Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చరిత్రను తెలుసుకోలేని జాతులు చరిత్రను సష్టించలేవు అని చెప్పిన బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ హెచ్చరిక భారత బహుజన సమాజం విషయంలో అక్షర సత్యం.
బడుగు, బలహీన జాతుల సమాజాలలో అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం, వారి జీవితాల్లో వెలుగులు నింపటం కోసం, బహుజన సమాజం ఇతర జాతులతో సగౌరవంగా తలెత్తుకుని జీవించటంకోసం తమ జీవితాన్ని త్యాగం చేసిన ఎందరో మూల పురుషుల త్యాగాల చరిత్రను భారతీయ అగ్ర కుల పరిశోధకులు, చరిత్ర కారులు మరుగు పరిచారు. ఇప్పుడిప్పుడే చైతన్యం పుంజుకుంటున్న దళిత (యస్.సీ), గిరిజన (యస్.టి), వెనుకబడిన తరగతులు( బి.సి), శూద్ర, అల్ప సంఖ్యాక (మైనారిటీ) సమూహాల ప్రజలు తామంతా బహుజన సమాజంలో భాగంగా గుర్తించలేక పోతున్నారు. తమ జీవితాల్ని ఈ ఆధునిక స్థాయికి చేర్చటం వెనుక ఎందరి మహనీయుల త్యాగాలు ఉన్నాయో, మరెందరు ప్రాణాలు కోల్పోయారో తెలుసుకోలేక పోవటం వల్ల మనువాదులు చెప్పిందే చరిత్రగాను, రాసిందే వాస్తవం గాను విశ్వసిస్తూ వారి మాయలో పడి పోతున్నారు.
బౌద్ధం నాటికే వేళ్ళూనుకున్న వైదిక బ్రాహ్మణ మతం అయీన హిందూ మతం నిచ్చెన మెట్ల సమాజాన్ని నిర్మించి బ్రాహ్మణున్ని పై మెట్టున ప్రతిష్టించి, క్షత్రియుణ్ణి, వైశ్యున్ని వరుసగా క్రింద నిలిపి అంతిమంగా శూద్రుణ్ణి పాదాల వద్దకు తోసింది. అందుకే బ్రాహ్మణుడు ప్రధముడిగా, పూజలందు కుంటుంటే శూద్రుడుపై మూడు కులాలకు సేవలందిస్తున్నాడు. ఈ అమానుష వ్యవస్థ నిర్మాణాన్ని వ్యతిరేకించి తిరుగుబాటు చేసిన వారిని ''అస్పశ్యులు'' అని ఊరి బయటకు బహిష్కరించి వారిపై అమానవీయ ఆంక్షలు విధిం చారనీ, పంచములని పేరు పెట్టారనీ బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రకటించారు. ఈ నిచ్చెన మెట్ల సమాజంలో బ్రాహ్మణ స్త్రీలకు సైతం ఆంక్షలుండేవి. సతీసహగమనాలుండేవి.
కులాల మధ్య అంతరం పెరిగి సమాజంలో అశాంతికి,దేశ నాశనానికి దారి తీసింది. ప్రపంచ దేశాలు అభివద్ధి పథంలో దూసుకుపోతున్న వేళ, భారతదేశం అధ:పాతాళానికి జారి పోటానికి అదే అసలు కారణం. ఈ చరిత్రను అర్ధం చేసుకున్న బహుజనులు తక్కువ. అధ్యయనం చేసిన వారు ఇంకా తక్కువ. దక్షిణాదిన తమిళనాట స్వాభిమాన ఉద్యమాన్ని నిర్మించి,దేశంలో ప్రప్రథమంగా బౌద్ధాన్ని తీసుకు వచ్చిన ''పండిత అయితీ దాస్'' గురించి,కేరళలో ఆత్మగౌరవ పోరాటాలు, అక్షరం కోసం నెలల తరబడి వ్యవసాయ కార్మికుల సమ్మె నిర్వహించటంతో పాటు స్వేచ్ఛ కోసం పాదయాత్రను నిర్వహించి, పబ్లిక్ రోడ్లు, దేవాలయాల ప్రవేశం కోసం చేసిన ''విల్లు వండి'' పోరాటం, ''కళ్లుముడి'' పోరాటం చేసిన ''మహాత్మా అయ్యంకాళి'' గురించి ఎందరికి తెలుసు? కర్ణాటకలో ''బసవన్న'' వీరశైవ ఉద్యమ పోరాటం, పల్నాడులో ''బ్రహ్మన్న'' చాపకూటి ఉద్యమం, కేరళలో ''నారాయణ గురు'' బడి - గుడి ఉద్యమం, అమానుష ''రొమ్ము పన్ను'' కు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన ''నంగేలి'' త్యాగం ఎందరు బహుజనులకు ఎరుక
ఉత్తరాదిన ''బుద్ధుని మొదలు, సంత్ రవిదాసు, కబీర్దాసు మొదలైన ఋషులు, టిల్కా మంజీ,ఝాన్సీ రాజ్యానికి చెందిన ఝాల్కారి కోరి, యల్. ఆర్.సాల్వే'' వంటి స్వాతంత్య్ర యోధుల మరుగున పెట్టబడిన చరిత్రలు,వక్రీకరించబడిన ఛత్రపతి శివాజీ మహారాజు, ఛత్రపతి సాహూ మహారాజుల చరిత్ర ఏమి చెబుతోందన్నది ఎందరు బహుజనులకు అర్ధమైంది? బాలికల విద్య కోసం తపించిన ''ఫాతిమా షేక్'',దేశం కోసం కుటుంబాన్ని, కన్న బిడ్డలను త్యాగం చేసిన భర్త వెనుక నిలబడిన త్యాగమయి ''మాత రమాబాయి'' గురించి,భర్తతో పాటుగా సంస్కరణ రంగంలో దూకిన ''సావిత్రి బాయి ఫూలే'' గురించి ఎందరికి తెలుసు? సామాజిక సమానత్వం కోసం, రాజకీయ మార్పుకోసం పోరాడిన నిలువెత్తు నిదర్శనాలుగా నిలిచిన మహాత్మా జ్యోతిరావు ఫూలే, పెరియార్, డాక్టర్ అంబేడ్కర్,మాన్యవర్ కాన్షిరాం మొదలైన వారి జీవిత చరిత్రలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి.
ఎంతో తపనతో అలవాల గవర్రాజు ఈ గ్రంథం రాశారు. ఈ రచన చదువుతుంటే వారి భావ తీవ్రత,తరతరాల ఆవేదన, భాషా చాతుర్యం కూడా పాఠకులను కట్టి పడేస్తాయి. సమాజంలో మార్పు ను కోరే ప్రతి బహుజనుడు, మార్పుకై ఉద్యమించే ప్రతి ఉద్యమకారుడు, ఉపాధ్యాయుడు,ప్రతి ప్రజాస్వామ్య వాదికి, అందరికీ ఈ గ్రంథం దిక్సూచి లా ఉపయోగపడుతుందనటంలో సందేహం లేదు.
- మడిపల్లి వెంకటేశ్వరరావు,