Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతీయ చలనచిత్ర రంగంలో తొలి ''మహిళా సూపర్ స్టార్'' గా గుర్తింపు పొందిన వైజయంతీమాల వెండితెర నటిగా, ఇండియన్ క్లాసికల్ డాన్సర్‌గా, కర్ణాటక గాయనిగా, గోల్ఫ్ క్రీడాకారిణిగా, రాజకీయ నాయకురాలిగా రాణించింది. 1950లో తెలుగు సినిమా 'జీవితం', తమిళ సినిమా 'వాజ్ కారు' చిత్రాలతో సినీ రంగ ప్రవేశం చేసిన వైజయంతీమాల అనతరం దక్షిణాది నుండి బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన తొలినటి. ఆమె బాలీవుడ్లో టాప్ స్టార్‌గా, ఇటు క్లాసికల్ డాన్స్ ఆర్టిస్ట్‌గా తనదైన ముద్ర వేసింది.
వైజయంతీమాల 1933 ఆగస్టు 13న మద్రాసు ట్రిప్లికేన్‌లో తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబంలో 'ఎమ్. డి. రామన్, వసుంధరా దేవి' దంపతులకు జన్మించింది. తల్లి వసుంధరాదేవి 1940వ దశకంలో తమిళ చిత్రసీమలో ప్రముఖ నటి. అమ్మమ్మ 'యాదుగిరి దేవి' దగ్గర పెరిగిన వైజయంతీ మాల ఐదేళ్ల వయసులోనే పోప్ పీయస్ కోసం శాస్త్రీయ భారతీయ నత్యం చేయడానికి ఎంపికయ్యారు. ఆమె గురు 'రామయ్య పిళ్ళై' నుండి భరతనాట్యం, 'మనక్కల్ శివరాజ అయ్యర్' నుండి కర్ణాటక సంగీతం నేర్చుకున్న వైజయంతీ 13 సంవత్సరాల వయస్సులో ఆరంగేట్రం చేసి తమిళనాడులో నాట్య ప్రదర్శనలు ఇచ్చింది.
1950లో సినీరంగ ప్రవేశం
వైజయంతిమాల 1950లో తన 16వ ఏట తమిళ సినిమా 'వాజ్కారు' తో సినీరంగ ప్రవేశం చేసింది. దర్శకుడు ఎం.వి. రామన్ 'వాజ్కారు' సినిమాకి కొత్త నటి కోసం వెతుకుతు న్నప్పుడు, చెన్నైలోని గోఖలే హాల్లో వైజయంతిమాల భరత నాట్యం చేయడం చూసి, తన సినిమాలో నటింప చేయాలని అనుకుని వెంటనే ఆమె అమ్మమ్మను కలసి ఒప్పించేందుకు ప్రయత్నించాడు. అయితే ఆమె వైజయంతి సినిమాల్లో నటించడానికి వయసు చాలా చిన్నదని, చదువు ఆగిపోతుందని నిరాకరించినా, దర్శకులు ఒప్పించి నటింపచేశారు. ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధిం చింది. దాంతో ఒక సంవత్సరం తర్వాత 'జీవితం' అనే పేరుతో ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశారు. ఈ చిత్రం విడుదలైన తర్వాత గొప్ప విజయాన్ని సాధించింది. వైజయంతి మాల 1950లో 'విజయకుమారి' చిత్రంలో అతిథి పాత్రలో నటించింది. ఇందులో వేదాంతం రాఘవయ్య కొరియో గ్రఫీ చేసిన ''లాలు.. లాలు... లాలు'' పాట కోసం నత్యం చేసింది. ఈ చిత్రం వాణిజ్యపరంగా విజయవంతం కానప్పటికీ, ఆమె నత్యం ప్రజాదరణ పొందింది.
అయితే 1951లో 'వాజ్కారు' చిత్రాన్ని హిందీలో 'బహార్' పేరుతో రీమేక్ చేయగా బాక్స్ ఆఫీస్ హిట్ సాధించి బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన ఆరో చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం కోసం వైజయంతి హిందీ ప్రచారసభలో హిందీని నేర్చుకుని, ఈ చిత్రంలో తన పాత్ర కోసం ఆమె స్వరాన్ని డబ్ చేసింది. 'వాజ్కారు' చిత్రం మూడు భాషలలో ఆమె తొలి చిత్రాల విజయం తరువాత, వైజయంతిమాల మళ్లీ బహుభాషా చిత్రంలో నటించారు. 'సంఘం' తెలుగు, తమిళ చిత్రాలలో ఎన్ టి రామారావు, వైజయంతిమాల, ఎస్. బాలచంద్రన్, అంజలీ దేవి ప్రధాన పాత్రలో విడుదలయ్యారు. ఈ తమిళ, తెలుగు చిత్రాలు దక్షిణ భారతదేశం అంతటా ఘన విజయాలు సాధించాయి. కాగా ఈ చిత్రం హిందీలో 'లడ్కీ'గా రీమేక్ చేయ బడింది. 1953లో వచ్చిన ''స్త్రీవాద టాంబోరు వైజయంతి మాల హిస్ట్రియోనికల్''. ఈ చిత్రం అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ చిత్రంగా నిలిచింది. 1954లో వైజయంతిమాల ప్రదీప్ కుమార్‌తో కలిసి 'నాగిన్' చిత్రంలో నటించారు. ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొంది బ్లాక్‌బస్టర్‌గా నిలచింది. నాగిన్ చిత్రం దేశవ్యాప్తంగా విజయం సాధించి వైజయంతిమాలను బాలీవుడ్ లో ప్రముఖ నటీమణులలో ఒకరిగా నిలబెట్టింది. ఇదే సంవత్సరంలో 'మిస్ మాలా' లో నటించింది. 1955లో వచ్చిన 'దేవదాస్' విమర్శనాత్మక విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో దిలీప్‌కుమార్ సరసన చంద్రముఖి పాత్రలో నటించిన వైజయంతిమాలకు గొప్ప ప్రశంశలు లబించాయి. దేవదాస్ హిట్ సాధించిన తరువాత వైజయంతీమాల 1956లో విజయ వంతమైన సినిమాలలో నటించారు, ప్రదీప్‌కుమార్‌తో మూడు సినిమాల్లో, సునీల్ దత్తో 'కిస్మత్ కా ఖేల్'తో పాటు 'మర్మ వీరన్' అనే తమిళ చిత్రం చేసింది. ఈ చిత్రంలో ఎన్.టి రామారావు, శివాజీ గణేషన్, జెమిని గణేషన్ వంటి దక్షిణ భారతదేశంలో స్థిరపడిన నటులు అతిథి పాత్రలో నటించారు. 1957లో దిలీప్ కుమార్ హీరోగా నటించిన 'నయా దౌర్' చిత్రం 1957లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ చిత్రంగా నిలిచింది. విమర్శకుల ప్రశంసలు పొందిన మదర్ ఇండియా తర్వాత రెండవ స్థానంలో నిలిచింది. 'తుమ్ సె నహి దేఖా' చిత్రంతో పాటు కామెడీ ఫిల్మ్ 'ఆశా' మొదలైన చిత్రాల్లో నటించింది. 1958లో 'సాధన', 'మధుమతి' చిత్రాలు విజయం సాదించాయి.
1960లో, వైజయంతిమాల పరిశ్రమతో సన్నిహితంగా ఉండటానికి ఎక్కువగా తమిళ చిత్రాలపై దష్టి పెట్టారు. మర్మా వీరన్, రాజా శక్తి, పార్థిబన్ కనవు, 1960లో క్రైమ్ డ్రామా చిత్రం 'గంగా జుమ్నా'లో వైజయంతి మాల నటించిన పాత్రకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందు కుంది. 1964లో వచ్చిన శంగార చిత్రం 'సంగం' ఆమెకు మళ్లీ ఫిల్మ్‌ఫేర్ అవార్డు తీసుకువచ్చింది. ఆమె తరువాత వైశాలి, ఆమ్రపాలి చిత్రాలలో నటించింది. ఆమ్రపాలిలో ఆమె నటనకు ప్రశంసలు అందు కుంది. ఆమె తర్వాత 1966లో విజయవంతమైన 'సూరజ్', 1967లో జ్యువెల్ థీఫ్, హేటీ బజారే 1968లో 'ప్యార్ హి ప్యార్', సుంఘుర్ష్, 1969లో 'గన్వార్', ప్రిన్స్ చిత్రాలలో నటించింది.
వివాహం తర్వాత నటనకు గుడ్ బై
వైజయంతిమాల ఢిల్లీకి చెందిన పంజాబీ హిందూ 'చమన్ లాల్ బాలి' ని వివాహం చేసుకున్నారు. తర్వాత నటన వదులుకుని 1968లో చెన్నైకి వెళ్లిపోయి 'అన్నాసలై' లో నివాసం ఏర్పర్చుకున్నారు. అయితే, 1968-1970 మధ్య, తన వివాహానికి ముందు సంతకం చేసిన సినిమాలైన 'ప్యార్ హి ప్యార్', 'ప్రిన్స్', 'గన్వార్' చిత్రాల కోసం ఆమె షూటింగ్లలో పాల్గొంది. అనంతరం భారతీయ శాస్త్రీయ నత్య రూపమైన భరత నాట్యంలో విశేష కషి చేసింది. ఇందుకుగాను వైజయంతిమాల సంగీత నాటక అకాడమీ పురస్కారం అందుకుంది. ఈ దంపతులకు 'సుచీంద్ర బాలి' అనే కుమారుడు ఉన్నాడు. 2007లో వైజయంతిమాల రచయిత్రి 'జ్యోతి సబర్వాల్' తో కలసి తన ఆత్మకథను 'బాండింగ్' పేరుతో ప్రచురించింది.
వివాదాలు
వైజయంతి మాల నటిగా రాణిస్తున్న సమయంలో అనేక వివాదాలకు గురైంది. ప్రత్యేకించి సహనటులతో ఆమెకి ఎఫైర్స్ ఉన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. దిలీప్ కుమార్‌తో ఎక్కువ చిత్రాలలో నటించడం వారి మధ్య తెరపై కెమిస్ట్రీ బాగా కుదరడం ఈ ప్రచారానికి కలసి వచ్చింది. నటుడు రాజ్ కపూర్ సంగమం సినిమా చిత్రీకరణ పూర్తి కావడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది. ఈ సమయంలో వైజయంతిమాల రాజ్‌కపూర్‌తో ప్రేమాయణం సాగించి దాదాపు అతడిని వివాహం చేసుకున్నట్లు చెబుతారు. దీంతో అతన్ని దూరంగా ఉంచింది. తన ఆత్మకథలో రాజ్‌కపూర్‌తో లింక్ చేయడం ఉత్తర భారతదేశంలోని వార్తాపత్రికల పబ్లిసిటీ స్టంట్ అని తను అతనితో ఎలాంటి సంబంధాలు పెట్టుకోలేదని పేర్కొంది.
నర్తకిగా..
వైజయంతీమాల భారతీయ సినిమాలలో నత్యానికి కొత్త దిశను, అర్థాన్ని ఇచ్చారు. ఆమె సినిమాల్లోకి వచ్చాక హీరోయిన్స్ కు డాన్స్ అనివార్యమయ్యింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు విజయవతమైన సినిమాల్లో నటించి తన అద్భుతమైన నత్యాలతో తెరను పరిపాలించారు. ఆమె శాస్త్రీయ నత్య రూపానికి అపూర్వమైన ప్రోత్సాహాన్నిచ్చింది. కొంతకాలం ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించింది. ఇప్పుడు వైజయంతిమాల భరత నాట్యంలో మునిగిపోయారు, మరచిపోయిన ఆలయ కళా రూపాలపై పరిశోధనలు చేస్తుంది. వైజయంతీమాల సినిమా ల్లోనే కాకుండా దేశ, అంతర్జాతీయ వేదికలపై ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది. ఆమె భరతనాట్యంలో చేసిన కషికి సంగీత నాటక అకాడమీ అవార్డు పురస్కారాన్ని అందించింది. సినిమాల నుండి రిటైర్ అయ్యాక బాహారత దేశంతో పాటు పలు ప్రపంచ వేదికలపై భరత నాట్య ప్రదర్శనలిచి అనేక అవరదలు సత్కారాలు అందుకున్నారు. వైజయంతీమాల గాయనిగా సైతం రాణించారు. గోల్ఫ్ క్రీడాకారిణిగా ఈ ఆటపై పట్టు సాదించడం విశేషం.
రాజకీయాల్లో..
1984లో తమిళనాడు సాధారణ ఎన్నికలలో దక్షిణ చెన్నై నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. 1989 ఎన్నికలలో సైతం గెలుపొందారు. అనం తరం 1993లో పార్లమెంట్లో రాజ్య సభకు ఎంపికయ్యారు. అయితే 1999లో కాంగ్రెస్ పార్టీకి రాజీ నామా చేసి బిజెపీలో చేరారు.
పురస్కారాలు
వైజయంతీమాల సినీ నటిగా, భరత నాట్య నర్తకిగా సాధించిన విజయాలకి గౌరవాలు, పురస్కారాలు అందుకున్నారు. సినిమాలో నటించడమే కాకుండా అప్పుడప్పుడు భారతదేశంతో పాటు విదేశాలలో తన నత్య ప్రదర్శనలు ఇస్తుండేవారు.
1950లో ఫిల్మ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అవార్డులో ఉత్తమ తమిళ నటి అవార్డు గెలుచుకుంది.
1956, 58, 61, 64లలో నాలుగు సార్లు వైజయంతిమాల ఉత్తమనటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు.
1968లో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని ప్రదానం చేసింది.
1979 లో తమిళనాడు ప్రభుత్వం కళైమామణి పురస్కార తో సత్కరించింది
1982 - భరతనాట్యంలో జీవితకాల సాఫల్యానికి సంగీత నాటక అకాడమీ అవార్డు పురస్కారాన్ని అందించింది.
1995 - అన్నామలై యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ పొందింది.
1996లో ఫిల్మ్‌ఫేర్ జీవిత సాపల్య పురస్కారం అందుకున్నారు.
2005లో బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అవార్డులు రెండు సార్లు అందుకున్నారు.
2006లో వైజయంతిమాల భారతీయ వినోద పరిశ్రమకు ఆమె చేసిన విశేష కషికి గుర్తింపుగా ఫెడరేషన్ నుండి లివింగ్ లెజెండ్ అవార్డును అందుకుంది.
2008లో అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అవార్డు లభించింది.
2013లో స్టార్‌డస్ట్ ప్రైడ్ ఆఫ్ ఫిల్మ్ ఇండిస్టీ అవార్డుతో సత్కరించారు.
వైజయంతిమాలను ప్రపంచవ్యాప్తంగా వివిధ చలన చిత్రోత్సవాలలో సత్కరించడంతో పాటు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది.
వైజయంతీమాల 1954లో నటించిన 'నాగిన్' చిత్రం, 1956లో 'తాజ్', 1957లో 'నయాదౌర్', 1958లో 'మధుమతి' 1961లో 'గంగా జమున', 1964లో 'సంగం', 1967లో 'జ్యువెల్ థిఫ్' 1969లో 'ప్యార్ హి ప్యార్' 1995లో ఆమె చంద్రముఖి పాత్రలో నటించిన 'దేవదాస్' తో పాటు పలు చిత్రాలు ఆమె సినీ కెరీర్లో హైలైట్‌గా నిలిచి, కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టాయి.
- పొన్నం రవిచంద్ర, 9440077499.
సీనియర్ జర్నలిస్టు, సినీ విమర్శకులు