Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురసలే కాదు... వాళ్లు నలుగురు. ఆ నలుగురూ ఆ రాజ్యెంలో కరుడు గట్టిన నేరస్తులు. లూటీలు హత్యలు రేప్‌లు వంటి ఘోర నేరాలు చేసిన ఆ నలుగురికే మరణ శిక్ష తప్ప మరొకటి సరైనది కాదని ప్రజలంతా భావించారు. న్యాయస్తానం అనేక విధాలుగా విచారించింది. లెక్కలేనంత మంది సాక్ష్యులు చెప్పింది వింది. చివరికి ఆ నలుగురుకీ ఉరిశిక్షే ఖాయం చేసింది.
బుల్లి కోర్టు చిన్న కోర్టు పెద్ద కోర్టు ఆ పై కోర్టు అన్ని కోర్టులూ నత్తనడక నడిచి కేసు కొన్నేళ్ళకి వచ్చి ఓ కొలిక్కి. ఏది ఏమైతేనేం ఎంత ఆలస్యం అయితేనేం చిట్టచివరికి ఆ నలుగురికీ ఖాయం అయింది ఉరిశిక్షే!
ఉరిశిక్ష అమలు చేయాలని రాజుగారి ఆదేశం వెలువడింది. తేదీ నిర్ణయింపబడింది. ఎన్నేళ్ళకోఅన్నేళ్ళకి తప్ప ఉరిశిక్షలు పడటం అమలవడం జరగకపోతుండడం వల్ల నేరస్తుల్ని ఉరి తీసే వృత్తి కళాకారులు ఆ వృత్తి మానేసి ఉండటాన అధికారులు ఆ నలుగురినీ ఉరితీసే తలారి అన్వేషణలో పడ్డారు. ఊరూవాడా పల్లే పట్నం గాలించి శోధించి పరిశోధించి చివరికి ఎలాగైతేనేం తాతముత్తాతలు ఆ వృత్తి చేసి వున్న వాడయిన ఒకానొక మనిషిని కనిపెట్టారు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. వాళ్ళిలా ఊపిరి పీల్చుకోడానికి కొన్ని యేళ్ళు గడిచిపోయేయి.
తలారి అయితే దొరికాడు కానీ తాడేదీ! ఉరి తీయడం అనేది లాకాయి లూకాయి విషయమూ ఆషామాషీ వ్యవహారమూకాదు గదా! ఎవడినైతే ఉరి తీయాలో వాడి మెడకు ఉచ్చు బిగించడానికి అది చాలినదై ఉండాలి. బావిలో చేద వేయడానికి వేసే చాంతాడులా కాకుండా అవసరమయినంత గట్టిగా ఉరితీతకు ఏ రకమైన అడ్డంకీ లేనిదిగా ఉండాలి. అలాంటి తాడు ఎక్కడ తయారు అవుతుందో ఉరితాడు తయారీ స్పెషలిస్టు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడానికి అధికారులు మళ్ళీ 'తియ్యండ్ర బళ్ళు' అన్నారు.
ఉరితీయడానికి తలారిని వెదకడానికి యేళ్ళుపట్టింది యిక ఉరితాడు తయారవడానికి యుగాలు పట్టుద్ది అని నవ్వుకున్నారు ఆ నలుగురు కీచకులు మానభంగ పర్వంలో లబ్ధప్రతిష్టులు.
ఊరికే బెదిరిస్తారు భయపెడ్తారు కానీ వీళ్ళ వల్ల అవనే అవదు మాకు ఉరిశిక్ష అమలు కానేకాదు అనుకున్నారు నలుగురు. ఆ నలుగురు అయితే ఆ నలుగురి ఖర్మకాలి ఉరితాడు చేసే మనిషి దొరికేశాడు. అయిన ఆలస్యం ఎలాగూ అయింది అని ఉరితాడు చేయమని అతడ్ని పురమాయించారు.
తలారి దొరికాడు ఉరితాడూ సిద్ధం అయింది. యిక ఆలస్యం అవడానికి వీల్లేదు అనుకున్నారు అమలు జరిపే అధికారులు. దుర్ముహుర్తం నిర్ణయించబడింది. ఉరితాడు పీకకు బిగించుకునే సమయంలో నేరస్తులకు నొప్పిగా ఉండకుండా ఉండటానికి వెన్నపూస తెప్పించబడింది. ఎట్లాగూ పీకకు ఉచ్చు బిగించి లాగితే ఎంతటి మొనగాడైనా నాలుక వెళ్ళబెట్టాల్సిందే కదా అది కనపడకుండా నల్ల ముసుగు వేయనే వేస్తారు కదా ఈ వెన్నపూస ఎందుకూ అని అనుకునేవాళ్ళు అనుకున్నారు కానీ రూల్సును ఎవరూఅతిక్రమించలేరు కదా. నిర్ణయించబడిన తేదీన ఉదయం ఉరిశిక్ష అమలు జరిగి తీరుతుందనుకున్నారు అందరూ. అప్పుడు భయపడ్డారు ఆ నలుగురూ సాధ్యం కానిది సాధ్యం అవుతుందేమోనని. ఆ రాత్రి వాళ్ళు నిద్రపోలేదు. బాగా ఆకలిగొని ఉన్న పందికొక్కు ఒకటి వాళ్ళతో పాటు జైల్లో తెల్లార్లూ మేలుకుంది.
ఆ మర్నాడు అమలు కావాల్సిన ఉరిశిక్ష అమలు కాలేదు. తెల్లవారు ఝామునే లేచి బ్రాండెడ్ ఉరితాడుకు వెన్నపూస రాద్దామని చూసి తలారి షాక్ తిన్నాడు. ఉరితాడుకు రాయవలసిన వెన్నపూసని తెల్లార్లూ నిద్రపోకుండా నాకేసింది పందికొక్కు.
ఆ నలుగురి ఉరిశిక్ష వాయిదా పడింది. వారి ఉరిశిక్షకు బ్యాడ్డేట్ అండ్ టైం పిక్సయింది. ఈ సారి ఎట్టి పరిస్థితులోనూ ఉరిశిక్ష అమలయ్యే తీరుతుంది అనుకున్నారు. మర్నాడు ఉరి తీసే సమయం దాకా ఉరితాడుకు పూయవలసిన వెన్నపూసను ఏ పందికొక్కు ముట్టుకుండా కాపలాకాసారు మిలిట్రీ నుంచి వచ్చిన వైట్క్యాట్ కమాండోలు.
ఆ నలుగుర్నీ ఉరితీసే స్థలానికి తీసుకుపోవడం మొదలైంది. పోలీసులు మీసాలు మెలేశారు. కళ్ళకు కట్టిన గంతలు తీసేసి ఈ దృశ్యాన్ని చూడాలని తహ తహ లాడింది న్యాయ దేవత.
ఆ నలుగురిలో ఒకడు మధ్య దారిలో దబ్బున నేల మీద కూలబడ్డాడు. అలర్ట్ అయ్యాడు డాక్టర్. ధర్మామీటర్ జ్వరాన్ని కొలిచింది. జబ్బుగా ఉన్నా జ్వరంగా ఉన్నా ఆ వ్యక్తిని ఉరి తీయడానికి వీల్లేదు. రూల్స్ ఒప్పుకోవు. జ్వరపీడితుడైన వాడ్ని ఒక్కడ్నే వదిలి మిగతా ముగ్గుర్నీ ఉరి తీయడానికి కూడా వీల్లేదు. బతికినా చచ్చినా ఆ నలుగుతూ కలిసే...
ఆ నలుగురి ఉరిశిక్ష మళ్ళీ వాయిదా పడింది. నలుగురూ సెల్‌లోకి వచ్చిపడ్డాక జ్వరం వచ్చిన వాడు తను చిన్నప్పుడు బడి ఎగ్గొట్టడానికి జ్వరం తెప్పించుకునే వాణ్ణని అందుకు ఉల్లిగడ్డ వాడేవాణ్ణని అన్నాడు. నలుగురూ నవ్వుకున్నారు. డాక్టర్ జ్వరం వచ్చినవాడిని పరీక్షించి అది ఉల్లిగడ్డ జ్వరం అని తేల్చడంతో మళ్ళీ ఉరితీతకు మరో రోజు నిర్ణయింపబడింది. ఈ సారి కమెండోలు ఉల్లిగడ్డలకు కాపలా ఉన్నారు. అయితే ఫేక్ ఫీవర్ తెచ్చుకున్న వాడు తనకు ఒక్క ఉల్లి గడ్డతో మరో మూడూ అప్పుడే తెచ్చేశాడని ఎవరికీ తెలియలేదు. ఒకడి తర్వాత ఒకడు దబ్బుదబ్బున పడిపోతూ ఉరిశిక్షని మళ్ళీమళ్ళీ వాయిదా వేయించబోతారని ఎవరూ ఊహించలేదు!!
- చింతపట్ల సుదర్శన్
సెల్: 9299809212