Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతి చిత్రం ఒక అధ్యయన గ్రంథం. అలరించే కావ్యం. ఒక మానసిక విశ్లేషణా వీచిక. నగర, గ్రామీణ దశ్యాలను తనలో ఒంపుకుని గాఢమైన అనుభూతిని పంపిణీ చేసే వాహిక. మనుషుల దుఃఖ సుఖభరిత జీవితాలను తనలో నింపుకోగల సాహసి. అటువంటి చిత్రాన్ని గీసే కళాకారుడు గొప్ప భావుకుడై ఉండాలి. నవ్యతకై పరితపించే కళాతష్ణ ఉండాలి. సమాజంలో నిత్యం కళ్లముందు కదలాడే అంశాలను తన చిత్రకళకు కథా వస్తువుగా మార్చుకునే కౌశల్యం ఉండాలి. నిబద్ధత, క్రమశిక్షణతో కూడిన ఓర్పు ఉండాలి. అన్నింటికీ మించి జీవితాన్ని త్యాగం చేసే తెగువ ఉండాలి. ఇవన్నీ కలిగి ఉన్న అరుదైన చిత్రకారుడు కూరెళ్ళ శ్రీనివాస్. రైలు పట్టాల్లాగా కళ, వ్యక్తిత్వాలు జీవితానికి ఉన్నతిని తెచ్చిపెడతాయని విశ్వసించే స్వచ్ఛమైన కళాకారుడు ఆయన.
సాధారణ కుటుంబలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచిన చిత్రకళా తాపసి కూరెళ్ళ. మానవీయత, వక్తుల జీవితంలోని సంఘర్షణ, జీవం ఉట్టిపడే ముఖాలు, కనుమరుగవుతున్న పల్లియ దశ్యాలు, శ్రమైక జీవన సౌందర్యాలు, అచ్చమైన ప్రాంతీయతకు చిహ్నమైన సంస్కతులు, అంతరిస్తున్న వత్తుల చిత్రీకరణ ఇవి కూరెళ్ళ శ్రీనివాస్ కేన్వాస్పై కనిపించే అపురూప చిత్రాలు. As I begin to paint / Hold the sky in your hands As the stretch of canvas Is unknown to meµ - M.F. Husain.
సరిగ్గా ఈ మాటలు కూరెళ్లకూ వర్తిస్తాయి అనిపిస్తుంది తను ఇటీవలికాలంలో చేస్తున్న ఆర్ట్ వర్క్‌ను చూస్తుంటే. ఎవరూ సాహసించని పనిని తను ఎత్తుకున్నాడు. వంద రోజుల్లో అతి క్లిష్టమైన వాటర్ కలర్ పోర్టైట్స్ వేస్తూ సామాజిక, చిత్ర కళా రంగాలను తనవైపుకు తిప్పుకున్నాడు. మనుషుల ఆత్మలను చిత్రికగట్టి ముందుకు దూసుకెళ్తున్నాడు. ఆయన చిత్రకళా జీవితాన్ని పరిచయం చేయడమే ఈ వారం 'సోపతి' కవర్ స్టోరీ...
ఒకనాడు రజాకార్లకు ఎదురు నిలబడి ఉద్యమించిన వంశంలో జన్మించిన కూరెళ్ళ శ్రీనివాస్ తల్లిదండ్రులు లక్ష్మయ్య, సావిత్రమ్మ. తండ్రి స్వర్ణకార వృత్తి చేసే వారు. చిన్నతనం నుండే చిత్రకళపై ఇష్టాన్ని పెంచుకున్నాడు. తన తాత ఉద్యమకారుడు కావడం, తండ్రి దాతత్వ, కళాగుణాలు కలవాడు అవ్వడం, తల్లి కఠినమైన క్రమశిక్షణలతో పెంచడం మూలంగా శ్రీనివాస్ కూడా నిబద్ధత గల కళాకారుడిగా ఎదిగి వచ్చాడు. తన తోడబుట్టిన అన్నదమ్ములూ చిత్రకళాకారులే కావడంతో శ్రీనివాస్‌కు సహజంగానే ఆ రంగం వైపు మళ్ళడానికి ఆసక్తి కలిగింది. తన నాన్న కళా వారసత్వమే ఆయన కుంచెకు జీవం పోసింది. ఎక్కడా వెనుదిరగక నిర్విరామ శ్రమతో చిత్రకళా రంగంలో ఘనమైన ప్రావీణ్యతను సంపాదించి రాటుదేలాడు, తెలుగు ప్రాంతాలు గర్వించదగ్గ చిత్రకారుడిగా రూపుదాల్చాడు కూరెళ్ళ శ్రీనివాస్.
పుట్టి పెరిగిన నల్లగొండలోనే పాఠశాల, జూనియర్, డిగ్రీ కళాశాల విద్యనూ పూర్తి చేశాడు. డిగ్రీ చివరి సంవత్సరంలో ఉన్నప్పుడే డిఎస్సీలో డ్రాయింగ్ టీచర్‌గా ప్రభుత్వోద్యోగం సంపాదించి, అటు నుండి పూర్తిస్థాయిలో చిత్రకళారంగం వైపు దష్టి సారించాడు. తర్వాతి కాలంలో ఎం.ఎ చేసి తెలుగు స్కూల్ అసిస్టెంట్‌గా విద్యారంగంలో ఒక మెట్టు పైకెక్కాడు. 2012లో కుర్మేడు పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొంది ఆదర్శ ఉపాధ్యాయుడిగా కీర్తి గడించాడు. ఏ పాఠశాలలో పని చేసినా ఆ పాఠశాల గోడలపై తన కుంచెతో విద్యార్థులకు అవసరమైన చిత్రాలు గీసి విలక్షణమైన చిత్ర కళాకారుడిగా, లక్షల విలువైన మౌలిక వసతులు కల్పించి అరుదైన ఉపాధ్యాయుడిగా తన ముద్రను వేసుకున్నాడు. ప్రస్తుతం నల్లగొండలోని చింతపల్లి మండలం జెడ్పీహెచ్ఎస్ వెంకటేశ్వరనగర్‌లో ప్రధానోపాధ్యాయుడిగా ఉండి అటు విద్యా, ఇటు చిత్రకళారంగంలో సమున్నతమైన ప్రతిభను కనబరుస్తూ సాగుతున్నాడు కూరెళ్ళ శ్రీనివాస్.
చిత్రకళా రంగంలోకి ప్రవేశం - ఆసక్తి
తనకు జన్మతః అబ్బిన చిత్రకళను విడిచిపెట్టకుండా తనను తాను నిరంతరం పుటం పెట్టుకుంటూ చిత్రకళలోని మర్మాలను తెలుసుకుంటూ సాగుతున్న కళాకారుడు శ్రీనివాస్. చిన్ననాడు నల్లగొండ పట్టణకేంద్రంగా తన ప్రాణమిత్రులైన ప్రస్తుత సాక్షి కార్టూనిస్ట్ శంకర్, ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.ఎస్.రఘు, కార్టూనిస్ట్ కంభాలపల్లి శేఖర్ల తోడ్పాటు, గురుతుల్యులైన వేణూ సంకోజు, పిట్టల రామ చంద్రం, నోముల సత్యనారాయణ, ఎం. వి గోనారెడ్డి, ప్రమీత్ గార్ల ప్రోద్భలాలతో చిత్రకళలో నైపుణ్యాన్ని సంపాదించాడు. అయితే చందమామ కథల పుస్తకాలు, వాటిపై వచ్చే బొమ్మల ప్రభావమూ తనపై బలంగా ఉండేదని, ఆ రకమైన బొమ్మలు గీయాలనే తపన తనలో అప్పట్లో ఉండేదని చెప్తుంటాడు కూరెళ్ళ. యువకుడిగా వున్నపుడు ఉద్యమపార్టీలు నిర్వహించే మహాసభలకు భారీగా చిత్రాలు వేస్తూ వచ్చాడు. సామాజిక చైతన్యానికి తన కళ ఉపయోగపడాలనే సంకల్పంతో చిత్రాలు గీసే సదుద్దేశ్యం ఆయనది. కనుకనే నల్లగొండలో ఉద్యమపార్టీల రాష్ట్ర మహాసభలు జరిగిన ప్పుడు వేంకటేశ్వర థియేటర్ వేదికనే కాదు జిల్లాను మొత్తం అవసరమైన రీతిలో స్ఫూర్తివంతంగా మార్చడంలో తన పాత్ర కీలమైంది. వాల్ పోస్టర్లు, బ్యానర్ల నిర్మాణం, అవసరమైన చోట పెయింటింగ్స్ వేస్తూ ఆ సభకే కాదు అనేక సభలకూ మెరుపులద్దాడు. కొన్ని ప్రజాసంఘాలకు, కళా బందాలకు పెయింటింగ్స్, బ్యాక్ డ్రాపులు చేసి దానికి హంగులద్దిన ప్రజా చిత్రకారుడు కూరెళ్ళ శ్రీనివాస్.
'చదువు వెలుగు' అక్షరాస్యతా, తెలంగాణ ఉద్యమాలలో
1992లో 'చదువు వెలుగు' అక్షరాస్యత కార్యక్రమంలో డిప్యుటేషన్ పై వచ్చి దాదాపు పది సం.లు పనిచేశాడు. వాచకాల రూపకల్పన, పక్షపత్రికలకు విస్తతమైన చిత్రాలు గీయడంతో పాటు పోస్టర్లు, బ్యానర్ల తయారీ చేసిన ఘనత శ్రీనివాస్ ది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సకల వర్గాలూ ఉద్యమించగా కూరెళ్ల ఆర్ట్ క్యాంపులు నిర్వహించాడు. 'హైదరాబాద్ నాదే, తెలంగాణ నాదే' వంటి శీర్షికలతో తాను గీసిన ఉద్యమ అవగాహన చిత్రాలు పుంఖానుపుంఖాలు. నిర్బంధంలో ఉన్నపుడు కూడా ఓయూలో సాహసోపేతమైన ఆర్ట్ క్యాంపులు నిర్వహించి విద్యార్థులను, ఉద్యమనాయకులను, ప్రజలను చైతన్యం చేసిన కుంచె కూరెళ్ళది. ఆయన కుంచె తెలంగాణ ఉద్యమకేతనానికి చిహ్నం.
SCERT లో చిత్రకారుడిగా విశేష కషి
రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా సంస్థలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి నేటి తెలంగాణ రాష్ట్రం వరకూ దాదాపు ఇరవై ఏళ్లుగా పాఠ్యపుస్తకాలకు ముఖచిత్రాలు, పాఠాలకను గుణంగా భావస్ఫోరకమైన బొమ్మలు వేస్తూ విశేషమైన సేవ చేస్తున్నాడు. ఒకటి నుండి పదవ తరగతి వరకూ గల విద్యార్థుల కోసం తెలుగు, సంస్కత, హిందీ, ఉర్దూ, ఆంగ్ల భాషా మాధ్యమాల్లోని పాఠ్యపుస్తకాలకు బొమ్మలు గీయడం అంత సులువైన పనికాదు. నిజానికి టీఏ, డీఏలిస్తేనే చేసే వర్క్ కాదిది. గౌరవభావం, అవిశ్రాంత శ్రమ, పూర్తిస్థాయి సమయం కేటాయించ గలగాలి. ప్రింటింగుకు అనుగుణంగా ఇల్లస్ట్రేషన్స్ ను సరైన పద్ధతిలో చేర్చడం తెలియాలి. సరైన అవగాహన లేకపోతే పుస్తకం ఆకర్షణీయంగా రూపుదాల్చదు కదా... ఇవన్నీ శ్రీనివాస్‌కు బాగా తెలుసు. అలా సుదీర్ఘకాలంగాSCERT కి సమర్థవంతమైన సేవలు అందుతున్నాయి. పది మంది ఉపాధ్యాయ చిత్రకారులను సమన్వయం చేసి వారికి అవగాహన సమావేశాలు పెట్టి పాఠ్య పుస్తకాలకు చిత్రాల రూపకల్పనలో అవిరళ కషి చేస్తుండడం శ్రీనివాస్ ప్రత్యేకత.
సమగ్ర శిక్షాఅభియాన్లో
సమగ్ర శిక్షాఅభియాన్లో కరదీపికలను, పుస్తకాలకు వేల కొలది ముఖచిత్రాలను శ్రీనివాస్ వేశాడు. ముఖ్యంగా బాల సాహిత్యానికి చెందిన వేల చిత్రాలు దీనికి అందించాడు. విద్యా విషయాలకు సంబంధించి పోస్టర్లు, ట్రైనింగ్ మాన్యుయల్స్కి ముఖచిత్రాలు వేయడమే గాక క్రియేటివ్ ఆర్ట్ రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించాడు. 'చదువుల పండుగ' వంటి పేర్లతో ఆర్ట్ టీచింగ్ శిక్షణా శిబిరాలు అనేకంగా నిర్వహించాడు. బాల సాహిత్య వికాసానికి చిత్రకారుడిగా తాను చేసిన సేవలు అనిర్వచనీయం.
15 రోజుల్లో 20 చిత్రాలు
2016లో తెలంగాణ సాహితీ నిర్వహించిన లిటరరీ ఫెస్ట్ లో 15 రోజుల్లో 20 మంది తెలుగు వైతాళికుల బొమ్మలు శ్రీనివాస్ కాన్వాస్‌పై వేశాడు. వ్యక్తిని ప్రత్యక్షంగా చూస్తున్నట్లుగా ఉన్నవి ఆ బొమ్మలు. పోతన మొదలు జాషువా, కాళోజీ, సురవరం, సుద్దాల హనుమంతు, శ్రీశ్రీ, దాశరథి ఇలా 20 మంది మహనీయులకు కూరెళ్ళ తన పెయింటింగ్ ద్వారా అమరత్వం సిద్ధింపజేసాడు. రికార్డ్ సష్టించాడు. చిత్రం బ్యాక్ గ్రౌండ్లో వారికి చెందిన విశిష్టమైన అంశాలు ప్రతీకాత్మకంగా చిత్రించడంలో శ్రీనివాస్ వివిధ అంశాలపై సమగ్రమైన అవగాహన, అధ్యయనశీలత మనకు బోధపడతుంది. ఈ లిటరరీ ఫెస్ట్ ద్వారా తెలుగు రాష్ట్రాలలో తన కుంచె పదునును చాటుకున్నాడు.
కరోనాపై అవగాహన చిత్రాలు
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాపై దాదాపు 200 చిత్రాలు వేశాడు. ఎంజీయూ విద్యార్థుల 'కాలం బంధించిన క్షణాలు' కవితా సంకలనానికి 24 గంటలలో 50 బొమ్మలను అందించిన ఘనత ఆయనది. సోషల్ మీడియా మాధ్యమంగా కరోనాపై చిత్రించిన చిత్రాలను ప్రకటించి ప్రజలకు అవగాహనను కలిగించిన సామాజిక చిత్రకారుడు కూరెళ్ళ.
ఇవేకాక ఏపీ గ్రామీణాభిద్ధి సంస్థ, మహిళా సమతా సొసైటీలకు అవసరమైన వందల కొలదీ చిత్రాలు గీసాడు. సజనకారుల పుస్తకాలకు కవర్ పేజీలతో పాటు కవితలకు, రచనలకు కవితాత్మక చిత్రాలు వేల కొద్దీ వేశాడు. ఈ చిత్రాలలో లోతు, దూరం (Depth & Perspective)లు మనల్ని భావ పరిధి పెంచుకునేలా చేస్తాయనటంలో అతిశయోక్తి లేదు. రాష్ట్రం నలుమూలలా శ్రీనివాస్ వేసిన బొమ్మలు పుస్తకాలపై సజీవంతో తొంగిచూస్తుంటాయి. కొన్ని చిత్రాలు కవిత్వాన్ని వినిపిస్తుంటాయి. కొన్ని చిత్రాలు రచనలోని అంతర్ముఖత్వాన్ని వెల్లడిస్తాయి. ప్రముఖకవి డా. ఏనుగు నరసింహారెడ్డి గారి 'తెలంగాణ రుబాయిలు' గ్రంథానికి 150 బొమ్మలు వేసి పుస్తకానికి ఆకర్షణీయతను తెచ్చిపెట్టాడు శ్రీనివాస్. తన అపురూపమైన రేఖావిన్యాసం మనల్ని సమ్మోహనపరుస్తుందని చెప్పడానికి ఇటువంటి పుస్తకాల్లోని చిత్రాలు మచ్చుతునకలు. అలాగే తెలుగు మహాసభలలో వేసిన ఒగ్గు కళాకారుడైన చుక్కా సత్తయ్య అక్రిలిక్ చిత్రం, ఎం.ఎస్ సుబ్బులక్ష్మి చిత్రం, తెలంగాణా గ్రామీణ జీవనాన్ని, పల్లియ సౌందర్యాన్ని ఎత్తి చూపే అనేక వర్ణచిత్రాలు ఎందరో హదయాలను కొల్లగొట్టాయి.
ఒకే కుంచె ... భిన్న పార్శ్వాలు
Illustrations, Painting, Abstractions, Line Drawing, Cover Design వంటివి చిత్రకళకు చెందిన కొన్ని పార్శ్వాలు. ఇలా అన్నింటిపై నైపుణ్యతను కలిగి చిత్రాలు వేసేవాళ్ల సంఖ్య వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. అలా అరుదైన వాళ్ళలో శ్రీనివాస్ అగ్రగణ్యులని చెప్పవచ్చు. ఈ రకమైన బొమ్మలను వేల కొలదీ వేసి చిత్రకళా రంగంలో చిరస్థానాన్ని పొందాడు. అంతేకాదు ఏ చిత్రం వేసినా రేఖల గుండా దానికి జీవం పోయగల ప్రజ్ఞ శ్రీనివాస్‌ది.
అవార్డులు, ప్రశంసలు
1992 జిల్లాస్థాయి, 2011లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా పురస్కారం అందుకున్నాడు. 1995లో కళా నీరాజనం పురస్కారం, 1996లో ఉత్తమ కళాకారుడి పురస్కారం, జన్మభూమి రాష్ట్రస్థాయి చిత్రలేఖన అవార్డు, 2010లో భువన భారతీ కళాపురస్కారం, 2012లో పానగల్లు పూర్వ వైభవ చిత్రకళా ప్రదర్శనలో పురస్కారాలు అందుకున్నాడు. తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఇచ్చిన రాష్ట్ర ఉత్తమ కళాకారుడి పురస్కారం 2014లో శ్రీనివాస్‌ను వరించింది.
ఉద్యమంలా 100 రోజులు 100 వాటర్ కలర్ పోర్ట్రెయిట్ చిత్రాలు
వాటర్ కలర్స్ తో పోర్ట్రెయిట్ చిత్రాలు గీయడం అషామాషీ విషయం కాదు. ఒకసారి పేపర్‌పై బ్రెష్ కదిలిందంటే మళ్లీ వెనక్కు తీసుకోలేం, చెరిపి మళ్లీ వేయడానికి అవకాశం ఉండదు. పక్కకు పడేయాల్సిందే. అంత క్లిష్టమైన పని, ప్రక్రియ అది. ఈ రకమైన కళలో నిష్ణాతునిగా వెలిగినవారు అరుదు. అందులోనూ ఇంత వేగంగా, ఇష్టంగా, నిబద్ధతతో వేసేవారు చాలా స్వల్పం. అటువంటి పనితనంలోనూ కూరెళ్ళ గత కొన్ని రోజుల నుండి విజంభిస్తున్నాడు. కరోనా కాలంలో సమయాన్ని సద్వినియోగం చేసుకునే మార్గంలో ఈ కఠినమైన పనిని చేసి చిత్రకళా రంగాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. వివిధ శాఖలకు చెందిన ప్రముఖుల చిత్రాలు వారివారి ఆత్మ ఉట్టిపడేటట్లు గీసి ఫేస్ బుక్ మాధ్యమంగా పెడుతూ అందరి దష్టినీ ఆకర్షిస్తున్నాడు. అబ్బురపరిచే రంగుల మిశ్రమంతో, అలరారే ముఖకవళికలతో, వ్యక్తిని కళ్ళ ముందు చూస్తున్నట్లు భావం కలిగేలా ఈ చిత్రాలు ఫేస్ బుక్ గోడలపై వచ్చి చేరడంతో ఆ చిత్రాలలోని వ్యక్తులను అవి ఆశ్చర్యపరుస్తున్నవి. ఓల్గా, అయినంపూడి శ్రీలక్ష్మి, డా. సూర్యా ధనంజయ, జూపాక సుభద్ర, వేముల గౌరి, పూర్ణీ కిషోర్ రెడ్డి ఎన్.గోపీ, డా. నందిని సిధారెడ్డి, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, కూరెళ్ళ విఠలాచార్య, అల్లం నారాయణ, బి.ఎస్ రాములు, మామిడి హరికష్ణ ఇలా ప్రముఖుల చిత్రాలు ఇప్పటి వరకూ 90 గీశాడు. మరికొన్ని రోజుల్లో 100 చిత్రాలు వేయడంతో అరుదైన రికార్డును కూరెళ్ళ శ్రీనివాస్ సాధించబోతున్నాడు. డిజిటల్ గ్రాఫిక్స్ మార్కెట్లోకి ప్రవేశించి అసలుసిసలైన ఆర్ట్ వర్క్‌ను కనుమరుగు చేస్తున్న తరుణంలో శ్రీనివాస్ ఇలా అచ్చమైన సంప్రదాయమైన నీటి రంగులతో చిత్రకళను ప్రదర్శించడం విశేషం.అసలుసిసలు రంగులకు ప్రాణం పోయడం సాహసం. ఇటువంటి ప్రభావ వంతమైన కషిపై సదస్సు నిర్వహించి, ప్రదర్శన చెయ్యాల్సిన అవసరమూ ఉన్నది. లాభాపేక్ష లేకుండా సమాజానికి ఉపయోగపడిన వారి చిత్రాలను వారికి కానుకగా ఇవ్వడం, వారిని చిత్రకళా వాహికగా మరోసారి కొత్తతరం వారికి స్ఫూర్తివంతంగా పరిచయం చేయడం తనకు తప్తినిచ్చే అంశమని శ్రీనివాస్ చెప్పడం వారి కళాత్మక సహదయతకు, నికార్సయిన క్రమశిక్షణకు, చిత్రకళపై గల అపారమైన గౌరవానికి, విలక్షణ వ్యక్తిత్వానికి నిదర్శనాలు.
- నర్రా ప్రవీణ్ రెడ్డి
ఉస్మానియా విశ్వవిద్యాలయం