Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకప్పుడు తమకు జన్మించిన బిడ్డలు తమ కండ్ల ఎదుటే ఉండాలని, తమతోనే జీవించాలని తల్లిదండ్రులు, బంధువులు భావించే వారు. కానీ ఆధునిక కాలంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.ఉపాధి కోసం యువతీయువకులు సప్త సముద్రాలు దాటి గాలిలో ఎగిరిపోతున్నారు. కొత్త ప్రాంతాల్లో, సరికొత్తదేశాల్లో ఎన్నో నూతన విషయాలను నేర్చుకుంటు న్నారు. తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటున్నారు. జీవన గతిని మార్చుకుంటున్నారు. ఇదొక నూతన ఒరవడి. దీనిని మనం ఆహ్వానించాలి. మార్పు మంచిదే. జీవన వికాసానికి తోడ్పడుతుంది. యాంత్రికమైన జీవితాన్ని మార్చివేసి కొత్త మార్గాల్లో నడిపిస్తుంది.
65 ఏండ్ల కిందట గ్రామీణ ప్రాంతాల్లోనే 95 శాతం మంది ప్రజలు జీవించేవారు. వందల ఏండ్ల వరకు వారి జీవన స్థితిగతులు ఏ మార్పు లేకండా యధావిధిగా ఉండిపోయాయి. న్యాయబద్ధంగా ఎంత కష్ట పడినా, ఎంత అన్వేషించినా తమ జీవితాలను మెరుగుపర్చుకో గల అవకాశాలు వారికి లభించ లేదు. ఫలితంగా తమ కర్మ ఇంతేననీ తమ ప్రయత్నంతో జీవితాలను మెరుగుపర్చుకోవడం అసాధ్యమనే నిర్ణయానికి వచ్చేవారు. జీవితంలో బాగుపడే అదృష్టం తమకు లేదని పరిమితులు విధించుకునేవారు. ప్రజలకున్న ఈ ఆలోచనా ధోరణి గత ఆరు దశాబ్దాలుగా పూర్తిగా మారిపోయింది. మన ఆలోచనలు, చొరవ, ప్రవర్తన పైనే మన జీవితం ఆధారపడి ఉంటుందనే విషయాన్ని అత్యధిక శాతం మంది ప్రజలు గుర్తించారు. వర్తమాన స్థితిగతుల సంక్షిప్త స్వరూపాన్నే కర్మగా అందరూ అభివర్ణిస్తున్నారనీ దీనిని సమూలంగా మార్చి వేయడం తమ చేతిలోనే ఉందనీ అందరికీ అవగతమవుతోంది. పుట్టుకతో సంక్రమించిన స్థితిగతుల్ని అవి నిర్దేశించే జీవన మార్గాన్ని కాలదన్ని, కోరిన జీవితాన్ని పొందడం తమ చేతలతోనే సాధ్యమని ప్రస్తుతం మెజార్టీ ప్రజలు అంగీకరి స్తున్నారు. కర్మ తమ 'విధి'ని నిర్ణయిస్తుందన్న గత కాలపు నమ్మకం క్రమంగా కనుమరుగవుతోంది. మనకు కావాల్సిందల్లా జీవితాన్ని మార్చుకు తీరాలన్న ఆకాంక్ష, ఉన్నతంగా మార్చుకో గలమన్న ఆత్మవిశ్వాసం. కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నది. అయితే మన దేశంలో ఇంకా మూఢ నమ్మకాలు, చేతబడులను ఇంకా నమ్మే ప్రజలున్నారు. కొన్ని సోషలిస్టు దేశాల్లో ప్రజలు తమ శ్రమను తప్ప ఇతర విషయాలను నమ్మడం లేదు. అలా నమ్ముతున్న క్యూబా లాంటి దేశాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. వైద్య రంగంలో ప్రపంచంలోనే క్యూబా ప్రసిద్ధి చెందింది. అనేక దేశాలకు వైద్య బృందాలను పంపిస్తోంది. మారుమూల గ్రామాల్లోని చదువు సంధ్యలు లేని యువతీయువకులు నగరాలకు వలసపోయి తమ జీవితాలను మార్చుకుంటున్నారు. హైదరాబాద్, న్యూఢిల్లీ, బెంగళూరు, చెన్నై తదితర నగరాలలో ఉపాధి కోసం అనేక పనులు చేసుకుంటున్నారు. ఉన్నత చదువులు చదువుకున్న వారు తమ జీవితాలను మార్చుకుంటున్నారు. మంత వినీల్ అనే యువకుడు కండ్ల పరీక్షల నిపుణుడు. ఆయన ఇటీవల ఆఫ్రికా ఖండంలోని సౌత్ సూడాన్ దేశంలోని జుబా అనే నగరంలో కొత్త ఉద్యోగంలో చేరాడు. తన జీవన గతిని మార్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఇదిలా ఉండగా ఒక సామాన్యమైన ప్రభుత్వ ఉద్యోగి. ఒక మామూలు వ్యాపారి, ఒక సాధారణ వృత్తిని చేపట్టిన వ్యక్తి తమ అడుగుజాడల్లో నడవాలని తమ పిల్లలకు చెప్పే స్థితిలో లేరు. గుర్తింపు, గౌరవం, ఉత్తేజం, ఔన్నత్యం లభించని సామాన్య పనులను ఎవరూ ఎంచుకోవడం లేదు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్నే దశాబ్దాల పర్యంతం అంటిపెట్టుకుని ఉండడం వంటి సూత్రాలు తమను యధావిధిగా మిగుల్చుతాయే తప్ప పురోగతికి అవకాశాలు కల్పించవని గుర్తిస్తున్నారు. కనీస స్థాయిలో జీవించ డానికి ఎవరూ సిద్ధంగా లేరు. జీవితం లో పైకి, పైపైకి ఎదిగే అవకాశాలను అన్వేషిస్తున్నారు.
కాగా ప్రతిభను ఎలా గుర్తిస్తు న్నారు? ఉదాహరణకు తెలుగు టీవీ ఛానళ్లు ఉత్తమ గాయకుల పోటీలు నిర్వహిస్తున్నాయి. ఆ పోటీల్లో విజయం సాధిస్తున్న వారిని పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన అంశాలు వెల్లడవుతు న్నాయి. అసమాన ప్రతిభ ఉండడం కంటే తమకున్న కొద్దిపాటి ప్రతిభను నిర్భయంగా, స్పష్టంగా వ్యక్తం చేయడం అతి ముఖ్యమని పోటీదారులు భావిస్తున్నారు. తమ పరిజ్ఞానాన్ని పెంచుకోవడం కంటే ఎదుటివారిని ఆకర్షించగల నైపుణ్యం, నేర్పు ఎంతో అవసరం. వినయంగా, భయం భయంగా ఉండటం కంటే ఆత్మ విశ్వాసంతో వ్యవహ రించడం ప్రధానమైన అంశంగా గుర్తిస్తున్నారు. ఈ ధోరణి అన్ని రంగాల్లోనూ దర్శనమిస్తోంది. అన్ని రకాల చతురతలను అలవర్చుకోవడమే కాదు, ఎప్పటి కప్పుడు పోటీలో నెగ్గుకు రావడం అతి కీలకమైన అంశంగా గుర్తిస్తున్నారు.అవగాహన, పరిజ్ఞానం, వివేకం, గత కాలంలో అందరూ ఆదరించిన అంశాలు. అందుకు భిన్నంగా చొరవ, ప్రయత్నం, కార్యాచరణ లతో నూతన అభివృద్ధి మార్గాల అన్వేషణ సాగుతోంది. ఇదే సమాజ పురోగతికి సంకేతం. మానసిక మార్పుకు దిక్సూచి.
- జి గంగాధర్ సిర్ప, 8919668843