Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణా ప్రజల వీరోచిత పోరాటాన్ని అణచాలనే వుద్దేశ్యంతో, హైదరాబాదులోని కాంగ్రెస్ మిలిటరీ ప్రభుత్వమూ, పోలీసులు, సైన్యమూ, కాంగ్రెస్ రజాకార్లూ, కనీవిని ఎరుగని స్థాయిలో గూండాయిజాన్ని, బీభత్సకాండను, ఫాసిజాన్ని విచ్చలవిడిగా సాగించారు.
తెలంగాణాలోని పోరాట ప్రాంతమంతటా ప్రతి నాలుగైదు మైళ్ళకొకటి చొప్పున మిలిటరీ క్యాంపులు ఏర్పాటు చేయబడ్డాయి. రోజుకు రెండుసార్లు, మూడుసార్లు సైనికులు ఈ క్యాంపుల దరిదాపులలో గల గ్రామాలపై మిలటరీ దాడులు సాగించారు. ప్రజలను నిర్ణీత పద్ధతి ప్రకారం హింసలపాలు చేశారు. ప్రతి గ్రామంలోనూ ప్రజలను ఒక చోట మంద వేసి, పాశవికంగా కొట్టారు. కమ్యూనిస్టులను వెదకటం కోసం అడవులు, తోపులు, కొండలు మొదలైన వాటిలో తమవెంట రావలసిందిగాను, సమాచారం చెప్పవలసిందిగాను ప్రజలను నిర్బంధించేవారు. ఆ విధంగా వెదికినప్పుడు ఎవ్వరూ కనిపించకపోతే, మరల ప్రజలను పట్టుకు కొట్టేవారు.
మానుకోట తాలూకా తొర్రూరు, తదితర గ్రామాలలో, హుజూర్ నగర్ తాలూకాలో ప్రజలను తాళ్ళతో కట్టి గిలకల మీదుగా పైకి లాగి, ఎత్తు నుండి కిందపడ వేశారు. మనుషులను గోనె సంచులలో బెట్టి మూతిగట్టి సైనికులు నూతి మీదుగా అటు నుండి ఇటు, ఇటు నుండి అటూ విసిరి వేసేవారు.
కొంతమంది సైనికులు ఆయుధాలు చేతబట్టుకునే వారు. మరికొంత మంది ప్రజల కాళ్ళు బట్టుకుని వూపుతుండగా, యింకా కొందరు ఆ వూగుతున్న వాళ్ళను తమ ఇనప నాడాల బూట్లతో ఫుట్ బాల్‌ను తన్నినట్లు తన్నుతుండేవారు.
మండే ఎండలో, యిసుకలో ప్రజలను మూకవుమ్మడిగా పరుండబెట్టి కొట్టేవారు. కొంతమందిని తలకిందులుగా చెట్ల కొమ్మలకు వేళ్లాడదీసి, ఉయ్యాల పూపేవారు పూపుకు ఆ చివర, ఈ చివర కొట్టుతూ వుండేవారు. కొంతమందిని బోర్లా పరుండబెట్టి వీపుమీద కొయ్యపలక మీదపడవేసి సైనికులు దాని మీదికెక్కి తొక్కుతూ, నత్యంజేస్తూ వుండేవారు.
చేతి వేళ్ళ గోళ్ళ కింద గుండు సూదులు గుచ్చేవారు ఎర్రగా కాలిన ఇనుముతోనో, కొరివితోనో వొంటిపై వాతలుబెట్టటం సర్వ సాధారణం. ప్రజలను హింసలసాలు జేయటానికి విద్యుచ్ఛక్తిని కూడా వుపయోగించేవారు.
మానుకోట - ఖమ్మం తాలూకాలలో, ఒక్కోసారి పది నుండి పాతిక గ్రామాల పైన దాడులు చేసేవారు. వందలాది ప్రజలను తీవ్రంగా కొట్టేవారు. లారీల ముందు పరిగేత్తించేవారు. లారీలకంటే ముందు పరుగెత్తలేకపోయిన వాళ్ళను, లారీల వెనుక వేళ్ళాడగట్టి ఈడ్చుకు పోయేవారు.
తెట్టలపాడు గ్రామ నాయకుడగు కామ్రేడ్ వీరాస్వామి కాళ్ళు, చేతులు వెనకకు మడిచి కట్టారు. ఆయనను, మోకాళ్ళు, మోచేతుల మీద ప్రాకునట్లు చేశారు. రక్తం కారుతుండగా, ప్రాకలేనిస్థితిలో వుండగా, ఆయన తలమీద లాఠీలకో, రాళ్ళతో మోదారు. తన జోన్ కమాండర్ సత్యం ఎక్కడున్నదీ బయట బెట్టటానికి ఆయన నిరాకరించటమే అందుకు కారణం. ఈ అమానుష చర్యను గాంచిన స్త్రీలు, బిడ్డలు ఆగ్రహవేసపరులై పోలీసులపై దుమ్ము జల్లారు. వాళ్ళను తిట్టిపోశారు.
ఇల్లెందు తాలూకా, బేతాలపాడు గ్రామ ప్రజలందరినీ కొట్టారు. వారందరినీ కింద పరుండబెట్టారు. వాళ్ళపై బరువైన రాళ్ళు బెట్టారు. ''కమ్యూనిస్టులెక్కడున్నారో యిప్పుడు చెప్పండి'', ''కాంగ్రెసు పాలన మంచిదా? కమ్యూనిస్టు పాలన మంచిదా చెప్పండి'' అని అడిగారు. సైనికులు, తమ ఇనుపనాడాల బూట్లతో వారి శరీరాలపై నత్యం చేశారు. ఆ తర్వాత, వారిని ఖమ్మం ముళ్ళకంచెల బందెల దొడ్డిలో పడవేసేవారు.
మానుకోట తాలూకా మన్నెగూడెం, పుల్లెపల్లి, జయ్యారం గ్రామాలలో ప్రజలను నేలమీద పరుండబెట్టి వాళ్ళమీదుగా గుర్రాలతో స్వారీ జేశారు.
లోయపల్లి పరిసర గ్రామాలలో ప్రజలను ముండ్ల తుప్పలలో పడవేసి, సైనికులు తమ బూట్ల కాళ్ళతో వారి మీదకెక్కారు. మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ, మండుటెండలో, ప్రజలను ఆ ముండ్ల పొదల మీదుగా మోచేతులు, మోకాళ్ళతో ప్రాకునట్లు చేశారు. ఆ స్థలమంతా రక్తసిక్తమయి పోయింది. వందల మంది స్పహ గోల్పోయారు. ఈ నాజీ హింసాకాండ అంతా అయిన తర్వాత, మీరు కమ్యూనిస్టులను వదులుకుంటారా లేదా అని సైనికులు ప్రజలనడిగారు. ''మా జీవితాలలో ఎన్నడూ మేము వాళ్ళను వదులుకునేది లేదు'' అని ప్రజలు ముక్తకంఠంతో సమాధాన మిచ్చారు.
నల్గొండ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాదు జిల్లాలకు చెందిన రెండు వేలకు పైగా గ్రామాలలో, పైన పేర్కొన్న విధంగా మూడు లక్షల మంది ప్రజలను చిత్రహింసల పాలుజేశారు. సుమారు యాభై వేలమందిని అరెస్టు చేశారు. కొలదిరోజు మొదలు, మాసాల వరకు క్యాంపులతో నిర్బంధించారు. ఐదువేల మందికి పైగా, సంవత్సరాల తరబడి జైళ్ళలో నిర్బంధించబడ్డారు. ఈ మహిళలపై అత్యాచారాలు, మానభంగాలు చేసారు. మహిళలపై అత్యాచారాలు జరపటంలోనూ వారిని మానభంగం చేయటం లోనూ కాంగ్రెసు రజాకార్లు, సైనికులు నైజాం, రజాకార్లను తలదన్ని పోయారు. ఈ అత్యాచారాల స్వభావం అర్థం చేసుకొనటానికి ఈ దిగున ఉదాహరణలే చాలు:
సూర్యాపేట తాలూకా రాగిపాడులో మూడు రోజుల క్రితమే ప్రసవించిన స్త్రీని చెరిచారు.
భువనగిరి తాలూకా తెనుగుంటలో ఒక గర్భిణిని చెరిచారు. క్రితం రోజే ప్రసవించిన స్త్రీని చెరిచారు.
ఖమ్మం తాలూకా పుష్పావూరులో, భువనగిరి తాలూకా యెర్రపాడులో పది సంవత్సరాల బాలికలను సయితం చెరిచారు.
ఈ సైనికులు, ఇల్లెందు తాలూకా బలపాలలో 20 మంది స్త్రీలను, సీమలపాడులో 70 మందిని, జనగామ తాలూకా నర్మెట, నంగనూరు గ్రామాలలో 80 మందివి చెరిచారు.
నీలాయగూడెంలో గ్రామస్తులు గెరిల్లాలకు బియ్యం యిచ్చినందుకు గాను, ఆ గ్రామంలో 12 సంవత్సరాలు దాటిన వారినందరినీ కొట్టారు. పదిహేను మంది స్త్రీలను పాశవికంగా చెరిచారు.
అందిన సమాచారాన్ని బట్టి, మొట్టమొదట సంవత్సర కాలంలోనే వెయ్యి మందికిపైగా స్త్రీలను చెరిచారు. మొత్తం ఆ కాలమంతటిలోనూ కొలది వేలమందిని చెరిచారు. అనేకమంది పశువులుగా, ఒకరి తర్వాత వొకరు చెరిచినందున వందమందికి పైగా స్త్రీలు మతిజెందారు.
ఇనుప పట్కార్లతో స్త్రీల రొమ్ములను పట్టిలాగటం, నొక్కటం జరిగింది. తల్లుల ఎదుటనే బిడ్డలను చంపి వేయటమూ జరిగింది.
నెరెడలో డెబ్బై మంది స్త్రీలను వివస్త్రలను గావించారు. వారి తొడలకు తొండలను కట్టి, గాయాలలో కారం కూరారు.
దారుణ హత్యలు, సజీవ దహనాలు, జీవ సమాధులు, మూకవుమ్మడి వూచకోతలు కోసారు.
చందుపల్లికి చెందిన కామ్రేడ్ రంగయ్యను ఒక బండికి కట్టి సజీవంగా దహనం చేశారు. ''కమ్యూనిస్టు పార్టీ జిందాబాద్'' అని నినదిస్తూ ఆయన ప్రాణాలు విడిచాడు.
కామ్రేడ్ రాములును సూర్యాపేట తాలూకా, మిర్యాల వద్ద చుట్టు ముట్టడి దాడిలో పట్టుకున్నారు. ఆయన నుండి ఎలాంటి రహస్యాలూ రాబట్ట లేక ఒక లారీకి కట్టి శరీరం ముక్కలు ముక్కలై పోయేంత వరకూ ఈడ్చు కెళ్ళారు.
తెల్లవారగట్ల గ్రామాలను ముట్టడించి గ్రామ ప్రజలందరినీ ఒక చోట చేర్చి, వారిని దిగంబరులుగా మార్చి లాఠీలతో, తుపాకులతో హింసించారు. మహిళలు, బాలికలు, ముసలివారు అన్న తేడా చూడకుండా హింస కొనసాగింది.
- కాన్సెంటేషన్ క్యాంపులలో పెట్టి చర్మాలు ఊడేవరకు హింసినప్పటికీ, ఆసనాలలో కారం పెట్టినప్పటికీ ఉద్యమ రహస్యాలను బయటపెట్టలేదు. ఉద్యమాన్ని అణచాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
విద్యార్థుల ప్రతిఘటన
26 జనవరి 1950 వరకు నైజాంను రాజ్ ప్రముఖుగా నిర్ణయించినందుకు విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ఇది సహించని ప్రజలు, విద్యార్థులు కలిసి తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్‌లో జనవరి 31న పోస్టర్లు వేసి నిరసన ప్రదర్శన చేశారు. కాచిగూడ హైస్కూల్ విద్యార్థులు సమ్మె చేశారు. వరంగల్‌లో 2000ల మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేయగా కాంగ్రెస్ పోలీసులు లాఠీచార్జి చేసి అరెస్టులు చేశారు. అరెస్టు చేసిన వారిని దూరంగా అడవిలోకి తీసుకెళ్ళి వదిలి పెట్టారు. కరీంనగర్లో జనవరి 26న విద్యార్థుల పోరాటం పెద్దఎత్తున సాగింది. 300 మందితో సోషలిస్టులు సభ జరిపారు. సభ జరుగుతుండగా మలబార్ పోలీసులు రెచ్చగొట్టగా వారికి బుద్ధి చెప్పారు. పోలీసులు గాల్లోకి కాల్పులు చేసి ఐదుగురిని అరెస్టు చేసి కానరాని చోట్లకు తీసుకెళ్ళారు. కార్యాలయంపై దాడులు చేసి పుస్తకాలు ఎత్తుకపోయారు. జనవరి 31 వరకు సమ్మె చేశారు. వరంగల్‌లో విద్యార్థుల దాడితో నిరసనలు పెల్లుబుకాయి.
నల్గొండ, సూర్యాపేట, జగిత్యాల, సూల్తాన్బాద్, పెద్దపల్లి, పరకాలలో విద్యార్థులు సమ్మె చేశారు. హైదరాబాద్‌లో కొమురయ్య అనే విద్యార్థిని చిత్రవద చేసి కాల్చి చంపారు. వారి కుతంత్రాలకు విద్యార్థులు వెనుకంజ వేయలేదు. ఫిబ్రవరి 28న హైదరాబాద్‌లో విద్యార్థులు, కార్మికులు, ప్రజలు పెద్ద బహిరంగ సభ నిర్వహించారు. కమ్యూనిస్టులు, సోషలిస్టులు ఆ బహిరంగ సభలో ప్రసంగించారు. కాంగ్రెస్ పోలీసు జులుంను తీవ్రంగా ఖండించారు.
కార్మికవర్గ పోరాటాలు
పోలీసు చర్య జరిగిన వెంటనే గని కార్మికులు, హిందూ, ముస్లీం బడా వ్యాపారస్తులు కార్మికవర్గంపై జరుగుతున్న దాడులను వ్యతిరేకించారు. భారత సైన్యం కర్ఫ్యూ పెట్టింది. ఎర్రజెండాలు ఎగరవేయడం నిషేధించింది. హిందూ, ముస్లీం స్త్రీలను మనబంగాలు చేశారు. సెప్టెంబర్ 25న 9 వేల మంది కార్మికులు సమ్మె చేశారు. మెనేజ్మెంట్ వద్దకు వెళ్ళి సైన్యాలను ఉపసంహరించాలని ఆందోళన చేయగా చివరికి ఉపసంహరించాల్సి వచ్చింది. కొత్తగూడెం గని కార్మికులు నవంబర్ చివరలో బోనస్ కోసం సమ్మె చేశారు. 1949 మే లో బెల్లంపల్లి కార్మికులు మరోసారి సమ్మె చేశారు. వరంగల్, నల్గొండ జిల్లాల్లో గెరిల్లా చర్యల ప్రభావం ఉన్నప్పటికీ ఉత్సాహం పొందినప్పటికీ పరిస్థితులు తగినంత అనుకూలంగా లేవు. వివిధ పరిశ్రమలలో రిట్రెంచ్‌మెంట్, ఊరిశిక్షల రద్దు కొరుతూ సభలు, సమావేశాలు జరిగాయి. ఆజంజాహిమిల్ కార్మికుల నాయకులు భూమయ్యపై దాడి చేశారు. 1950 ఫిబ్రవరి 25 వరకు రహస్యంగా ఉన్నాడు.
ప్రభుత్వ ఉద్యోగులలో అసంతృప్తి
ముఖ్యమైన నాయకులను భారత యూనియన్ నుండి తీసుకు వచ్చి స్థానికంగా పదవులు ఇవ్వడంతో వారి కింద పని చేయడానికి ఉద్యోగులు అసంతృఫ్తి ప్రకటించారు. ద్వంద పరిపాలన వద్దు అంటూ నినాదాలు చేశారు. యూనియన్‌లో అధికారంలో ఉన్నత పదవులలో తెలంగాణ ఉద్యమం అణిచి వేయడానికి మీరే కారణం అంటూ పరస్పరం తిట్టుకున్నారు.
జైళ్ళలో పోరాటాలు
50 వేల మందిని అరెస్టు చేసి జైళ్ళలో కుక్కారు. ఒకరు ఉండాల్సిన చోట 6 గురిని పెట్టారు. కిక్కిరిసి ఉండడంతో బహిరంగ స్థలాలలో ముళ్ళ కంచెలు వేసి దానికి కరెంటు పెట్టి బహిరంగ జైళ్ళను ఏర్పాటు చేశారు. పశువుల వలె శిక్ష పడిన వారిని అరెస్టు చేసిన వారిని ఒకేచోట పెట్టారు. ఖమ్మం నిర్భంద శిబిరం, గుల్బర్గ జైలు, జాల్నా జైలు, బీడ్ జైలు, హైదరాబాద్, సికింద్రాబాద్ జైలులలో ఆందోళనలు మొదలైనాయి. వరంగల్ జైల్లో మిల్ట్రీ కాల్పులు జరిపింది. ఖైదీని కొట్టడంతో ప్రధాన ద్వారం వద్దకు వెళ్ళి ఆందోళన చేశారు. మహిళ డిటేన్యూలపై లాఠీచార్జి చేశారు. ప్రత్యేక ట్రిబ్యునల్లు ఏర్పాటు చేసి భూటక విచారణలు చేసి వేలాది మందిని అరెస్టు చేశారు. జైళ్ళలో నుండి తప్పించుకున్న ఘటనలు ఉన్నాయి. నల్ల నర్సింహులు సీనియర్ మరియు నంద్యాల శ్రీనివాసరెడ్డి అందులో ఉన్నారు.
స్త్రీల విరోచిత పాత్ర
భూములు నిలుపుకోవడంలో స్త్రీల పాత్ర గుర్తించ వల్సినది. మిర్యాలగూడ, ముకుందాపురం, వాడపల్లి లంబాడీలు, కొండ్రపోలు స్త్రీలు పోరాటాలు చేసి భూములు దక్కించుకున్నారు. కూలీ పెంపుకు పోరాటాలు చేశారు. జైనాబి (రాజారం) లచ్చమ్మ నడిగడ్డ, హము-మంగ్లీతో పాటు పాలడుగు మల్లికాంబ (కృష్ణ జిల్లా వలసగా వచ్చింది) ఎర్రమ్మ (హూజుర్‌నగర్), రాంబాయి (పిండిప్రోలు) తదితరులు వీరోజితంగా పోరాటం చేశారు. మహిళలు వివాహ సమస్యలను కూడా పరిష్కరించారు. విడాకులు భార్య, భర్తల ఇష్టాలపై ఆధారపడి చేశారు. కుల మతాలు తేడ లేకుండా వివాహాలు జరిపించారు. ఈ పోరాటాన్ని కుల వివక్షత, స్త్రీ, పురుషులకు సమాన హక్కులు, కుల మతంతర వివాహాలు అమలులోకి తెచ్చింది.
1951 ఎన్నికలు నిర్వహించే వరకు నైజాంనే హైదరాబాద్ సంస్థానానికి రాజ్‌ప్రముఖ్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. 1948 సెప్టెంబరు నుండి కమ్యూనిస్టులను అణిచివేసే బాధ్యతను కేంద్రబలగాలు తీసుకున్నాయి. 1946 జూలై నుండి 1948 సెప్టెంబరు వరకు 1500 మంది కార్యకర్తలు, నాయకులు నైజాం సైనికుల, రజాకార్ల కాల్పులకు ఘాతుకాలకు బలయ్యారు. 1948 సెప్టెంబర్ తర్వాత వచ్చిన కేంద్ర సైన్యాలు భూ సమస్యను పరిష్కరించకపోగా భూస్వాములకు, దేశ్‌ముఖ్‌లకు అనుకూలంగా పేదలను భూముల నుండి బేధఖలు కార్యక్రమాన్ని కొనసాగించాయి. ఈ పరిస్థితులలో పోరాటాన్ని కొనసాగించాలని కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించింది. భూస్వాముల నుండి స్వాధీనం చేసుకున్న భూములను రక్షించుకోవడానికి సాయుధపోరాటం అనివార్యమైంది. నైజాం పోలీసుల కన్నా కేంద్ర పోలీసు బలగాలు అత్యంత క్రూరంగా ప్రజలపై నిర్బంధకాండ కొనసాగించాయి.
చివరకు కేంద్ర ప్రభుత్వం భూ సంస్కరణల చట్టం ద్వారా పేదల స్వాధీనంలో ఉన్న భూములను వారికే హక్కు కల్పిస్తామని, రక్షిత కౌలుదారీ చట్టం 38(ఇ), ప్రకటించింది. ఈ చట్ట ప్రకటనతో తెలంగాణా సాయుధ పోరాటం 1951 అక్టోబర్ 20న ముగిస్తున్నట్లు కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది. మొత్తంగాను ఈ ఉద్యమంలో 1946 జూన్ నుండి 4000 మంది పోరాట యోధులు, రైతులు ప్రాణాలర్పించారు. ప్రపంచ చరిత్రలోనే ఈ పోరాటం గుర్తింపు పొందింది. 38(ఇ) చట్ట ప్రకారం ఇప్పటికీ కొన్ని భూములు రైతులకు పట్టాలు కావల్సియే ఉన్నది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు జరపలేదు. ఈ చట్టాన్ని సుప్రీంకోర్టులో కూడా సవాలు చేసేహక్కు లేదు.
- సాగర్ల సత్తయ్య, 7989117415