Authorization
Mon Jan 19, 2015 06:51 pm
»»When ever you read a good book, somewhere in the world a door opens to allow in more lightµµ
- Vera Nazarian
మనం నివసిస్తున్న భూమి, మన చుట్టూ ఉన్న ప్రకతి, మనతో పాటు ఉనికిలోని మొత్తం ప్రపంచాన్ని గురించి తలెత్తే ప్రశ్నలూ వాటికి జవాబులు అందించే విషయాన్నే విజ్ఞానం అంటున్నాం. ప్రతి తరానికి భౌతిక జీవనం కొరకు గాలి నీరు ఆహారం దుస్తులు నివాసం ఎంత అవసరమో, సామాజిక జీవితానికి, వనరుల కల్పన అభివద్ధికి విజ్ఞానం, మేధస్సు అంతే అవసరం. జ్ఞానావసరాలను మేధో అవసరాలను తీర్చేందుకు ఏ తరానికి ఆ తరం విద్యను అభ్యసించాల్సిందే. విద్యలో ఉపాధ్యాయుడిచ్చే శిక్షణతో పాటు విద్యా కత్యాల్లో విద్యార్థికి అధ్యయనం ఎంతో ముఖ్యమైంది. అధ్యయనానికి గ్రంథాలయం... అందులోని పత్రికలు, ఇతర పఠన సామాగ్రితో పాటు వివిధ శాస్త్ర విభాగాలకు చెందిన పుస్తకాలు ఎన్నో అందుబాటులో ఉంటాయి. టెక్నాలజీ పెరిగి ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులోకి వచ్చిన దరిమిలా పుస్తక పఠనం తగ్గిపోతుందని, మన దేశంలో నూటికి తొంబై ఒక్క మంది విద్యార్థులు రోజుకు మూడు గంటలు కూడా చదవడం లేదని కాశ్మీర్ విశ్వవిద్యాలయం-ఆసియా అధ్యయనం కేంద్రం గతంలో నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. ఆ మూడు గంటలైనా పాఠ్య పుస్తకాలు తప్పించి మరొకటి ముట్టుకోరు. అత్యంత విలువైన సాహిత్య సామాజిక గ్రంథాల వైపు పిల్లలు మళ్లీ చూడకపోవడంతో అవి దుమ్ముగొట్టుక పోతున్నాయని లైబ్రేరియన్లు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త తరాన్ని సాహిత్య పఠనం వైపుకు మళ్లించి వారిలో పఠన సంస్కతిని పెంపొందించాల్సి ఉంది.
అసలు ఏ పుస్తకాన్ని ఎందుకు చదవాలో స్పష్టంగా అర్థమయ్యేట్టు విద్యార్థులకు తెలియాల్సి వుంది. ఇక్కడ గ్రంథాలయ సిబ్బంది అవసరం విద్యార్థులకు చాలా ఉంది. పెద్ద వాళ్లంగా పిల్లలు పెరిగే విధానాన్ని గమనిస్తున్నప్పుడు వాళ్లు ఎక్కడ దేనిదేనికి ఎట్లా సంఘర్షణ పడుతున్నారో మనకు తెలుస్తూనే ఉంటుంది. వ్యక్తి ఎదుగుదలకు పునాది సంఘర్షణలో ఉన్నట్టే, వెనకడుగుకూ హేతువు సంఘర్షణే కాగలదు. సంఘర్షణకు బొమ్మాబొరుసు ఉంటాయి. అందుకని ఓటమితో కుమిలిపోయే వ్యక్తికి స్ఫూర్తిదాయ కమైన ఓ పుస్తకమిచ్చి చదివిస్తే ఓరిమినల వరచుకొని గెలుపు వైపుకు అడుగు పడుతుంది. లక్ష్య సాధనలో ప్రగతి సాధిస్తున్న వ్యక్తి సైతం మరింత ముందు కెళ్లడానికి పుస్తకాలు ఎంతో అవసర మవుతాయి. విద్యా నైపుణ్యాలతో పాటు జీవన నైపుణ్యాలు అబ్బుతా యనే ఎరుకను వాళ్లకు నచ్చే పద్ధతిలో ప్రణాళికాబద్దంగా ఉపాధ్యాయులు, గ్రంథ పాలకులు పుస్తకాలను గురించి విషయ సూచిక వారీగా వివరించ గలగాలి. అప్పుడే యువత గ్రంథాలయాల తలుపు తడతారు. లక్షలాది మంది యువతీ యువకులు విద్యార్థులున్నప్పటికీ కేవలం పఠనాభి రుచి మందగించిన కారణంగా విద్యాసంస్థల్లోని గ్రంథా యాలు, పట్టణాల్లోని నగరాల్లోని పౌరగ్రంథాలయాలు వెలవెల బోవడం మనం చూస్తున్నదే. కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని వెచ్చించి ఏర్పాటు చేసిన గ్రంథాలయ వ్యవస్థ ప్రయోజన దాయకం కావాలంటే పిల్లలను పాఠశాల స్థాయి నుంచే పుస్తక పఠనం మీదకు మళ్లించాల్సిన బాధ్యత విద్యావంతులైన ప్రతి ఒక్కరిదీ. శారీరక ఆరోగ్యం కోసం రోజూ వ్యాయామానికి గ్రౌండుకు ఎట్లా వెళ్తామో, అట్లానే రోజులో ఏదో ఓ సమయంలో కోసం లైబ్రరీలో గడిపితేనే జ్ఞానార్జన సాధ్యపడుతుంది. కేవలం పోటీ పరీక్షల కోసమే కాదు, ఉత్పత్తి, వ్యవస్థాననా రంగాల్లో మేధోవనరుల ప్రాధాన్యత కీలకంగా మారిన ఈ స్వయంచలన యుగం (Age of Automation) లో మేధో సముపార్జనే యువత ముదున్న కర్తవ్యం. ఇందుకు గ్రంథపఠనమే చక్కటి రహదారి.
ప్రముఖ పాత్రికేయురాలు, లైఫ్ హ్యాక్ నిర్వాహకురాలు కేథరిన్ వింటర్ పుస్తక పఠనం వల్ల పది మహత్తరమైన ప్రయోజనాలున్నట్టు గర్తించారు. అవి 1.మానసిక ఉద్దీపన (Mental Streaming). 2. ఒత్తిడి తగ్గింపు (Stress Reduction). 3. విజ్ఞానం (Know ledge). 4. భాషా విస్త్తతి (Vocabulary Expansion). 5. జ్ఞాపక శక్తి పెంపు (Memory Improvement) 6. బలమైన విశ్లేషణాత్మక నైపుణ్యాలు (Stronger Analytical Skills) 7. దష్టి పెంపు, ఏకాగ్రత (Improve Focus and Concentration) 8. ఉత్తమ లేఖన నైపుణ్యాలు (Better Writing Skills) 9. ప్రశాంత చిత్తత ( Tranquillity) 10. ఉచిత వినోదం (Free Entertainment).
కేథరిన్ వింటర్ చెబుతున్నట్టు వీటన్నింటిని సోదాహరణంగా అధ్యాపకులు వివరిస్తేనే విద్యార్థులు ప్రేరణ పొందుతారు. విక్టోరియా విశ్వవిద్యాలయ భాషా పరిశోధకురాలు, కోఆపరేటివ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రాం డ కెరీర్ సర్వీసెస్ స్థాపకురాలు కెటీ యాకో వ్లేవా వ్యక్తిలో పఠనం తెచ్చే మార్పులను వైవిధ్యంగా చర్చించారు. అవి 1. పఠనం వ్యక్తి ఎదగడానికి కావాల్సిన ధైర్యాన్నిస్తుంది (Reading dares you to grow), 2. పఠనం బహుళ వాస్తవాలను అనుభవంలోకి తెస్తుంది (Reading allows you to experience multiple realities), 3. పఠనం మన దక్పథాన్ని సవాలు చేస్తుంది(Reading challenges your perspective), 4.పఠనం ఆయా విద్యాంశాలను జ్ఞాపకం పెట్టు కోవడానికి దోహదపడుతుంది (Reading helps you remember), 5.పఠనం మనల్ని బాధించే విష యాల మరపుకు సాయ పడుతుంది (Reading helps you forget), 6. పఠనం మన ఒంటరి తనాన్ని పోగొడుతుంది (Reading means you donµt have to be alone), 7.పఠనం పఠితలో స్ఫూర్తి నింపి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంది Reading brings life) అని కెటీ యాకోవ్లేవా అంటారు. ఇట్లా అనేకులు అనేక అభిప్రాయాలను వ్యక్తీకరించారు. ఇదంతా దష్టిలో ఉంచుకొని వయో వర్గాల వారీగా, జెండర్ ప్రాతిపదికగా పుస్తకాలను విద్యార్థులకు అందజేస్తూ ఉండాలి. పుస్తకాలు మెదడును వేగిరపరచి వాస్తవాల చొప్పింపుతో హేతుబద్దంగా ప్రపంచానికి సంబంధించిన సంక్లిష్ట విష యాలను అవగాహన చేయిస్తాయి. భాష, చరిత్ర, సంస్కతి, నాగరికత, సామాజాల అభి వద్ధి వివరాలను సమగ్రంగా వివరిస్తాయి. పర్యావరణం, సైన్సు, టెక్నాలజీల పారంపర్యతను కళ్లకు కడతాయి. మానవాళితో పాటు సమస్త జీవకోటి ప్రాదుర్భావాన్ని పరిణామ క్రమతను నిత్యం పరిశోధకుల దాపున ఉంచుతాయి. మంచి వక్తలు, గొప్ప రచయితలు శాస్త్రవేత్తలు తయారయ్యేది, పరిశోధకులు విశ్లేషకులు సిద్ధాంత కర్తలు ఆవిర్భవించేది గ్రంథాధ్యయనం ద్వారా చేరుకున్న ప్రతిభా సామర్థ్యాలతోనే. వ్యవస్థలో, కుటుంబంలో, వ్యక్తిలో సంక్షోభం ఏ స్థాయిదైనా దాని పరిష్కారానికి పఠనానుభవం తోడ్పడగలదు.
గ్రంథ పఠనంతో మనిషి చైతన్యవంతుడవుతాడు. ఒక అనిర్వచనీయ శక్తి లోలోపల నుంచి రాజుకొని మనిషిని యుక్తి పరుడుగా జీవితాంతం నడిపిస్తుంది. ఈ దష్టితోనే కొందరు తమ మిత్రులకు ఆయా సందర్భాల్లో తమకు నచ్చిన పుస్తకాలను బహూకరిస్తుంటారు. ఇంకొందరు నూతన సంవత్సరాదిన, జన్మదిన వేడుకల్లో, పెళ్లిరోజు, గహ ప్రవేశం ఇత్యాది సందర్భాల్లో శుభా కాంక్షలను గుదిగుచ్చి పుస్తకాలను మిత్రుల చేతికందిస్తుంటారు. కొత్త పుస్తకాలు మరిన్ని చదివేందుకు తీర్మానాలు చేస్తారు. పుస్తక ప్రేమికులు అక్కడక్కడ తమ స్నేహితులతో కలసి వారం వారం 'బుక్ టాక్స్, బుక్ క్లబ్స్, స్టడీ సర్కిల్స్' నడుపుతారు. ముఖ్యంగా ఆయా రాజకీయ పార్టీలు తమ భావజాల పరిణతి కోసం సుప్రసిద్ధ రచయితల గ్రంథాల మీద ఉపన్యాసాలు ఏర్పాటు చేస్తారు. వివిధ గ్రంథాలపై పాఠక స్పందన నిర్వహిస్తారు. ఆయా గ్రంథకర్తల స్వీయానుభవం, స్వీయ పరిశీలన, అధ్యయనం పై లోతుగా చర్చ జరుగుతుంది. వీటిల్లో విద్యార్థులు పాల్గొనేలా ప్రోత్సహించాలి. ఈ సందర్భంలో రచయితలను గురించి పండిత రాహుల్ సాంకత్యాయన్ చెప్పిన అందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ''గత కాలపు సమాజాన్ని వాస్తవిక రూపంలో నిజాయితీతో చిత్రించడం నా ప్రథమ కర్తవ్యంగా భావిస్తాను'' మాటను విద్యార్థుల ముందుంచు తున్నాను. మనలో ఎవరమైనా మనకు చెందిన వెనకటి తరాలను గురించి తెలుసుకోవాల్సి వుంటుంది.ఐతే అది సంభాషణ రూపం లోనైనా, కథల రూపంలోనైనా, కావ్యం, నవల, నాటకం గానైనా, సాహిత్యానికి సంబంధించిన మరొక ఏ రూపంలోనైనా మనకు అందుబాటు ఉన్నదంటే దాని ఆవిష్కరణ పట్ల రచయితల కున్న బాధ్యత ఏమిటో సాంకత్యాయన్ తెలియపరచారు. పఠన కార్యక్ర మంలో పాఠకుల్ని మరింత పరిపక్వ మనస్కుల్ని చేసే అంశం ఇదే.
కొందరు పుస్తకం చదవడం ప్రారంభించిన దగ్గర్నుంచి ముగిసే వరకు నోట్సు రాసుకుంటారు. ఈ నోట్సు వాళ్లను సజరంగం వైపుకు రిఇన్ఫోర్స్ చేస్తుంది. తమ రచనలకు ప్రణాళికగా కూడా ఆ నోట్సు వాళ్లకు పనికొస్తుంది. మట్టిలో వేసిన విత్తనం పంటనిచ్చినట్టు పుస్తకం నుంచి మెదడుకెక్కిన జ్ఞానాంశ పాఠకుడిలో చింతనావరణాన్ని సష్టిస్తుంది. చింతనావరణంలోంచే తత్త్వవేత్తలు ప్రవక్తలు ఆవిర్భవిస్తారు. ప్రపంచ గతిని మార్చే ప్రతి చర్య వెనుక తత్త్వవేత్తల ప్రవక్తల కషి ఎంత ఉందో మనకు తెలుసును. కారల్ మార్క్స్, చార్లెస్ డార్విన్, సిగ్మండ్ ఫ్రాయిడ్ తమ ఆలోచనాధారతో ప్రపంచగతిని మార్చేశారు. ఈ ముగ్గురూ మహా చదువరులన్న విషయాన్ని నేటి కొత్తతరం గుర్తెరగాలి. భారత రాజ్యాంగ రూపశిల్పి డా.బి.ఆర్.అంబేద్కర్, జాతిపిత మహాత్మాగాంధీ, తొలి ప్రధాని పండిట్ నెహ్రూ, నవధర్మ ప్రతిపాదకుడు వివేకానందుడు, విశ్వకవి రవీంద్ర గురుదేవుడు, మహాత్మా జ్యోతిబా ఫూలే, ద్రవిడ ఉద్యమ కారుడు రామస్వామి నాయకర్ నిత్యపఠశీలురు, పుస్తకప్రియులు. వీరి రచనలు ప్రాతః పఠనీయాలు. తెలుగునాట అభ్యుదయ విప్లవ సాహిత్యోద్యమాలకు నాయకత్వం వహించిన మహాకవి శ్రీశ్రీకి నిత్య చదువరిగా పేరుంది. మాజీ ప్రధాని పి.వి. నర్సింహారావు నిరంతర అధ్యయనం అలవాటున్నందున్నే రాజకీయ రణరంగంలో అపర చాణుక్యుడిగా రాణించారు.
ఉత్తమ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందిన మాజీ కేంద్ర మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి రాసిన 'పది భావజాలాలు (Ten Ideologies) గ్రంథం వెనకాల గల ఆధార పట్టికను చూస్తే ఆయన ఎంతటి తీరికలేని చదువరో తెలియగలదు.
పుస్తక పఠనం వలన వ్యక్తికి చేకూరే ప్రయోజనాన్ని గురించి తన శిష్యుడు ప్లేటోతో ప్రత్యేకించి చెబుతూ సోక్రటీస్ ఇట్లా ''గ్రంథ పఠనానికి నువ్వు సమయాన్ని తప్పక కేటాయించు. ఆ రచనల్లోని పాత్రలు చేసిన కష్టతరమైన పనులను నువ్వు గనక నీ జీవితంలో చేయాల్సి వచ్చినపుడు నీకు అసలు శ్రమే ఉండదు'' అంటాడు. ఎంత ఎక్కువ చదువుతామో అంత ఎక్కువ విషయాలను తెలుసుకుంటాం, నేర్చుకుంటామంటారు మన పెద్దలు. సౌహార్థం, సమభావం, సహన శీలం, కుశాగ్ర బుద్ధి, భాషణ చాతుర్యం, పోరాటతత్వం, జాతీయ భావన, విశ్వమానవ తత్త్వం శీగ్రగతిన అలవడేది చదువరులకే. గ్లోబల్ పరిభాషలో 'థింక్ ట్యాంక్' అని పిలువబడే మేధో బందాలు అధ్యయన శక్తివల్లనే రూపొందుతారు. మేధో బందాలే దేశాధ్యక్షులకు ప్రధానులకు గవర్నెన్స్‌లో, పెద్ద పెద్ద కంపెనీ మేనేజ్మెంట్లకు వ్యాపార సలహాలిస్తుంటారు. ఒక్కో రచయిత ఒక్కో సామాజిక అంశాన్ని లక్ష్యం చేసుకొని రచనలు చేస్తుంటారు. ఆర్.కె.నారాయణ్ 'మాల్గుడి డేస్', కుష్వంత్ సింగ్ 'ట్రైన్ టు పాకిస్తాన్', చిత్రా బెనర్జీ 'పాలెస్ ఆఫ్ ఇల్యుజన్స్', జె.కె.రోలింగ్స్ 'హారిపాటర్', పాల్ కొయిల్హొ 'ద ఆల్కమెస్ట్', ఎఫ్.స్కాట్ ఫిజరాల్డ్ 'ద గ్రేట్ గాట్స్బి' మొదలైన పుస్తకాలు పాఠకులను రంజింపజేయడంతో పాటు మానవాళి ఆలోచనా స్థితిలో నడవడికలో మార్పులను కార్యకారణ సంబంధాలతో నిరూపిస్తాయి.
మనకు ఇతిహాసాలు ప్రబంధాలున్నట్టే ప్రపంచం నలుదిక్కుల నుండి ఆయాభాషల్లో గొప్పరచనలెన్నో వెలువడ్డాయి. థామస్ పెయిన్ 'కామన్ సెన్స్' చదువుకొని అమెరికా ప్రజలు స్వాతంత్య్రం సముపార్జన చేశారు. మార్క్స్ ఎంగెల్స్ 'కమ్యూనిస్టు మేనిఫెస్టో' అధ్యయనంతో శ్రామిక వర్గం ప్రాపంచిక శక్తిగా ఎదిగింది. జ్యోతిబా ఫూలే 'గులాం గిరి' మన దేశ మూలవాసులకు అడుగు వర్గాలకు ఆత్మగౌరవ పతాకాన్నందించింది. ఎలెక్స్ హేలీ 'రూట్స్' జాతి వివక్షను, బానిసత్వాన్ని తీవ్రంగా నిరసించింది. తరిమెల నాగిరెడ్డి 'తాకట్టులో భారతదేశం' పంతొమ్మిది వందల అరవైల నాటికే ముంచుకొచ్చిన నయా ఉదారవాద పెట్టుబడిదారీ అగ్రరాజ్యపు గుత్తాధిపత్యాన్ని ఘాటుగా విమర్శించింది. గోర్కీ 'అమ్మ' నవల సోవియట్ విప్లవం మీద ఎంతగా ప్రభావం చూపిందో అందరికీ తెలుసు. స్వామి దయానంద సరస్వతి 'సత్యార్థ ప్రకాశిక' దేశీయోద్యమానికి భారత స్వాతంత్య్రోద్యమానికి ఇచ్చిన మహత్తర ప్రేరణ సదా స్మరణీయం. అమిత పఠన కాంక్షకు కుతూహలానికి నవచైనా నిర్మాత మావోసేటుంగ్ గ్రంథాలయంలో గుమస్తాగా పని చేసిన ఉదంతాన్ని తార్కాణంగా పేర్కొనవచ్చు. అంతెందుకు జయ శంకర్ సార్ రాసిన 'తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్' పుస్తక ఫలితమే కదా! ఉద్యమం, కొత్త తెలంగాణ రాష్ట్రం.
ప్రపంచ పటం మీద ఆసియా ఐరోపా ఆఫ్రికా లాటిన్ అమెరికా దేశాల్లో కీర్తి గడించిన కవులు రచయితలెందరో మనకున్నారు. రూసో, వోల్టేరు, అబ్రహం లింకన్, బెట్రాండ్ రస్సెల్, అడమ్ స్మిత్, జాన్ స్టువర్ట్ మిల్, ఆస్కార్ వైల్డ్, బంకించంద్ర, దామోదర్ సావర్కర్, రూజ్ వెల్ట్, చర్చిల్, ఐనిస్టీన్, రాం మనోహర్ లోహియా, డి.డి.కొశాంబి, సర్వేపల్లి రాధా కష్ణన్, మౌలానా ఆజాద్, ప్రేమ్ చంద్, పెర్సనొప్పితె మండేలా, మహాశ్వాతా దేవి, హౌవర్డ్ ఫ్రాస్ట్, కరుణానిధి, ఏ.పి.జె.అబ్దుల్ కలాం-వీళ్లంతా పుస్తక ప్రియులే. అమర్త్య సేన్, వారన్ బఫెట్, బిల్ గేట్స్, జెఫ్ బిజోస్, గోపాల కష్ణగాంధీ, రొమిల్లా థాపర్, బిపిన్ చంద్ర, నోమ్ చామ్స్కీ, మాయా ఎంజిలియో, చుక్కా రామయ్య, కంచె ఐలయ్య, అరంధతీ రారు, రామచంద్ర గుహ, శశి థరూర్, వీరప్ప మొయిలీ, ప్రభాత్ పట్నాయక్, శివ్ ఖేరా, సంజయ బారూ, కిరణ్ బేడి, కత్తి పద్మారావు, ఎబికె. ప్రసాద్, ఆచార్య కొలకలూరి ఇనాక్ మొదలు ఇవాళ్టి సుప్రసిద్ధ రచయితలు ప్రజా మేధావులంతా రేయింబవళ్లు పఠన మందిరాల్లో గడిపే వాళ్లే.
చివరన ఒక మాట, మహాకవి పోతన ''చదువని వాడజ్ఞుండగు, చదివిన సదసద్వివేక చతురత కలుగున్'' అని పలికిన భాగవత వాక్యం ముమ్మాటికీ నిజం. పిల్లలూ ఇక ఆలస్యం దేనికి? ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లకు కాసేపు విరామం ఇచ్చి పంచ తంత్రమో, పథేర్ పాంచాలీనో మరో మంచి పుస్తకమో తీసుకొని చదువండిరా. వేడెక్కిన బుర్ర చల్లబడుతుంది. సచ్చుబడ్డ వెన్నెముక నిటారుగా నిలబడతది. కర్తవ్యం బోధపడతది. తీవ్ర నిరాశా నిస్పహల నుండి బయట పడి ఇవాళ యువత జీవన శైలిపై అద్భుతంగా రచనలు చేస్తున్న చేతన్ భగత్‌ను బతికించి బాగుపరచినవి పుస్తకాలే.. నమ్మండి..!!
-డా.బెల్లి యాదయ్య
సెల్: 9848392690