Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాధేయ, సత్యాదేవి గారి మధ్య ఉండే అన్యోన్యతను గురించి తెలియజేసే కథ ఇది. వారు కలిసి చేసిన జీవనప్రయాణం, సాహితీ ప్రయాణం గూర్చిన కథ ఇది. నిజంగా ఇది స్వచ్ఛమైన సాహితీపిపాసులు 'సత్యారాధేయుల' కథ. ఇది స్మతి కవిత్వం. జ్ఞాపకాల బరువును అక్షరాల్లోకి ఒంపుతూ కవి చేసిన కన్నీటిసంతకమిది.
ఈ పుస్తకాన్ని రచించిన డా.రాధేయ అనంతపురం నివాసి. గత 33 సంవత్సరాలుగా వారు ఉత్తమ కవిత్వాన్ని ఎంపిక చేసి ఉమ్మడిశెట్టి అవార్డు ప్రకటిస్తున్న విషయం సాహితీకారులందరికీ తెలుసు.వీరు 9 కవితా సంపుటాలు,7 విమర్శ గ్రంథాలను రచించారు. సంపాదకులుగా 2 పుస్తకాలకు వ్యవహరించారు. వీరి 'మగ్గం బతుకు' చాలా ప్రాచుర్యం పొందిన దీర్ఘ కావ్యం.
ఈ పుస్తకంలో కవిత్వమంతా కవి జీవితం, సాహితీ సేవ, తన వెన్నంటే ఉండి తనను ముందుకు నడిపించిన సత్యాదేవి గారిని గుర్తు చేసుకుంటూ సాగుతుంది. కొన్ని భాగాలుగా విడగొట్టుకుంటే సత్యాదేవి గారితో వివాహ సందర్భం, ప్రోత్సాహం, ఉద్యోగజీవితం, అవార్డు నిర్వహణలో ఆవిడ భాగస్వామ్యం, ఉద్యోగ విరమణ, ఉమ్మడి శెట్టి అవార్డు అనివార్య స్థితి, సత్యాదేవి గారి ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడం, కాలం చేయటం, రాధేయ గారి ఒంటరి జీవనం, చివరగా సత్యాదేవి గారి జ్ఞాపకాల్లో జీవించటం వంటి అంశాలతో కూడినది.
వెంటాడే వాక్యాల్లోకి...
బతుకును ఖాళీ చేసి వెళ్ళిపోయిన
ప్రియసఖి కోసం
నా ఏకాంత యోగ ధ్యానం లోంచీ
జరిపిన 'సత్యా'న్వేషణం (పేజీ 8)
వాస్తవాన్ని మనం లోనికి తీసుకొని ఆలోచించినప్పుడు అన్యోన్యంగా జీవించటం వేరు. ఒకరి లక్ష్యం కోసం ఇంకొకరు తమ జీవితాన్ని త్యాగం చేయటం వేరు. ఈ కవి దంపతులలో రెండూ ఉన్నాయి. అందుకే ఈ వాక్యాలు ఎంతో ఆర్థ్రంగా బయటికొచ్చుంటాయి. ఖాళీ చేసి వెళ్ళటమనేది ఈ భూమి మీద సహజాతి సహజమైన విషయం కానీ ఆ జ్ఞాపకాలను, వారితో కలిసి చేసిన ప్రయాణాన్ని మరిచిపోకపోవటమే గొప్పతనం. ఆ పనిలో ముందంజలో ఉన్నారు రాధేయ. నిజంగా ఇక్కడ 'సత్యాన్వేషణం' అనే పదబంధంలో శ్లేష కనబడుతుంది. మనిషి ఎంత ముందుకు వెళ్ళినా ఎక్కడో చోట ఆగి గడిచిన జీవితాన్ని వెతుక్కోవాల్సిందే.
రాధేయ ఇలా కవిత్వరూపంలో వారి సతీమణిని 'సత్యం'గా వెతుక్కోవటం అనిర్వచనీయం.
నీ ప్రేమ నాపై ఉంది
నీపై అత్తామామలకు అభిమానముంది
ఇంతకంటే నాకేం కావాలి చెప్పు?
తప్తిని మించిన ఐశ్వర్యం లేదు
ఆశను మించిన దరిద్రం లేదు
కదా సత్యా! (పేజీ 21)
ఈ వాక్యాల్లో కవి జీవనవిధానం కనబడుతుంది. ఇందులో తప్తి, ఆశకు సంబంధించిన భావనలను కవి గుర్తుచేస్తాడు. అదే విధంగా సత్యాదేవి గార్కి కుటుంబంతో ఉన్న సంబంధాన్ని చెబుతూ, ఆమె కుటుంబం పట్ల బాధ్యతాయుతంగా మెలిగిన తీరును ఈ వాక్యాల్లోకి తీసుకొచ్చాడు. సంభాషణాత్మకంగా పలికిన ఈ వాక్యాలు కుటుంబ భారాన్ని మోస్తూ, తోడుగా ఉంటూ కుటుంబాన్ని ముందుకు నడిపే మహిళలందరికి వర్తిస్తాయి. మాట్లాడుకున్నట్టుగానే కవి రాసిన ఈ వాక్యాలు ఎంతో ప్రేమను నింపుకున్నవి.
మైకుముందు నీ తడికళ్ళ ముఖచిత్రం
ఇప్పటికీ నా కన్నీటిలో మున్కలేస్తూనే ఉంది
నీ తడి తడి మాటలు మళ్ళీ నీకు విన్పిస్తున్నా..
వింటావా సత్యా! (పేజీ 59)
ఉమ్మడి శెట్టి అవార్డు విరమణ గురించి ప్రకటించే సందర్భంలో సత్యాదేవి గారి ప్రసంగాన్ని గుర్తు చేసుకొని రాసిన మాటలివి. సాహిత్యంతో మమేకమైనప్పటికీ ఎప్పుడూ సభలో మాట్లాడని సత్యాదేవి గారు ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయి ఈ అవార్డు కొనసాగింపు గురించి భరోసానిస్తూ మాట్లాడిన మాటలను రాధేయ గారు ఇక్కడ కవిత్వీకరించారు. కన్నీటిలో మునకలేయటం, తడికళ్ళముఖచిత్రం ఇందులో ఆకట్టుకునే ప్రతీకలు.
జన్మంటూ మళ్ళీ ఉంటే
ఉన్నఫళంగా నిన్ను చేరుకొని
నీ కడుపున పుట్టాలని ఉంది సత్యా! (పేజీ 81)
వారిద్దరి మధ్య ఉన్న అన్యన్యోతను చెప్పటానికి కంటతడి పెట్టించే ఈ వాక్యాలు చాలు. ఎంతలా తనను ఆరాధించి ఉంటే, ప్రేమను చూపించి ఉంటే కవి ఈ మాటలనగలడు. ఈ వాక్యాలను బట్టి చూస్తే కవి ఆమెలేని ఖాళీతనంలో ఆమె జ్ఞాపకాలను నింపుకొని జీవిస్తున్నాడు. ఆయన సత్య లేని రాధేయ కాదు. సత్యను నరనరాన నింపుకున్న రాధేయ అని తెలపటానికి ఈ వాక్యాలే సాక్ష్యం.
కొంత వచనంతో కూడినా మొదలు నుండి చివరిదాకా చదివించేలా చేసే రచనగా 'సత్యారాధేయమ్'ను చెప్పుకోవచ్చు. ఇలా జీవితానికి సంబంధించిన ఎన్నో వాక్యాలను ఈ సంపుటిలో మేళవింపు చేసి కళ్ళను తడిచేసిన కవి రాధేయ నిర్విరామ కషి కొనియాడదగినది. వారి ఆచరణ, అంకితభావం ఎంతో ఆదర్శనీయం.
- తండ హరీష్ గౌడ్
8978439551