Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చరిత్రలో గొప్ప వ్యక్తులుగా గుర్తింపు పొందిన వారు తమ జీవిత కాలంలో అధిక సమయాన్ని గ్రంథాలయంలో గడిపిన వారే.తమ జ్ఞానాన్ని వికసింపజేసుకున్నది అక్కడే. మానవ వికాసానికి పునాది, ఆధారం పుస్తకమే. పుస్తకాలు చదవడం ద్వారా మనం అనేక అనుభూతులకు లోనవుతాం. మౌనంగా మనకు మనమే నవ్వుకుంటాం.మైమరచి పోతాం. తన్మయత్వానికి లోనవుతాం. మనం చదువుతున్న పుస్తకాల్లోని పాత్రలో మనల్ని మనం ఊహించుకుని, ఆయా పాత్రల్లో లీనమై గొప్పగా ఫీలవుతాం. పుస్తకానికున్న విలువ అలాంటిది.ఆధునిక కాలంలో పుస్తకాలు చదివే అలవాటు క్రమంగా తగ్గిపోతున్ననేది కొంతవరకు వాస్తవమే. ఎందుకంటే ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ల వాడకం అధికమైంది. అయితే అనేక మందికి పుస్తకాలు చదవాలనే మమకారం మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఏ ప్రాంతంలో పుస్తక ప్రదర్శన జరిగినా పాఠకులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. తమ ఆర్థిక స్తోమతను అనుసరించి పుస్తకాలు కొనుగోలు చేస్తున్నారు.కొనుగోలు చేసిన పుస్తకాలన్నింటినీ చదువుతున్నారా? అని ప్రశ్నించుకుంటే లేదు అనే సమాధానమే వస్తుంది. అందువల్ల మన బుద్ధి వికాసానికి మనకున్న సమయంలో కొంత టైంను పుస్తక పఠనానికి కేటాయించాలి. మొబైళ్లు వీక్షించే సమయాన్ని తగ్గించుకోవాలి. కండ్లను కాపాడుకోవాలి.పుస్తకం చదివే అలవాటు పిల్లలకు ఏకాగ్రతనీ, పెద్దలకు దీర్ఘాయుష్షునీ కలుగజేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.పుస్తకం మనిషికి ఆనందాన్నిస్తుంది. అలవాట్లను మారుస్తుంది.జ్ఞానాన్ని వికసింపజేస్తున్నది. నూతన విషయాలను తెలియజెపుతుంది.వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది. జీవితానికి మార్గనిర్దేశనం చేస్తుంది. అనేక తరాల మధ్య వారదీ, గత చరిత్రను తెలిపే పెన్నిది అయిన పుస్తకం మనిషి జీవితంలో విడదీయరాని భాగం. మంచి తనాన్ని, మానవత్వాన్ని ప్రోదిచేసే నిజమైన నేస్తం పుస్తకమే.పుస్తక పఠనానికి అనువైన ప్రదేశం గ్రంథాలయమే. ఇండ్లలో వివిధ కారణాల వల్ల పుస్తకాలు చదవడానికి అంతరాయం ఏర్పడుతుంది. ప్రతి రోజు కాకపోయినా ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు గ్రంథాలయానికి వెళ్లే అలవాటు చేసుకోవాలి. వీలైతే దినచర్యలో అదొక భాగం కావాలి.గ్రంథాలయానికి వెళ్లే ముందు మన మెదడు ఖాళీగా ఉంటుంది. లైబ్రరీలో కొంతకాలం గడిపాక మనకు పుస్తకం చదివాక ఉల్లాసంగా బయటకు వస్తాం. మనసును వికసింప జేసుకునేందుకు ఈ అలవాటు ఎంతగానో ఉపయోగ పడుతుంది. మీకు సమీపంలోని గ్రంథాలయాన్ని సందర్శించండి. దిన పత్రికలు, కథల పుస్తకాలు, నవలలు, చరిత్రలు, ఇంకా ఇతర పుస్తకాలు మీకు నచ్చినవి తీసుకొండి. వాటిని చదవండి. దినమంతా పుస్తకాలు చదవలేం.
అందుకు మన మెదడు సిద్ధంగా ఉండదు. విషయ గ్రహణ శక్తి పరిమితంగా ఉంటుంది. రెండు మూడు గంటలు ఏకదాటినా చదివాక కొంత విరామం ఇవ్వాలి. ఆ తరువాత మళ్లీ చదవాలి. పుస్తకాన్ని కొనుక్కుని ఒకటి రెండు సార్లు చదివాక ఆ పుస్తకం బీరువాలో వృధాగా పడి ఉంటుంది. అలా కాకుండా పుస్తకాన్ని ఎల్లప్పుడు ఎవరో ఒకరు చదువుతూ ఉండేలా చేయాలన్న ఆలోచన వచ్చింది. బ్రిటన్కు చెందిన కార్డెలియా ఆక్స్లీకి. ఆమె ఎవరైనా కొత్త పుస్తకాన్ని చూడగానే వారి కండ్లలో కలిగే మెరుపును, ఆనందాన్ని గమనించింది.పుస్తకాలు కొనుగోలు చేయని వారందరూ కూడా పుస్తకాలు చదివే సౌలభ్యాన్ని కలుగజేసేందుకు ఆమె పుస్తక ప్రదర్శన ఉద్యమాన్ని ప్రారంభించారు. లండన్ నగరంలోని సబ్వేలో ప్రారంభమైన పుస్తక ప్రదర్శన అన్ని దేశాలకు విస్తరించింది. మన హైదరాబాద్ నగరంలో ఈ పుస్తక ప్రదర్శన ప్రతి సంవత్సరం డిసెంబర్ మాసంలో నిర్వహిస్తున్న విషయం మీకు తెలిసిందే. హైదరబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఆద్వర్యంలో జరిగే ఈ ప్రదర్శనకు పాఠకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.పుస్తకాలు చదివే అలవాటున్న వారు ప్రయాణం చేసేటపుడు తప్పకుండా తమ బ్యాగులో ఒక పుస్తకం తీసుకెళ్తారు. పొరపాటున అలా తీసుకెళ్లడం మరచి పోతే సమయం వృధా అయిందని బాధపడతారు. మహారాష్ట్రలోని 'ద డెక్కన్ క్వీన్', 'పంచవటి' అనే రెండు ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణికులు ఆసక్తిని గమనించిన ప్రభుత్వం ఆ రైళ్లలో ప్రత్యేకంగా లైబ్రరీలను ఏర్పాటు చేసింది. చక్రాల బండిలో పుస్తకాలను తీసుకుని మన సీట్ల వద్దకే గ్రంథాలయ నిర్వాహకులు వస్తారు. మనకు నచ్చిన పుస్తకాన్ని చదివి దిగేటపుడు ఆ పుస్తకాన్ని వదిలేసి రావాలి. ఇక కోల్కత్తా నగరంలో పుస్తక ప్రియులకు వీది పక్కన గ్రంథాలయాలను ఏర్పాటు చేశారు. పాఠకులు తమకు నచ్చిన పుస్తకాన్ని చదివి మళ్లీ ఆ పుస్తకాన్ని ఆ గ్రంథాలయంలో పెడతారు. వీది పక్క గ్రంథాలయాలను ఆ నగరంలో చక్కగా నడుపుతున్నారు.
- జి.గంగాధర్ సిర్ప, 8919668843