Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం వస్తున్న సినిమాలలో స్త్రీ పాత్రలు కేవలం అలంకారంగా మాత్రమే ఉన్నాయి కాని వాటికి ప్రత్యేక వ్యక్తిత్వం అన్నది ఉండట్లేదన్నది నాకెప్పుడు ఉండే అభ్యంతరమే. స్త్రీ ని పొట్టి బట్టలతో (అదీ గ్లామర్ అనుకుంటున్నాం), వచ్చి రాని మాటలతో (భాష సరిగ్గా రాకపోతే అది క్యూట్ అట) తెలుగు సినిమాలలో చూసినప్పుడు నిజం చెప్పాలంటే అరికాలి మంట నెత్తికొస్తుంది. అసలు ఎదిగీ ఎదగని మైండ్ ని రిటార్డ్ అంటారన్న కొంచెం కూడా అవగాహన లేకుండా ప్రస్తుత తెలుగు సినీ హీరోయిన్లందరు ఈ రిటార్డ్నెస్తో ఉంటే వారిని చూసి ఆరోగ్యకరమైన పిల్లలు కూడా అనుకరించడం ఓ పెద్ద సమస్య. అలాంటి సమయంలో మళయాళం, తమిళ సినిమాలలో కాస్త వ్యక్తిత్వం ఉన్న స్త్రీ పాత్రలు కనిపిస్తే కరోనా పేషంట్ కి ఆక్సిజన్ అందిన ఫీలింగ్. అచ్చం అలాగే అనిపించింది ''మాయక్కం ఎన్న'' అన్న తమిళ సినిమాలో యామిని పాత్రను చూస్తే. ఈ సినిమా తెలుగులో ''మిస్టర్ కార్తిక్'' పేరుతో డబ్ అయింది. 2011 లో వచ్చిన ఈ సినిమా పెద్ద హిట్. ఈ సినిమాలో యామిని పాత్ర మాత్రం చాలా ఆత్మాభిమానం ఉన్న గొప్ప స్త్రీ పాత్ర. భారతీయ సినీ చరిత్రలో వ్యక్తిత్వం ఉన్న స్త్రీ పాత్రగా నిలిచిపోయే ఒక మాడర్న్ అమ్మాయి కథ ఇది. అందుకే ఈ సినిమాను యామిని నేపథ్యంలో పరిచయం చేస్తున్నాను.
యామిని ఒక మాడర్న్ యువతి. ఆధునిక స్త్రీ ప్రపంచానికి, ఆలోచనకు ప్రతినిధి. ఎవరూ లేని అనాథ. సుందర్ అనే ఒక అబ్బాయి పట్ల ఆకర్షణ పెంచుకుంటుంది. ప్రస్తుత తరానికి బారు ప్రెండ్ ఉండి తీరాలి కదా. ఆ భావజాలంతో కావచ్చు, వయసు పడే తొందర కావచ్చు సుందర్‌తో స్నేహం చేస్తుంది. సుందర్ తన స్నేహితులకి యామినిని పరిచయం చేస్తాడు. కార్తిక్ అతని చెల్లెలు తల్లి తండ్రులు చనిపోతే సుందర్ కుటుంబంతో పెరుగుతారు. కార్తిక్ మంచి ఫోటోగ్రాఫర్. జీవితంలో పెద్ద వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా ఎదగాలని అతని కోరిక. చాలా తెలివైన వాడు కాబట్టీ స్నేహితులందరూ అతన్ని జీనియస్ అని పిలుస్తారు. కార్తిక్‌కు మొదటి చూపులో యామిని నచ్చదు. చాలా అహంకారం ఉన్న అమ్మాయిలా కనిపిస్తుంది. కార్తిక్ అతిచనువు మాట తీరు యామినికి కూడా నచ్చవు. కాని సుందర్ స్నేహితుడిగా ఆ గ్రూప్‌లో ఉంటూ అతన్ని సహిస్తుంది. క్రమంగా ఇద్దరికి ఒకరిపట్ల ఒకరికి ఆకర్షణ మొదలవుతుంది. సుందర్‌ని కేవలం కార్తిక్ కోసమే యామిని కలవడం మొదలెడుతుంది. తనకు అతని పట్ల ఉన్న ప్రేమ ఆమె దాచుకోవాలనుకోదు. కార్తిక్‌కి తనలో వస్తున్న మార్పు అర్ధం అవుతున్నా తనకు తన చెల్లెలికి జీవితాన్నిచ్చిన సుందర్ ప్రేమిస్తున్న అమ్మాయిపై ప్రేమ పెంచుకుని అతనికి అన్యాయం చేయడం తప్పు అని తన ప్రేమ విషయం బైటపెట్టడు. చివరకు యామిని ప్రోద్బలంతోనే అతను తన ప్రేమ గురించి ఒప్పుకోవలసి వస్తుంది.
సమస్యను తీర్చడానికి సుందర్ తండ్రి రంగంలోకి దిగుతాడు. కార్తిక్ యామినీలను గమనించి వారిద్దరి మధ్య మొలకెత్తిన ప్రేమను అర్థం చేసుకుంటాడు. సుందర్ యామినిల మధ్య ఉన్నది కేవలం ఆకర్షణ అని, కార్తిక్ పట్ల యామిని ప్రేమ ఇది నిరూపిస్తుందని అందుకని యామిని కార్తిక్‌లు ఒకటవడంలో తప్పులేదని కొడుకుకి అర్థం అయ్యేలా చెప్పి కార్తిక్ యామినిల పెళ్ళి జరిపిస్తారు. స్నేహితులందరూ కూడా కథ సుఖాంతమయ్యిందని సంతోషిస్తారు.
కార్తిక్‌కు మాధేష్ అనే వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ అంటే చాలా భక్తి. ఎప్పటికయినా అతనిలా తానూ గొప్ప ఫోటోగ్రాఫర్ అవ్వాలని కోరిక. అతని వద్ద అసిస్టెంట్‌గా చేరాలని అతని ఆశ. మాధేష్ను కలిస్తే అహంకారంగా కార్తిక్‌కు ఒక ప్రాజెక్ట్ అప్పజెప్పి ఫొటోలు తీసుకు రమ్మని అడవికి పంపిస్తాడు. అదో సవాలుగా తీసుకుంటాడు కార్తిక్. ఏ ఆర్టిస్ట్కయినా తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పగల ఒక్క చాన్స్ చాలా అవసరం. కరెక్ట్ మూమెంట్ కోసం అడవిలో చాలా కష్టపడతాడు కార్తిక్, చివరకు అద్భుతమైన ఫోటోలు తీసి మాధేష్ వద్దకు వస్తాడు. ఆ ఫోటోలు చూడకుండానే కార్తిక్ తనకు అసిస్టెంట్ గా పనికి రాడని మాధేష్ అతన్ని పంపించేస్తాడు. మాధేష్ని దేవుడిలా పూజించే కార్తిక్ అతని ఈ చర్యకు బాధపడతాడు. అతని కాన్ఫిడెన్స్ దెబ్బ తింటుంది.
మాధేష్ని కార్తిక్ తీసిన ఫోటొలలో ఒక ఫోటో ఆకర్షిస్తుంది. దాన్ని ప్రతికకు పంపి జాతీయ అవార్డు సంపాదిస్తాడు మాధేష్. తన ఫోటో మాధేష్ వాడుకోవడం చూసి కార్తిక్ షాక్‌కు గురి అవుతాడు. దేవుడిలా కొలిచే వ్యక్తిలోని మరో కోణం అతన్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. అప్పటిదాకా సరదాగా మందు తాగే అతను ఒక పెద్ద ఆల్కాహాలిక్గా మారతాడు. యామినీ పట్ల ప్రపంచం పట్ల అతనిలో విపరీతమైన కోపం పెరుగుతుంది. భర్తను ఆ స్థితిలో చూసి యామిని చాలా బాధపడుతుంది. తానే ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఎప్పటి కన్నా కార్తిక్‌కి పేరు వస్తుందని నిరాశ పడకుండా అతను తీసిని పాత ఫోటోలను పత్రికలకు పంపిస్తూ ఉంటుంది. కార్తిక్ మాత్రం మానసికంగా దెబ్బ తిని తాగుడికి పూర్తిగా బానిస అవుతాడు. సమాజంలో అతనికి గౌరవం పోతుంది. స్నేహితులు కూడా అతనికి దూరం అవుతారు. నలుగురు మధ్యకు వచ్చే ప్రతిసారి కార్తిక్ చేసే గొడవ వారు భరించలేక పోతారు. అతని కారణంగా ఇంటి యజమాని నుండి స్నేహితుల వరకు యామిని ఎన్నో అవమానాలు పొందుతుంది. తాగుబోతు భార్యగా చులకనగా చూసే సమాజం ముందు గౌరవంగా బతకడానికి, తన భర్తను వెనకేసుకొస్తూ తమకు మంచి రోజులొస్తాయని ఆశతో బతుకుతూ చాలా వేదన అనుభవిస్తుంది.
ఇన్ని కష్టాల మధ్య కూడా యామినికి భర్త పై అపార నమ్మకం. ఎందుకూ పనికిరాని వాడిగా తాగిన మైకంలో రోడ్లపై పడిపోతూ రోతగా ప్రవర్తించే అతని పట్ల యామిని ప్రేమను అందరూ చులకన చేసి మాట్లాడినా, అలాంటి భర్తను అంటిపెట్టూకుని ఉండడం ఆమె చేతకానితనం అని విమర్శించినా, భర్తపై నమ్మకాన్ని ఆమె పోగొట్టుకోదు. ఇలా ఉన్నప్పుడే యామిని గర్భవతి అవుతుంది. కాని తాగిన మత్తులో కార్తిక్ ఆమెపై చేయి చేసుకున్నందు వలన యామినికి అబార్షన్ అయిపోతుంది. ఆమెకు మానసికంగా చాలా దెబ్బ తగులుతుంది. ఆమెలో ఒక భాగం పూర్తిగా చనిపోతుంది. భర్తతో మాట్లాడడం మానేస్తుంది. అప్పటిదాకా భార్య విలువ తెలియని కార్తిక్, ఆమె మౌనాన్ని, తాను చేసిన పనిని గుర్తు తెచ్చుకుని పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. అబార్షన్ అయి హాస్పిటల్ నుండి వచ్చి, తనకు రక్తస్రావం అయిన గదిలో రక్తాన్ని తానే తుడుచుకుంటూ యామినీ పడే వేదన ఆడియన్స్‌ను కదిలిస్తుంది.
భర్త తాగుడు కారణంగా బాధపడుతున్న యామినిని, స్నేహితుడే శారీరకంగా పొందాలని ఆమె పట్ల నీచంగా ప్రవర్తించినప్పుడు యామిని అతనికిచ్చే సమాధానం స్త్రీ మనసుకు గొప్ప ఉదాహరణ. ఆమె వ్యక్తిత్వాన్ని ఆ ఒక్క సీన్లో చూపే ప్రయత్నం చేస్తారు దర్శకులు. తన పరిస్థితి పట్ల చులకన భావంతో తాను ఎమోషనల్‌గా బలహీనంగా ఉన్నప్పుడు మనసులో బాధను పంచుకోవాలనుకున్నప్పుడు అది అలసుగా తీసుకుని తన శరీరాన్ని కోరుకుంటున్న వ్యక్తి తన స్నేహితుడే అవడంతో బాధపడుతూ, దానికి స్పందిస్తూ తన మానసిక ఒంటరితనాన్ని బైట పెట్టుకోవడం తన తప్పని చెబుతూ తన భర్త కన్నా అవకాశవాదిగా, దుర్మార్గుడిగా మారిన ఆ స్నేహితుని చిన్న బుద్దిని ఆ పరిస్థితులలో కూడా ఎత్తి చూపి తన వ్యక్తిత్వాన్ని చాటుకుంటుంది యామిని.
ఇటువంటి స్థితిలోనే మరో మగాడి భుజంపై తలవాల్చి బలహీనతకు లోనయ్యి జీవితాంతం కుమిలిపోయే స్త్రీలు మనకు కనపిస్తూ ఉంటారు. ఆ బలహీన క్షణంలో మగవాడి అవకాశ వాదాన్ని గుర్తు పట్టగలిగితే స్త్రీ జీవితంలో చాలా కష్టాల నుండి తప్పించుకోగలదు. ఆ బలహీన క్షణాన్ని అంతటి ప్రతికూల పరిస్థితులలో కూడా ఎదుర్కుని తన భర్తను భాద్యతగా స్వీకరించి ముందుకు నడిచే యామిని ప్రేమకు నిర్వచనం. కష్టాల ఒడిలో ప్రయాణిస్తున్న స్త్రీ బలహీనపడితే ఆమెను అనుభవించాలనే ఆలోచనతో ఉండే మగవారు ఎందరో. వారు చూపేది ప్రేమ కాదని, అది అవకాశవాదమని గుర్తించి యామిని తన జీవితాన్ని దిద్దుకునేవైనం ఆమెపట్ల చాలా గౌరవం కలిగిస్తుంది. యామిని పాత్రను దర్శకుడు చాలా గొప్పగా మలిచారు ఈ సినిమాలో.
చివరకు అన్ని కష్టాల్లో కూడా భర్త ఫోటోలను పత్రికలకు పంపడం యామిని మానదు. ఒక ఫోటో చేరవలసిన చోటుకు చేరడం వలన కార్తిక్‌కు మంచి ఆఫర్ వస్తుంది. అప్పటికే యామిని మౌనంతో పశ్చాత్తాపంలోకి జారుకుంటున్న కార్తిక్ తాగుడు మానేస్తాడు. ఈ ఆఫర్‌తో అతనిలో ఉత్సాహం వస్తుంది. వైల్డ్ లైప్ ఫోటోగ్రాఫర్‌గా మంచిపేరు తెచ్చుకున్నాక ఇంటర్నేషనల్ పోటీలలో కార్తిక్ ఫోటో బహుమతి గెలుచు కుంటుంది. మాధేష్ని ఓడించి ఆ బహుమతి గెలుచుకున్న కార్తిక్ లైవ్‌లో తన భార్యకు క్షమాపణ చెప్పుకుని ఆమె ప్రేమను కోరుకోవడం, చివరకు యామిని అతనితో మాట్లాడడం సినిమా ముగింపు.
యామినిగా రీచా గంగోపాధ్యాయ, కార్తిక్‌గా ధనుష్ నటించిన ఈ సినిమా ఈ దశకంలో వచ్చిన మంచి చిత్రం. ఇప్పటి హీరోయిన్లకు భాష రాదు. డబ్బింగ్‌పై ఆధారపడతారు. ఈ సినిమాలో కూడా రిచాకు డబ్బింగ్ చెప్పారనే అనుకుంటాను. కాని ఆమె నటన బావుంటుంది. నటన కన్నా ఆ పాత్రను దర్శకులు సెల్వరాఘవన్ మలచిన తీరు బావుంటుంది. ఈ సినిమాకు కథ కూడా అయనే సమకూర్చుకున్నారు. యామిని పాత్రలోని మెచ్యూరిటి అందరినీ ఆకట్టుకుంటుంది.
- పి.జ్యోతి
సెల్: 9885384740