Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందానికి తోడు అభినయంలో.. తనకు మరెవరూ సాటిరాని విధంగా ఉన్న, మీనా కుమారిని ''ట్రాజడీ క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమా'' అని అంటారు. ఈ 'కన్నీటి కథానాయిక' నట జీవితంలో ఉన్నత శిఖరాల మీద వున్నపుడు నటించిన సినిమాలన్నీ కూడా విషాదభరితమైనవే. విచిత్రమేమిటంటే ఈ నటి వెండి తెర మీద విషాద పాత్రలు దరించింది... నిజ జీవితంలో విషాదాన్ని వరించింది. పేరు ప్రఖ్యాతులు, సంపదలు, వైబోగాలు ఎన్నో ఆర్జించిన, పెళ్లిలో మోసం.. దరికి చేరని ప్రేమ బంధం.. విచిన్నమైనటువంటి వైవాహిక జీవితం మీనా కుమారిని మద్యానికి బానిసను చేసి, వెండి తెరకు దూరం చేశాయి. 40 ఏళ్లకే మత్యువు ఒడిని చేర్చాయి.
మీనా కుమారి అసలు పేరు మహాజబీన్ బానో. ఆగస్టు ఒకటో తేదీ 1933లో థియేటర్ ఆర్టిస్టులైన అలీ బక్స్-ఇక్బాల్ బేగంల కుటుంబంలో మహజబీన్ బానో జన్మించింది. మహజబీన్ తండ్రి మాస్టర్ అలీ బక్స్ సున్నీ ముస్లిం, అతను పార్సీ థియేటర్ ఆర్ట్స్‌లో అనుభవం కలవాడు. హార్మోనియం వాయించాడు, సంగీతం నేర్పించాడు, ఉర్దూ కవిత్వం రాశాడు, 'ఈద్ కా చంద్' వంటి చిత్రాలలో చిన్న పాత్రలు పోషించడమే కాకుండా 'షాహి లుటేరే' వంటి చిత్రాలకు సంగీతం సమకూర్చాడు. మహజబీన్ తల్లి ఇక్బాల్ బేగం, ఈమె అసలు పేరు ప్రభావతి దేవి. బెంగాలీ హిందూ. అలీ బక్స్తో వివాహం తరువాత ఇస్లాం మతంలోకి మారారు. ఇక్బాల్ బేగం అలీ బక్స్ రెండవ భార్య. అలీ బక్స్తో వివాహనికి ముందు ఠాగూర్ కుటుంబానికి చెందిన ప్రభావతీ దేవి ''కామిని'' అనే స్టేజ్ పేరుతో రంగస్థల నటిగా, నర్తకిగా గుర్తింపు పొందింది. ప్రభావతి దేవి అమ్మ హేమ సుందరి ఠాగూర్, రవీంద్రనాథ్ ఠాగూర్ తమ్ముడి కుమార్తె.
సినీరంగ ప్రవేశం
మహజబీన్ చిన్నతనంలో సినీ కెరీర్‌పై ఆసక్తి లేదని చెప్పినప్పటికీ, ఆమె తల్లిదండ్రులు మహజబీన్‌ను ఫిల్మ్ స్టూడియోల చుట్టు తిప్పడం ప్రారంభించారు. ఆ సమయంలో దర్శకుడు విజరు భట్ మహజబీన్‌కు ''లెదర్ఫేస్'' చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఈ చిత్రం 1939లో విడుదలైంది. అనంతరం మహజబీన్ ఒక సాధారణ పాఠశాలలో చేరిన అది ఎక్కువ కాలం కొనసాగ లేదు. నటనలో బిజీ కావడంతో ప్రైవేట్ ట్యూషన్ల ద్వారా చదువును సాగించింది. నాలుగేళ్ల వయసులోనే నటించడం ప్రారంభించిన ఆమె మొదట్లో ఎక్కువగా విజరు భట్ ప్రొడక్షన్స్‌లో పని చేసింది. 1939లో ''లెదర్ఫేస్'', ''అధూరి కహానీ'', 1940లో ''పూజ, ఏక్ హీ భూల్''. ఈ చిత్ర చిత్రీకరణ సమయంలో విజరు భట్ మహజబీన్ పేరును ''బేబీ మీనా''గా మార్చారు. 1941 లో ''న్కె రోష్ని, కసౌటి, 1942 లో విజరు, గరీబ్, 1943లో 'ప్రతి లాల్' 1944లో 'హవేలీ' చిత్రాలలో బేబీ మీనా నటించి పలువురి ప్రశంసలు అందు కుంది. 1946లో రామ్నిక్ ప్రొడక్షన్ వారి ''బచ్చన్ కా ఖేల్'' సిని మాలో ''బేబీ మీనా'' మీనా కుమారి పేరుతో నటించింది. 1946లో దునియా ఏక్ సారారు, 1948లో పియా ఘర్ ఆజా, బిచ్చడే బాలమ్ చిత్రాలలో నటించడమే కాకుండా పాటలు సైతం పాడింది మీనా కుమారి.1949లో వీర్ ఘటోత్కాచ్ 1950లో శ్రీ గణేష్ మహిమా, మాగ్రూర్, హమారా ఘర్ 1951లో లక్ష్మీ నారాయణ్, హనుమాన్ పాటల్ విజరు, సనమ్, మాధోష్ 1952లో అల్లాదీన్ ఔర్ జాదురు, చిరాగ్, తమషా మొదలైన చిత్రాలలో నటించింది.
రైజింగ్ స్టార్‌గా మీనాకుమారి
1952లో వచ్చిన విజరు భట్ ''సంగీత బైజు బావ్రా'' చిత్రం మీనా కుమారికి మంచి పేరు తీసుకువచ్చింది. 1953లో బిమల్ రారు దర్శకత్వం వహించిన ''పరిణీత'' చిత్రంలో అశోక్‌కుమార్ సరసన మీనా కుమారి ప్రధాన పాత్రలో నటించారు. బిమల్ రారు దర్శకత్వం వహించిన ''డు బిఘా జమిన్'' 1954లో కేన్స్‌లో అంతర్జాతీయ బహుమతిని గెలుచుకుంది. జియా సర్హాది దర్శకత్వం వహించిన దిలీప్‌కుమార్‌తో మీనా చేసిన మొదటి చిత్రం ''ఫుట్ పాత్'', కమల్ అమ్రోహి దర్శకత్వం వహించిన ''దాయెరా'' 1954లో బిఆర్ చోప్రా దర్శకత్వం వహించిన ''చాందిని చౌక్'', ఫద్ మజుందార్ దర్శకత్వం వహించిన ''బాద్బాన్'', ఆర్.సి.తల్వార్ దర్శకత్వం వహించిన ''ఇల్జామ్'' 1955లో శ్రీరామలు నాయుడు ఎస్.ఎమ్. దర్శకత్వం వహించిన ''ఆజాద్'' చిత్రంలో మీనాకుమారి రాబిన్‌వుడ్ 'దిలీప్ కుమార్'తో కలిసి నటించారు. జిపి.సిప్పీ దర్శకత్వం వహించిన చారిత్రక నాటక చిత్రం ''అడ్ల్-ఎ-జహంగీర్'', ''బండిష్'', ''రుఖ్సానా'' చిత్రాలు మీనా కుమారికి గుర్తింపుని తెచ్చాయి. 1956లో వితంతు పునర్వివాహాల సమస్య ఆధారంగా బిఆర్ చోప్రా దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం ''ఏక్ హారు రాస్తా''. ఈ చిత్రం విజయవంతమైంది. ప్రముఖ బెంగాలీ నవల ఆధారంగా హేమచంద్ర దర్శకత్వంలో వచ్చిన ''బంధన్'' సిల్వర్ జూబ్లీని జరుపుకుంది.
ట్రాజడీ క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమా
1957లో ఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించిన ''శారద'' చిత్రంలోని ఆమె నటనకు బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఉత్తమ నటి అవార్డుతో సత్కరించింది. ఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించిన హాస్య చిత్రం ''మిస్ మేరీ'' సినిమాలో మీనా కుమారి, జెమిని గణేషన్, జమున నటించారు. ఈ చిత్రం ఆ సంవత్సరంలో అతిపెద్ద విజయాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. 1958లో లేఖ్‌రాజ్ భక్రీ దర్శకత్వం వహించిన ''సహారా'' చిత్రంలోని నటనకు మీనా ఫిలింఫేర్ అవార్డు నామినేషన్ అందుకున్నారు. బిమల్‌రారు దర్శ కత్వం వహించిన యాహుడి, 1959లో దేవేంద్ర గోయెల్ దర్శకత్వం వహించిన ''చిరాగ్ కహాన్ రోష్ని కహాన్'', ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ దర్శకత్వం వహించిన ''చార్ దిల్ చార్ రహెన్'' 1959లో విడు దలైన ఇతర చిత్రాలు ''అర్ధంగిని'', ''సత్తా బజార్'', ''మధు'', ''జాగీర్'', 1960 కిషోర్ సాహు దర్శకత్వం వహించిన 'దిల్ అప్నా ఔర్ ప్రీత్ పరాయి' సినిమాలన్నీ మీనా కుమారిని ట్రాజడీ క్వీన్ గా నిలిపాయి.
విమర్శకుల ప్రశంసలు
1961లో సదాశివ్ జె. కవి దర్శకత్వం వహించిన ''భభి కి చుడియాన్'' సినిమాలన్నీ ప్రేక్షకాదరణ పొందడంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది. 1962లో
ఫణి మజుందార్ దర్శకత్వం వహించిన ''ఆర్తి'' చిత్రంలో మీనా కుమారి తన నటనకు ఉత్తమ నటిగా ఫిలింఫేర్‌కు నామినేషన్ అందుకుంది. 1962 లో అబ్రార్ అల్వి దర్శకత్వంలో గురు దత్ నిర్మించిన ''సాహిబ్ బీబీ ఔర్ గులాం'' చిత్రం ఉత్తమ నటి అవార్డుతో సహా నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రం 13 వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు సెలెక్ట్ కాగా, మీనా కుమారి ఈ ఫెస్టివల్‌కు ప్రతినిధిగా ఎంపికయ్యారు. ఆస్కార్ అవార్డులకు భారత అధికారిక ఎంట్రీగా ఎంపికయ్యింది. 1963లో సివి శ్రీధర్ దర్శకత్వం వహించిన ''దిల్ ఏక్ మందిర్'', 1964లో హషికేశ్ ముఖర్జీ దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా చిత్రం ''సంజ్ సర్ సవేరా'', రామ్ మహేశ్వరి దర్శకత్వం వహించిన 'కాజల్', తదితర చిత్రాలన్నింటిలో మీనా కుమారి నటన క్లాసిక్‌గా నిలిచింది. టాప్ ఇరవై చిత్రాలలో 'కాజల్' చిత్రం ఫిల్మ్ ఫేర్ అవార్డును గెలుచుకుంది. 1966లో ఒపి రాల్హాన్ దర్శకత్వం వహించిన 'ఫూల్ ఔర్ పత్తర్' గోల్డెన్ జూబ్లీ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో మీనా కుమారి నటనకు ఆ సంవత్సరానికి ఫిలింఫేర్ అవార్డులలో ఉత్తమ నటిగా ఎంపికైంది. ఈ చిత్రమే ధర్మేంద్రను స్టార్డమ్కు తీసుకు వచ్చింది. 1967లో హషికేశ్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ''మజ్లీ దీదీ'' చిత్రం ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా నలబై ఒకటవ అకాడమీ అవార్డులకు భారత దేశం తరపున ప్రవేశం పొందింది. 1968లో యాకుబ్ హసన్ రిజ్వి దర్శకత్వం వహించిన సస్పెన్స్ థ్రిల్లర్ ''బహరోన్ కి మన్జిల్ ఎ'' చిత్రం మీనా ప్రధాన విజయా లలో ఒకటిగా నిలిచింది. 1970 ప్రారంభంలో మీనాకుమారి తన దష్టిని 'యాక్టింగ్ ఓరియెంటెడ్', క్యారెక్టర్ రోల్స్‌పై మరల్చారు. ఈ కాలంలో ఆరు చిత్రాలు విడుదలై నాయి అవి ''జవాబ్, సాత్ ఫేరే, మేరే అప్నే, దుష్మన్, పాకీజా, గోమతి కే కినారె''. మీనా నటించిన చివరి సినిమా నిర్మాణం 14 సంవత్సరాల పాటు కొనసాగింది. ఇప్పటికీ కూడా అత్యద్భుత కళాఖండంగా నిలిచిపోయిన 'పాకీజా' విడుదలైన రెండు నెలలకి ఈ 'ట్రాజడీ క్వీన్' మరణించింది. ఆమె మరణించాక 'పాకీజా' సూపర్ హిట్ అయ్యింది.
కమల్ అమ్రోహీతో వివాహం.. విభేదాలు
మీనా కుమారి తన 22 ఏళ్ల వయస్సులో ప్రముఖ దర్శకులు, నిర్మాత కమల్ అమ్రోహీని పెళ్లి చేసుకుంది. కమల్ అమ్రోహి 1949లో సినిమాలు తీసి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. కమల్ దర్శకుడే కాదు మంచి రచయిత కూడా. కవితలు అంటే ఇష్టపడే మీనాకుమారి తనకు తెలియకుండానే కమల్‌ను ఆరాధించింది. అతడిపై ప్రేమను పెంచుకుంది. మీనాకుమారితో ఓ సినిమాను ప్లాన్ చేసిన కమల్ ఆమెకు సినిమా కథ చెప్పడానికి వెళ్లడంతో వారి మధ్య ప్రేమ చిగురించింది. ఆ సమయంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన మీనాకుమారికి వారాంతాల్లో సపర్యలు చేస్తూ స్నేహాన్ని పెంచుకున్నాడు. మీనా, కమల్ల స్నేహం ప్రేమై.. 1952లో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఎందుకంటే కమల్ అప్పటికే వివాహితుడు, కమల్‌కు అది మూడో పెళ్లి. అప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. పిల్లలు కూడా. కమల్ మీనా కుమారి కన్నా పదహారేళ్లు పెద్దవాడు కూడాను. పెళ్లైన తర్వాత కూడా మీనాకుమారి వరస విజయాలు అందుకుంది. ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. దీంతో కమల్ మనస్సులో అసూయ ఏర్పడింది. తర్వాత నుంచి మీనా కుమారికి కమల్ అనేక ఆంక్షలు పెట్టడం ప్రారంభించాడు. ఎవరితోనూ మాట్లాడుకూడదు. ఎవరి కారులోనూ వెళ్లకూడదు, ఆదివారాలు నటించ కూడదు, ఈ టైంకే వెళ్లాలి. పలానా టైంకే రావాలనే రూల్స్ పెట్టాడు. దీంతో మీనా కుమారి మానసికంగా కుంగి పోయింది. అంతేకాదు మీనాకుమారికి వచ్చిన అద్భుతమైన సినిమా అవకాశాలను కమల్ దూరం చేశాడు. దీంతో వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. మీనా కుమారి హీరోయిన్గా తన కలల ప్రాజెక్ట్ 'పాకీజా' సినిమా తీయాలను కున్నాడు కమల్. 'విడాకులు ఇస్తేనే చేస్తాను' అంటూ కమల్‌కు చెప్పింది మీనా. మానసికంగా మనమేమీ ఒకరికొకరం ముడిపడిలేమి ప్పుడు నీ ఆత్మసంతప్తి కోసం ఇచ్చేస్తానని, విడాకులు ఇచ్చే సాడు. కమల్ అమ్రోహీ మీనా కుమారిని హీరోయిన్గా పెట్టి ''పాకీజా'' సినిమా మొదలు పెట్టాడు. ఆ టైంలో ఇద్దరి మధ్య విభేదాలు పెరిగి, మరింత తారా స్థాయికి చేరుకున్నాయి. సినిమా కూడా మధ్యలో ఆగిపోయింది. ఈ పరిణామంతో ఇద్దరి మధ్య దూరం పెరగడంతో మీనా కుమారి మద్యానికి బానిసైంది.
ధర్మేంద్రతో పరిచయం ప్రేమ
ఆ సమయంలోనే మీనా కుమారికి సినిమాల్లో కో యాక్టర్ దర్మేంద్ర పరిచయం అయ్యాడు. ముంబైలోని చాందీవలీ స్టూడియోస్‌లో ఈ యువనటుడిని మీనా కుమారికి పరిచయం చేశారు. ఆమె వాత్సల్యంగా అతని భుజం తట్టి 'ఈ అబ్బాయికి మంచి భవిష్యత్ ఉంది' అని చెప్పింది. ఇది ఆ జంట ప్రేమకథకు తొలి సన్నివేశం. దర్మేంద్ర అప్‌కమింగ్ యాక్టర్. అయినా మీనాకుమారి దర్మేంద్ర పట్ల ఆకర్షితురాలైంది. ఒంటరి తనంలో తనకు మంచి తోడు గా భావించింది. ధర్మేంద్రను పిచ్చిగా ప్రేమించింది. ఎంతో మంది నిర్మాతలు, దర్శకులకు అతని పేరు సిఫారసు చేయ డమే కాకుండా మీనా కుమారి ధర్మేంద్రతో కలిసి ''కాజల్, పూర్ణిమ, చందన్ కా పల్నా, మై భీ లడ్కీ హూ, బహారోంకీ మంజిల్, ఫూల్ ఔర్ పత్థర్'' మొదలైన చిత్రా లలో నటించింది. ధర్మేంద్రతో పరి చయం అయ్యే నాటికే మీనాకుమారి మందుకు బానిసైంది. ఆ సమయం లో మీనాకుమారి బేషరతుగా తనకు ప్రేమను పంచే మనసు కోసం తపిస్తోంది, తాను ఎదురుచూస్తున్న వ్యక్తి ధర్మేంద్రే అని స్థిరపరచుకుంది. అతని సాంగత్యంలో ఈ లోకాన్ని మరిచి పోయేది. ఆమెతో ఉన్నంతసేపు అతనూ తన లోకాన్ని పక్కన పెట్టే వాడు. ఆ కాలక్షేపంలో ఆమె అతణ్ణి తన సాంత్వనగా మలచుకునేది. అతను ఆమెనో గురువుగా, గైడ్‌గా భావించేవాడు. తన గురించి అతను ఏమనుకుంటున్నాడోనని ఏనాడూ ఆలోచించ లేదు. ఆమె తన నుంచి ఏం ఆశిస్తోందో ధర్మేంద్ర మెదడుకి చిక్కినా, తాను ఎలా ఉండదలుచుకున్నాడో అలాగే ఉన్నాడు. ధర్మేంద్ర ఆమె స్టార్‌డమ్‌ను వాడుకుని, తర్వాత కాలంలో ఆమెను దూరంగా పెట్టాడు. ఈ ప్రేమ కథలో ధర్మేంద్ర విలన్‌గా మిగిలాడు. దాంతో మీనా కుమారి మళ్లీ ఒంటరిగా మిగిలిపోయింది. కడవరకు కలిసే ఉంటాడని నమ్ముకున్న బంధం మూడేళ్లకే ముగిసిపోయింది. మీనా మళ్లీ మద్యం మత్తులో మునిగిపోయింది. కానీ ధర్మేంద్ర తన కెరీర్ ప్రారంభంలో మీనా అందించిన ప్రోత్సాహాన్ని మాత్రం మరిచి పోలేదు. ఇప్పటికీ ఆమె చేసిన మేలును తలచుకుంటూనే ఉంటాడు.
లండన్, స్విట్జర్లాండ్లలో చికిత్స
ధర్మేంద్రతో విడిపోయాక మద్యా నికి బానిసైన మీనా కుమారి లివర్ సిర్రోసిస్ వ్యాధి బారిన పడింది. ఆధునిక చికిత్స అవసరమని వైద్యుల సలహాతో జూన్ 1968 లో లండన్, స్విట్జర్లాండ్లలో డాక్టర్ షీలా షెర్లాక్ ఆధ్వర్యంలో చికిత్స తీసుకుంది. అక్కడ కోలుకున్న తర్వాత మీనా 1968 సెప్టెంబరు లో భారతదేశానికి తిరిగి వచ్చింది. వచ్చిన ఐదవ రోజు నుండి వైద్యుల సూచనలకు విరుద్ధంగా సిరోసిస్ వ్యాధితో బాధపడుతున్నా లెక్క చేయకుండా తిరిగి నటించడం ప్రారంభించింది. లండన్ నుండి తిరిగి వచ్చిన తరువాత ఆమె తాగలేదు. కానీ సొంత ఇంటిని కొనుగోలు చేసింది.
చెరగని అందం
విదేశాల్లో చికిత్స పొంది తిరిగి ముంబైకి వచ్చాక ఆమెకు కమల్ మళ్లీ చేరవయ్యాడు. 'నువ్వు లేక నా డ్రీమ్ ప్రాజెక్ట్ ''పాకీజా'' ఆగిపోయిందని మీనాకు చెప్పడంతో, 'నన్ను మునుపటి అందంతో చూపిస్తాను.. అంటే నీ ''పాకీజా'' నేనవుతాను' అని చెప్పింది మీనా. 'పాకీజా' సినిమాకు సన్నహాలు మొదలయ్యాయి. మీనాకుమారి హీరోయిన్గా. హీరోగా ధర్మేంద్రతో అంతకు ముందే సైన్ చేయించుకున్నప్పటికి, మీనా కుమారితో ధర్మేంద్రకున్న స్నేహం కమల్ మనసును కలవరపెట్టాయి. అతనిలోని పొసెసివ్ నేచర్ మళ్లీ పడగ విప్పింది. ధర్మేంద్రను ఆ సినిమా నుంచి తొలగించి, ఆ పాత్రకు రాజ్‌కుమార్‌ను ఎంచుకున్నాడు. 'పాకీజా' మొదలైంది. అయితే అప్పటికి కమల్‌కు తెలియని నిజం ఏంటంటే రాజ్‌కుమార్ కూడా మీనాకుమారిని ఆరాధిస్తున్నాడని. విలక్షణమైన తన ఉచ్చారణ శైలితో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రాజ్‌కుమార్ సెట్స్‌లో మీనాకుమారిని చూడగానే మైమరచిపోయేవాడట.., డైరెక్టర్ కమల్ 'కెమెరా.. యాక్షన్' అని చెప్పినా తాను చెప్పాల్సిన సంభాషణలను మరచిపోయి మీనాకుమారినే చూస్తుండి పోయిన సందర్భాలెన్నో, రాజ్‌కుమార్ తీరుతో చిర్రెత్తి పోయిన కమల్.. హీరో హీరోయిన్లు కలిసి నటించే సీన్లను సాధ్యమైనంత తక్కువ షఉట్ చేశాడట. 'పాకీజా'లోని 'చలో దిల్దార్ చలో చాంద్‌కే పార్ చలో' పాటను ప్రణయ గీతంగా నాయికా నాయకుల మధ్య సాన్నిహిత్యంతో చిత్రీకరించాలని అనుకున్నాడట. కాని ఎప్పుడైతే రాజ్‌కుమార్ కూడా మీనా కుమారి అంటే పడి చచ్చిపోతున్నాడని కమల్ గ్రహించాడో అప్పడు ఆ పాట చిత్రీకరణే మారి పోయింది. కళ్లతోనే ప్రేమను అభినయించమని, ముఖ కవళికలతోనే సాన్నిహిత్యాన్ని ప్రదర్శించమని మీనాకుమారిని ఆదేశించాడు కమల్. అంతేకాదు చుట్టూ ఉన్న చెట్లు, లతలు, పూలు, చందమామాను ఎక్కువగా ఫోకస్ చేసి రొమాంటిక్ సాంగ్‌ను పూర్తి చేశాడు. పాకిజా సినిమా 1972లో విడుదలై ఘన విజయం సాధించింది. సినిమా విడుదలైన రెండు నెలలకే మీనా కుమారి మద్యం కారణంగా లివర్ చెడిపోయి మార్చి 31, 1972 న చనిపోయింది. ఆమె చనిపోవడంతో ''పాకిజా'' సినిమాకు అభిమానులు పోటెత్తారు. అలా భారీ వసూళ్లతో పాకిజా సినిమా రికార్డ్ సష్టించింది. వివాహ బంధం విచ్ఛినమై.. ప్రేమించిన మనిషి దూరమై మీనా కుమారి ఒంటరిగా మిగిలిపోయింది. మనస్సు విరిగి జీవితంలో విషాదాన్ని నింపుకుంది. వెండితెరపై తన నటనతో ఒలికించిన విషాదం.. తన జీవితంలో చేర్చుకుంది. అలా ట్రాజడీ క్వీన్ మీనా కుమారి వినీలాకాశంలో ఓ ధ్రువ నక్షత్రంగా మిగిలిపోయింది.
ప్లేబ్యాక్ సింగర్‌గా
మీనా కుమారి కూడా ప్లేబ్యాక్ సింగర్‌గా సైతం రాణించింది. ఆమె 1945 వరకు 'బహెన్' తదితర చిత్రా లకు చైల్డ్ ఆర్టిస్ట్‌గా పాడింది. కథా నాయికగా, దునియా ఏక్ సారారు, పియా ఘర్ ఆజా, బిచ్చాడే బాలం, పింజ్రే వంటి చిత్రాల పాటలకు ఆమె తన గొంతును అందించింది. కే పంచి, పాకీజా కోసం కూడా పాడింది, అయితే, ఈ పాట ఈ చిత్రంలో ఉపయోగించబడలేదు అయితే ఆ తరువాత 1977లో పాకీజా - రంగ్ బా రంగ్ ఆల్బమ్‌లో విడుదలైంది.
రచయిత్రిగా.. కవయిత్రిగా..
మీనాకుమారి మంచి నటి మాత్రమే కాదు, రచయిత్రి కూడా. చదువుకోకపోయినా ఉర్దూలో ''నాజ్'' అనే కలం పేరుతో కవితలు రాసింది. అందులో చాలా వరకూ పబ్లిష్ అయ్యాయి. హిందీలో కూడా ప్రావీణ్యం ఉంది. 1971 లో మీనా కుమారి ''నేను వ్రాస్తాను, నేను పఠిస్తాను'' కవితలతో కూడిన ఆల్బమ్ విడుదలైంది. ఈ ఆల్బమ్ 19 సెప్టెంబర్ 2006 న తిరిగి విడుదల చేయబడింది. దీనికి మొహమ్మద్ జహూర్ ఖయ్యామ్ సంగీతం ఇచ్చారు. మీనా కుమారి కవితల సంకలనం ''తన్హా చాంద్'' గుల్జార్ చేత సంకలనం చేయ బడింది. ఈ సంకలనం 1972లో ఆమె మరణం తరువాత ప్రచురించబడింది. దివంగత నటి కవితలు ''ఎ లైఫ్ బియాండ్ సినిమా మీనాకుమారి'' 2014లో ప్రచురించబడింది.
- పొన్నం రవిచంద్ర, 9440077499
సీనియర్ జర్నలిస్టు, సినీ విమర్శకులు