Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దట్టమైన అడవి.. పొడుగాటి చెట్ల కొమ్మలు ఆకాశం వైపు చూస్తున్నవి. పొట్టి చెట్ల కొమ్మలు నేల చూపులు చూస్తున్నవి. పొదలు ఒకదాన్ని ఒకటి తొక్కేస్తున్నయి. చీకటి నల్ల ప్యాంటూ షర్టూ వేసుకు తిరుగుతున్నది. అడవిలోకి నాలుగేసి అడుగుల చొప్పున చప్పుడు చేస్తూ వచ్చేయి తెల్లవీ, ఎర్రవీ, నల్లవీ గుర్రాలు.
నలభై గుర్రాలు వెనక పరుగెత్తుతుంటే ముందు వైపు పరుగెడుతున్నది ఒక గుర్రం. అది ఆ నలభై గుర్రాల మీద ఉన్న నలభై మందికీ నాయకుడి గుర్రం. అడవిలో ఈ మూల దట్టంగా మునిగడ్డంలా పెరిగిన చెట్టూ చేమల మధ్యనున్నది ఓ గుహ. ఆ గుహ ముందుకి వచ్చి నాయకుడి గుర్రం ఒగరుస్తూ నిలబడ్డది. వెనకవచ్చిన నలభై గుర్రాలు వరుస కట్టి నిలబడ్డయి.
గుర్రం దిగిన నాయకుడి పేరు ఆలీబాబా. బాబా వెంట ఉన్న వాళ్ళు అనుచరులు. వీళ్ళంతా దొంగలే. ఆలీబాబా నలభై దొంగల ముఠా అన్నమాట.
ఆలీబాబా తలపాగా తీసి దులిపి మళ్ళీ కట్టుకుని గుహ ద్వారం దగ్గర నిలబడి తెరుచుకోవే 'సినిమా' అన్నాడు. గుహకు అడ్డంగా ఉన్న బండరాయి పెద్ద శబ్దం చేస్తూ పక్కకు తప్పుకుంటే గుహనోరు బార్లా తెరిచింది.
ఆలీబాబా నలభై దొంగలూ గుహలో జొరబడ్డారు. తాము ఊళ్ళ మీద పడి ఇళ్ళల్లో జొరబడి కొట్టుకొచ్చిన నగలూ, వజ్ర వైఢూర్యాలూ, వగైరాలు అక్కడ ఉన్న చెక్క 'సందూకు'ల్లో నింపసాగారు. దొంగల సర్దార్ ఓ మఖమల్ దిళ్ళ దీవాన్ మీద కూచుని హుక్కా పీల్చసాగాడు తాపీగా.
తాము కొట్టుకొచ్చినవన్నీ సందూకుల్లో సద్దేశాక ఒకడు వచ్చి 'సర్దార్ అన్నీ సర్దేశాం ఇక వెళ్దామా' అన్నాడు.
'అచ్ఛా ఖేల్ ఖతమ్ దుకాన్ బంద్' అంటూ లేచి నిలబడ్డాడు ఆలీబాబా. 'నలభై మందీ ఉన్నారో లేరో లెక్కపెట్టు బయటకి వెళ్ళేటప్పుడు ఒక్కడు లోపల దాక్కున్నా కొంప కొల్లేరు అయిపోతుంది ఖబర్దార్' అన్నాడు ఆలీబాబా.
లెక్కపెట్టాడు ఒకడు బయటకు వచ్చిన వాళ్ళు ముప్ఫయి తొమ్మిది మందే. బద్మాష్ కౌన్ హై ఓ బద్మాష్ అందర్ చుపా హువాహై. లోపలికి వెళ్ళి వెతికి రమ్మని ముప్ఫయి తొమ్మిదో దొంగని లోపలికి పంపాడు ఆలీబాబా. వాడు అంతటా వెతికి చేతులు ఊపుకుంటూ వచ్చాడు. 'అందర్ కోయీనహీ' అన్నాడు.
ఆలీబాబా గుండె దడదడ లాడింది. లబలబలాడింది. నలభయ్యవ దొంగ మాయం అంటే వీడు ఎవరూ లేనప్పుడు వచ్చి గుహలో ఖజానా కొట్టేస్తే ఎలా అని ఆలోచించి, ముప్ఫయ్యారవ దొంగ నుంచి ముప్ఫయి తొమ్మిదవ దొంగ దాకా నల్గురిని అక్కడే కాపలా ఉండమని చెప్పి వెళ్ళిపోయేడు ముప్ఫయిదుగురితో.
ఆ రాత్రి కాలపా ఉన్న నలుగురు దొంగలు ఏదో చప్పుడు వస్తే ఉలిక్కిపడి లేచాడు. ఎవడో గుహ ద్వారం దగ్గర నిలబడి 'తెరుచుకోవే సిసామా' అనరుస్తున్నాడు బిగ్గరగా.
నలుగురూ కలిసికట్టుగా వెళ్ళి వాడి మీద పడి వాటేసుకున్నారు ప్రేమతో కాదు చావగొట్టాలన్న కసితో. నలభయ్యవ దొంగ వాళ్ళకి జ్ఞాన బోధ హిత బోధ రెండూ చేశాడు. ''ఒరేరు ఎంతకాలం మనమిలా ఆలీబాబా సర్దార్ కింద నలిగిపోదాం. ఎంతో రిస్కు చేసి దొంగతనం చేసి తెచ్చినవన్నీ గుహలో భద్రపరుస్తున్నాం. మనకు ఒరిగేదేమిటి 'లోటెడు సారాయీ' 'పావుకిలో మాంసం' అంతే కదా ప్రతిరోజు. ఏదో ఓ నాడు సర్దార్ ఆలీబాబా మనకు చెప్పకుండా వచ్చి గుహను 'వెకేట్' చేసిపోతే మన గతేమిటి 'ముసాఫిర్ హుయారో నా ఘర్ హూ నా టికావో నే కదా' అన్నాడు. 'సహీ బాత్ హై' అన్నారు నలుగురు. అంతే! నలభై దొంగల్లో ఐదుగురు వేరే గ్యాంగయి పోయేరు. ఆలీబాబా ముప్ఫయిదు మంది దొంగలు వినడానికే బాగా లేదని ఆలీబాబా నలభై దొంగల సర్దారనిపించుకోవాలని మరో ఐదుగురు కొత్త దొంగల్ని గ్యాంగులో చేర్చుకోవడానికి 'రడీ' అయిపోయేడు. మొదట తిరుగుబాటు చేసిన నలభయ్యవ దొంగ నలుగురిని కలుపుకున్నాక మిగతా ముప్ఫయి ఆరు మందిని వెదికి పట్టుకోవడానికి పాదయాత్ర ప్రారంభించాడు. ఈ గ్యాంగైనా ఆ గ్యాంగైనా దొంగలు నలభై మందే కానీ సర్దార్లు అనగా ఆలీబాబాలే మారుతారు.
కాలచక్రం కళ్ళ గిర్రున తిరుగేయి. కాలం వేల వేల క్యాలెండర్లను చించి పోగులు పెట్టి మంటల్లో మసి చేసింది. బళ్ళు ఓడలవడం ఓడలు బళ్ళవడం కాదు గుర్రాలు కార్లయ్యేయి. కార్లు విమానాలు అయ్యేయి. అప్పట్లో ఒక్క ఆలీబాబా నలభై మంది... ఇప్పుడు అనేక మంది ఆలీబాబాలు... అనేక మంది.....
- చింతపట్ల సుదర్శన్, 9299809212