Authorization
Mon Jan 19, 2015 06:51 pm
14వ శతాబ్దం ద్వితీయార్థంలో పద కవితా పితామహుడు 'అన్నమయ్య' తన కీర్తనలలో భక్తితో పాటు పలు సామాజిక విషయాలను కూడా ప్రబోధించారు. 'బ్రహ్మమొక్కటే పర బ్రహ్మ మొక్కటే' అనే కీర్తనలో ''నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే-అండనే బంటు నిద్ర అదియు నొకటే- మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి యొకటే- చండాలుండేటి సరి భూమి యొకటే'' అని ప్రాకతిక అంశాలకు రాజు-పేద; అగ్ర-నీచ అనే భేదభావం ఉండదని సాధారణీకరించారు. 20 వ శతాబ్దం ప్రథమార్థంలో 'కర్ణ' అనే చిత్రానికి సినారె ఒక గీతాన్ని అందించారు. ''గాలికే కులమేదీ.. ఏదీ నేలకు కులమేదీ'' అనే గీతానికి విశ్వనాథన్-రామమూర్తి సంగీత సారథ్యంలో గానకోకిల సుశీలమ్మ గొంతులో శివాజీ గణేషన్-దేవిక అద్భుతమైన నటనలో ఒక సందర్భోచిత సన్నివేశంలో దర్శకుడి బి.ఆర్. పంతులు ప్రతిభను చూడవచ్చు. ప్రకతి సిద్ధమైన పదార్థాలకు కులము, మతము, ప్రాంతము, పేద, ధనిక అనే వర్గ విభేదాలు లేవనీ, అవి అన్ని జీవులకు సమానంగా అందజేయ బడతాయని కవి ఈ లలితగీతంలో విశదీకరించారు.
పంచభూతాలైన గాలి, నీరు, నేల, నింగి, నిప్పు మొదలగు ప్రాకతిక పదార్థాలు తరతమ భేదం లేకుండా ఈ భూమ్మీద పుట్టిన ప్రతి జీవీ యథేచ్ఛగా అందుకుని ఆస్వాదించగలదన్న అంశాన్ని పైన పేర్కొన్న కీర్తన గానీ, గీతం గానీ బోధిస్తున్నాయి. ఎందుకంటే, ప్రకతిలో జీవులు కూడా ఒక భాగమే కాబట్టి, ప్రకతి జీవులను సంరక్షిస్తుంది. ప్రకతికి జీవికీ మధ్య అవినాభావ సంబంధం ఉంది. అన్ని రకాల జీవరాశులు తమ తమ ఉనికిని కాపాడుకుంటూ జీవించడమే 'జీవవైవిధ్యం' అంటారు. ప్రకతిలో ఉన్న ప్రతి జీవీ మానవుడికి ఏదో రకంగా సహాయపడుతుంది. అందుకే మానవుడు సంఘజీవి అయ్యాడు. కానీ అదే మానవుడు అభివద్ధి పేరిట ప్రాకతిక వినాశనానికి పాటు పడుతున్నాడు. యథేచ్ఛగా భూమ్మీద పర్యావరణ సమతుల్యానికి దెబ్బతీసే పనులకు ఒడిగడుతున్నాడు. దీంతో అనివార్యంగా మానవుడు ప్రకతి ప్రకోపానికి గురికాక తప్పడంలేదు. ఈ నేలమీద పలురకాల ప్రకతి వైపరీత్యాలు ఎప్పటికప్పుడు సంభవిస్తూ మానవ జీవనానికి సవాలుగా నిలుస్తున్నాయి. ప్రాక్తన మానవుడు నుండి నేటి ఆధునిక మానవుడు వరకూ నాగరికతలో భాగంగా, క్రమేపీ శాస్త్ర విజ్ఞానాన్ని పెంపొందించుకుని అనేక ఆవిష్కరణలు అందిపుచ్చుకొని సౌకర్య వంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఈ క్రమంలో అంతే స్థాయిలో మానవుడు తన దైనందిన జీవితాలలో ప్రకతి భీభత్సాలను ఎదుర్కొనక తప్పడంలేదు. సునామీలు, భూకంపాలు, వరదలు, కార్చిచ్చులు, కరువుకాటకాలు, అతివష్టి, అనావష్టి, అంటువ్యాధులు మొదలగు ప్రాకతిక విస్ఫోటనాలతో మనిషి అతలాకుతలం అవుతున్నాడు. దీనిలో భాగంగానే నేడు ప్రపంచవ్యాప్తంగా 'కొవిడ్ వైరస్' ధాటికి మానవ సమూహం విలవిలలాడి పోతున్నది. ఇది మానవుడు తనకు తానుగా చేసుకున్న స్వయంకతాపరాధమే.
మనిషి జీవించాలంటే గాలి, నీరు, కూడు, గూడు, గుడ్డ ప్రాథమిక అవసరాలు. వీటిలో గాలి, నీరు, కూడు లేకుండా మనిషి జీవించడం కల్ల. జంతువుల నుండి చెట్ల నుండి వచ్చే ముడి పదార్థాల ద్వారా మానవుడు ఆహారాన్ని తయారు చేసుకో గలుగుతున్నాడు. ఇందులో ఆహారం కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏనాడో మనిషికి ఏర్పడింది. తదనంతర కాలంలో భూమిపై కాలుష్యపు పొరలు విపరీతంగా పేరుకుపోవడంతో పుడమి విషతుల్యం కాబడింది. మానవుడు యథేచ్ఛగా వాడే ప్లాస్టిక్ పదార్ధాలు, జీవ రసాయనాల అవశేషాలు, మరికొన్ని కాలుష్య కారకాలు వాతావరణ కాలుష్యానికి కారణభూతమవుతున్నాయి. అందువల్ల పాతాళంలో లభించే నీటిలో కాలుష్యం చేరి నీరు విష పదార్థంగా మారింది. దాంతో నేడు మినరల్ వాటర్ పేరిట మంచి నీటిని కొనుక్కునే అగత్యం మానవుడికి ఏర్పడింది. ఈ క్రమంలో నీటి చవ్యాపారం కార్పొరేట్ స్థాయిని అందుకుంది. ఆ నీరు కూడా ప్లాస్టిక్ ప్యాకెట్లలో, సీసాలలో నిలువ చేస్తూ అమ్ము తున్నారు. అది కూడా ఒకరకంగా చూస్తే, వివిధ రసాయనాలు మిళితమై కాలుష్యం కాబడిన నీరేనని మనం గ్రహించాలి.
ఇప్పుడు గాలి విషయానికొద్దాం. గాలిలో ఉండే ఆక్సిజన్ వాయువు మానవుని ప్రాణాన్ని నిలబడు తుంది. అందుకే దీన్ని ప్రాణ వాయువు అంటారు. నేడు సంవత్సరన్నర కాలంగా యావత్తు ప్రపంచం కరోనా సంక్షోభంలో కొట్టుమిట్టాడు తోంది. ఈ నేపథ్యంలో కొవిడ్ వైరస్‌కు గురై మనిషి ప్రాణా లను పోగొట్టుకునే పరిస్థితికి వచ్చాడు. కరోనా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండే మనిషిలో ఊపిరి తిత్తుల దెబ్బతిని, శ్వాసకోస ఇబ్బందులు తలెత్తుతాయి. దీంతో అలాంటి రోగులకు ఆక్సిజన్ సమకూర్చ వలసిన అవసరం ఉంది.
ఒక్కసారిగా కొవిడ్ ఉధతి పెరిగిన నేపథ్యంలో రోగులకు ఆక్సిజన్ అవసరం పెరిగింది. దాంతో ప్రభుత్వాలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ, ఏర్పాట్లపై సమాలోచనలు చేసి పెద్ద యెత్తున ప్రాణ వాయువును సమకూర్చే పనిలో పడ్డాయి. దీనిలో భాగంగా పలు విదేశాలు కూడా మన దేశానికి ప్రాణ వాయువును సమ కూర్చాయి. కానీ భారత్‌లో పలువురు రోగులు ఆక్సిజన్ అందక మరణించారు. అంటే ఆక్సిజన్ సిలిండర్ లకు విపరీత మైన డిమాండ్ పెరి గింది. ఈ డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ప్రాణవాయువు సిలిండర్లను రోగులే కొనుక్కోవలసిన అవసరం ఏర్పడింది. ఇవే
కాకుండా అత్యవసర పరిస్థితుల్లో రోగి ప్రాణాలు నిలబెట్టే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ అవసరం కూడా పెరిగింది. మామూలు రోజుల్లో ఇవి ఐదారు వేల రూపాయలకు లభించేవి. ఒక్కసారిగా ఈ సంక్షోభ కాలంలో 30 నుంచి 40 వేల వరకూ ధరలు పెరిగిపోయాయి. దీంతో అతి సామాన్య రోగుల ప్రాణాలు గాలిలో దీపాల్లా నిలిచాయి. కొనుక్కోలేని పరిస్థితి లేక చాలా మంది రోగులు మరణించారు కూడా. ప్రభుత్వం కూడా పెద్దయెత్తున నిధులను సమకూర్చి ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు తమ వంతు ప్రయత్నం చేసింది. ప్రాణవాయువు కొన్ని సెకండ్ల పాటు అందకపోతే మనిషి యొక్క ప్రాణం పోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వెనువెంటనే నిమిషాల మరియు గంటల వ్యవధిలో ఆక్సిజన్ ను సమకూర్చడం ప్రభుత్వాలకు కూడా కష్టమైన పనే. ఒకానొక దశలో ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేక దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. ఈ క్రమంలో డబ్బున్నవాళ్ళు, అధికారం ఉన్నవాళ్లు వివిధ కార్పొరేట్ ఆసుపత్రులలో చికిత్స పొందుతూ, అక్రమంగా నిల్వ ఉంచిన వ్యాపారుల వద్ద నుండి పెద్దయెత్తున డబ్బులు ఖర్చుపెట్టి, ఆక్సిజన్ సిలిండర్లు మరియు కాన్సన్ట్రేటర్స్ కొనుగోలు చేసుకోగలిగి తమ ప్రాణాలను నిలబెట్టుకోగలిగారు. అంటే నేడు గాలిని కూడా కొనుక్కోవలసిన అవసరాన్ని కరోనా సంక్షోభం మన ముందు పెట్టింది. అంటే గాలికే కులమేదీ? అని ఎప్పటిలా పాడగలమా! అంటే దాదాపుగా అలా అనలేమనే చెప్పాలి. దీన్ని బట్టి నేటి పరిస్థితుల్లో గాలి, నీరు, నేల, నింగి, నిప్పు అన్నింటికీ కులము, మతము, ప్రాంతము, అగ్ర, నీచ, బీద, ధనిక అనే బేధభావాలు ఉన్నాయని ఖచ్చితంగా చెప్పవచ్చు.
ప్రతి ఏడాది ఢిల్లీ నగరాన్ని కాలుష్యం చుట్టు ముట్టేస్తుంది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉండే రైతులు పొలాల్లో ఉన్న తమ పంటల వ్యర్ధాలను ఇష్టారాజ్యంగా తగులబెట్టడంతో, ఆ కాలుష్య వాయువులు ఢిల్లీ నగరంపై కమ్ముకొని తీవ్ర ప్రభావం చూపుతాయి. అలాగే ఈ నగరంలో శీతాకాలంలో మంచు విపరీతంగా పడడంతో ప్రజలకు ప్రాణవాయువు సరిగా అందదు. ఈ పరిస్థితుల్లో ఉండే ఢిల్లీ ప్రజలు తమ ఇళ్ళల్లో ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవలసిన దుస్థితి దాపురించింది. అంటే ఇది డబ్బుతో ముడిపడిన సమస్య. పేద, అణగారిన వర్గాల ప్రజలు 'రెక్కాడితే గాని డొక్కాడని' పరిస్థితులో తమ రోజువారీ జీవనాన్ని నెట్టు కొస్తారు. అలాంటి వారు ప్రాణవాయువును కూడా కొనుక్కోగలరా? పేదవాడికి కేవలం తిండి కోసమే తను సంపాదించిన సంపాదన చాలదు. మరి గాలి, నీరు కూడా కొనుక్కోవాలంటే ఎలా? ఈ మూడూ సమపాళ్ళలో దొరకాలంటే డబ్బు ఎక్కువగా సంపాదించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదన అనేది పేదలకు అసాధ్యము. అందుకే గాలికీ, నీటికీ కుల, మత, పేద, ధనిక వర్గ భేదాలు ఉన్నాయని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు.
పంచభూతాల్లో ఒక్కొక్క అంశాన్ని మనం ఉదహరించి కుంటూపోతే, కొన్ని విషయాలు బోధ పడతాయి. నేల అనేది అందరి సొత్తు కాదు. భూమి అందరి దగ్గర ఒకేలా లేదు. భూస్వాములు, కార్పొరేట్ వ్యాపారుల దగ్గర నేడు
భూమి వందల, వేల కొలదీ ఎకరాలు ఉంది. చిన్న, సన్నకారు రైతుల దగ్గర చాలా తక్కువ భూమి ఉంది. భూమిలేని నిరుపేద వర్గాల వారు కూలీనాలీ చేసుకునే బతుకుతున్నారు. అనగా కొద్ది శాతం మంది సంపన్నుల వద్దనే భూమి నిల్వ ఉంది. సమాజంలో హెచ్చుశాతం ప్రజలు భూమి లేనివారే. అంటే నేలకు కూడా వర్గ వైషమ్యం ఉందన్నమాట. అలాగే నింగిలోని అందాలను అంటే నక్షత్రపు వెలుగు జిలుగులు, వర్షించే మేఘమాలికలు, వెన్నెల కురిపించే చందమామ, జవజీవాలనిచ్చే సూర్యకాంతి మొదలగునవి అందరూ సమానంగా అనుభవించ వచ్చు. కానీ విమానయానం చేస్తూ నింగిలో విహరిస్తూ గడిపే మధుర క్షణాలను అనుభవించాలని ప్రతీ బీదవాడికి ఉంటుంది. కానీ వారి ఆశలు అడియాశలే కదా! అంటే నింగికి కూడా సామాజిక అంతరాలు ఉన్నాయన్నమాట. తదుపరి చివరిది నిప్పు. నిప్పును కట్టెలకు అంటించి అందరమూ రుచికరమైన పదార్థాలను వండుకొని తింటాం. కానీ అదే నిప్పు అంటే ఒక రకంగా కాంతి కూడా. ధనికులు తాము నివసించే ఇంద్ర భవనాల్లో కన్నులు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపపు కాంతులలో హాయిగా, ఆనందంగా గడుపుతూ, చలువ యంత్రాల పంచన హంసతూలికా తల్పాలపై సుఖంగా నిద్రిస్తారు. అలాంటి సుఖాలను ఈ నిప్పు అంటే విద్యుత్ శక్తి ద్వారా పేదలు పొందలేరు. నేటికీ దేశంలో విద్యుత్ శక్తి అందని గ్రామాలు ఉన్నాయంటే అతిశయోక్తికాదు. విద్యుత్ శక్తి సౌకర్యం ఉన్నప్పటికీ, నిరుపేద జనం ధనికులు వలె వినియోగించు కోలేరు. వారి ఆర్థిక స్థాయి ఎంత మాత్రమూ సహకరించదు కాబట్టి. అంటే ధనిక, పేద, ప్రాంతము, కులము, మతము అనే వర్గ విభేదాలు నిప్పుకు కూడా ఉన్నాయని సాధారణీకరించవచ్చు.
అంటే అన్నమయ్య, సినారె లాంటి మహానుభావులు ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేసి ఉంటే, పంచభూతాలకు కూడా వర్గ వైషమ్యాలు ఉన్నాయని ఖచ్చితంగా తమ కీర్తనలలో, గీతాల్లో చెప్పేవారేమో!కదా! అని అనిపించక మానదు. ప్రకతిలో భాగమైన పంచభూతాలకు కూడా వర్గ భేదాలు అంటగట్టేలా నేటి మానవుని దైనందిన జీవన సరళి, ప్రవర్తన ఉందనేది సత్యం. సామాజిక అంతరాలు లేని సమాజం ఎప్పుడైతే ఏర్పడుతుందో! అప్పుడు పంచభూతాలు అందరికీ సమానంగా అందగలవు. మానవుడు ఎప్పుడైతే జీవ వైవిధ్యాన్ని కాపాడుకుంటూ, పర్యావరణ సమతుల్యతకు తన వంతు బాధ్యత వహిస్తాడో! అప్పుడే గాలికే కులమేదీ...ఏదీ నేలకు కులమేదీ...లాంటి గీతాలను తాజాగా పాడుకోగలడు.
- పిల్లా తిరుపతిరావు, 7095184846