Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనిషిని చదివిన మనిషి సంగెనేని రవీంద్ర. అతని 'వారెవా...!' అన్న మినీ కవితా సంకలనంలో మనిషి నైజాన్ని, లోకం పోకడలను ఆవిష్కరించాడు. ఈ మినీ కవితా సంకలనం లోని ఏదో ఒక కవిత మన జీవితానికి దగ్గరగా కనిపిస్తుంది అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. కాలాను గుణంగా వచ్చే మార్పులతో పాటు మనిషి నడకలోనూ, మాట తీరులోనూ మార్పు చోటు చేసుకొంది. ఆ మార్పు కేవలం సంఘహితం ఎంత మాత్రం కాదు. కేవలం తన గురించి, తన కుటుంబం గురించి మాత్రమే. ఈ కవితా సంకలనంలో ప్రధానంగా మనకు కనిపించేది మనిషిలోని బలహీనతలు, అసూయ, ద్వేషం తదితర జాడ్యాలు మనకు కన్పిస్తాయి. రవీంద్ర తన మాననా తానేదో రాసుకొని పోతుంటే, ఆ కవిత్వంలో తననే తిట్టావంటూ తిట్టినవాళ్లు ఉన్నారు. నిజానికి వాళ్లు చేసిన తప్పులేమిటో కూడా తనకు తెలియదు. లోకాన్ని తన కళ్లతో చూసి, తన మనసుతో చదివి తాను చెప్పాలనుకొన్నది చెప్పాడు. అయినా, ఈ రోజుల్లో మంత్రాలకు చింతకాయలు రాలుతాయ అన్నట్లు, రాతలకు మనిషిలో మార్పు తీసుకురావడం అనేది ఒక అపోహ మాత్రమే. అతిగా ఊహించుకొంటే ఒక భ్రమ కూడా. ఇప్పుడు నిజాలు మాట్లాడటం అంటే నీకు బతకడం చేతకాదు అని ఎవరో ఒకరు తమ చూపుడు వేలు చూపించే కాలం.
ఈ మినీ కవితలలో జీవిత నగ సత్యాలు ఉన్నాయి. అందుకే ఆరుద్ర అంటారు 'ఎన్ని గజాలు రాశాడు అన్నది కాదు ... ఎన్ని నిజాలు చెప్పాడు'' అన్నది కవి కవిత్వం సూత్రం. రవీంద్ర చెప్పాలనుకొన్నది మొహమాటం లేకుండా చెప్పినా, మొహం మీద మాట్లాడిన వాళ్లు ఉన్నారని తన మాటలో చెప్పుకొన్నారు.
ఈ మినీ కవితలకు ఎలాంటి శీర్షికలు లేవు. ఈ కవిత రెండు భాగాలుగా విభజించిబడి ఉంది. ఇందులో మొదటి భాగంలో ఒక ఆలోచన రెండవ భాగంలో ఒక అన్వేషణ కనిపిస్తుంది. 1వ ఖండికలో మనిషి జీవన పోరాటం గురించి -
నా అక్షరం / ఆయుధం / కానక్కర లేదు.../ అలారమైతే చాలు...!
నిద్రలేచినోడు / యుద్ధం / చేయకుండా ఉంటాడా...?
లేదా మనిషి తన ఓటమి గురించి ఏదో ఒక రోజు చైతన్య వంతుడవుతాడని, ఎదురు నిలబడి ప్రశ్నిస్తాడని కవి నమ్మకం.
ఒక సాహితీవేత్తకు రావల్సిన అవార్డులు రివార్డులు, సభలు, సన్మానాలు అతను జీవించి ఉన్నప్పుడు కాదు. ఆ సాహితీవేత్త తదనంతరం అతనికి దక్కవలసిన గౌరవం గురించి ఈ విధంగా అంటారు
పోయాక.../ మోసేందుకు కాదు.../ మన గురించి రాసేందుకు కూడా / నలుగురు కావాలి... / ఏమైనా ఇస్తే ఎవరైనా మోస్తారు... / ఏమైనా చేస్తేనే / మన గురించి రాస్తారు.
ఒక సాహితీవేత్త జీవితాన్ని అతని రచనలు మాత్రమే చిరంజీవిని చేస్తాయి.
మనిషి లక్షణాలు గురించి కవి ఈ విధంగా అంటారు కానీ... ఇప్పుడే / ఓ కుక్కను తెచ్చారు/ పెంచుకుందామనీ... /చిత్రం /దాన్ని చూశాకే /నాలో మనిషి /లక్షణాలు కనిపిస్తునై...!
మనిషిని కుక్కను పెంచుకొన్నంత మాత్రాన మనిషిలో విశ్వాస బీజం నాటుకోదు. అయితే, గియితే కుక్క తోకలా ఉ ంటుంది మనిషి బుద్ధి.
మరో మినీ కవితా ఖండికలో ''తప్పు లెన్నువారు తండోప తండబు... ఊర్వి జనులకెల్ల ఉండు తప్పు...'' అయినప్పటికీ, మనిషి చిరునామా కోసం మనిషిని మనసుతో వెతకమంటారు. ఈ కవిత కవి మనసుకు తార్కాణంగా నిలుస్తుంది.
మనసుతో చూడు / మనుషులు కనిపిస్తారు... / కళ్లతోనే చూస్తే / కల్మషమే కనిపిస్తుంది...!
అందెశ్రీగారు మాత్రం ''మాయమైపోతు న్నడమ్మ మనిషన్నవాడు...'' అంటారు. మని షిని వెతికి పట్టుకోవడానికి మనసు కావాలి.
నేటి రాజకీయ చిత్రాన్ని ఈ విధంగా విశ్లేషించారు - మన నాయకులు మాటలతో ఎలా మభ్యపెట్టేది ఈ కవితలో కనిపిస్తుంది.
ఈ దేశంలో / పదవుల్లేని మేధావులు / ప్రజాపక్షమంటారు
పదవులెక్కగానే / పెదవులు / మూసుకుంటారు...!
ఈ 'వారెవా....!! మినీ కవితా సంకలనంలో 100 కవితలు ఉన్నాయి. ప్రతి కవిత ఏదో ఒక జీవిత సత్యాన్ని తెలియ పరుసూర్తి, వెక్కిరిస్తుంది. కాస్తంత తడితడిగా ఉన్న మనసులు ఉలిక్కి పడుతుంటాయి. ఈ కవితలు చురుక్కు మంటాయి.
ఈ మినీకవితలు ఏదో ఒక సందర్భములో గుర్తుకు వచ్చాయంటే- విశ్వంభరుడు సి.నా.రె మాటల్లో చెప్పాలంటే. మినీకవిత ఆయుష్షు మెరుపంత కాని అది ప్రసురిస్తుంది కాలమంతా రవీంద్రగారు మీ ప్రయత్నం - ''వారెవా...!'' అని కాస్తంత జోష్ గానే అనాలి.
(వారెవా..! (మినీ కథలు), రచయిత : సంగెవేని రవీంద్ర, పేజీలు : 54, వెల : రూ. 100/-, ప్రతులకు : సి.వి.ఎస్ కాంపౌండ్ 7/4, హనుమాన్ లేన్, లోవర్ పారెల్, ముంబై - 400013; అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలలో...)
- బొల్లిముంత వెంకట రమణారావు
సెల్: 81067 13351