Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ నవలను రచయిత తన అమ్మనాయనలైన భూతం మల్లయ్య - మల్లమ్మ గారలకు అంకితం ఇచ్చారు. మూడు తరాల తండ్లాట అంటూ సంగిశెట్టి శ్రీనివాస్ మానవీయ భావాల గుండె తడి అంటూ ఆచార్య సూర్యధనుంజరు గారలు చక్కటి ముందుమాటలు రాశారు. కందుల శివకృష్ణ నవలలోని ముఖ్యాంశాలు తెలుపుతూ పరిచయ వ్యాసం రాశారు. బలమైన నో స్టాల్జియా, గ్రామీణ పల్లె జీవనంలోని ఉత్పత్తి శక్తుల మానవీయ సంబంధాలు; సామెతలు - పలుకుబడులు - ఆసక్తికర కథనం; వ్యదార్థ జీవిత యధార్థదృశ్యాల్ని అద్భుతంగా ముత్యాలుగారు అక్షరీకరించారు.
ఈ నవల లచ్చుమవ్వ తండ్రి ్లలచ్చయ్య చావుతో ప్రారంభమై లచ్చుమవ్వ చావుతో ముగుస్తుంది. ఈ రెండు చావుల మధ్యన లచ్చుమవ్వ పూర్తి జీవితాన్ని రచయిత చక్కగా నవలీకరించారు. తెలంగాణ సమాజంలోని అణగారిన వర్గాల జీవన వ్యథను ఈ నవల ప్రతిబింబిస్తుంది. బర్లగాసె పేద దళిత బాలికను ఓ గొప్ప పోరాట శిఖరంగా బలమైన సన్నివేశాలతో ఇంకా చైతన్యపూరితంగా ఆదర్శ వంతంగా చిత్రించిన, నవల ఇంకా బాగుండేది. ధిక్కారం వినిపించే శక్తిగా 'లచ్చుమవ్వ'ను చూపాల్సింది. గుణాడ్యుని బృహత్ కథలోని అంశాలు నవలకు పెద్ద బలం చేకూర్చాయి. పెద్దులు, దుర్గమ్మల పాత్రలు ఆత్మగౌరవ ప్రతీకలుగా మల్చటం బాగుంది.
లచ్చుమమ్మ తండ్రి మరణించడం - తల్లి వేరొకరిని చేరటం - తాత నాయనమ్మల వద్ద లచ్చుమమ్మ పెరగటం - పెద్ద మనిషి కావడం - సోపతులతో ఆటపాటలు - మల్లయ్యతో పెళ్ళి- ఇటుక బట్టీల్లో పని చేయడం - పిల్లాడు పుట్టడం - అతన్ని పెద్దజేసి సరోజతో లగ్గం జేయడం... కొన్నాళ్ళకు జోగుల్ని తీసుకొని సొంత వూరు వెళ్ళడం - సమాధులపై ఆమె పడి మృతి చెందటం,. ముగిపు బెంగాలీ సాహిత్యాన్ని (విషాదాన్ని) గుర్తు చేసింది. 'లచ్చువమ్మ పాత్ర జ్ఞాపకాల ఆస్తి మాత్రమే కాదు, దళిత శ్రామిక స్త్రీలకు ప్రతీకగా నిలబెట్టారు రచయిత. అభినందనీయులు. ఈ నవలలోని నాల్గు తరాలు... దుర్గమ్మ, పెద్దులు, బుచ్చమ్మ, లచ్చయ్య, మల్లయ్య, సరోజ, జోగులు పాత్రలు స్థలకాల, సామాజిక స్థితితులు ఇంకా బలంగా రాస్తే నవల బలంగా వుండేది. ఈ నవలలో మాల కులంలో ఉండే సాత్రాలు - ఆచారాలు; పెండ్లిలు; పేరంటాలు; సమర్తలు; పట్టింపులు; దేవుని మొక్కులు; చావు పుట్టుకల సందర్భాల్లోని ఆచారాలు, దళిత యోధుల స్ఫురణ, తెలంగాణ భాష సొబగులు, సౌందర్యం, మట్టి వాసనలు... కష్టం చేసే దళిత స్త్రీ అంతరంగాన్ని అద్భుతంగా ఒడిసి పట్టుకున్న గొప్ప నవల ఇది. ముత్యాలుగారు గతంలో సూర, పురుడు, ఇగురం, మొగలి లాంటి నవలలు.... కథలు, కులవృత్తి పదకోశం, కవిత్వం, నియతి ఆటో బయోగ్రఫీ- 'కులాటకం' అనే నాటకం, దస్తూరి వ్యాస సంపుటి లాంటివి రాసారు. పాఠక జనాదరణ పొందారు. ఓ మంచి నవల 'మాలచ్చువమ్మ' అందించారు.
(మాలచ్చువమ్మ (దళిత నవల), రచయిత : భూతం ముత్యాలు, వెల : రూ. 100/-, పేజీలు : 118, ప్రతులకు : భూతం ముత్యాలు, ఇ.నెం. 4-11-117/1, చైతన్య నగర్, ఎల్‌హెచ్‌సీ దగ్గర, డివీకే రోడ్, నల్గొండ - 508001.
సెల్ : 9490437978)
- తంగిరాల చక్రవర్తి, 9393804472