Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన దేశంలో వివాహ వ్యవస్థకు చాలా గౌరవం ఉంది. ఊహ తెలియనప్పటి నుండి ఆడపిల్లలకు ఆమె భర్త ద్వారా వచ్చే సౌఖ్యాల గురించి చెప్పడం మొదలెడతారు తల్లి తండ్రులు. జానపద గీతాలన్ని చూడండి ఈ పెళ్ళి ద్వారా వచ్చే సౌఖ్యాల గురించే. గోరింటాకు పాటలలో కూడా మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు అనే మొదలెడతారు కదా.. ఆ మంచి భర్త చాలా పెద్ద అవసరం స్త్రీ జీవితంలో. అందుకే ఒకప్పటి భారతీయ స్త్రీ తన నిజమైన జీవితం వివాహంతో మొదలవుతుంది అని కలలు కనేది. భర్త లేని జీవితం ఆడదానికి దుర్బరం అవుతుంది. ఆమెకు అయినా కాకపోయినా సమాజం దుర్బరం చేసి వదిలిపెడుతుంది. తమకు వివాహం కేవలం ఒక సామాజిక అవసరం అనుకునే చాలా మంది మగవారికి భార్య స్థానంలో ఉన్న ప్రాణి అవసరాలను గుర్తించే తీరిక ఉండదు. అసలు స్త్రీకు కొన్ని అవసరాలు ఉంటాయన్నదే అంగీకరించని సమాజంలో నుండి ఇప్పుడే మారుతున్నాం మనం. పితస్వామ్య వ్యవస్థ, జమిందారీ వ్యవస్థ పాతుకుపోయిన సమాజంలో స్త్రీల జీవితం ఎలా ఉండిందో, ఎంతటి మానసిక చిత్రహింసకు వారు లోనయ్యేవారో చెప్పిన ఒక గొప్ప సినిమా 1962లో హిందీలో వచ్చిన ''సాహిబ్ బీవి ఔర్ ఘులాం''. ఇందులో ''చోటీ బహు'' పాత్ర భారతీయ సినీ జగత్తులో ఎప్పటికీ గుర్తుండిపోయేలా నటించారు మీనాకుమారి. 'చోటీ బహు'ని మర్చిపోతే భారతీయ సినీ స్త్రీ పాత్రలు అసంపూర్ణమే.
బిమల్ మిత్ర ప్రముఖ బెంగాళీ రచయిత. 1953లో ఆయన సాహెబ్ బీవీ గొలామ్ అనే నవలను బెంగాలీ భాషలో రాసారు. దీన్నీ 1956లో కార్తిక్ చటర్జీ దర్శకత్వంలో ఉత్తం కుమార్, సుమిత్రా దేవీలతో బెంగాలీలో సినిమాగా తీసారు. అది బెంగాలీ భాషలో గొప్ప సినిమాగా మన్నన అందుకున్నా, ఈ కథకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చింది 1962లో తీసిన హిందీ సినిమా. గురుదత్ నిర్మించిన ఈ చిత్రానికి అబ్రర్ అల్వీ దర్శకత్వం వహించారు. చాలామంది విశ్లేషకులు గురుదత్ బాణిలో ఉన్న ఈ చిత్రాన్ని చూసి, ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహించారని, తన సినిమాలు ఫెయిల్ అవుతాయన్న అపోహతో అబ్రర్ అల్వీ పేరు దర్శకుడిగా పెట్టారని అంటారని. సినిమాకు తాను దర్శకత్వం వహిస్తే పాటలకు మాత్రం గురుదత్ దర్శకత్వం వహించారని అబ్రర్ అల్వీ చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు. అది వేరే కథ. ఈ సినిమా మాత్రం గురుదత్ నిర్మాణంలో వచ్చిన ఒక గొప్ప ఆణిముత్యం.
ఈ సినిమాకు మూడు ఫిలిం ఫేర్ అవార్డులు లభించాయి. అకాడమీ నామినేషన్ పొందింది. జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా బహుమతి పొందింది. ప్రస్తుతం వంద భారతీయ గొప్ప సినిమాల లిస్టులో కూడా ఉంది. సినిమా మొత్తంలో చాలా సింబాలిజమ్స్ కనిపిస్తాయి. కథను, కథా నేపధ్యాన్ని వివరించే షాట్లు అవి. సినిమా మొదటి సీన్ ఒక పాడుబడిన భవంతి తవ్వకంతో మొదలవుతుంది. శిథిలమయిన జమిందారీ సంస్కతి, అందులో మగ్గిపోయిన ఆడవారు ఈ శిథిల భవనం మూడింటిని పోల్చి చూపిస్తారు దర్శకులు. ఆ భవనం వద్ద ఇంజనీరుగా పని చేసే భూత్‌నాధ్ ఒకప్పుడు ఆ భవనంలో పని చేసినవాడు. పల్లెటూరి నుండి దూరపు చుట్టం దగ్గరకు పని వెతుక్కుంటూ వస్తాడు భూత్‌నాధ్. అతని చుట్టం ఆ జమిందారి గడీలో పని చేస్తూ ఉంటాడు. భూత్నాధ్కి ఒక కుంకుమ ఫాక్టెరీ లో పని దొరుకుతుంది. కుంకుమ అమ్మకాలను పెంచడానికి రాసిన ఒక కవితను అచ్చు వేసి పాంప్లెట్లు పంచుతారు కంపనీ పనివారు. తమ కుంకుమ పెట్టుకున్న స్త్రీలను వారి ప్రియులు, భర్తలు వదిలి ఉండలేరని, తమ కంపెనీ తయారు చేసిన కుంకుమలో అంత మహత్తు ఉందనే ఒక కమర్షియల్ అడ్వర్టయిజ్మెంట్ అది.
ఆ జమిందారి భవనంలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. తల్లి వితంతువు. పెద్ద అన్నగారు జమిందారి హౌదాతో అనవసరమైన ధర్భాలకు డబ్బు తగలేస్తూ పావురాయి పోటీలు, వేట, షికార్లతో కాలం గడుపుతూ ఉంటాడు. అతని భార్య జమిందారి కుటుంబం నుండి వచ్చిన కోడలు. ఆమెకు జమిందారి మగవారి అలవాట్లు బాగా తెలుసు కాబట్టి నగలు కొనుక్కుంటూ, చీరలు కొనుక్కుంటూ బతుకుతూ ఉంటుంది. చిన్న కోడలు అంటే ''చోటీ బహు'' ఒక పేద ఇంటి నుండి వచ్చిన అమ్మాయి. భర్త అంటే ఎంతో భక్తి, ప్రేమ. భర్త సాంగత్యంలో గడపాలని కోరిక. కాని ఆ భర్త మాత్రం రాత్రులు ఆ పరిసరాలలోనే ఉంచుకున్న వేశ్యల దగ్గరకు వెళుతూ ఉంటాడు. భర్త తనతో గడపాలని, అతనితో తాను సుఖించాలని, భర్త చేతుల్లో సేద తీరాలని ఇలా ఎన్నో కోరికలు చోటీ బహుకి. కాని ఏం చేస్తే భర్త తనతో ప్రేమగా ఉంటాడో తెలీదు. ఆ భవనం దాటి బయటకు వెళ్ళలేరు జమిందారి స్త్రీలు. ఆమెకు నగలు చీరలపై మోజు లేదు. కావల్సింది భర్త ప్రేమ. అతను పూర్తిగా తనకు సొంతమవడం. ఆమెలోని ఈ కోరికలు తోటి కోడలికి, అత్తకు వింతగా అనిపిస్తాయి. జమిందారీ స్త్రీ భర్తతో ఉండాలని కోరుకోవడం ఒక వింత అయితే చోటీ బహు భర్త తనతో మాత్రమే ఉండాలని కోరుకోవడం వారికి అర్థం కాని మరో వింత. చోటి బహు మాత్రం భర్తను తన దగ్గర ఉంచుకోవాలని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఆమె ఈ కుంకుమ కంపెనీకి సంబంధించిన ఆడ్వర్టయిజ్‌మెంట్ చదువుతుంది. తమ భవనంలో ఆ కంపెనీలో పని చేసే వ్యక్తి ఉన్నాడని తెలుసుకుని భూత్నాధ్ని తన గదికి పిలిపించుకుంటుంది. తనకు కుంకుమ తెచ్చివ్వమని, ఇలా తాను అడిగానని ఎవ్వరికీ చెప్పవద్దని కోరుకుంటుంది.
మొదటి సారి భూత్నాధ్్ చోటీ బహుని కలుసుకునే సీన్, హిందీ సినిమాలలో చిత్రించిన గొప్ప సీన్లలో ఒకటి. వారిద్దరి మధ్య ఒక మానసిక సంబంధం ఏర్పడుతుంది. చోటి బహు ఒక దేవతలా కనిపిస్తుంది భూత్నాధ్కు. ఆమెలోని అమాయకత్వం, అమ్మతనం రెంటికి చేతులెత్తి మనసులో నమస్కరిస్తాడు అతను. కంపెనీలోని కుంకుమను బాధ్యతతో తీసుకువచ్చి ఇస్తాడు. అప్పటికే ఆమె ఒంటరితనం చిన్న జమిందారి గారి అలవాట్ల గురించి విని ఉండడం వలన అతనికి చోటీ బహు బాధ అర్థం అవుతుంది. కుంకుమను అలంకరించుకున్నా జమిందారు గారు మాత్రం చోటీ బహుని దులపరించుకుని వెళతాడు. నిరాశతో అవమానంతో కుమిలిపోతుంది చోటి బహు. అప్పుడే ఆమెకు భూత్నాధ్కు మధ్య స్నేహం ఇంగా గట్టిపడుతుంది.
రాత్రుళ్లు తన దగ్గర భర్త ఉండాలంటే తానేం చేయాలో చెప్పమని చోటీ బహు భర్తనే అడుగుతుంది. అతను ఆమెను తాగమని తనను ఆనందపరచమని చెబుతాడు. తాగుడంటే అసహ్యించుకునే సాంప్రదాయ స్తీ అయినా, అమె భర్త కోసం తాగుడు మొదలెడుతుంది. అయినా భర్త పర స్త్రీల దగ్గరకు వెళ్ళడం మానడు. చివరకు ఆమె తాగుడికి బానిసవుతుంది. భర్త ప్రేమ దొరకక ఒంటరితనాన్ని తన అర్ధరహిత జీవితాన్ని జీవించలేక దుఖాన్ని మత్తులో మరచిపోయే ప్రయత్నం చేస్తుంది. ఆమెకు మందు తెచ్చిచ్చే భూత్‌నాధ్ ఆమెను ఆ అలవాటు నుండి దూరం చేయాలని చాలా ప్రయత్నిస్తాడు. ప్రేమరాహిత్యంతో, పురుషాహంకార జమిందారీ వ్యవస్థలో ఆమె ఒంటరితనాన్ని అర్థం చేసుకున్నది అతనొక్కడే.
పెద్ద జమిందారు అనవసరమైన డాంబికాలకు డబ్బు తగలేసి అప్పుల పాలవుతాడు. ఆస్థులన్నీ అమ్మేయాల్సి వస్తుంది. చిన్న జమిందారు వద్ద డబ్బు లేదని తెలిసి అంత కాలం రంజింపజేసిన వేశ్యలు అతన్ని వదిలిపోతారు. పక్షవాతంతో మంచంపై పడతాడు చిన్న జమిందారు. చోటి బహు అతనికి సేవలు చేస్తూ ఉంటుంది. కాని అప్పటికే మద్యానికి ఆమె బానిసవుతుంది. ఒక్కొక్కటిగా నగలు అమ్ముకుని మత్తులో భర్త సేవలో గడుపుతుంటుంది చోటీ బహు.
ఒక రోజు భర్త ఆరోగ్యం కోసం ఒక సాధువుని కలవాలని తోడు కోసం భూత్నాధ్ని రమ్మని పల్లకిలో పక్క ఊరికి బయలు దేరుతుంది చోటీ బహు. జమిందారి పోయినా అహంకారం చావని ఆమె బావగారు చోటీ బహు, భూత్నాధ్ల మధ్య అక్రమ సంబంధం ఉందని ఊహించి ఆమెను గుండాలతో కిడ్నాప్ చేయిస్తాడు. దీనికి కూడా డబ్బులు లేక చేతి కడియం అమ్మి మరీ గుండాలను సమకూర్చుతాడు. లేమిలో కూడ ప్రదర్శించే ఈ జమిందారి అహంకారం అప్పటి జమిందారుల మానసిక చాపల్యాన్ని చూపిస్తుంది. చోటీ బహుని రక్షించపోయి దెబ్బలు తిన్న భూత్‌నాధ్ తరువాత ఆ భవనం వదిలి వెళ్ళిపోతాడు. చోటి బహు ఏం అయ్యిందీ ఎవరికీ తెలీదు. తరువాత చాలా సంవత్సరాల తరువాత ఇంజనీర్ అయి ఆ భవనం తవ్వకాల కోసం మళ్ళి వచ్చిన భూత్ నాధ్కి పాత రోజులు గుర్తుకు వస్తాయి. అప్పుడే ఆ తవ్వకాలలో ఒక అస్థిపంజరం బైటపడుతుంది. అది చూసిన భూత్నాద్ అవి చోటి బహు అవశేషాలుగా గుర్తుస్తాడు. అస్థిపంజరం చేతి గాజుని చూసి ఆ శవాన్ని గుర్తుపడతాడు. జమిందారు చోటీబహుని హత్య చేయించి ఆ భవనంలోనే పాతి పెట్టాడని అర్ధం చేసుకుంటాడు.
జమిందారి వ్యవస్థలో ఇలా భూమిలో పాతపడ్డ శవాలు ఎన్నో. ఆ గడులలోని స్త్రీల జీవితాలలో ఎన్ని కథలో చోటి బహు పాత్ర ద్వారా రచయిత చెప్పే ప్రయత్నం చేసారు. ఆ వ్యవస్థలో పురుషులకు భార్య ఒక అలంకార వస్తువు మాత్రమే. నచ్చిన స్త్రీతో నచ్చినట్టు గడుపుతూ ఇంట్లో భార్య స్థానంలో ఉన్న ప్రాణి తాము ఇచ్చే సౌఖ్యాలకు అణిగి మణీగి ఉండాలని కోరుకునే వారు. విశంఖలత్వం తామ హక్కుగా చాటుకునేవారు. వాళ్ళే కాదు ఆ ఇంట స్త్రీలు కూడా తమపై జరిగే దోపిడిని సహజంగానే తీసుకునేవారు. తమ భర్తలు వచ్చినప్పుడు వారితో ఉండడం లేదా వారు రాకపోనప్పుడు ఎదురు చూడడం, ఆ పరిస్థితులను స్వీకరించడమే తమ ధర్మం అనుకునేవారు.
చోటి బహు మాత్రం ఒక సాధారణ స్త్రీలా భర్త సాంగత్యంలో జీవితం గడపాలనుకుంటుంది. ఆమె శరీరానికి, మనసుకు భర్తతో అవసరం ఉందని, అది ప్రతి స్త్రీకి ఉండే సహజమైన ఆశ అని నమ్ముతుంది. కాని ఆమెలోని ఈ కోరికలను అసహజమైనవిగా భావిస్తుంది జమిందారీ వ్యవస్థ. భర్తను భార్య అయినా సరే కోరుకోవడం విచ్చలవిడి తనం అని చెప్పే ఆ వ్యవస్థలో ఉండలేక, తనను అర్ధం చేసుకునే భర్తకు చేరువ కాలేక భాధపడే చోటీ బహుగా మీనాకుమారి అత్యద్భుతంగా నటించింది. కేవలం భర్తను తన దగ్గర కట్టిపడేసుకోవడానికి ఇష్టం లేక తాగుడు మొదలెట్టినా చివరకు అదే ఆమెకు అసరా అవుతుంది. చోటి బహులోని అ ఒంటరి తనాన్ని అర్థం చేసుకుంది భూత్నాథ్ మాత్రమే. అయితే ఒక జమిందారీ స్త్రీగా మరో పురుషుడితో ఆమె మాట్లడటం అంటేనే అక్రమ సంబంధం అని నిర్ణయిస్తుంది జమిందారి అహంకారం. కేవలం భర్త మాత్రమే కావాలనుకున్నందుకు అతన్ని విపరీతంగా ప్రేమించి నందుకు చివరకు తనను ఒక మనసున్న మనిషిగా గుర్తించని ఆ వ్యవస్థ కారణంగా ప్రాణాలు పోగొట్టుకుంటుంది చోటి బహు.
ఎందరి స్త్రీలో ఆ జమిందారి పరదాల చాటున ఇటువంటి చిత్రవధను అనుభవించారు. స్త్రీ తన కోరికలను బైట పెట్టకూడ దనుకునే రోజుల్లో చోటి బహు పాత్ర చాలా ప్రశ్నలను రేపింది. ఈ పాత్ర ఎలా మలచబడిందంటే, ఇందులో చోటి బహు తాగుడుని కాని భర్తని రాత్రి తన దగ్గర ఉంచుకోవాలనుకునే కోరికను కాని విచ్చలవిడితనంలా కాక ఆమె సంపూర్ణ ప్రేమగా చూపిస్తూ ఆ పాత్రకు అంతే న్యాయం చేసారు దర్శకులు. తాగుడుకి అలవాటు పడిన ఆమె పరిస్థితి పట్ల సానుభూతి ప్రేక్షకులలో కలిగించడానికి ఆమె పడే మానసిక వేదనను మీనాకుమారి తన హావభావలతో చూపించి మెప్పించారు. గీతా గత్ పాటలు ''కోయీ దూర్ సే ఆవాజ్ దే'', ''నా జావొ సైయా'', ''పియా ఐసో జియా మే'' వీటిని మీనా కుమారి అభినయం చూస్తే మరెవ్వరూ ఈ చోటి బహు పాత్రకు అంత న్యాయం చేయలేరేమో అనిపిస్తుంది.
ఈ సినిమాకు ఫోటోగ్రఫీ వి.కే మూర్తి ఇచ్చారు. ఎంత అద్భుతమైన ఫోటొగ్రఫీ అంటే ''సాఖియా ఆజ్ ముజె నీంద్ నహీ ఆతి హై'' అన్నఒక పాట డాన్సర్ల మీద చిత్రించారు. ఈ పాటలో మెయిన్ డాన్సర్ మినూ ముంతాజ్ కాకుండా ఆమె చుట్టూ ఆరుగురు డాన్సర్లు ఉంటారు. వారంతా నీడల్లో ఉంటే వారి మధ్య ఉన్న మేయిన్ డాన్సర్ మాత్రమే వెలుగులో కనిపిస్తుంది. పాటంతా అలా వెలుగు నీడల కలయికలా అంత అద్భుతంగా ఎలా తీయగలిగారు ఆ రోజులో అన్నది మాత్రం అర్ధం కాదు. గురుదత్ సినిమాలన్ని కూడా ఈ వెలుగు నీడల మాజిక్‌తో ఉంటాయి. వాటిని సష్టించిన వి.కె మూర్తి, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహిత ఎందుకయ్యారో ఈ సినిమాలో అతని పనితనం చూసి తెలుసుకోవచ్చు.
ఇక మీనాకుమారి ఈ సినిమాలో ఎంత భారతీయత్వంతో మూర్తిభవించి కనిపిస్తుందంటే కొన్ని షాట్లల్లో ఆమెలోని ఆ స్త్రీత్వం సూపర్‌గా స్క్రీన్‌పై ప్రెజెంట్ చేయగలిగారు. ఆమె కళ్ళతో పలికించే ఆ బాధ ఒంటరితనం, తరతరాల ఒంటరి వివాహితలు పెదవి దాటకుండా కప్పి పెట్టుకున్న తమ సంసార గుట్టును చెప్పకనే చెబుతాయి. ఆమె పద్ధ్దతిలో ఆమె చేసిన పోరాటం అప్పటి వివాహ, జమిందారి పురుషాహంకార వ్యవ్యస్థలో నలిగిపోయిన స్త్రీల జీవితాలకు నిదర్శనం, అందుకే గొప్ప భారతీయ సినీ పాత్రలలో సాహెబ్ బీవి ఔర్ గులామ్‌లోని చోటీ బహుపాత్ర చర్చించవలసిందే. భూత్నాధ్గా గురుదత్, చోటీ బహుగా మీనాకుమారి, భూత్‌నాధ్ ప్రేయసి జబాగా వహీదా రెహమాన్, పెద్ద జమిందారుగా సప్రు, చిన్న జమిందారుగా రెహమాన్, తమ పాత్రలలో జీవించారు.
స్త్రీకి కూడా శరీరం ఉంటుంది, దానికి వ్యాయామం ఇవ్వాలి
మెదడు ఉంటుంది, దానికి జ్ఞానం ఇవ్వాలి
హదయం ఉంటుంది, దానికి అనుభవం ఇవాలి... అనే గుడిపాటి వెంకటా చలం గారి మాటలకు ఆధారం చోటి బహు లాంటి స్త్రీల జీవితం. ఈ మూడు లేక నలిగిపోయి ఒంటరి అయి నిస్సహాయంగా రగిలిపోయి, మోడవుతున్న జీవితాన్ని భరించలేక మత్తుకు అలవాటు పడిన చోటి బహులోని ఆ స్వీయ విధ్వంసాన్ని గమనిస్తే స్త్రీల ఆవేదన పట్ల సానుకూల దక్పధం కొందరిలో కలగవచ్చు. ఎటువంటి వ్యవస్థ నుండి స్త్రీ ప్రయాణిస్తూ వస్తుందో అర్థం చేసుకుంటే తప్ప నేటీ స్వేచ్ఛా జీవితాలకు సరి అయిన అర్థం ఉండదు.
పి.జ్యోతి,
సల్: 9885384740