Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎవరు తన కలాన్ని పట్టి కవితా సేద్యం చేస్తే ప్రజల్లో చైతన్యపు విత్తులు మొలుస్తాయో, ఎవరు చెయ్యెత్తి జై కొడితే నిజాం గుండెలు గజ గజ వణుకుతాయో, ఎవరు జైలు గోడలపై కవితా పంక్తులు రాస్తే ఆ నినాదాలతో నిరంకుశ పునాదులు కదులుతాయో అతనే, అతనే దాశరథి కష్ణమాచార్య.
ఇతను కవి, కథా రచయిత, సినీ గీత రచయిత, స్వాతంత్య్ర సమరయోధుడు, గొప్ప మానవతావాది. దాశరథి ఇలా ఎన్ని కోణాల్లో తన పేరును పదిలం చేసుకున్నా గానీ ఆయనకు కవిగానే గొప్ప పేరుంది. ఈయన వరంగల్ జిల్లా మహబూబాబాద్ తాలూకా చిన గూడూరులో జూలై 22, 1925లో జన్మించాడు. సంస్కతం, ఆంగ్లం, హిందీ, ఉర్దూ, ఫారసీ భాషలలో చక్కటి ప్రావీణ్యాన్ని అర్జించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయ పట్టభద్రుడు. తన కవిత్వంతో తెలంగాణ ప్రజలను నిరంతరం చైతన్యపరిచాడు. స్టేట్ కాంగ్రెస్ తరపున హైదరాబాదు ప్రజా ఉద్యమంలో, గార్ల ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ తరపున రైతాంగ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఉద్యమంలో కొనసాగుతూనే 'అగ్నిధార' గేయాన్ని రాశాడు. తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి సాహిత్య ఉద్యమాన్ని నడిపాడు. అగ్నిధార, రుద్రవీణ, మహాంద్రోదయం, పునర్నవం, కవితాపుష్పకం, అమతాభిషేకం, మహాబోధి, తిమిరంతో సమరం అనే రచనలు రాశాడు. 1974లో తిమిరంతో సమరం రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1975లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ బిరుదును ప్రదానం చేసింది. శ్రీ వెంకటేశ్వర, ఆగ్రా విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లను అందించాయి. అంతేగాక దాశరథిని ప్రజలు మహాకవి బిరుదుతో 1949లో సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆస్థాన కవిగా వెలిగి అందరి చేత మన్నన పొందిన అరుదైన తెలంగాణ కవి. తెలుగు వైతాళికుడిగా చెరగని కీర్తిని పొందిన దాశరథిని నందమూరి తారకరామారావు ఆస్థానకవి పదవి నుండి నిష్కారణంగా తొలగించడం ప్రాంతీయ వివక్షకు సత్యసమీపమైన రుజువుగా మిగిలిపోయింది. అయినా దాశరథి ఈనాటికి, మరేనాటికైనా వన్నెతగ్గని సాహితీవేత్త. తెలుగు చిత్ర రంగానికి వందల సంఖ్యలో గీతాలు రాశాడు. భారతదేశానికి స్వాతంత్య్రం లభించిందని సంతోషపడినా అది అసంపూర్ణ స్వాతంత్య్రమేనని భావించి, సంపూర్ణ భారత స్వాతంత్య్రం అనేది ఇంకా సిద్ధించలేదని గ్రహించి నాటి సమకాలికులతో తెలంగాణ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నాడు. క్షేత్ర స్థాయిలో పర్యటించిన స్వానుభవంతో ప్రజలలో నిజాం ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను సష్టించి వారిలో చైతన్య బీజాలు నాటడానికి సాహిత్యాన్ని ఉత్తమ సాధనంగా ఎంచుకున్నాడు. రాక్షస కత్యాలకు నిత్యం కేంద్రమైన తెలంగాణను తల్లిగా భావించి, పూజించి తెలంగాణ తల్లికి జరుగుతున్న ఘోర అన్యాయాలను, ఎదురవుతున్న దౌర్జన్యాలను ఎదురించడానికి కుటుంబానికి సైతం దూరమయ్యాడు. నిజాం వ్యతిరేక సాహిత్యం రాసి తన రచనలతో ప్రజలలో చైతన్యాన్ని తీసుకొచ్చాడు. ఆంధ్ర మహాసభలో ఉత్తేజకరమైన పాత్ర నిర్వహించి నిరంకుశ నైజాం ప్రభుత్వం చేత జైలు శిక్ష అనుభవించాడు. సాహితీ ప్రేరేపిత రచయితలపైనా, ప్రభుత్వ వ్యతిరేకులపైనా కక్ష్య గట్టిన నిజాం రాజు, నిజామాబాదు జిల్లాలోని ఇందూరు కోటలో దాశరథిని మరో 150 మంది ఖైదీలతో బంధించాడు. ఆయనతోపాటు జైలులో ఉన్న ఖైదులలో వట్టికోట ఆళ్వారుస్వామి కూడా ఉన్నాడు. నిజాం ప్రభుత్వం దాశరథిని జైల్లో బంధించినా తన ఉద్యమ ఆవేశాన్ని, ప్రజలలో మేల్కొల్పే చైతన్యాన్ని మాత్రం ఏనాడూ మరవలేదు. ఉద్యమకారులను బంధించి హింస పెడుతున్న ప్రభుత్వంపై కసితో, ప్రజలలో ఆవేశాలను రగలించుటకు నాలుగోడల జైలు అడ్డం కాదని భావించి జైలు పోలీసులు పళ్ళు తోముకోవడానికి ఇచ్చిన బొగ్గుతో తానున్న జైలు గోడల మీదనే పద్యాలు రాశాడు. ఆ విధంగా తనలో ఉన్న భావావేశాన్ని భౌతికమైన పద్దతిలో జైలు గోడలపై తెలిపాడు. అందుకు ప్రతిఫలంగా బొగ్గు ఇచ్చిన పోలీసుల చేతిలోనే దెబ్బలు తిన్నాడు. దాశరథి ఉద్యమకారుడు, రచయితే కాక మంచి ఉపన్యాసకుడు కూడా. దాశరథి తన జైలు అనుభవం తోనే 'పూచిన మోదుగులు', 'రక్తాంజలి' వంటి నిజాం వ్యతిరేక జాతీయోద్యమ కథల్ని రచించాడు. ప్రజలను సాంస్కతికంగా, సాహిత్య పరంగా చైతన్యోన్ముఖుల్ని చేసేందుకు అనేక రచనలు రచించాడు. దాశరథి తెలంగాణ స్వాతంత్య్రోద్యమంలో, తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను వేసుకున్నాడు. ఇటువంటి ఉన్నతమైన పోరాట పటిమతో, సాహిత్యపు విలువలతో నిజాంకు ఎదురుగా నిలబడి, కలబడి, స్వాతంత్య్రోద్యమ కాంక్షను కళ్లారా వీక్షించిన కష్ణమాచార్య 1987 నవంబర్ 5న దివంగతుడయ్యాడు.
- ఘణపురం సుదర్శన్