Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గిరిజనుల చరిత్ర, సంస్కతి సంప్రదాయాలు నాగరిక సమాజానికి భిన్నంగా ఉంటాయి. ప్రధానంగా లంబాడీ, బంజారాల జీవనశైలి విధానాలు, కట్టుబాట్లు ప్రత్యేకం. లంబాడీ తెగలది ప్రాచీన సంస్కతి..అడవుల్లో పశుపోషణ వీరి జీవన ఆధారం. లంబాడీ తెగ పవిత్రమైన ఆచార వ్యవహారాలను కలిగి ఉంటారు. అటువంటి వాటిలో సీత్ల పండుగ కూడా ఒకటి.
పండుగ విశేషం
సీత్ల భవానీ పండుగ ప్రపంచ వ్యాప్తంగా నివసిస్తున్న బంజారా, లంబాడీల వారి సంస్కతి, సంప్రదాయాలకు ప్రతీక. ఈ పండుగ బంజారాల ఔనత్యాన్ని చాటుతుంది. వానాకాలం సీజన్ ఆరంభంలో జరుపుకునే ఈ పండుగ లంబాడీల పండుగలలో మొదటిది.
నేపథ్యం
పూర్వం లంబాడీ, బంజారాలు పశువులతో మమేకమై జీవనం సాగించేవారు. ఈ క్రమంలో వారి పశువులు గాలి కుంటు వ్యాధి బారినపడి మత్యువాత పడుతుండేవి. ఆ పరిస్థితులలో తండా పెద్ద మనిషి(నాయక్)కి కలలో వారి వన దేవతలైన ఏడుగురు అక్కచెల్లెళ్ల (మేరమా, త్వళ్జ, మంత్రాళ్, కంకాళి, హీంగ్లా, ద్వాళంగర్, సీత్ల యాడీ)లో చిన్న దేవత సీత్ల యాడి ప్రత్యక్షమై నన్ను కొలిచి, నా మొక్కులు తీరిస్తే మీ పశుసంపదను కాపాడుతానని వాగ్దానం చేసిందని చరిత్ర చెబుతోంది. మరో ఆధారం ఏమిటంటే ఏడుగురు దేవతలల్లో ఆరుగురిని తమ తమ ఇళ్లలో నెలకొల్పుతారు. కానీ చిన్న దేవత సీత్ల భవానీని మాత్రం ఊరి అవతల వేపచెట్టు నీడలో పూజిస్తారు. కారణం సీత్ల యాడీ ఆవుల మందతో వెళ్లిన క్రమంలో తిరిగి సాయంత్రం ఇంటికి రాకపోవడంతో అడవిలోనే శిలా విగ్రహంగా మారిందని అందుకే ఆ తల్లిని అడవిలో పూజిస్తారని పెద్దలు చెబుతున్నారు. ఏది ఏమైనా పశువుల రక్షణ కే సీత్ల భవానీని కొలుస్తారనడంలో సందేహం లేదు. వీరిని ప్రతి ఏటా పూజిస్తారు. వీరితో పాటు లుంక్డీయా (దేవతల తమ్ముడు) ను కొలుస్తారు.
నిర్వహించుకునే సందర్భం
వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందుగా జరుపుకునేదే ఈ సీత్ల భవానీ పండుగ. వరుణుడు కరుణించి సకాలంలో వర్షాలను సమద్ధిగా కురిపించి పాడిపంటలు, పశుపక్ష్యాదులు ఆరోగ్యంగా ఉండా లని పెద్దపుసాల (పునర్వసు కార్తె) లలో ప్రతి తండాల్లో సీత్ల పండుగ సందడి కనిపిస్తుంది. జూలై మాసం లో వచ్చే మంగళవారం రోజున వారి వీలును బట్టి ఆయా గిరిజన తండాల్లో లంబాడీలు ఈ వేడుక నిర్వహించుకుంటారు.
విధానం
ఏడుగురు వనదేవతలతో పాటు చిన్న దేవత అయిన సీత్ల భవానీని తండా పొలిమేరలో చిన్న రాళ్లు ఏర్పాటు చేసి వాటికి రంగు (గేరు) పూస్తారు. వరుస క్రమంలో తూర్పు దిక్కుకు అభిముఖంగా ప్రతిష్ఠిస్తారు. ఈ ఏడుగురు దేవతలకు ఎదురుగా (కొంత దూరంలో) లుంక్డీయా (దేవతల తమ్ముడు)ను నెలకొల్పుతారు. ఈ విధంగా ప్రతిష్ఠించిన దేవతలకు వర్ష రుతువులో పూసిన పూవ్వులతో పాటు, మామిడి ఆకుల తోరణాలతో అందంగా అలంకరణ చేస్తారు. అనంతరం గిరిజన మహిళలు అంతకు ముందు రోజు నానబెట్టిన జొన్న, పప్పు ధాన్యాలతో నైవేథ్యం (వాసోడీ, గుగ్రీ) తయారు చేస్తారు. వీటీతో పాటు లాప్సీ (బెల్లం అన్నం), ఉల్లిగడ్డ, ఎండు మిరప కాయలు, శుద్ధ జలాన్నీ పూజలో సమర్పిస్తారు. తండాలో గిరిజన మహిళలు తలంటు స్నానమాచరించి నూతన దుస్తులు (ఫూల్యగాల, గుంగ్టో) ధరించి డప్పు చప్పుళ్లతో, సంప్రదాయ పాటలు పాడుతూ కోలాహలంగా సీత్ల భవానీకీ నైవేథ్యం సమర్పిస్తారు. తండా పెద్ద పూజారిగా వ్యవహరిస్తారు. సాయంత్రం సమయంలో సీత్ల యాడికీ గొర్రెపోతులు, కోళ్లను బలిస్తారు. పోతుల పేగు తీసి దాన్ని లుంక్డీయా వరకు పరుస్తారు. దాని పైనుంచి తండాల్లోని పశువులను దాటిస్తారు. దీన్ని దాటోడి (గొడ్ల దాటుడు) అని అంటారు. ఈ క్రమంలో బలిచ్చిన గొర్రెపోతు రక్తంలో వాసోడీ గుగ్గిళ్లను కలిపి ఎడ్లు, గేదెలు, మేకల మందపై చల్లుతారు. ఈ విధంగా చేయడం వల్ల తమ పశువులకు ఎలాంటి రోగాలు దరిచేరకుండా సీత్ల భవానీ రక్షిస్తుందని గిరిజనుల నమ్మిక. ఈ వేడుకకు బంధువులు, ఆడబిడ్డల రాకతో సీత్ల పండుగ సందడి కనిపిస్తుంది.
- ఇస్లావత్ దేవేందర్
కాకతీయ యూనివర్సిటీ జర్నలిజం పూర్వ విద్యార్థి,
వరంగల్ గ్రామీణ జిల్లా