Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''దేశమంటే మట్టికాదోరు దేశమంటే మనుషులోరు'' అని గురజాడ అప్పారావు రాసిన కవితా వాక్కులు ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకున్నారో కానీ ప్రపంచ మానవాళి జనాభా దీనికి అనుగుణంగా పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. వాస్తవానికి గురజాడ దేశమంటే మనుషులని ఆ మనుషుల జీవన ప్రమాణాలు, సామాజిక నైతిక విలువలు సుస్థిరంగా ఉండాలని ఆశించి రాసిన కవితా వాక్కులవి. ఈ నేల, నీరు, అనేక ఖనిజ సంపదలతో కూడిన విశ్వంలో మానవునితో పాటు, సమస్త జీవరాసులు పురుడు పోసుకున్నాయి. ఈ భూమిపై జీవించడానికి మనిషితో పాటు, అన్ని జీవులు ఆ హక్కును కలిగి ఉన్నాయి. గడిచిన దశాబ్దాలుగా జనాభా పెరుగుదల కారణంగా వనరులు తరిగిపోయి, మానవులతో పాటు, భూమిపై జీవరాసుల మనుగడ ప్రశ్నార్థకమైంది. మానవ మనుగడ సుభిక్షంగా ఉండాలంటే జనాభా నియంత్రణ అవశ్యమని గుర్తించాలి.
జనాభా లెక్కల్లోకి వెళ్తే 1804లో ప్రపంచ జనాభా వంద కోట్లు నమోదయితే, 1987లో జులై 11 నాటికి ఐదు వందల కోట్లకు చేరింది. ఐక్యరాజ్య సమితి ఈ రికార్డు స్థాయి జనాభా పెరుగుదలను ప్రమాద సూచికగా గుర్తించి, 1989లో ప్రతి ఏడాది జులై 11న ప్రపంచవ్యాప్తంగా జనాభా దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించింది. ప్రపంచంలోని అనేక దేశాల్లో జనాభా పెరుగుదల వేగవంతంగా ఉన్న ఈ సమయంలో ''ప్రపంచ జనాభా దినోత్సవం'' జరుపుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే ఇది జనాభా స్థిరీకరణ యొక్క ప్రాముఖ్యతను, ప్రజల భవిష్యత్తును మరియు వారి ఆరోగ్య ప్రాధాన్యతను నొక్కి చెబుతుంది.
జనాభా పెరుగుదలలో ప్రపంచం తీరు
ప్రపంచ దేశాల జనాభా లెక్కలను అంతర్జాలంలో వరల్డ్ మీటర్ సంస్థ వెలువరిస్తూ ఉంటుంది. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే క్రీ.పూ. 5000 సంవత్సరంలో ఈ భూమిపై 50 లక్షల జనాభా ఉండేదని అంచనా వేశారు. క్రీ.శ. 200 సంవత్సరంలో 19 కోట్ల జనాభా ఉండగా, ఆ సంఖ్య 1600 సంవత్సరం నాటికి 50 కోట్లకు చేరింది. 1804 నాటికి ప్రపంచ జనాభా ఒక బిలియన్ (వంద కోట్లు)కు చేరుకుంది. అయితే, ఈ జనాభా 2 బిలియన్లు చేరుకోవడానికి వంద సంవత్సరాలు పట్టింది. కానీ, 3 బిలియన్ల జనాభా పెరగడానికి కేవలం 30 సంవత్సరాలు మాత్రమే పట్టిందంటే ఆశ్చర్యం కలిగించక మానదు. ఆ తర్వాత ఆ సంఖ్య మరింత పెరుగుతూ, 1974లో 4 బిలియన్లుగా, 1987లో 5 బిలియన్లుగా, 1999లో 6 బిలియన్లుగా, 2011లో 7 బిలియన్లుగా నమోదయింది. ఇది ఇలా కొనసాగితే 2023 నాటికి ప్రపంచ జనాభా 8 బిలియన్ల వరకు చేరుకుంటుంది. భూగ్రహం పై తట్టుకోగల జనాభా పరిమితి కంటే 10 రెట్లు ఎక్కువగా ఉందని 2056 నాటికి 10 బిలియన్ల జనాభాతో ఈ భూమి నిండుకుంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఈ భూమిపై ప్రతి రోజు సుమారు 3 లక్షల జననాలు, 1.4 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. ప్రతి ఏటా సుమారు 83 మిలియన్ల జనాభా పెరుగుతున్నది. ప్రపంచ జనాభా లెక్కల ప్రకారం 50.4 శాతం పురుషులు ఉంటే, 49.6 శాతం స్త్రీలు ఉన్నారు. అమెరికా లాంటి అభివద్ధి చెందుతున్న దేశాల్లో 1.6 శాతం జనాభా పెరుగుదల ఉంటే, చైనా, భారత్ లాంటి అభివద్ధి చెందుతున్న దేశాల్లో ఈ పెరుగుదల రేటు 2.8 శాతంగా నమోదవుతున్నది. ప్రపంచ జనాభా ఆర్థిక వ్యవస్థతోపాటు, అనుబంధంగా పెరుగుతూనే ఉంది. 1971-2017 మధ్యకాలంలో ప్రపంచ ఎకానమి నాలుగు రెట్లు పెరిగితే, ప్రపంచ జనాభా రెండు రెట్లు పెరిగింది. ఈ జనాభా తమ జీవనం కోసం సహజ వనరులను వాడవలసిన దాని కంటె మూడు రెట్లు ఎక్కువగా ఉపయోగించారు. ప్రపంచంలో సహజ వనరుల తగ్గుదలకు ఇది ఒక సంకేతం.
ప్రపంచ జనాభాలో 17 శాతం భారత్‌లోనే...
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రపంచ భూభాగంలో 2.4 శాతం భూమిని మాత్రమే కలిగిన భారతదేశం ప్రపంచ జనాభాలో 17.7 శాతం వాటాను కలిగి ఉంది. భారత్‌లో స్వాతంత్య్రానికి పూర్వం 33 కోట్ల జనాభా ఉంటే, ప్రస్తుతం 139 కోట్లకు చేరింది. ఈ సంఖ్య 2050 నాటికి 165 కోట్లకు చేరవచ్చని ఐక్యరాజ్య సమితి అంచనా వేస్తున్నది. ఈ జనాభా పట్టణాల్లో 48.6 కోట్లు (35 శాతం) వుంటే, గ్రామీణ ప్రాంతాల్లో 90.4 కోట్లు (65 శాతం) ఉన్నారు.
భారత్‌లో జన సాంద్రత ఒక చదరపు కిలో మీటరుకు 382 మంది ఉన్నారు. ఈ జనాభా పెరుగుదలలో భారతదేశం, చైనాతో పోటీపడుతున్నది. ప్రస్తుతం చైనా జనాభా 144.4 కోట్లు. అయితే, ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన నివేదికలో చైనాను అధిగమించి, 2024 నాటికి భారత్ అత్యధిక జనాభా గల దేశంగా అవతరించనుందని ప్రకటించింది.
భారతదేశంలో స్వాతంత్య్రానంతరం జనాభా విస్తరణలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. సేద్యపు నీటిని అభివద్ధిచేసిన ప్రాంతాల్లో, పారిశ్రామిక అభివద్ధి జరిగిన ప్రాంతాల్లో జనాభా పెరుగుదల అధికంగా కనిపిస్తుంది. చత్తీస్‌గఢ్, ఒరిస్సాలలో, మహానది లోయ ప్రాంతాల్లో హీరాకుడ్ రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా జన సాంధ్రత పెరిగింది. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ మరియు తమిళనాడు రాష్ట్రాల్లో జరిగిన పారిశ్రామిక అభివద్ధిలో భాగంగా నగరాలకు వలసలు పెరగడంతో జనాభా రెట్టింపుకు కారణమైంది. అంతేకాకుండా, గనుల తవ్వకాలు కూడా జనాభా పెరుగుదలను ప్రభావితం చేసింది. తూర్పుకనుమలకు చెందిన ఒరిస్సా, చోటా నాగ్‌పూర్ పీఠభూమి ప్రాంతాల్లో గనుల త్వవకాలు పెద్ద ఎత్తున జరగడంతో వలసల వల్ల జనాభా విస్తతి పెరిగింది.
ప్రపంచంలో 1900 ప్రాంతంలో జనన, మరణాల రేటు సమాంతరంగా ఉండేది. ఈ దశ 1910-1950 మధ్య కాలంలో భారతదేశంలో కనిపిస్తుంది. ప్రజల్లో కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన లేకపోవడమే జనాభా పెరుగుదలకు కారణం. అయితే అదే క్రమంలో నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు, పౌష్ఠికాహార లోపం, అపరిశుభ్రత, వైద్య సదుపాయాలు అంతగా లేకపోవడం వల్ల మరణాలు సంభవించాయి. 20వ శతాబ్దం ప్రథమార్థంలో మరణాల రేటు అధికమై, జనాభా తక్కువగా నమోదయింది. 1918-20 మధ్య కాలంలో స్పానిష్ ఇన్ఫ్లూయంజా వైరస్ ప్రపంచంలో విపరీతంగా ప్రబలింది. ఈ వైరస్ కారణంగా కోటిన్నర మంది మరణించినట్లు అధికార లెక్కలు ఉన్నప్పటికీ, ఆ సంఖ్య అంతకంటే ఎక్కువగానే ఉండవచ్చు. సరిగ్గా వంద సంవత్సరాల తర్వాత 2020లో ప్రబలిన కరోనా వైరస్ కారణంగా భారత్ తో పాటు ప్రపంచ దేశాలు కుదేలవుతున్నాయి.
1960 తర్వాత ప్రజల ఆదాయం పెరగడం, సమద్ధిగా పౌష్ఠికాహారం లభించడం, ఆరోగ్య వసతులు సమకూరడం, ప్రాణ రక్షణ కోసం ఔషధాలు అందుబాటులోకి రావడంతో మరణాలు తగ్గుతున్నాయి. ఆయుషు ప్రమాణం 70 ఏళ్ళకి చేరింది. దీనితో ప్రపంచంలో అన్ని దేశాలతోపాటు భారత్ లో కూడా మరణాల రేటు తగ్గింది. అభివద్ధి చెందుతున్న దేశాల్లో ఈ దశ కనిపిస్తుంది.
ప్రపంచంలో మొదటి కుటుంబ నియంత్రణ ఆలోచన పురుడు పోసుకుంది భారత్‌లోనే. ప్రొఫెసర్ రఘునాథ్ దొండా కార్వే 1921లో తొలిసారి వ్యక్తిగత కుటుంబ నియంత్రణ క్లినిక్‌ను ముంబయిలో ఏర్పాటు చేశారు. 1882లో ముంబయి లో జన్మించిన ఆయన గణిత శాస్త్రంలో ఆచార్యుడుగా సేవలందిస్తూనే, సామాజిక మార్పు కోసం ఉద్యమించాడు. కుటుంబ నియంత్రణ పాటించాలని మరియు అవాంచిత గర్భనిరోధానికి కాంట్రసెప్టివ్లు ఉపయోగ పడతాయని కార్వే మహాశయుడు ప్రత్యేక క్లినిక్‌ల ద్వారా ప్రజలను చైతన్యవంతుల్ని చేశారు. ఆయన ఆలోచన ఇతర ప్రాంతాలకు విస్తరించింది. 1932లో మద్రాసు ప్రభుత్వం జనన నియంత్రణ క్లినిక్‌లను ప్రారంభించింది. స్వాతంత్య్రానంతరం జనాభాను నియంత్రించడం కోసం భారత ప్రభుత్వం 1952లో జాతీయ కుటుంబ నియంత్రణ ప్రణాళికను తీసుకు వచ్చింది.
జనాభా లెక్కల సేరణ
జనాభాను నిర్వచిస్తే ఒక నిర్ణీత కాలంలో దేశంలో నివసించే ప్రజలను జనాభా అంటారు. జనాభా దేశాభివద్ధికి ఎంతో అవసరం. భారతదేశంలో జనాభా లెక్కల ప్రక్రియను సెన్సెస్ ఆర్గనైజేషన్ చేపడుతుంది. భారత పార్లమెంట్ 1948లో సెన్సెస్ యాక్ట్‌ను ఆమోదించింది. 1976లో మొదటి జనాభా విధానం రాగా, 2000లో స్వామినాథన్ కమిటి సిఫార్సులతో వచ్చిన నూతన జనాభా విధానం ప్రస్తుతం అమలులో ఉంది. ఒక్క సారి వెనక్కి వెళ్తే బ్రిటీషువారి హయాంలో తొలిసారిగా దాదాబారు నౌరోజీ జనాభా లెక్కలను మదింపు వేశారు. అయితే, లార్డ్‌రిప్పన్ సారధ్యంలో 1881లో శాస్త్రీయంగా జనాభా లెక్కల క్రమబద్ధీకరణ జరిగింది. ఆనాటి నుండి ప్రతి పదేళ్ళకు ఒకసారి భారత్‌లో క్రమం తప్పకుండా జనాభా లెక్కల మదింపు ప్రక్రియ జరుగుతున్నది. అయితే, కరోనా కారణంగా భారతదేశంలో 2021 జనాభా లెక్కల సేకరణ వాయిదా పడింది.
జనాభా స్థిరీకరణ కోసం ప్రభుత్వం దష్టి
కుటుంబ నియంత్రణ జనాభా స్థిరీకరణ కోసమే కాకుండా మహిళలు, కుటుంబాలు, సమాజం ఆరోగ్యంగా ఉండేలా దోహదపడుతుంది. అంతేకాదు, జనాభా స్థిరీకరణకు, గరిష్ట అభివద్ధికి వనరులు ఉండటాన్ని నిర్ధారిస్తుంది. ప్రస్తుతం జనాభా స్థిరీకరణ భారతదేశానికి ఎంతో ముఖ్యం. దేశ జనాభాలో దాదాపు 50 శాతం అంటే 15 నుండి 49 సంవత్సరాల వారు పునరుత్పత్తి వయసు కలిగిన వారున్నారు. కేంద్ర శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ జాతీయ కుటుంబ నియంత్రణలో ''అంతరా'' కార్యక్రమంలో భాగంగా ఇంజెక్ట్ చేయదగిన గర్భనిరోదకాన్ని ప్రజారోగ్య వ్యవస్థలో అమలు చేస్తున్నారు. దంపతులుగా మారుతున్నవారికి, సంతానం మధ్య అంతరం ఉండేలా చూసుకునేవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థల కషిలో భాగంగా దేశంలో గడచిన ఏడాది కాలంలో గర్భనిరోధకాల వాడకం ఫలితంగా దాదాపు 5.5 కోట్ల అవాంచిత గర్భాలను, 1.1 కోట్ల జననాలను, 18 లక్షల మేర అసురక్షిత గర్భస్రావాలను మరియు 30 వేల ప్రసూతి మరణాలను నివారించగలిగింది. భారత ప్రభుత్వం, రాష్ట్రాల సహకారంతో జనాభా స్థిరీకరణ కోసం ప్రత్యేకంగా దష్టి సారించింది. మిషన్ పరివార్ వికాస్, ఇంజెక్షన్ కాంట్రసెప్టివ్ యం.వి.ఎ, ఫ్యామిలీ ప్లానింగ్ లాజిస్టిక్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ క్యాంపేయిన్ల ద్వారా కుటుంబ నియంత్రణతో జనాభా స్థిరీకరణ లక్ష్యాలను సాధించేందుకు కషి చేస్తున్నది.
ముగింపు
భూమి మీద పుట్టిన ప్రతి బిడ్డ అభివద్ధికారకమవుతుంది. కానీ, జనాభా ఒక స్థాయిని దాటి పెరుగుతూపోతే ఆ దేశం అభివద్ధిని హరించి వేస్తుందనేది వాస్తవం. జనాభాకు నాణ్యత, పరిమాణం కారకాలతో తూలనం చేయగా, మొదటిది.. ఎక్కువ పరిమాణం కలిగిన జనాభా ఉండి, తక్కువ నాణ్యతను ప్రదర్శిస్తే ఆ దేశానికి భారంగా మారుతుంది. రెండవది.. తక్కువ పరిమాణం కలిగిన జనాభా ఉండి ఎక్కువ నాణ్యతను ప్రదర్శిస్తే ఆ దేశం అభివద్ధి పథంలో సాగుతుంది. ప్రస్తుతం భారతదేశం మొదటి తూలనానికి ఉదాహరణగా నిలుస్తుంది. భారత్‌లో జనాభా పెరుగుదల ఆర్థికాభివద్ధిపై రుణాత్మక ప్రభావాన్ని చూపుతున్నది. దీనిని అధిగమించడానికి జనాభా స్థిరీకరణవైపు అడుగులు వేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ జనాభా విధానాన్ని సంపూర్ణంగా అమలుపరచాలి. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా కుటుంబ నియంత్రణ అమలును పర్యవేక్షించే అధికారాన్ని గ్రామ పంచాయతీలకు బదలాయించారు. ఉత్తమ ఫలితాల కోసం ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి. కుటుంబ నియంత్రణ వల్ల మాత్రమే జనాభా స్థిరీకరణ సాధ్యమవుతుంది. ముఖ్యంగా స్త్రీలు చైతన్యవంతులవ్వాలి. ''ఒకరు లేదా ఇద్దరు'', ''వన్ ఆర్ నన్'' వంటి నినాదాలు జనాభా నియంత్రణలో ప్రతిఫలించాలి. ప్రభుత్వం ఇందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను రూపకల్పన చేసి, అమలుపరచాలి. భూగోళంపై జన భారం ఇప్పటికైనా నియంత్రించకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. జనాభా నియంత్రణ బాధ్యత ఒక్క ప్రభుత్వాలదే కాదు, మనందరి బాధ్యత కూడా.
(జులై 11 ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా)
జనాభా లెక్కలపై చర్చ జరిగినప్పుడు ప్రపంచ ప్రఖ్యాత అర్థ శాస్త్రవేత్త థామస్ రాబర్ట్ మాల్దస్ గుర్తుకు వస్తాడు. 1766లో ఇంగ్లాండ్‌లో జన్మించిన ఆయన జనాభా సిద్ధాంత(An essay on the principles of population) గ్రంథాన్ని రచించి జనాభా మదింపుపై ప్రపంచానికి మార్గనిర్దేశకత్వం చేశారు. ప్రపంచంలో ఆహారధాన్యాల పెరుగుదల కంటే జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా ఉంటుందని మాల్దస్ తన సిద్ధాంతంలో వివరించారు. ఆహారం అంక గణిత శ్రేణిలో (1, 2, 3, 4, 5...) పెరిగితే, జనాభా గుణశ్రేణి (1, 2, 4, 8, 16,..) లో పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. దీర్ఘకాలంలో అనేక కారణాలు ప్రభావితం చేసి జనాభా పెరుగుదల రేటును అడ్డుకుంటాయని మాల్దస్ విశదీకరించారు. కరువు కాటకాలు, వరదలు, యుద్ధాలు మొదలైన కారణాలు జనాభాను తగ్గిస్తాయని ప్రకటించారు. మాల్దస్ రాసిన జనాభా సిద్ధాంత గ్రంథం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆయన చేసిన సూచనల ప్రకారంగానే బ్రిటన్ ప్రభుత్వం 1800 సంవత్సరంలో సెన్సెస్ యాక్ట్ ను తీసుకువస్తే, ఇతర దేశాల జనాభా లెక్కల మదింపుకు మార్గ సూచికగా నిలిచింది.
ప్రమాదంలో పర్యావరణం
మానవుడు తెలివైన జీవి. తన అవసరాల కోసం సాంకేతిక తలను ఆలంబనగా చేసుకుని నవ్యావిష్కరణలకు తలుపులు తట్టాడు. ఇవి ప్రజల జీవనాన్ని సౌకర్యవంతంగా మార్చాయి. కాలక్రమంలో జనాభా పెరుగుదలతో ప్రకతి నుండి సహజ సిద్ధంగా అందే ఆహారం, నీరు, గాలి, భూమిలోని ఖనిజ సంపద అయిన బొగ్గు, ఆయిల్, గ్యాస్ వంటి శక్తి వనరుల వాడకం పెరిగిపోయింది. అయితే, మానవుడు తాను బ్రతకడానికి ఉపయోగించవలసిన దానికంటే 75 శాతం అధికంగా వాడుకుంటున్నాడని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. మరోవైపు మనిషి స్వయంగా ఉత్పత్తికి ఉపయోగపడే సాధనం. వాస్తవానికి భూమిపై ఉన్న వనరులను మనిషి తాను అనుభవిస్తూ, భవిష్యత్తు తరాలకు అందించేలా దోహదపడాలి. ప్రకతిలో దాగిన వనరులపై మానవులకే కాదు సమస్త జీవరాసులకు హక్కు వుందని గ్రహించాలి. కానీ, మనిషి తమ జనాభాను అదుపు లేకుండా పెంచుకుంటూ తానొక్కడే భూమి మీద ఉండే వనరులను వినియోగించుకుంటున్నాడు. దీనివల్ల మానవజాతే కాదు, భూమి పైన ఉండే జంతు జీవ జాలం ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. జనాభా పెరుగుదలతో ప్రకతి వనరులు హారతి కర్పూరంలా కరిగిపోవడంతోపాటు, పర్యావరణం కలుషితమవుతున్నది. పరిశ్రమలు విడుదల చేస్తున్న కాలుష్య వాయువులు, రసాయనిక పదార్థాలు, వాహనాల వల్ల వచ్చే కాలుష్యం, విద్యుత్తు ఉత్పాదనలో విడుదలవుతున్న కర్బన ఉద్గారాలు వంటివి భూమి వేడికి కారణమవుతున్నాయి. మానవ అవసరాల కోసం అడవులు అంతరించిపోతున్నాయి. దీని వల్ల భూమిపై అతివష్టి, అనావష్టి ఏర్పడటంతో పాటు, జీవవైవిధ్యం లోపిస్తున్నది.
1950 తర్వాత భారతదేశంలో జనాభా పెరగడం ప్రారంభమవడంతో, వ్యవసాయ భూమి విస్తరణపై దష్టి పడింది. దీంతో అనేక మంది ప్రజలు నదీ లోయలు, మైదానాలు వీడి సమీప ప్రాంతాల్లోని అడవులను నరికి సాగు చేయడం ప్రారంభించారు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రాంతాల్లో అడవులను నరికివేసి వ్యవసాయం చేయడం మొదలు పెట్టారు. ఇలాంటి సంఘటనలు భారతదేశంలో అనేక ప్రాంతాలలో వ్యాప్తి చెందడంతో అడవులు అంతరించడం ప్రారంభమైంది. దీనితో పర్యావరణం ప్రమాదంలో పడింది. అయితే, ఇక్కడ ఒక విషయం గుర్తు చేయాలి, అడవిలో జీవించే అడవి బిడ్డలు మాత్రం ఆ పని చేయడం లేదు. అక్కడి వనరులను తమ జీవిక కోసం వాడుకుంటారే కానీ, ఆ అడవిని నాశనం చేయరు. ఒక విధంగా చెరువులో ఉండే చేప ఆ చెరువులోని నీటిని మాత్రమే తాగితే చెరువు అడుగంటి పోదన్నది ఎంత నిజమో, ఆదివాసీల వల్ల అడవి అంతరించిపోదన్నది అంతే నిజం.
- డా. జె. విజరు కుమార్ జీ, 9848078109
సీనియర్ స్టాఫ్ ఆర్టిస్ట్ ఉద్యోగి, రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో భారత ప్రభుత్వం