Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇసుక పునాదుల మీద
ఎనిమిది శతాబ్దాలుగా నిల్చున్న
ఈ పురాతన రాతి దేవాలయం ముందు
ఇవాళ్టి చూపు ఆసక్తితో నిల్చున్నా
రామప్ప తటాకంలో తడిసిన చూపుతో -
లేచి, వెలుగు వెలిగి, మబ్బు పట్టి
ఒకింత ఒరిగి పాడుబడి, మళ్లీ లేచి
ఇవాళ ఈ దేవళం ప్రాచీన నవ్యత్వ కళతో -
కాలం ఎన్ని రకాలుగా ఢ కొట్టినా
తట్టుకునేట్టు కట్టిన శిల్పతపస్వి రామప్పా !
నీకు శిలాపూర్వక వందనాలు!
నాజూగ్గా పరుచుకున్న నక్షత్రాకార పీఠం
నా చూపును విశాలపరుస్తున్నది
పీఠమ్మీద కొలువున్న ఉలి కళ
నన్ను ఆశ్చర్య పీఠమ్మీద కూర్చోబెడుతున్నది
పంచ శత గజాలు పలు భంగిమల్లో నిల్చి
ప్రదక్షిణానికి వినయ విన్యాసంతో దారి చూపుతాయి
లోపల కుడ్యాల మీద మహేతిహాస గాథలు
రూపభాషలో కడు రమ్యంగా పలకరిస్తాయి
కోలాటాల కోలాహలాలు కళ్ళముందాడుతాయి
క్షీర సముద్రం మరో మారు మథించబడుతుంది
మందిర మధ్యంలో గుండ్రని రంగమంటపం
గత కాలాల పలు నాట్య పాదగతుల్ని ముద్రించుకుంది
అంతరాళ ద్వారమ్మీద నిల్చిన పొన్నచెట్టు
సరిగమ పదని విన్పిస్తుంది, మీటితే -
సంగీత వైచిత్రేనా, ఇట కాంతి సైతం ఓ వింతే !
కంబాల మీద వాలే వెల్తురు పరావర్తించి
గర్భ గుడిని వెల్గిస్తుంది, రామప్పా జోహార్!
ఎరుపూ నలుపూ శిలల మేళవింపు సింగారం
శిఖర నిర్మితిలో ఇమిడిన తేలిక ఇటుకల పాటవం
ఎన్ని నేలల మూలకాల సంగమమీ మందిరం !
ప్రాకారాలనలంకరించిన గజకేసరులూ
శైలీ భేదంతో నిలిచిన సాలభంజికలూ
ఓ యువతి హై హీల్స్ తో హైలెస్సా దుస్తుల్తో -
మరొకరు సర్పధారియై నిశ్శబ్ద ఆగ్రహ భాషతో -
ఇంకొకరు ప్రసన్న ప్రశాంత నాట్య భంగిమలో -
ఎన్నాళ్ల కిందటో ఓ మదనిక కాలికి గుచ్చుకున్న
ముల్లును ఈనాటికీ తీస్తున్నాడో యువకుడు -
ఇక్కడి నందిలో సౌష్ఠవమూ సౌకుమార్యమూ
నిన్ను చూస్తూ, నన్ను చూస్తూ
అన్ని దెసల్నీ ఏక కాలంలో చూస్తున్నట్లు
మెడను కుడికి తిప్పి సంసిద్ధంగా వుంది
పిలిస్తే చాలు ! లేచి ఒక్కుదుటున దూకడాన్కి -
రాతిని మదులపరచడం , వొంపులు తిప్పడం
మాలల్లా అల్లడం , నడుమ నడుమ
సన్నని సూదీ దూరేంత రంధ్రాల్ని అమర్చడం
ఎంత కౌశలం నీది రామప్పా శిల్ప కౌతుకా !
ఆగేయంలో ఖాళీగా వొదిలిన ఫలకం సైతం
నాకు శిల్పం లాగే గోచరిస్తున్నది మహాశిల్పీ!
గుడిని కాపాడుకోలేని నిర్లక్ష్యాన్నీ
కళా రాహిత్యాన్నీ విధ్వంసాల్నీ క్షమించొచ్చా
రామప్పా ! ఐనా గుడి నిల్చింది ఈ నేల మీద !
తలెత్తుకొమ్మనే నేల కదా ఇది!
వెళ్ళిపోయావు ! చేతుల్ని ఈ శిల్పాల్లో వొదిలి !
ఏది నీ ఉలి ! వుంటే ఊరేగించాలయ్యా
తిరూర్ లో మలయాళ కవి తుంజన్ ఘంటాన్ని
ఊరేగించినట్లు !
ఇంతకీ ఈ శిల్ప ప్రాచీన కట్టడంలో
ఇవాళ ఇట్టే ఇమిడిపోతున్న నేనెవర్ని ?
నాటి రామప్పనా
అతనికి రాయినందించిన
సహచరుణ్నా లేక అనుచరుణ్నా
లేక ఈ గుడి మీద వాలిన తొలి పక్షినా !
(గైడ్ గోరంటల విజయకుమార్‌కు ప్రేమతో )
- దర్భశయనం శ్రీనివాసాచార్య
94404 19039