Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకప్పుడు గ్రామాలలో వేసవికాలం వచ్చిందంటే రాత్రి వేళ పిండారబోసిన వెన్నెలలోనో లేక కటిక చీకటి అమవాస్యలోనో మంచాలు ఆరుబయట వేసుకొని నిద్రపోయే సమయానికి ముందు సాత్రాల ఎల్లయ్యనో సాత్రాల మల్లయ్యనో ఎవరో ఒకరు కథలు చెప్పే వాళ్ళ చుట్టూ చిన్నాపెద్దా తేడా లేకుండా గుమిగూడి ''ఊ'' కొడుతూ కథలు వినేవారు. పెద్దలకు కాలక్షేపం, చిన్న పిల్లలకు నీతి కథల ద్వారా నైతిక విలువలు అలవడేవి... జానపద సాహిత్యంలోని కథలు, పొడుపు కథలు, సామెతలు చిన్నప్పటి నుంచే ప్రతీపిల్లవాడికి తెలిసి వాళ్ళలో ఆలోచన విధానం మెరుగుపడేది.సృజనాత్మక శక్తి బయటకు వచ్చేది. ప్రపంచీకరణ రాకతో పల్లె ఆనవాళ్లు కనుమరుగై కథలన్నీ కంచికి చేరుకొని రూపు మార్చుకున్నాయి. ఆధునిక సమాజంలో పిల్లలను చిన్న వయసులోనే హాస్టళ్లలో వేయడం వేసవి సెలవులలో కూడా ఏదో ఒక శిక్షణకు పంపిస్తూ బాల్యాన్ని బంగారు పంజరంలో బంధించి పిల్లలకు బాల్యాన్ని దూరం చేస్తున్నారు. ఇటువంటి సంధర్భంలో వచ్చే బాల సాహిత్యం పిల్లలను చదువరులుగా చేయడమే కాకుండా నైతిక విలువలు పెంపొందించి ఊహించే శక్తిని, సృజనాత్మకను, తెలుసుకోవాలి, నేర్చుకోవాలనే తత్వాన్ని కలగజేస్తూ బాల్యాన్ని పరిచయం చేస్తుంది. ఏదైతే ప్రపంచీకరణ ద్వారా కోల్పోయామని అనుకున్నామో అదే రూపు మార్చుకుని బాలసాహిత్యం ద్వారా వస్తుంది.
బాలసాహితీకారులు సృష్టించే సాహిత్యం ఈ మధ్య ఎక్కువగా వస్తున్నప్పటికి అందులో కథలు చెప్పుకోదగ్గవి కవయిత్రి, రచయిత్రి, వ్యాసకర్త, వక్త అయిన యలమర్తి అనూరాధ రాసిన ''పసి మొగ్గలు'' కథల సంపుటి ఒకటి. సరళ భాషలో చిన్న పిల్లలకు అర్థమయ్యే రీతిలో ఈ కథలు సాగుతాయి. ఈ పసిమొగ్గలు కథలలో మొదటి కథ ''స్నేహం'' స్నేహమంటే ఏంటో ప్రీతీ, మైత్రి, కిరణ్మయి పాత్రల ద్వారా తెలియజేస్తూ స్నేహం విడదీయరాని బంధమని చెప్తారు. ఇక ''గురుదక్షిణ'' కథ విద్య ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. సాహసంగా, సమయ స్ఫూర్తితో నడుచుకోవాలని ''ధైర్యం'' కథ చెపుతుంది. ఇందులో ''ముచ్చట్లు'', ''టీవీ తెచ్చిన తంటా'', ''చెప్పిన మాట వినాలి'' వంటి కథలు పిల్లలతో పాటు పెద్దలు చదవాలి.
నిర్లక్ష్యం వల్ల విలువైనవి, ఉపయోగకరమైనవి కోల్పోతాము అందువల్ల పెద్దలు చెప్పిన మాటలు వినాలని ''విలువ'' కథ తెలియజేస్తుంది.రంగు పక్షపాతం వద్దు స్నేహమే ముద్దని ''అందం'', సహాయ గుణాన్ని అలవర్చుకోవాలని చెప్పే ''మానవత్వం'', శ్రమపడాలని చెప్పే ''గుణపాఠం'', శుభ్రత గురించి ''మంచి అలవాటు'' తెలియజేస్తాయి.
ఆవేదనభరిత ''పసిమొగ్గలు'' చందమామ కథలలోని కథ లాగా ''శ్రమదానం'' కథలు తమదైన తీరులో మంచి సందేశాన్ని, నీతిని చెబుతాయి. విద్యార్థులపై ముద్రలు వేయడం మానేసి వాళ్ళను మంచి విద్యార్థులుగా చేయటానికి ప్రయత్నించాలని ''ముద్ర'' కథ, ఆతిధ్యం, స్నేహం గురించి కొంగ-నక్క కథ, ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటే బంధాలు బలపడతాయని ''సహాయం'' కథ చెపుతుంది. పట్టుదలతో కృషి చేస్తే విజయం వరిస్తుందని ''విజయం మీదే'' కథ చెబుతుంది. ఆలోచనాత్మకమైన ''మంచి ఆలోచన'', ''మాష్టారు ఆంతర్యం'', ''మంచి మార్గం'', ''అబద్ధాలాడకోడదని ''అబద్ధాలాడితే'' వంటి కథలున్నాయి. ''పసి మనసు'', ''అందరూ మనవాళ్లే'' మొత్తం 30 కథలు మంచి సందేశాన్ని ఇస్తాయి.
మానవత్వం, సాహసం, సమయస్ఫూర్తి, విద్య ప్రాముఖ్యత మొదలైన అంశాల మీద సందేశాత్మక కథలు పిల్లలలో నైతిక విలువలు పెంపొందించి ఆలోచింపజేసేలా సరళమైన భాషలో అర్థమయ్యే రీతిలో ఉంటాయి.
(పసి మొగ్గలు (బాలల కథలు), రచయిత : యలమర్తి అనురాధ, వెల : రూ.100/-, ప్రతులకు : యలమర్తి అనురాధ, బి-బ్లాక్ - 205, శ్రీ వెంకటసాయి గ్రీన్‌సిటీ (ఎస్వీకే ప్రాజెక్ట్స్), చంద్రా గార్డెన్స్ దగ్గర, గాయత్రీ నగర్, హైద్రాబాద్ - 500018,
సెల్ : 9247260206)
- సయ్యద్ ముజాహిద్ అలీ(బి.ఏ)
సెల్: 7729929807