Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు నాటక రంగానికి 160 ఏళ్ళు చరిత్ర ఉంది. నాటకం దృశ్య రూపం చాలా అద్భుతంగా వుంటుంది. శ్రవ్య రూపాలు కూడా ఆకాశవాణి మాధ్యమంలో గొప్ప గొప్ప ప్రయోగాలు జరిగాయి. అలాగే సంగీత నాటక రూపాలు కూడా జాతీయ స్థాయిలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 1947 తర్వాత ఆకాశవాణి తన నాటక రూపకాన్ని విస్తృతీకరించింది. బాలాంత్రపు రజనీ కాంతారావు, శ్రీనివాసన్, ఇంద్రగంటి లాంటి వారు ఆకాశవాణి సంగీత, నాటక రూపకాలకు ప్రాణం పోశారు. ''కంచికి చేరని కథ'' లాంటి అద్భుత నాటక రూపాలు (వి.ఎస్.కామేశ్వరరావు) ఎన్నో సాంఘిక నాటకంలో వున్నాయి.
తన పెద తండ్రి బొల్లిముంత శివరామకృష్ణ సాహిత్య వారసత్వాన్ని తన పరం చేసుకొని, కవిత్వం- నాటకం- అంశాలపై బొల్లిముంద వెంకట రమణా రావు పట్టు సాధించారు. ఈ గ్రంథంలో 12 రూపకాలున్నాయి. రూపకాల్లో వ్యాఖ్యాతల ప్రాధాన్యత ఇస్తూ రాసారు. ప్రయోక్త ప్రదర్శన(ల)ను నడిపించడం ఓ అద్భుత టెక్నిక్- సర్వేజన సుఖినోభవతు! లో ప్రయోక్తలు + మాతాక్సియో మూడే పాత్రలతో నడిపించారు.
డా|| నోరి వారు అన్నట్లుగా 'రణతంత్ర ఛత్రపతి'- వ్యాఖ్యాతల ప్రాధాన్యత కనిపిస్తుంది. రూపకంగా నాటికను విస్తరించి చక్కటి ఇతివృత్త బలం; పదునైన సంభాషణలు, చరిత్ర కోణంలతో పాటు వాస్తవ వివరణతో అద్భుతంగా అక్షరీకరించారు బొల్లిముంత వెంకట రమణారావు.
అంబేద్కర్ నాటకంలో ఆనాటి సాంఘిక స్థితిగతులు, అంటరానితనంపై సాగించిన పోరాట కృషి పదునైన సంభాషణలతో బాగా రాసారు. సెల్యూట్ - ఆమె ఎవరైతేనేం! విడాకుల దినోత్సవం, రక్తదాత సుఖీభవా! నాటకాలు కొంచెం మార్పు చేసుకొని స్టేజి ప్రదర్శనలుగానూ ప్రదర్శించుకోవచ్చు!! చాలా కాలం తరువాత చక్కటి రేడియో రూపకాలు పాఠకులకు- శ్రోతలకు (రేడియో) అందించిన రచయిత అభినందనీయులు.
(రచన : బొల్లిముంత వెంకటరమణారావు, పేజీలు : 140, వెల : రూ.100/-, ప్రతులకు : బొల్లిముంత వెంకట రమణారావు, 3-1-116, విద్యానగర్ కాలనీ, కొత్తగూడెం - 507101, ఖమ్మం జిల్లా. సెల్ : 8106713351)
- తంగిరాల చక్రవర్తి, 9393804472