Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, భారత దేశ ప్రధానిగా, బహుభాషా వేత్తగా పి.వి. నరసింహారావు ప్రసిద్ధులు. సురభి ఎడ్యుకేషన్ సొసైటీ. పి.వీ. సాహిత్య పీఠం (కరీంనగర్) వారు ఈ పుస్తకాన్ని ముద్రించారు. పి.వి.శత జయంతి సంవత్సరం ఇది. పి.వి. మనోహరరావు, డా|| వొజ్జల శరత్‌బాబు, కల్వకోట వేంకట సంతోష్ బాబు గార్ల ముందుమాటలు ఈ పుస్తకానికి నిండుతనం తెచ్చాయి. పి.వి. గారి రెండు కథలు, రెండు నవలలు (ఆత్మకథ) పై విశ్లేషణే ఈ పుస్తకం. కథా ప్రపంచంలో బి.వి.ఎన్ స్వామి గారి కృషి ఎంతో విలువైనది. కథలు అధ్యయనం చేయడం, రాయడం, సమీక్షించడం, విమర్శించడం, పరిశోధించడం, సంపాదకత్వం వహించడం, కథకుల్ని (జిల్లాల వారీగా) పరిచయం చేయడం, కరీంనగర్ సాహిత్య చరిత్రను అందించడం వీరి ప్రత్యేకత. పలు పత్రికల్లోని వ్యాసాలు, ఇతర కథనాలు, ప్రముఖుల అభిప్రాయాలు (పి.వి.గారి పై) ఈ సంకలనంలో వున్నాయి. కథ, నవల, అనువాదం, ప్రక్రియల్లో పి.వి.గారి శైలిని స్వామిగారు చక్కగా ఒడిసి పట్టుకొని అద్భుతంగా విశ్లేషించారు. 'గొల్ల రామయ్య' కథ నిజాం పాలనపై పోరాడే కాలం నాటి కథ. స్టేట్ కాంగ్రెస్ కార్యకర్త ఆనంద్ తన్ను తాను తుపాకీ పట్టి రాజుపై పోరాడే కాంగ్రెస్ వాలంటీర్‌గా పరిచయం చేసుకోవడం, వచ్చిన పోలీసుల్ని మాటల్తో గొల్లరామయ్య తిప్పి పంపడం, కథాంశంలో ప్రధాన దృశ్యం. శిల్పం వస్తువు , సన్నివేశ సృష్టి, వర్ణన సంఘటన, సంభాషణ, పలుకు బడులు, భాష, స్వాతంత్య్ర కాంక్ష, నిజాం పోలీసుల దౌష్ట్యం, ముగింపు చక్కగా రాసారు. 'ఓ మంత్రిగారి బాధలు' కూడా పి.వి. గారు రాసిన మంచి కథల్లో చక్కటి కథనం వర్ణన, సంభాషణల పదును, సమకాలీనత నిండిన మంచి కథ, ప్రభుత్వ కార్యాలయ స్థితిగతుల్ని చెప్పే కథాంశం వుంది. హిందూ-ముస్లిం మత కలహం ఇతివృత్తంగా భారత్-పాక్ ఏర్పడిన రోజుల్లో స్థితిపై రాసిన 'బ్లూసిల్క్ సారీ' (నీలం పట్టుచీర) ఆంగ్ల కథ. వేశ్యా వాటికలో సొంత చెల్లి నీలం పట్టుచీరలో కనిపించడం, తాను సృష్టించిన మత కలహాల్లో తప్పిన తన చెల్లెలు బొంబాయిలో కనిపించడం కథా వస్తువు, అన్నాచెల్లెలు అనుబంధం, మత కలహాలు పెంచిన ఓ గూండా... ఈ కళలో ప్రధాన వస్తువు. శైలీ, శిల్పం, సంభాషణలపై స్వామిగారి విశ్లేషణ బాగుంది.
హరినారాయణ ఆప్టే మరాఠీ నవల 'పాన్ లక్షంత్ కోంగెట్'ను పి.వి. 'అబలా జీవితం' గా నవనీకరణ అద్భుతంగా చేసారు. సామెతల్లి మార్చి రాసిన తీరు... బ్రాహ్మణ కుటుంబంలో జరిగిన కథే ఈ నవల. 'మంగయ్య అదృష్టం' కథ- ఇన్స్పెక్టర్ (లోపలి మనిషి) పై స్వామి గారి విశ్లేషణలు బాగున్నాయి. ఓ మంచి ప్రయత్నం.
(రచన : డా|| బి.వి.ఎన్ స్వామి, పేజీలు : 140, వెల : రూ.150/-, ప్రతులకు : డా|| బి.వి.ఎన్. స్వామి, ఇ.నెం. 9-6-161/ఎ, రాంనగర్, కరీంనగర్ - 505001, సెల్ : 9247817732)
- తంగిరాల చక్రవర్తి,