Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఎక్కడ జ్ఞానపు తీగలు వికసించి విస్తరిస్తాయో అక్కడ అజ్ఞానపు పునాదుల గోడలు పటాపంచలవుతాయి. ఎక్కడ స్వయంకషి, శ్రమ, పట్టుదల అన్నవి ఉద్భవిస్తాయో అక్కడ పేరు ప్రతిష్టలు అనవరతం మారుమ్రోగుతాయి''
ఈ వాక్యాలకు సరిగ్గా సరిపోయే వ్యక్తే వెల్దుర్తి మాణిక్యరావు. ఇతను గొప్ప ప్రవర్తనకు గొప్ప చిరునామా. మానవతా వాది, స్వాతంత్య్ర సమరయోధుడు, రాజకీయ నాయకుడు, రచయిత, పత్రికా సంపాదకుడు... ఇలా విభిన్న కోణాలలో తనదైన ముద్రను వేసుకున్న మధు స్వభావి, గొప్ప మేధావి, వినయశీలి అయిన మాణిక్యరావు డిసెంబర్12, 1913లో మెదక్ సమీపంలోని వెల్దుర్తి గ్రామంలో శ్రీమతి రుక్మిణమ్మ, వెంకటేశ్వరరావులకు జన్మించాడు. కళాశాల విద్య సమయంలో ఉద్యమాల పట్ల ఆకర్షితుడైనాడు. 1930లో మాధ్యమిక విద్యనభ్యసించాడు.
ఇతను బహుభాషా పండితుడు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, కన్నడ, మరాఠి, పారశీక భాషలలో నిష్ణాతుడు. 'స్వయం ప్రకాశం' అనే కలం పేరుతో రచనలు చేశాడు. బాలల కథలు, బాల గేయాలూ రాశాడు. స్వాతంత్య్రో ద్యమ కాలంలో మహాత్మాగాంధీ సూచించిన కార్యక్ర మాలలో ఒకటైన మద్యపాన నిషేధం గురించి 'దయ్యాల పన్గడ' అను నాటికను పూర్తి తెలం గాణ మాండలికంలో రాశాడు. ఏడు అంకాలతో రచించిన ఈ నాటకంలో ఒక నాటి ముఖ్య మంత్రి అయిన మర్రి చెన్నారెడ్డి నటించాడు. ఈ నాటకం హైదరాబాద్ కొత్వాల్ (కమీషనర్) రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి మెప్పు పొందింది.
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి ప్రకారం 'పన్గడ' అంటే పశువుల దొడ్డికి ఉండే తలుపు అని అర్థం. వెల్దుర్తి ప్రేమ్ చంద్, దాశరథిలను అభిమాన రచయితలుగా భావించాడు. సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో వెలువడిన గోల్కొండ పత్రికలో సహాయ సంపాదకులుగా పని చేశాడు. అందులో తన, ప్రజాభిప్రాయాలను నిర్భయంగా ప్రకటించేవాడు. మర్రి చెన్నారెడ్డి సంపాదకత్వంలో బెజవాడ నుండి వెలువడే 'హైదరాబాదు పత్రిక' లో కూడా ఇతను ఎన్నో వ్యాసాలు రచించాడు. అడవి బాపిరాజు సంపాదకత్వంలో వెలువడే మీజాన్ పత్రికలో గేయాలు రచించాడు. ఇతను రచించిన 'హైదరాబాదు స్వాతంత్య్రోద్యమ చరిత్ర' గ్రంథం అత్యంత ప్రముఖమైనది. అణా కథలను 1945లో, శోభ కథా సంకలనాన్ని 1951లో, పరిసరాలు కథల సంకలనాలను 1956లో ప్రచురించాడు. మల్లి, చేనుకాడ, మంచె మీద అనే నాటకాలు రాశాడు. 'నా దేశపు బట్ట' అనే తెలంగాణ జాతీయోద్యమ కథ రాశాడు.
ప్రగతిశీల భావాలను గలిగి, నియంతత్వ పోకడలను ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకున్న మాణిక్యరావు తన కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ మౌనంగా ఉండలేని వ్యక్తి. తెలంగాణ సాంస్కతికోద్యమమైన గ్రంథాలయోద్యమంలో చేరి ఉద్యమాన్ని తెలంగాణ వ్యాప్తంగా సాగిస్తున్న క్రమంలో మాడపాటి హనుమంతరావుతో, నిజాం వ్యతిరేక ఉద్యమ సమయంలో రాజకీయ సభలలో పాల్గొనడం వల్ల బూర్గుల రామకష్ణరావుతో సహచరుడిగా ఉండడంతో సాన్నిహిత్యం బలపడింది. రచనా రంగంలో, పత్రికా, రాజకీయ రంగాలలో వైతాళి కుడైన సురవరం ప్రతాపరెడ్డికి సహ చరుడు. నేడు ప్రముఖ రచయిత లుగా కీర్తిని పొందుతున్న నాటి యువ కవులైన దాశరథి, కాళోజీ, సి.నారాయణ రెడ్డిలకు వెల్దుర్తి మాణిక్యరావు అత్యంత . కేవలం రచయిత, స్వాతంత్య్ర సమరయోధుడుగానే కాక హైదరాబాద్ స్వాతంత్య్రం విషయానికి వస్తే, చెప్పుకోదగ్గ అతిగొప్ప పరిశోధ కుడు వెల్దుర్తి. నిజాం ఫర్మానాలను, ప్రభుత్వ జరీదాలను, గెజిట్లను కూలంకుషంగా పరిశీలించి హైదరాబాద్ స్వాతంత్య్రో ద్యమ చరిత్ర, తెలంగాణ స్వాతంత్య్రోద్యమ చరిత్ర అనే గ్రంథాలు రాశాడు. ఇవి నిజాం కాలం నాటి పరిస్థితికి సజీవ అక్షర రూపాలు. ఇందులో మొదటి పుస్తకాన్ని 1987లో నాటి ఉప రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ, రెండవ పుస్తకాన్ని నాటి రాష్ట్రపతి శ్రీ జ్ఞానీ జైల్సింగ్లు ఆవిష్కరించి రచయిత చేసిన కషిని గుర్తించి, మనసారా మెచ్చుకొని సత్కరించారు.
నిజాం ప్రభుత్వ నియంతత్వ, దౌర్జన్య, దోపిడీ పాలనా విధానాన్ని నిరసిస్తూ అప్పటి సాంఘిక, రాజకీయ పరిస్థితుల గురించి ప్రజలకు తెలియ పర్చడంలో పలు మార్గాలను అనుసరించి కతకత్యుడయ్యాడు. మాణిక్య రావుకు, ప్రభుత్వాన్ని ఎండగట్టాలన్న ఆలోచనలకు రూపం ఆంధ్రమహాసభల నుండే ఏర్పడింది. అతని రాజకీయ జీవితం ఈ సభల నుండే మొదలైంది. 1938లో ఆంధ్ర మహాసభ కార్యదర్శిగా పనిచేస్తూ మహాత్మాగాంధీ సూచించిన జాతీయోద్యమ నిర్మాణ కార్యక్రమాలను తెలంగాణలో ఊరూరా ప్రచారం చేశాడు. తెలుగు భాషకు, సంస్కతికి కించిత్తు కూడా గౌరవ స్థానమివ్వని నిజాం రాజ్యంలో పుస్తకాలు ప్రచురించడం అతి పెద్ద సాహసం. అటువంటి సాహసాన్ని కూడా లెక్క చేయకుండా 'అణా గ్రంథమాల'ను స్థాపించి మహామహుల జీవిత చరిత్రలు గల గ్రంథాలు ప్రచురించాడు. మాణిక్యరావు నిజాం రాజును, ఉద్యమాల ద్వారానే కాకుండా తన రచనల ద్వారా, గ్రంథమాల తరపున వెలువడే పుస్తకాల ద్వారా కూడా ఉక్కిరిబిక్కిరి చేసాడు. ఈ ధాటికి తట్టుకోలేని నిజాం ఫర్మానాను జారీ చేపించి కొన్ని గ్రంథాల నిషేధానికి పాల్పడ్డాడు. ఇలా ఇంతటి కషి చేసిన వెల్దుర్తి స్వాతంత్య్రానంతరం ప్రభుత్వ శాఖలో ఉద్యోగం చేసి స్వచ్ఛంద విరమణ పొందిన కొన్నాళ్ళకు 1994 జూలై28న కన్నుమూశాడు.
- ఘణపురం సుదర్శన్