Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనోవిజ్ఞాన శాస్త్రంలో మనసుకు మానసిక నిపుణులు అత్యంత ప్రాధాన్యత కల్పించారు. మనసు మన కంటికి కనిపించదు. అయితే మానవ మెదడులో జరిగే ఆలోచనల ప్రకారమే మనం నడుచుకుంటాం. మన మనసు ఎల్లప్పుడూ సమస్యలతో సతమతం కాకూడదు. వ్యాకులతకు, చింతకు గురి కాకూడదు. ప్రతి మనిషికి రోజుకు వేలాది ఆలోచనలు వస్తాయి. మనం నిద్ర పోయిన సమయం మినహాయించి, మిగిలిన అన్ని సమయాల్లో మనలో ఆలోచనలు వస్తుంటాయి. పోతుంటాయి. మనసులో కలిగిన ప్రతి ఆలోచనను ఆచరణలో పెట్టలేం. మన ఆలోచనను ఆచరణలో పెట్టే ముందు దాని సాధ్యాసాధ్యాల గురించి బేరీజు వేసుకోవాలి. ఒక ఆలోచనను అమలు చేస్తే, దాని వల్ల నష్టమా? లాభమా? అంచనా వేసుకోవాలి. ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగేయాలి. ఇదిలా ఉండగా చీకూ చింతలేని జీవితం కేవలం డబ్బువల్లనే సాధ్యపడుతుందన్న భావనా సరికాదు. మన జీవితంలో అనుకూల ఫలితాలు వస్తుంటే పొంగిపోతాం.ప్రతికూలత కలిగితే అందుకు వేరే ఎవరో కారణమని నిందిస్తాం. ఆత్మ విమర్శకు, పరిశీలనకు తప్పు ఒప్పుల సమీక్షకు తావివ్వం. ఒక మనిషి ఆత్మ పరిశీలన చేసుకుంటేనే ఉచితానుచితాలు తెలుస్తాయి. దిద్దుబాటుకు అవకాశముంటుంది. మనం ఒక సమయంలో ఉత్సాహంగా, మరో సమయంలో దిగులుతో ఉంటాం. మనం ఎలా ఉండాలో మనసులో నిర్ణయించుకుంటే అలాగే ఉండగలుగుతాం. ఈ విషయాలన్నింటినీ మనసే నిర్ణయిస్తుంది. మనసును అదుపులో పెట్టుకోగలిగిన వ్యక్తి తన జీవితంలో అద్భుతాలు సాధించవచ్చు. ఇందులో ఎలాంటి అనుమానానికి తావులేదు. అయితే ఇంత ప్రాముఖ్యత కలిగిన మెదడు నిర్మాణం ఎలా ఉంటుంది. అది ఎలా పనిచేస్తుంది. తెలుసుకోవలసిన అవసరముంది. మన మెదడు ఒక కొవ్వు ముద్దలాంటిది. దాని కంటూ ఒక ప్రత్యేకమైన ఆకృతి లేదు. ఒక వేళ మనం మెదడును తీసి బయటపెడితే అది సుద్దలా కూలబడుతుంది. మెదడు మన పుర్రె ఎముక లోపల నీరులాంటి ద్రవ పదార్థంలో తేలియాడుతూ ఉంటుంది. ఆ నీటి ఒత్తిడికే అది తన రూపాన్ని మార్చుకుంటుంది. మెదడు చుట్టూరా ఒక పొరలా ఆవరించి ఉండే ఈ ద్రవం మన మెదడుకు రక్షణ కల్పిస్తుంది. మెదడు ఎంతటి సంక్షిష్టమైన అవయవమంటే శతాబ్దాల పరిశోధనల తరువాత ఇప్పటికీ మనకు మెదడు గురించి సమగ్రంగా తెలసునని ధైర్యంగా చెప్పే పరిస్థితిలేదు. అయితే అత్యాధునికమైన స్కానింగ్, మ్యాపింగ్ పరిశోధనల అనంతరం మెదడు పట్ల మన అవగాహన పెరిగింది.
మన మెదుడుకున్న సామర్థ్యంలో మనం కేవలం 10 శాతమే ఉపయోగించుకుంటున్నామని, దీనికే ఇన్ని అద్భుతాలు సాధ్యమవుతుంటే, ఇక మిగిలిన మెదడు కూడా పూర్తిగా మనుషులందరూ వాడితే ప్రపంచ పరిస్థితి మరింత మెరుగ్గా ఉండేదని నిపుణులు భావిస్తున్నారు. కాగా వయస్సు పెరిగే కొద్ది చురుకుదనం తగ్గుతుందని, మెదడులోని కొన్ని నాడి కణాలు నశిస్తాయని కొత్తవి పుట్టవని ఇప్పటి వరకు భావించారు. అయితే శాస్త్ర వేత్తల పరిశోధనలో ఈ సమాచారం తప్పని తేలింది. మెదడులోని కొన్ని ప్రాంతాల్లో వృద్దాప్యంలో కూడా కొత్తగా నాడి కణాలు పుట్టుకొస్తున్నాయని దీనినే 'న్యూరో జెనిసిస్' అంటారని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా జ్ఞాపక శక్తి, కొత్త విషయాలు నేర్చుకోవడం వృద్దాప్యంలో కూడా సాధ్యమేనన్న విషయాన్ని మానసిక నిపుణులు గుర్తించారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో వంద సంవత్సరాలకు పైబడిన మహిళలు, పురుషులు ఎంతో మంది చురుకుగా తమ జీవనాన్ని సాగిస్తున్న విషయం మనకు తెలిసిందే. సహజంగా హిప్పోకాంపస్లో కొత్త నాడికణాలు పుట్టుకొస్తున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు.నాడీకణాలు ఉన్నవి నశించకుండా, కొత్తవి అభివృద్ది చెందేందుకు నిత్యం వ్యాయామం చేయడం, ఎల్లప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవడం ఎంతో అవసరమని మానసిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మెదడుకు పదును పెట్టేందుకు పుస్తకాలు చదవడం, ఎల్లప్పుడూ ఏదో ఒకటి రాస్తు ఉండాలని, చదరంగం ఆడాలని, పదకేళి పూర్తి చేయాలని సూచిస్తున్నారు. సంగీత సాధన కూడా మనసును చురుకుగా ఉంచేందుకు ప్రయత్నిస్తుంది.
మనిషి జీవితం అద్భుతమైనది. అయితే కొంత మంది చెబుతున్నట్లుగా అదృష్టం, దురదృష్టంలపై మన జీవితం ఆధారపడిలేదు. మన నుదుట ఎలా రాసి ఉంటే అలా మన జీవితం సాగుతుందనేది కూడా అబద్దం. ఇది కల్పన మాత్రమే. మన జీవితానికి మనమే విధాతలం. మనం ఎలా జీవించాలనేది మన చేతుల్లోనే ఉంది. మనసు అన్ని రకాల ఆలోచనలు, భావాలు, అనుభూతులు గ్రహిస్తుంది. మనకు పనికిరాని విషయాలను వివేకం, సాధన ద్వారానే వదిలించు కోవాలి. వ్యాకులత కలిగించే విషయాలను మనిషి దూరం చేసుకునేందుకు మూడు మార్గాలున్నాయి.
ఒకటి - తన స్వభావంపై స్వీయ అధ్యయనం, విశ్లేషణ.
రెండు - భావోద్వేగాలపై పూర్తి అదుపు.
మూడు -ఎవరి జీవితం పట్ల వారు పూర్తి అవగాహన కలిగి ఉండడం. ఒక శిల్పి ఎలాగైతే ఒక రాయిని అద్భుతమైన ఆకృతిగా తీర్చిదిద్దుతారో, అలాగే ఎవరి జీవితాన్ని వారే తీర్చిదిద్దు కోవాలి.
- జి.గంగాధర్ సిర్ప, 8919668843