Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇలాంటి ప్రశ్న వింటే చాలా మందికి విసుగనిపిస్తుంది. పీకావులే కోడిగుడ్డుమీద ఈకలు అని ఈసడించేసుకుంటారు. లేదా అదేదో సినిమాలో సునీల్ అన్నట్లు హె.. హె..హె (సునీల్ కామెడీ స్టైల్లో) కీ...చ్ కోడే ముందు హెంద్డు కంటే గుడ్డు వెనక నుంచి వచ్చిద్దిగా.
కానీ ఈ ప్రశ్న క్రీస్తు పూర్వం నుంచే వుంది. అరిస్ఠాటిల్ పేర్కొన్న ప్రధాన అసంబద్దాలలలో (Paradox) ఇది కూడా ఒకటి. కాలక్రమంలో ఎంతకీ తేలని ప్రశ్నలు వుంటే కోడి ముందా? గుడ్డు ముందా? అన్నట్లుంది అనే నానుడితో తేల్చేయడం కూడా అలవాటయ్యింది.
అయితే నీల్ టైసన్ అనే ఆయన ఇదే విషయంలో ఒక మౌలికాంశంపై పరిశోధన చేసి 2017లో స్టీఫెన్ హాకింగ్ పేరుతో ఇచ్చే శాస్త్రీయ అవార్డును అందుకున్నాడు. 1958లో పుట్టిన ఈ అమెరికన్ అంతరిక్ష భౌతిక శాస్త్రవేత్త గుడ్డుపై పెంకులో వుండే OC17 అనే పదార్ధం రసాయన లక్షణాలు దాని మూలాల విశ్లేషణ ఆధారంగా ఈ ప్రశ్నలోని చిక్కుని విడదీసి కొంత సాఫీగా చేసాడు.
ఏది ముందు?
మనం కూడా కొంచెం ఆలోచిద్దాం. ఇందాకే ఒక ఆమ్లెట్ వేసుకుని తిన్నాను. ఆ ఎ అనే కోడిగుడ్డుని ఒకానొక బి అనే కోడి పెట్టింది. సరే ఆ కోడి మరేదో సి అనే గుడ్డు నుంచి వచ్చింది. సి అనే గుడ్డు డి అనే కోడి నుంచి వచ్చింది. మరి దానికంటే ముందు దానికంటే ముందు అంటూ మనం కాలంలో ఎంత వెనక్కి వెళ్ళగలం. నిజానికి కోళ్ళు మనిషి అనేవాడెవ్వడూ పుట్టక ముందు నుంచే వుంటున్నాయి. ఇంకా చెప్పాలంటే క్షీరదాలు అనే జీవరాశి ఏదీ భూమ్మీదకు రాక ముందే ఈ కోళ్ళు వున్నాయి. మరి అప్పటి కాలంలోని సిసి టీవి ఫూటేజిలూ, టైం మెషిన్లో మనం వెనక్కి వెళ్ళి తెలుసుకునే అవకాశాలూ లేవు కదా. మరి ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుం... ఎలా తెలు.....
హా డార్విన్ తాతయ్య చెప్పిన పరిణామ సిద్దాంతం చూద్దాం.
నాటుకోడి, గిన్నెకోడి, ఫారం కోడి, గిరిరాజ కోడి, వనరాజా కోడి, కడక్ నాధ్ కోడి, నిప్పుకోడి, వగైరా వగైరా ఇవ్వన్నీ కోళ్ళే కదా. కోళ్ళు పక్షులే కానీ ఎగిరే పక్షులు కాదు. ఎగరని పక్షుల్లో కూడా వీటికంటూ కొన్ని లక్షణాలు వున్నాయి. మరి గుడ్డు అంటే చుట్టూ పెంకు లోపట సొన ఆ సొనలో కూడా మధ్యలో గుండ్రంగా పసుపు పచ్చ సొన దాని చుట్టూతా తెల్ల సొన కనపడే రూపం. శాస్త్రీయంగా చూస్తే తల్లికోడి నుంచి కొన్ని కణాలు(సంయోగ బీజం) తండ్రికోడి అనబడే కోడిపుంజు నుంచి కొన్ని కణాలు (మరో సంయోగ బీజం) కలవడం వల్ల ఏర్పడిన సంయుక్తబీజం (ఉమ్మడివిత్తనం) అన్నమాట. తల్లి దండ్రుల నుంచి అటునుంచి సగం, ఇటునుంచి సగం ఆస్తులు తీసుకుని వారిలా తనూ ఎదిగే ప్రయత్నం చేసే చిన్న రూపం అన్నమాట. విశ్వం ప్రారంభాన్ని అండం (గుడ్డు) అనే అంటారు. పిండం ప్రారంభాన్ని కూడా అండం అనే అంటారు. ఎదిగే జీవలక్షణం వున్న ప్రాధమిక రూపం అన్నమాట. మొక్కల విషయంలో బీజం (విత్తనం) అంటే కూడా అదే కదా.
డార్విన్ పరిణామ క్రమం ఏం చెపుతోంది?
అత్యంత ప్రాధమికమైన సరళ జీవుల నుంచ సంక్లిష్టమైన ఉన్నత జీవులు వచ్చాయని చెపుతారు. ఈ మార్పులు నెమ్మదిగా జరిగే పరిణామం (Evolution) వల్ల మాత్రమే కాక ఉత్పరి వర్తనం (Mutation) వల్ల కూడా జరుగుతాయి అంటారు. దాని ప్రకారం చూస్తే తాబేళ్ళు, మొసళ్ళు, పాముల కాలం నుంచే గుడ్లు పెట్టడం, అవి పొదగబడి వాటినుంచి పిల్లలు రావడం అనేది వుంది. వీటి తర్వాత భూమిపై ఎప్పటికో కొంత కాలానికి కోడిలాంటి పక్షివచ్చింది. అంటే సరిసపాల తర్వాత ఆర్కియో ప్టెరిక్స్ లాంటి కనెక్టింగ్ లింకు ను దాటుకుని పక్షలు పరిణామం చెందుతూ వచ్చాయి. అలా చూసినప్పడు కోడి కంటే చాలా చాలా ముందునుంచే గుడ్డు అనేది వుంది.
హు ఇంత చిన్న విషయం అర్దంకాక వేల సంవత్సరాల నుంచి ఇంత బిల్డప్పు ఎందుకుకిచ్చారు అంటారా? అగండా గండి దానికీ ఒక లెక్క వుంది. గుడ్డు ముందు సరే కోడిగుడ్డు అనేది ముందు ఏర్పడి దానినుంచి కోడి వచ్చిందా? లేక కోడి ముందు ఏర్పడి అది కోడిగుడ్డును పెట్టిందా? అనే ప్రశ్న దీని వెంటనే వస్తుంది కదా. అప్పుడు మనం శీర్షికలో అడిగినట్లు కోడిముందా? గుడ్డు ముందా? అని కాకుండా కోడి ముందా? కోడిగుడ్డు ముందా? అని కదా అడగాలి. ఈ ప్రశ్నకు కూడా పామర పద్దతిలో ఆలోచించి సమాధానం చెపితే మాత్రం సులభంగా అయిపోతుంది చూడండి.
ఒక గుడ్డును కోడి పెడితేనే కదా కోడిగుడ్డు అంటాం. అసలు కోడి అనేదే లేకుండా వచ్చిన గుడ్డును ఎన్ని ఏ లక్షణాలు వున్నా సరే కోడిగుడ్డు అనటం కుదరదు కదా. కాబట్టి పరిణామంలో ఏదోరకంగా ముందు కోడి రావడం దాని తర్వాతనే అది గుడ్డు పెడితే కోడిగుడ్డు కావడం జరిగివుంటుంది అంతే బస్, లారీ, ట్రాక్టర్ ట్రైన్....అనేసు కుందామా. ఆగండాగండి. ఇక్కడే ఒక కొత్త విషయాన్ని ఓసీ 17 అనే పేరుతో వున్న రసాయన పదార్ధాన్ని పట్టుకొచ్చాడు మన టైసన్ గారు. కోడిగుడ్డుకున్న ప్రత్యేకత కోడి పెట్టడం మాత్రమే కాదు. ovocledidin-17 (OC-17) అనే పదార్డం గుడ్డుపెంకులో వుండటం కడా అని ఆ పదార్దం ఏమిటి ఎలా వుంటుంది ఎట్లా ఏర్పడింది లాంటి పరిశోధనలు చేసారు. కోడికంటే ముందు కోడిలాంటి జీవి ఒకటి దాన్నే ప్రొటో చికెన్ (పూర్వకోడి) ఒకటి ఏర్పడి అది ఈ గుడ్డు పెట్టిందని దానినుంచే తొలి కోడి ఏర్పడిందనీ చెప్తారు ఈయన. ఈ ovocledidin-17 (ఉజ-17) గురించ ఇంత లోతైన పరిశోధన చేసినందుకే టైసన్ కు 2017లో స్టీఫెన్ హాకింగ్ పేరుతో ఇచ్చే అవార్డు వచ్చింది. కానీ కోడే ముందు అనే వారి వాదన ప్రకారం మళ్ళీ టైసన్ చెప్పింది తప్పే అంటున్నారు. ప్రొటో చికెన్ పెట్టిన గుడ్డు కోడిగుడ్డు ఎట్లా అవుతుందప్పా? అది వుట్టి ప్రొటో చికెనీ గుడ్డే కదా. దాన్నుంచి వచ్చిన మన కోడి వుంది చూసారు అది పెట్టిన గుడ్డే కోడి గుడ్డు అనబడుతుందన్న మాట అనేస్తున్నారు. ఏమోనండీ నాక్కూడా బోలెడంత సందేహమే ఈ విషయంలో అయినా ఆలోచనలకు మరింత మరింత సానబెట్టటానికి ఇలాంటి సానరాళ్ళ లాంటి ప్రశ్నలు మాత్రం వుండాల్సిందే. ఏది ముందు అనడాన్ని తర్కశాస్త్రం ప్రకారం చూస్తే కార్యకారణ సిద్దాంతం కార్యము ఏది దానికి కారణము ఏది అని అర్ధం చేసుకోవడం దీనిలో ప్రధానాంశం. ఇటువంటివే మరికొన్ని ప్రశ్నలు కూడా వున్నాయి. వీటికోసం గెలుచేలా వాదించుకుని సంతోష పడటం కోసం కాకుండా సమాధానాన్ని తార్కికంగా వెతకడం ఎలాగ? మరింత చిక్కుముడులు వేసుకుంటూ పోకుండా దాన్ని సరళమైన పద్దతిలో విశ్లేషించుకోవడం ఎలాగా అనేది పరిశీలిస్తూ కుదిరితే ఎదిగే పిల్లలకు ఈ రిడిల్స్ అలవాటు చేయగలిగితే తార్కిక అవగాహన పెంచగలుగుతాం.
మరి చెట్టు ముందా? విత్తు ముందా?
దీన్ని కూడా సులభంగా పరిణామ సిద్దాంతం ఆధారంగా పరిశీలించి చూడొచ్చు. భూమిపై మొదట ఏర్పడిన ప్రాదమిక మొక్కలు క్రిప్టోగాములు అంటే పుష్పించని మొక్కలు ఇవి సంయుక్త బీజాలు(అంటే గింజలు) ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకోవు. ఇతర పద్దతుల్లో తమలాంటి మొక్కలను తయారు చేసుకుంటాయి. అంటే కొట్టిలో నాచు, బుట్టలో పుట్టగొడుగులు, ఆకునుంచి రణపాల, వేళ్ళనుంచి కరివేప, కొమ్మలు నాటితే గులాబీ మొలిచినట్లు విత్తనాల అవసరం లేని మొక్కలన్నమాటి ఇవి. ఆ తర్వాత పరిణామం లో ఎప్పటికో విత్తనాలను ఇచ్చే ఉన్నత స్థాయి మొక్కలు అంటే పుష్పించే మొక్కలు (ఫెనిరో గాములు) పుట్టాయన్నమాట. నిజానికి ఈ ప్రశ్న విషయంలో పూర్వకాలం నుంచి అనేకానేక వివరణలు చర్చలు జరిగాయి. సష్టి ప్రారంభం గురించి వివిధ మత గ్రంధాలు కూడా చర్చించక తప్పనిపరిస్థితి కాబట్టి భూమిపై జీవరాశిని సష్టికర్త లేదా దేవుడు ఎలా ఎన్ని రోజుల్లో సష్టించాడు అనే దానిపై వేర్వేరు వివరణలు ఇచ్చారు. అదంతా చెప్పుకుంటూపోతే నిడివి పెరుగుతుంది అన్న భయంతో ఇక్కడికి ఆపుతాను. ఈ రెండు ప్రశ్నలే కాక ఇటువంటివే మరెన్నో ప్రశ్నలు మానవ మేధస్సును ముందుకు నడిపి స్తున్నాయి. ఉదాహరణకు అత్యంత మేధావిగా చెప్పుకునే ఐన్స్టీన్ సూత్రం E=MC2 దీనిలో పదార్ధం శక్తి రూపంలోకి, శక్తి పదార్ధం రూపంలోకి మారుతుంది అని చెపుతారు. ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం ద్రవ్యరాశి సష్టించబడదు నాశనం కాదు ఒక రూపం నుంచి మరో రూపంలోకి మారుతుందంతే. మరి అలాగయినప్పుడు పదార్ధం ముందా? శక్తి ముందా? ముందుది ఎక్కడినుంచి వచ్చింది? ఎలా వచ్చింది? అది అంతం అవుతుందా? ఎప్పటికీ కాదా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పటికీ మానవ మేధస్సును దానిస్థాయినీ చాలెంజ్ చేస్తున్నాయి. Large Hadron Collider (LHC) లాంటి వాటితో చేస్తున్న ప్రయోగాలు ఊరిస్తున్న బోసాన్ కణాలు ఎప్పటికైనా ఈ ప్రశ్నలకు సమాధానం చెపుతాయేమో వేచి చూడాలి.
- కట్టా శ్రీనివాస్
సెల్: 98851 33969