Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వాతంత్య్రోద్యమ సాహితీకారులు
హైదరాబాద్ స్వాతంత్య్రంకై, ప్రజల స్వేచ్ఛా జీవనానికై అమతతుల్యమైన తన యావజ్జీవితాన్ని ఉద్యమానికి అంకితం చేసిన వ్యక్తి, ప్రముఖ ప్రజా న్యాయవాది, విద్యావేత్త, సాహితీ వేత్త, స్వాతంత్య్ర సమరయోధుడైన ఎన్.కె.రావు. పూర్తి పేరు నాగులపల్లి కోదండ రామారావు. ఈయన హైదరాబాద్ రాష్ట్రంలోని కొల్లాపూర్ తాలుకాకు చెందిన చిక్కేపల్లిలో 20 ఆగస్టు 1903లో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు పట్టాభి రామారావు, రావమ్మ గారలు. ఇతని తండ్రి గోపాల పేట సంస్థానానికి దివాను. తెలంగాణ ప్రజలను సాంస్కతికంగా చైతన్యవంతులను చేసేందుకు సాగించిన గ్రంథాలయోద్యమం లో నాయకుడుగా పేరొందిన చిక్కేపల్లి రామ చంద్రరావుకు ఇతను తమ్ముడవుతాడు. కోదండ రామారావు ప్రాథమిక విద్యాభ్యాసమంతా చిక్కేపల్లిలోనే కొనసాగింది. అనంతరం మహబూబ్ నగర్లో, హైదరాబాద్ చాదర్‌ఘాట్ హైస్కూల్లో విద్యనభ్యసించాడు. వైజ్ఞానిక కార్యక్రమాలను ఇష్టపడే కోదండ రామారావు మెట్రిక్ చదువుతూ నలుగురి స్నేహితులను కూడగట్టుకొని గౌలిగూడా, హైదరాబాదులో బాల సరస్వతీ గ్రంథాలయాన్ని స్థాపించాడు. ఆనాడు హైదరాబాదుకు వచ్చిన కాశీనాథుని నాగేశ్వరరావు, ఇతను చేస్తున్న సామాజిక చైతన్యాన్ని చూసి బాల సరస్వతీ గ్రంథాలయంలో సన్మానించాడు. అటు పిమ్మట విద్యాభ్యాసం కొరకు కలకత్తా వెళ్లి ఇంటర్మీడియట్, బి.ఎస్.సి చదివాడు. ఆ తరువాత ఢిల్లీ విశ్వవిద్యాలయంలో బి.ఎస్.సి ఆనర్స్ పరీక్ష రాశాక, అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ఎల్.ఎల్.బి చేశాడు. అలా క్రమంగా సమాజాన్ని దగ్గరగా చూస్తున్న కొద్దీ ప్రజాహిత కార్యక్రమాలపై దష్టిని సారించాడు.
న్యాయవాద విద్యాభ్యాస అనంతరం బూర్గుల రామకష్ణ రావు దగ్గర మొదటి ఎప్రెంటిస్‌గా చేరాడు. నిరంకుశత్వపు పాలనా విధానాన్ని అలవర్చుకున్న నిజాంకు వ్యతిరేకంగా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని, అకారణంగా అరెస్టయిన వారికి అండగా ఉండి వారిని జైలు నుంచి విడుదల చేయడానికి కృషి చేశాడు. నిజాం రాజ్యంలో బావుల కింద సేద్యం చేస్తున్న రైతులపై విధించిన అధిక పన్నులకు వ్యతిరేకంగా ప్రభుత్వంతో పోరాడాడు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టు భూమిశిస్తు విధానాన్ని ఇక్కడా అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాడు. దాని పర్యవసానంగా రెండు వంతుల భూమిశిస్తు తగ్గింపుకు తోడ్పడ్డాడు. ఈ విధంగా నిత్యం సామాన్య ప్రజాపక్షం వహించడం వలన కోదండరామారావు అంటే అందరికీ గౌరవ భావం ఏర్పడింది. నిర్విరామంగా ప్రజల తరపున 18 కేసుల్లో వాదించి గెలిచాడు. హైదరాబాద్ సంస్థానంలో జరుగుతున్న దోపిళ్లను, ప్రజల అణిచివేతను ప్రశ్నిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హిందూ ప్రజల రక్షకుడిగా కీర్తిని పొందాడు. దేశంలో, హైదరాబాదులో జాతీయోద్యమం తీవ్రంగా సాగుతున్న రోజులలో ఆంధ్రమహాసభ, కాంగ్రెసుల సభ్యుడిగా ఉంటూ 1938 కాంగ్రెసు సత్యాగ్రహంలో దళనాయకుడుగా పాల్గొని అరెస్టయినాడు.
1939లో అరెస్టయిన ఆరు నెలల తర్వాత విడుదలయ్యాడు. 1940లో మందుముల రామ చంద్రరావు అధ్యక్షతన జరిగిన మల్కాపురం ఆంధ్రమహాసభకు కోదండ రామారావు కార్యదర్శి గా వ్యవహరించాడు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా సురవరం ప్రతాపరెడ్డి విద్యా ప్రచారాన్ని ఇష్టపడ్డట్టుగా ఎన్.కె.రావు కూడా విద్యా ప్రచారాన్ని అమితంగా ఇష్టపడ్డాడు. 1944లో వరంగల్‌లో ఆంధ్ర విద్యాభివర్ధిని ఉన్నత పాఠశాల స్థాపనకు, హైదరాబాద్ కిషన్ గంజిలోని సావిత్రి కన్యా విద్యాలయానికి, 1946లో జనగామలో ఆంధ్ర భాషాభివర్ధిని మాధ్యమిక పాఠశాల స్థాపనకు తోడ్పడ్డాడు. 1945 నుంచి నారాయణ గూడా ఆంధ్ర బాలిక పాఠశాల మేనేజింగ్ బోర్డులో సభ్యుడిగా ఉన్నాడు. తెలుగు భాషను బోధన భాషగా గుర్తించాలని ఆ శాఖ అధికారితో మాట్లాడి తెలుగు భాషకు తగిన గౌరవం దక్కేలా చేశాడు. 1947-48 లో కె.ఎం. మునీ హైదరాబాద్ ఏజెంట్ జనరల్‌గా వచ్చినప్పుడు హైదరాబాదులో జరుగుతున్న పరిస్థితులను గురించి చెప్పడంలో ఎన్.కె.రావు కీలకపాత్ర పోషించాడు. ప్రభుత్వం ఏర్పరచిన విద్యా కమిటీల్లో సభ్యుడుగా నియమితు లయ్యారు. ఈ విధంగా హైదరాబాద్ రాష్ట్ర ప్రజలను విద్యా ప్రచారం ద్వారా చైతన్యవంతుల్ని చేస్తూ వారికి నిజాం ప్రభుత్వం చేసే అన్యాయాలను తెలియపర్చడంలో అహరహం స్వచ్ఛందంగా పని చేశాడు. నాగులపల్లి కోదండ రామారావు బ్రహ్మచారిగా ఉంటూ ఇలా తన యావత్ సుదీర్ఘ జీవితాన్ని హైదరాబాద్ రాష్ట్ర ప్రజల చైతన్యానికే అంకితం చేశాడు. ఇంతటి ఘనమైన కార్యక్రమాల్ని నిర్వహించిన రామారావు ప్రజలకు ప్రాతస్మరణీయుడు. ఈ విధంగా తాను పాల్గొన్న ఉద్యమానుభవాలతో 1946లో 'దేశమాత కశి' అనే జాతీయో ద్యమ కథ రాశాడు. హైదరాబాద్‌లో జరిగిన ప్రమాదం, ఇతర అనారోగ్యాల కారణంగా వికారాబాద్‌లోని అనంతగిరి, మద్రాసు, ఉస్మానియా ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం వెళ్ళాడు. అయినా ఆరోగ్యం మెరుగుపడలేదు. చివరకు డిసెంబర్ 5న 1952లో అమరుడయ్యాడు.
- ఘణపురం సుదర్శన్