Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2014 ఎన్నికల తర్వాత నుంచి మోడీ షా ద్వయం సంకీర్ణయుగం సమాప్తి అయిందన్న సందేశమిస్తు న్నారు. కానీ, కొలిజియన్ ప్రభుత్వం నడపటంలో ఉన్న సవా ళ్ళను ఆవిష్కరించినదే ''సంకీర్ణ సంవత్సరాలు 1996-2012'' పుస్తకం. కాంగ్రెస్‌లో 1964 నుంచి కొనసాగిన ఆయన పార్ల మెంట్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. బెంగాల్లో మారుమూల గ్రామంలోని పెక్కుటిల్లుతో మొదలైన తన జీవితం దేశంలోనే అత్యంత సువిశాలమైన అధికారిక నివాసం (రాష్ట్రపతి భవన్)లో గడిపే స్థాయికి ఎదిగిన తీరుతెన్నులు వివరించారు. చివరి వరకు ప్రధాని పదవికి ఆశపడి అవకాశం కోల్పోయానన్న నిరాశ తప్ప తనకంటూ జీవితంలో పెద్దగా అసంతప్తి ఏమి లేదన్నది ఆయన వివరణ.
పార్లమెంట్‌ని ప్రణబ్ ఎప్పుడూ గంగోత్రితో పోలుస్తారు. సుమారు 135 కోట్ల ప్రజల ఆకాంక్షలని పరిష్కరించే పవిత్ర వేదికగా అంటారు. అయితే, అది ఎప్పుడైతే అపవిత్రమవు తుందో... దాని విభాగాలన్నీ పవిత్రంగా ఉంటాయని మనం ఎంతమాత్రం ఆశించలేమంటారు. 2004 లోక్‌సభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ, తనకి వ్యక్తిగతంగా ప్రాముఖ్యత కల్గినవని చెప్పుకొచ్చారు. ఆ ఎన్నికల్లో మొదటిసారి పశ్చిమ బెంగాల్‌లోని జంగీపూర్ నుంచి లోక్‌సభ సభ్యుడు అయ్యాయని చెప్పారు. పార్టీ గెలిచిన తర్వాత ప్రధాని సోనియా అవుతారని అందరూ ఊహిస్తే, మేడం తన అంతర్వాహిని చెప్పిన ప్రకారం పదవి స్వీకరించనని చెప్పారన్నారు. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంలో ఆ తరుణంలో సోనియా, ఇతర నాయకులంటే కంటే కూడా అత్యధిక అనుభవం ఉన్న వ్యక్తి ప్రణబ్ ముఖర్జీయే. ఆయనే తదుపరి ప్రధాని అని ఇటు మీడియాలో అటు రాజకీయవర్గాల్లో చర్చ సాగింది. సోనియా మాత్రం మాజీ ఆర్థికమంత్రి మన్మోహన్ని ఎంపిక చేయడం ప్రణబ్‌కి అవమానంగా అనిపించిందట. తను ఆర్థికమంత్రిగా ఉండగా ఆర్బీఐ గవర్నర్ ఉన్న వ్యక్తి కింద మంత్రిగా ఉండటం ఏంటని అన్నారట. ఇదే విషయాన్ని ఆయన సోనియాకి చెప్పి తాను ప్రభుత్వంలో చేరనని నిట్టూర్చారు. ప్రణబ్‌జీ మీరే ఈ ప్రభుత్వంలో నెంబర్ 2 గా ఉంటారనీ, మన్మోహన్ ప్రధాని అయినప్పటికీ ప్రతి విషయానికి సంప్రదిస్తారని చెప్పడంతో చేరారట. ముఖ్యంగా ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి ప్రణబ్ ప్రత్యేకంగా రాశారు. చంద్రశేఖర్‌రావు తనకు ఏ మంత్రి పదవి ఇచ్చినా పర్వాలేదని కుండబద్దలు కొట్టినట్టు వివరించారట. కానీ, తన డిమాండుపై మాత్రం సానుకూలంగా స్పందించి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని చెప్పారట. అప్పుడే తెలంగాణ పట్ల కేసీఆర్ చిత్తశుధ్ధి ఏంటో అర్థం అయిందని స్పెషల్‌గా చెప్పారు. ఇక అమెరికాతో న్యూక్లియర్ డీల్ విషయంలో వామపక్షాలు తమ పార్టీ కేరళ రాష్ట్ర శాఖ నేతల ప్రభావంతో మొండిగా వ్యవహరించాయని దాదా అంచనా వేశారు. ఆ ఒప్పందం వల్ల ఎదురయ్యే లాభాలను వారు కనీసం పరిశీలించకుండా మంకుపట్టుతో ఉండటం తనకి ఇబ్బంది అనిపించిందన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. వేరే ఇతర అంశాల్లో తన కంటే సమర్థత కల్గిన నాయకులు ఉన్నప్పటికీ తనకే రాష్ట్రపతి గా అవకాశం రావడానికి విధేయత, క్రమశిక్షణే మాత్రమే కారణమంటారు ప్రణబ్. ఎందుకంటే, 2012 రాష్ట్రపతి ఎన్నికల్లో తన కంటే ముందు అప్పటి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ పేరుని సోనియా పరిశీలించారట. కానీ, దేశంలో హిందూత్వని సంఘటితం దిశగా బీజేపీ దూసుకెళ్ళడంతో అన్సారీని అధ్యక్ష పోరులో పెడితే మైనార్టీ సంతుష్టీకరణ అన్న పేరు వచ్చి రాజకీయంగా నష్టపోతామని భయంతో అన్సారీని ఆమె పోటీలో పెట్టలేదన్నారు. తనప వ్యతిరేకంగా నిలుచుకున్న పీఏ సంగ్మా కూడా తనకంటే అన్నివిధాల రాష్ట్రపతి పదవికి అర్హుడేనని, రాజకీయంగానూ సమర్థుడని చెప్పడం ఆశ్చర్యంగా అనిపించింది. వెనకబడిన ప్రాంతమైన ఈశాన్య రాష్ట్రం నుంచి సీనియర్ ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి, లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన గిరిజన నాయకుడిగా అవకాశం ఉన్నప్పటికీ ఆయన రాష్ట్రపతి కాలేకపోవడానికి గల కారణాన్ని ప్రణబ్ ఇక్కడ ప్రత్యేకంగా వివరించారు. 1999లో సోనియా గాంధీ విదేశీ మూలాలను అధికార బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఆమెని అధినేత స్థాయి నుంచి తగ్గించి కేవలం ప్రచారానికి వాడుకోవాలని సీనియర్ నేతలైన శరద్‌పవార్, తరీఖ్ అన్వార్ ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో వారికి పావుగా పీఏ సంగ్మా ఉపయోగపడ్డారట. ఆమెని రాజకీయంగా పక్కకి తప్పిస్తే పవార్ పార్టీ అధ్యక్షుడు అవుదామని ఈ ప్లాన్ రచించి ఉంటారని భావించారు. సంగ్మా నేరుగా సోనియా దగ్గరకి వెళ్ళి ''నీవు విదేశీ అన్న విషయంపై దేశమంతా వ్యతిరేకత వస్తుంది. పార్టీకి అది రాజకీయంగా నష్టదాయకమైన విషయం. అందుచేత పార్టీలో పక్కకి ఉంటే మంచింది'' అని చాలా పరుషంగా అన్నారట. దీంతో సోనియా ఎంతో మనోవేధనకి గురై, కన్నీటి పర్యంతం అయ్యారని ప్రణబ్ రాసుకొచ్చారు. ఈ దేశం కోసం తన అత్తమ్మ, భర్త ప్రాణాలు కోల్పోయినప్పటికీ తాను ఇంకా భారతీయతని నిరూపించు కోవాల్సి రావడం ఏంటీ దాదా అని ఆమె అడిగారట. కేవలం ఆమెకి ఇబ్బందికర పదాలు మాట్లాడాడన్న ఒకే ఒక్క కారణంతో ఈ దేశం ఒక గిరిజన వ్యక్తిని రాష్ట్రపతిగా చూడలేకపోయిందన్న విషయాన్ని వివరంగా చెప్పడం విశేషం. రాజకీయాల్లో హత్యలు ఉండవని... కేవలం ఆత్మహత్యలే ఉంటాయని పీఏ సంగ్మా ఉదంతం నిరూపించిందని దాదా వివరించారు.
- సాగర్ వనపర్తి, 9494041258