Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ సాయుధ పోరాటం 04.07.1946 కామ్రేడ్ దొడ్డి కొమరయ్య మరణంతో అగ్నికణం రాజుకుంది. 11 సెప్టెంబర్ 1946న తెలంగాణ సాయుధ పోరాటం ప్రకటించబడింది. 1951 అక్టోబర్ 20న సాయుధ పోరాటం ముగిస్తున్నట్టు కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది. భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 1947 ఆగస్టు 15న వచ్చింది. కానీ నైజాం ప్రాంతం 1948 సెప్టెంబర్ 17-19 తేదీలలో భారత దేశంలో విలీనం అయ్యింది. కాబట్టి సెప్టెంబర్ 17-18కి గల ప్రాముఖ్యత చర్చించే ముందు తెలంగాణ పూర్వ చరిత్ర భౌతిక పరిస్థితులు తెలుసుకోవడం అవసరం. అందువల్ల సెప్టెంబర్ 17 వరకు గల ఆదివారం సంచికలలో వరుసగా తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర 8 భాగాలుగా ముద్రించ బడుతుంది. మొదటి భాగం విడుదల చేస్తున్నాం.
తెలంగాణా వైశాల్యం
మొత్తం వైశాల్యం 82,698 చ.మైళ్ళు లేదా 5.30 కోట్ల ఎకరాలు తెలంగాణ ప్రాంతం, 50.4%, మరట్వాడా ప్రాంతం 28%, కన్నడ ప్రాంతం 21.4%గా ఉన్నారు. జనాభా వరుస వారీగా 54%, 26%, 20% ఉన్నారు.
తెలంగాణ మొత్తం గ్రామాల సంఖ్య 10,167, మరట్వాడా, కన్నడా ప్రాంతాల మొత్తం గ్రామాల సంఖ్య 12,290 ఉన్నాయి.
తెలంగాణా ప్రాంతంలో మొత్తం 10,167కు దివానీ ప్రాంతం గ్రామాలు 6,891 కాగా జాగీరు, సర్ఫేఖాస్ గ్రామాలు 3,276 ఉన్నాయి.
మరట్వాడా, కన్నడ ప్రాంతాలలో మొత్తం 12,290 గ్రామాలకు ఖాల్సా గ్రామాలు 7,070 కాగా సర్ఫేఖాస్, జాగీరు గ్రామాలు 5,120 వరకు ఉన్నాయి.
ఈ ప్రాంతంలో భూమి మూడు విధాలుగా ఉంది. 1) దివానీ లేక ఖాల్సా, 2) జాగీరు, 3) సర్ఫేఖాస్.
1) దివానీ లేక ఖాల్సా : ఇది రైతువారీ పట్టా ఇచ్చిన ప్రాంతం మూడు కోట్ల ఎకరాలకు పైగా ఉంది.
2) జాగీరు : జాగీర్దార్లు, సంస్థానాధిపతుల ఆధీనంలో గల భూమి. ఇది 1.5 కోట్ల ఎకరాలు ఉంది. జాగీర్లలో పారుగాలు, అల్తమాజాగీర్లు, జాత్జాగీర్లు, తనఖాజాగీర్లు ఉండేవి.
3) సర్ఫేఖాస్ : నైజాం ప్రభుత్వ సొంత ఆస్థిగా ఉన్న ప్రాంతం. ఇది 55 లక్షల ఎకరాలు ఉంది. రైతువారీ పట్టా (దివాని) భూమిలో 40% ఉంది.
1948 జూన్ 20న సర్పేఖాస్, జాగీరు ప్రాంతాలను రద్దు చేసి దివానీ ప్రాంతాలలో కలిపి వేశారు. సర్ఫేఖాస్ ప్రాంతం దాదాపు 8,000 చ.మైళ్ళ వైశాల్యం కలిగి 18 తాలూకాలు ఉన్నాయి. దీనితోపాటు 7 తాలూకాలు గల ఆత్రాప్బల్దా-హైదరాబాద్ జిల్లా నైజాం ఆస్థిగా ఉంది.
కౌలుదార్లు రెండు తరగతులు క్రింద విభజించబడ్డారు. 1) రక్షిత ఆసామీ సిక్మిలు, 2) సాధారణ ఆసామి సిక్మిలు
రక్షిత ఆసామీ సిక్మీగా పరిగణింప బడేందుకు అవసరమైన 6 ఏండ్ల కబ్జాకాలాన్ని ఈ క్రింది విధంగా లెక్కకట్టాలి.
అ) 1342-52 ఫస్లీల మధ్య వరుసగా 6 ఏండ్లు కాలం వుంటే దాన్ని లెక్కించుట సులభమే.
1354 ఫసలీ (1944) ఆసామీ సిక్మీచట్టం 1950వ సంవత్సరపు కౌలుదారీచట్టం అమలులోకి వచ్చాక రద్దుగావించబడింది. అయితే ఆసామీ సిక్మీస్ చట్టం క్రింద సంక్రమించిన హక్కులు మాత్రం రద్దుచేయబడలేదు.
1958 వ ఫసలీ(1948సం)లో జాగీర్లను రద్దుగావించి ఖాల్సా ప్రాంతాలలో కలిపేందుకు అప్పటి మిలిటరీ గవర్నరు జనరల్ చౌదరి ఒక వుత్తర్వును(రెగ్యులేషనును) గావిచాడు.
జాగీరు అంటే పాయెగా, సంస్థానం, జాగీరులోని భాగం, మఖ్తాపూర్తి గ్రామము, అగ్రహారం పూర్తిగ్రామము, వుమ్లీ, మొఖాసా(వీటన్నిటినీ ప్రభువుగాని లేక జాగీరుదారుగాని యినంగా యిచ్చివుండవచ్చు) అని అర్థం.
రైతుల నుండి అంతకు ముందు సాంప్రదాయంగా వసూలు గావిస్తూ వచ్చిన అన్ని అక్రమ పన్నులను, సెస్సులను వసూలు చేయరాదు.
కౌలుదార్ల నుండి చట్టబద్ధంగా నిర్ణయించిన కౌలురేటు తప్ప పారితోషకాలను పెంచుకోవడం కూడా నిషేధించ బడింది.
ఫ్యూడల్ దోపిడీగాండ్రకు చెందిన 10 లక్షల ఎకరాలను విప్లవ పంధాలో తెలంగాణా రైతులు పంచుకున్నారు.
ఫ్యూడల్ దోపిడీగాండ్లకు ఒక్క చిల్లిగవ్వ కూడా వసూలు అయ్యే పరిస్థితి పోయింది.
చౌదరి మిలిటరీ ప్రభుత్వం కూలిపోతున్న జాగీరుదారీ మున్నగు ఫ్యూడల్ దోపిడీ వ్యవస్థ రక్షణకు పూనుకోంది.
జాగీరు రద్దు వలన అధిక శిస్తులు చెల్లిస్తున్న రైతులకు శిస్తుభారం కూడ తగ్గలేదు.
ప్రభుత్వం నష్టపరిహారం కింద ప్రతియేటా ఒక కోటి 15 లక్షల రూపాయలు ముడుపు చెల్లించుకోవాలి. జాగీరుదార్ల రద్దు అన్న బూటకపు సంస్క రణ ద్వారా రైతులు చెల్లించే పన్నుల నుండి ప్రతి సంవ త్సరం జాగీరుదార్లు మున్నగు ఫ్యూడలు మున్నగు దోపిడీ గాండ్లకు హైదరాబాదు ప్రభుత్వం కోటి రూపాయలకు పైచిల్లర చెల్లించు తోంది. 1949 అక్టోబరు నుండి యి ముడుపు చెల్లించడం ప్రారంభమైంది.
భావుల క్రిందతప్ప తతిమా అన్ని కరాల తరిభూముల విషయం లో పండిన పంటలో మూడో వంతు కంటే ఎక్కువ కౌలురేటును భూస్వామి తీసుకోరాదు.
భావుల క్రింద తరి, తోట భూములకు ఖుష్కి భూములకు పండిన పంటలో నాలుగోవంతు కంటే కౌలురేటు అధికంగా వుండరాదు.
ఇంతకు ముందు ఏ ఓడంబడిక జరిగివున్నా అది రద్దు అవుతుంది.
కాంగ్రెస్ పథకంలో ముఖ్యాంశాలు
సంవత్సరానికి రు.3000/-ల నుండి రు.3600/-ల వరకూ, అంతకులోపు నికరాదాయం వచ్చే భూఖామందుల భూమిని ప్రభుత్వం ముట్టుకోరాదు.
దాదాపు 480 మణుగుల వడ్లుగాని, తత్తుల్యమైన ఇతర ధాన్యాలు, పంట సరుకులు పండాల్సి వుంటుంది. రెండు పంటలు పండే 16 ఎకరాలు తరి భూమిలోగాని లేదా ఒకే పంటపండే 24 ఎకరాల తరి భూమిలోగాని వస్తుందని ప్రభుత్వం అంచనా.
5 ఎకరాల చెల్కాభూమి ఒకపంట పండే ఒక ఎకరం తరి భూమికి సమానం అని అంచనా.
రెండు పంటలుపండే తరి భూమి అయితే 6 ఎకరాల 16 గుంటలు, ఒకపంటపండే తరిభూమి అయితే 10 ఎకరాలు, చెల్కాభూమి అయితే 50ఎకరాలు.
ఈత, తాడి, విప్పచెట్లపై హక్కును మాత్రం ప్రభుత్వం అట్టిపెట్టుకొంది. ఆ చెట్లపై పట్టా రైతులు నరకడంగాని, గీతగీయడంగానిచేయరాదు. విప్ప చెట్టు పువ్వుఅమ్ముకోరాదు. ఆ పువ్వును సారా చేసుకోరాదు.
మామ్లాపట్టిన ముస్తాజరు పట్టాదారుకు మాలిఖానా అనబడే మొదళ్ళపన్ను చెల్లించాలి.
ప్రభుత్వ అనాక్రమిత భూముల క్రిందకు ఈ క్రింద పేర్కొన్న భూములు వస్తాయి:
అ) పోరంబోకు, బంచరాయి (గైరాన్) భూములు
ఆ) గ్రామకంఠాలు(గైవుటాన్)
ఇ) ఖార్జిఖాతా భూములు(విడుదల పెట్టిన భూములు)
ఈ) చెరువులోతట్టు భూములు(సికంతలాబ్)
ఉ) నదీలంకలు
ఊ) ప్రభుత్వం క్రింద వున్న ఇతర భూములు
ఖాల్సా గ్రామాలలోనే ఈ విధంగా వున్నప్పుడు ఇక జాగీరు, ఇనాం, మక్తామున్నగు ఖాల్సాగాని ప్రాంతాల రైతుల దుర్బర పరిస్థితిగూర్చి చెప్పనవరంలేదు. ఆ ప్రాంతాలలో రైతులు ఏ హక్కులులేని ఉత్త కౌలుదారులుగానే యిటీవల వరకు పరిగణించబడుతూ వచ్చారు. 1317వ ఫసలీలో (1907) ల్యాండు రెవెన్యూ చట్టం అమలులోకి వచ్చినా అది జాగీరు ప్రాంతాలకు సంబంధించినంత వరకు 1355వ ఫసలీ (1945) వరకు అమలులోకి రాలేదు. ఆ ఫసలీలోనే జాగీరుప్రాంతాలలో సర్వే, సెటిల్మెంట్లు(బందోబస్తు) తప్పనిసరిగా చేయబడాలని శిసించడం జరిగింది. అయినా 1949 వరకూ గూడ ఇంకా దాదాపు 1200 జాగీరు గ్రామాలలో బందోబస్తు జరగనేలేదు. అందుచేత 1317వ ఫసలీకి(1907) పూర్వం ఖాల్సా ప్రాంతాలుకాని జాగీరు మున్నగు ప్రాంతాలలో రైతుల నుండి వసూలుగావించబడే శిస్తు వాస్తవానికి భూమిశిస్తు కానేకాదు. జాగీరుదారు, యినాందార్ల దయా దాక్షిణ్యాలపై ఆధారపడి నిర్ణయించబడే కౌలురేట్లు. 1317వ ఫసలీ (1907) ల్యాండు రెవెన్యూచట్టం తర్వాత గూడ అదే పరిస్థితి చాలవరకు కొనసాగింది.
బందోబస్తు చేయడంలోగాని లేక శిస్తు మదింపులో గాని లెక్కల పొరపాట్లు లేక వ్రాతపొరపాట్లు ఏవైనా వుంటే వాటిని సరిచేసుకోవడానికి భూఖామందులకు బందోబస్తు అయ్యాక రెండేళ్ళవరకు వ్యవధి వుంటుంది. ఈ వ్యవధిలోపల ఆయా జిల్లా కలెక్టర్లకు అవసరమున్న భూఖామందులు దరఖాస్తు చేసుకోవచ్చును.
పాతిన రాళ్ళను పీకిపారేయడంగాని లేక వున్నచోటునుండి మరోచోటికి మార్చడంగాని చేయడం చట్టవిరుద్ధం. అలా జరిగితే భూఖామందుల నుండి రాతి ఖరీదుకు నాలుగురెట్లు జరిమాన విధించుతారు.
శిస్తు రిమీషన్లకోసం దరఖాస్తు చేసుకొనేవిధానం : శిస్తురిమీషనులకై దరఖాస్తులన్నీ తహశీలుదారుకుగాని లేక నాయబ్ తహశీలు దారుకుగాని పెట్టుకోవాలి. స్టాంపుబిళ్ళలు అతికించినవసరంలేదు. ఉత్తర తెల్లకాగితంపై వ్రాతపూర్వకమైన దరఖాస్తు ఇచ్చుకోవాలి. ఆబీ పంట విషయంలో అయితే దరఖాస్తును నవంబరు 22వ తేదీలోపలనూ, తాబి పంట విషయంలో అయితే ఏప్రిల్ 15వ తేదీలోపలను పెట్టుకోవాలి. ఆ తేదీలు దాటితే రిమీషను దరఖాస్తులు తీసుకోబడవు.
ఆయకట్టు నిర్ణయించడమంటే ప్రభుత్వం నీటిపారుదల వనరులను సప్లయిగాబడే నీటివలన సాగుఅయ్యే భూమి యింత అని నిర్ధారణ చేయడం. ఉదాహరణకు ఏదైనా ఖుష్కి భూమి ఆయకట్టులో చేర్చబడిందంటే అర్థం ఆ ఖుష్కి భూమికి యిక ముందునుండి ప్రభుత్వ నీటి సప్లయి వుంటుదన్న మాట. అందుకోసం తరిరేటు విధించబడుతుందన్నమాట.
1867లో సాలర్జంగ్ భూమి పన్నులలో మార్పులు తెచ్చాడు. కౌలు గుత్తా పద్ధతి తీసివేసి భూములు కొలిపించి బందబస్తు చేసి పనులు ఏర్పాటు చేశాడు. తాలుక దారులు వ్యతిరేకించారు. రెండు ఎద్దులు సేద్యగాని నుండి 5 నుండి 10 రూపాయల వరకు 4 ఎద్దుల వారికి 10 నుండి 20 రూపాయల వరకు ఇదే పద్ధతిలో వసూలు చేశారు.
ప్రజలలో ప్రతి కుటుంబంపైన ఏదో ఒక పన్ను చెల్లించాలి. పన్నులు చెల్లించలేక చాలా మంది గ్రామాలు వదిలి పారిపోతే వారిని పట్టుకవచ్చి హింసించి, పన్నులు వసూలు చేసే వారు.
నాటి తెలంగాణలో ప్రజలపై పన్నులు
ధన్గర్ పట్టి (గొల్ల వారిపై)
దేడ్ పట్టి (మాల మాదుగులపై)
షాది పట్టి (పెండ్లిలపై)
చర్మ పట్టి (తొళ్ళపై)
బొయిపట్టి (బొయిలమీదా)
హాట్ బజారీ (మార్కెట్లమీదా)
కలాల్ పట్టి (కల్లు దుకాణాలమీదా)
జూలాహ పట్టి (సాలే వాళ్ళపైనా)
దారపట్టి (లోకల్ ఫండ్ వంటిది)
రహదారీ (త్రోవ పట్టి)
ఫారల పట్టి (గడ్డి సప్లరుకి గానూ)
బట్ట్ సబ్జీ (కూరాగాయల అమ్మకంకు)
భాన్సూ పరోసి (బొంగులు అమ్ముకున్నందుకు)
మజ్గూరి పట్టి (కూలీల మీదా)
రెడ్డి రుసుం (రెడ్డిగారికి చెల్లించేది)
దపన్ (పీనుగులను పూడ్చినందుకు)
తైలీపాన్ పట్టి (నూనె, తమల పాకులు)
మచిలీ పట్టి (బెస్తావారిమీదా)
కుంబాల పట్టి (కుమ్మరివారీ మీదా)
భైంస్ పట్టి (దున్నపోతులు ఉంచుకున్న వారిపై)
ఆదాం పట్టి (హిందూ శిల్ప కళాకారుల మీదా)
మేహధర్పా (ఇంటి పన్ను)
సఫర్ పట్టి (జమీందార్ గారి దౌర)
- సారంపల్లి మల్లారెడ్డి, 9490098666