Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డా.బెల్లి యాదయ్య, 98483 92690
"Education means the ability to think independently and creatively, and development of skill of applying oneµs knowledge in dealing with the people and situations in real world"
- Oliver DeMille, Founder of TJEd.
ఏదైనా ఒక పనిని ఇతరుల కంటే భిన్నంగా సమర్థ వంతంగా నిర్వహించడాన్ని 'నైపుణ్యం' అంటాం. ఒక్కో వ్యక్తికి ఒక్కో నైపుణ్యం ఉంటుంది. కొంతమందికి బహు నైపుణ్యాలు కూడా ఉంటాయి. సామర్థ్యానికి నాణ్యతకు అనుభవానికి ఆలవాలమైన బహు నైపుణ్యాలనే 'నైపుణ్య సముదాయం (స్కిల్ సెట్)' అంటారు. వత్తి, ఉద్యోగ, వ్యవస్థాపనా రంగాల్లో నైపుణ్య సముదాయం కలవారికే ఇవాళ ప్రాధాన్యత ఉంది. సామాజిక పరిణామ క్రమంలో ఏ యుగానికి ఆ యుగపు జీవన విధానం, తదనుగుణ నైపుణ్యాలు ఉంటాయి. అంటే గణ వ్యవస్థలో, రాజరిక వ్యవస్థలో, భూస్వామ్య వ్యవస్థలో, వలస వాద వ్యవస్థలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకే నైపుణ్యాలు చెల్లుబాటు కావు. కాలీనమైన నైపుణ్యాలే మనకు కనిపిస్తాయి. యాజమాన్య శాస్త్ర (మేనేజ్మెంట్) పరిభాషలో స్వయంచలన యుగం (ఏజ్ ఆట్ ఆటోమేషన్) అని సంబోధించబడుతున్న ప్రస్తుత 21వ శతాబ్దంలో వర్తమాన పరిస్థితులకు అనువైన 'నైపుణ్య సముదాయ' కల్పనే ఉన్నత విద్య ప్రధాన లక్ష్యం. మన దేశంలో యువతీ యువకులందరూ చదివిన లేదా చదువుతున్న కోర్సు, సంస్థ ఏదైనప్పటికీ నైపుణ్యాల కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్నారని కాలిఫోర్నియాకు చెందిన కోర్సియా సంస్థ వెలువరించిన గ్లోబల్ స్కిల్ రిపోర్ట్-2021 ద్వారా బహిర్గత మవుతోంది. గ్లోబల్ స్కిల్ రిపోర్ట్-2021లో మనదేశానిది 67వ స్థానం. ఈ కొరతను తీర్చి యువజనులకు ఇరవై ఒకటో శతాబ్దపు నైపుణ్యాలను అందించడమే నూతన విద్యా విధానం-2020 ధ్యేయమని నూతన విద్యా విధాన ముసాయిదా అధ్యక్షులు ఆచార్య కె. కస్తూరి రంగన్ ముసాయిదా సమర్పణలో తెలిపారు. విలువలతో కూడిన విద్య, ప్రావీణ్యంతో కూడిన విద్య రెండిటిపై మేధోమథనం జరుగుతున్న నేపథ్యంలో ఇరవై ఒకటో శతాబ్దపు నైపుణ్యాలను గురించి విద్యార్థూలూ ఉపాధ్యాయులూ తల్లిదండ్రులూ యాజమాన్యాలిప్పుడు కూలంకషంగా తెలుసు కోవాల్సి వుంది.
ఇరవైఒకటో శతాబ్దపు నైపుణ్యాలను పార్ట్నర్షిప్ ఫర్ ట్వంటీఫస్ట్ సెంచరీ (ూ21) లెర్నింగ్ నెట్ వర్క్ తన 'ఫ్రేం వర్క్ ఫర్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ లెర్నింగ్' లో సవివరంగా ప్రస్తావించింది. వ్యక్తి సముపార్జించే విజ్ఞానం, పని అలవాట్లు, వ్యక్తి గుణశీలాల విశాలత ప్రాతిపదికగా ఇరవై ఒకటో శతాబ్దపు నైపుణ్యాలు నిర్వచించబడ్డాయి. ఇవి 1.లెర్నింగ్ స్కిల్స్ 2.లిటరరీ స్కిల్స్ 3.లైఫ్ స్కిల్స్ అనే మూడు ప్రధాన విభాగాలుగా పేర్కొనబడ్డాయి. మొదటి విభాగం 'లెర్నింగ్ స్కిల్స్' లో - క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటి, కొలాబరేషన్, కమ్యూనికేషన్ అని విడివిడిగా చర్చించబడ్డాయి. వీటినే 'సి-4' అని కూడా అంటారు.
రెండో విభాగం 'లిటరరీ స్కిల్స్'లో- ఇన్ఫర్మేషన్ లిటరసీ, మీడియా లిటరసీ, టెక్నాలజీ లిటరసీ అనే ఉప విభాగాలు ఉన్నాయి. మూడో విభాగం 'లైఫ్ స్కిల్స్'లో-ఫ్లెక్సిబిలిటీ, లీడర్ షిప్, ఇన్షియేటివ్, ప్రొడక్టివిటీ, సోషల్ స్కిల్స్ అనే అంశాలతో అన్ని విభాగాలు కలిపి మొత్తం 'పన్నెండు నైపుణ్యాలు' ఇరవై ఒకటో శతాబ్దపు యువతకు అవసరమవుతున్నాయి. ప్రపంచీకరణలో భాగంగా విద్య లోపల ఆధునిక నైపుణ్యాల చర్చ ప్రారంభమయ్యింది. ఈ చర్చను గమనంలో ఉంచుకొనే భవిష్యత్తరాల ఉపాధి సుస్థిరతల కోసం భారత ప్రభుత్వం 2008లో జాతీయ నైపుణ్యాభివద్ధి సంస్థను నెలకొల్పింది. క్రియేట్ (సష్టించు), ఫండ్ (సమకూర్చు), ఎనేబుల్ (ప్రసరించు) అనేవి మన జాతీయ నైపుణ్యాభివద్ధి సంస్థ నినాదాలు. 2014 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా 'తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)' ను ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ మాటల్లో చెప్పాల్సి వస్తే ''నైపుణ్యాభివద్ధికి మనం ఎంతో ప్రాముఖ్యతను ఇవ్వాల్సి వుంది. ఎందుకంటే, నిరుద్యోగాన్ని రూపుమాపగలిగేది నైపుణ్యాభివద్ధి ఒక్కటి మాత్రమే''.
కేంద్ర మాజీ మానవ వనరుల అభివద్ధి శాఖా మంత్రి (2012-14) పల్లంరాజు జాతీయ నైపుణ్యాభివద్ధి సంస్థ పనితీరును సమీక్షిస్తూ ''2022కల్లా దేశంలో యాభై కోట్ల మందిని నైపుణ్యవంత వర్క్ ఫోర్స్‌గా రూపొందించడమే లక్ష్యమని'' అప్పట్లో చెప్పారు. జాతీయ నైపుణ్యాభివద్ధి సంస్థ స్థాపించిన నాటి యుపిఏ ప్రభుత్వ నిర్దేశిత కాలానికి మనం ఇప్పుడు ఆరుమాసాల దూరంలో ఉన్నాం. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేక పోయాం. ఇదిట్లా ఉంటే యాడాదిన్నర కాలంగా విద్యా రంగాన్ని సైతం కోవిడ్ పట్టి పీడిస్తుంది. ఆశావాద దక్పథమే అన్నింటికీ మందు. అడ్డంకులను అధిగమిస్తూనే 'యోచన(థింక్), ఆచరణ(యాక్ట్)' నైపుణ్య సముదాయాలతో విద్యా సంస్థలు యువతను తీర్చిదిద్దవలసి వుంది. విషయ బోధన ఒక్క దానికే కాదు విద్యార్థుల భవిష్యత్తుకు కూడా తమదే బాధ్యత అని అధ్యాపకులు అనుకున్నప్పుడు స్కిల్ సెట్‌కు పునాది పడగలదు. ముఖ్యంగా సంస్థ పరంగా చూసినప్పుడు విద్యార్థులను అధ్యాపకులను 'నాణ్యతా బందాలు (క్వాలిటి సర్కిల్స్)'గా ఏర్పరచి నడిపించే విద్యాధికారుల పాలనా దక్షత మూలంగా నైపుణ్యాల కల్పన విజయవంతం కాగలదు.
లెర్నింగ్ స్కిల్స్‌ను తెలుగులో అభ్యసన నైపుణ్యాలు అంటారు. సూక్ష్మ పరిశీలనా దష్టి, సజనాత్మకత, అభివ్యక్తీకరణ, సహభాగిత్వం అనే ఈ నైపుణ్యాలు అధ్యాపకుల ద్వారా అధ్యాయాల బోధనలో భాగంగా విద్యార్థులకు అందవలసి వుంది. విద్యార్జనలో ఈ 'సి4' అతికీలకమైనవి. ఇవే విద్యార్థి ప్రతిభా సామర్థ్యాలకు శ్రేణీకరణకు తొలి మెట్లు. వీటి ద్వారానే విద్యార్థి ఆసక్తులు అనురక్తులు వ్యక్తమవుతాయి. భవిష్యత్తును నిర్ణయిస్తాయి. లిటరరీ స్కిల్స్ ను 'అక్షరాస్యతా నైపుణ్యాలు లేదా అను సంధాన నైపుణ్యాలు' అంటారు. సమాచార పరిజ్ఞానం, మాధ్యమాల పరిజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం ఇవి మూడూ ఈ కాలపు తక్షణావసరాలు. ప్రపంచం నలుమూలల్లో జరిగే విషయాలు యెరుకలో ఉండటం, వివిధ ముద్రణ, విద్యున్మాధ్యమాలకు రాయగలిగి, ప్రసంగాలివ్వ గలిగి ఉండటం, వేగవంతమైన సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండటం నేటి యువతకందరకూ బహుధాప్రయోజన దాయకం. అభ్యసన నైపుణ్యాలు విద్యార్థుల విషయ పరిజ్ఞానానికి కొలమానమైతే, అనుసంధాన నైపుణ్యాలు క్షేత్ర స్థాయిలో వస్తు సేవల ప్రామాణికతకు సూచిక. ఇవే ఉపాధి అవకాశాలకూ వేతన స్థిరీకరణకు, పెంపుకూ పరామితి కానున్నాయి. లైఫ్ స్కిల్స్‌ను జీవన నైపుణ్యాలు అంటాం. నమ్రత, నాయకత్వం, నాంది, ఉత్పాదకత, సామాజికత అనే ఈ ఐదు ఎవరైనా ఒక వ్యక్తి ఒక సంస్థలోనో వ్యవస్థలోనో రాణించడానికి దోహదపడే నైపుణ్యాలు. వ్యక్తి స్థాయిని హౌదాను కూడా జీవన నైపుణ్యాలు నిర్ణయిస్తాయి. తన పట్ల తనకు (ఇంట్రా పర్సనల్), సమాజం పట్ల తనకు (ఇంటర్ పర్సనల్) గల శోధక సాధక అంతర్గత బాంధవ్యాలకు జీవన నైపుణ్యాలే గీటురాయి. మార్కులు గ్రేడును అభ్యసన సామార్థ్యాలు ఇస్తే, ఉపాధి, వేతనం, పెంపు, కొనసాగింపుకు అక్షరాస్యతా నైపుణ్యాలు మార్గాన్ని సుగమం చేస్తే, జీవన నైపుణ్యాలు యువతీయువకుల వ్యక్తిగత జీవితాన్ని సంఘ జీవితాన్ని స్థితివంతం హితవంతం చేస్తాయి. పేరు ప్రతిష్ఠలను తెస్తాయి. సామాన్యుడిని అసామాన్యుడిగా నిలబెడతాయి. అది సర్వీసు సెక్టారయినా, మ్యాన్యుఫాక్చరింగ్ యూనిటైనా అంకిత భావాన్ని అలవరుస్తూ అనుభవం మీదట వ్యక్తులను మంచి వర్క్ ఫోర్స్‌గా మలుస్తాయి. అంతే కాదు ప్రభావ శీలురుగా కీర్తికాయులుగా కూడా గుర్తింపునిస్తాయి. 21వ శతాబ్దపు నైపుణ్యాల శిక్షణను 'ప్రగతి శీల విద్య'గా వ్యక్తిత్వ వికాస నిపుణులు తీర్మానించింది బహుశా ఇందుకేనేమో.