Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకప్పుడు సన్నగా గడకర్రలా ఉండే వారు ఇప్పుడు ఇంతగా భారీగా మీకు మీరే భారంగా తయారయ్యారు అన్నాడు ఆంతరంగికుడు.
అవును మారాజా ఊరికే తిండం తాగడం తొంగోవడం వల్ల ఊక కూరిన బస్తాలా మారారు అన్నాడు మంత్రి.
అదేమిటి అంతమాటన్నారు. ఊరికే గోళ్లు గిల్లుకుంటూ కూచున్నామా పరిపాలన సాగిస్తున్నాం కదా అన్నార్రాజావారు కొంచెం కోపంగా.
కోప్పడకండి సార్! పరిపాలనదేముంది. ఈ విడిది గృహంలో మీ ఎంజారుమెంట్ మీరు కొనసాగిస్తూంటే పరిపాలన దానంతట అదే సాగిపోతుంది. ఏ రాజు అయినా చేసేది అదే. పొడిచేదీ ఊడబొడిచేదీ ఏమీ ఉండదు. అంతా నౌకర్లు చాకర్లూనే కదా చూసుకునేది. పేరొకరిది పెత్తనం ఒకరిది అన్నారు అని సేనాపతి పైకి అనకుండా మనసులో అనుకున్నాడు.
మీరేం వర్రీ అవకంఇ రాజా సాబ్. రేపట్నించి రోజూ ఓ పది నిమిషాలు తోటలో వాకింగ్ చెయ్యండి కింగ్ మండలం రోజుల్లో మళ్లీ గడకర్రలా మారకపోతే నా చెవీ ముక్కూ కోసుకోనూ అన్నాడు వైద్యుడు.
వైద్యుడి సలహాను అమలు చేశాడు రాజు. మర్నాడు ఉదయం లేచీ లేవంగానే 'హాంగోవర్'కు 'లెమన్‌జ్యూస్' తాగి వాకింగ్‌కి బయల్దేరాడు.
అలాగ ఒంటరిగా చెట్లంట తిరుగుతుంటే హఠాత్తుగా ఓ జీవం ఎదురుగ్గా వచ్చి నిలబడింది.
రాజుకు పిచ్చి కోపం వచ్చింది. ఏరు ఎవర్నువ్వు చూస్తే నాలుక్కాళ్ళూ తోకా కొంచెం గుర్రంలా అగుపడ్తున్నావు అన్నాడు.
గుర్రంలా అగుపడ్తున్నాను కానీ దయలేని దేవుడు నన్ను గాడిదను చేశాడు. నన్నెప్పుడూ చూసి వుండరు మహారాజులు కదా. అయ్యా సార్ నన్ను గాడిద అంటారు. నేనొక గాడిదను సార్ అంది గాడిదే.
గాడిదవా. ఓహౌ గాడిదవన్నమాట. నీకెన్ని గుండెలు. అసలు లోపలికెలా వచ్చావ్. నా ముందుకు ఎలా రాగలిగావు అన్నాడు రాజు అసహనంగా.
తమరి ఏలుబడిలో 'కరప్షన్' ముప్ఫయి పువ్వులూ అరవై కాయలూగా వర్థిల్లుతున్నది. కాపలావాడికి లంచం యిచ్చా. నీముందుకు వచ్చా అంది గాడిద. లంచం ఇచ్చి లోపలకు రాగలిగినందుకు ఆనందంగా ఓండ్ర పెట్టాలన్న కోరికను బలవంతంగా కంట్రోల్ చేసుకుని.
ఎందుకొచ్చావ్. నేను ప్రజల్ని ఏలుకునే రాజుని కాని గాడిదలనీ, పనికిమాలిన జంతువుల్నీ ఏలుకునే వాడ్ని కాను. నీతో నాకేపనీ లేదు. నాతో నీకేం పని అన్నాడు రాజు రాత్రి నమిలిన కిళ్ళీలోని వక్కముక్కలని పళ్ళ సందుల్లోంచి నాలుకతో కెలుకుతూ.
ఇదే! ఇది అడగడానికే వచ్చాను. రాజ్యంలో ఉండే మనుషులూ, సంపదలూ మీవే అని అంటారు సరే మరి గాడిదలూ కుక్కలూ మీవి కావా? వాటి బాగోగులు చూడకుడదా? అంది గాడిద.
మనుషుల్ని ఏలడానికే టైం చాలక చస్తున్నా. గాడిదల్నీ ఏలుకోవాలా అన్నాడు రాజు నొసలు చిట్లిస్తూ ఆపుకోలేక ఆవలిస్తూ.
ధన కనక వస్తు వాహనాలే కాదు మా బోటి గాడిదల బాగోగులు చూసుకోవాల్సింది తమరే. ఈ మధ్య ఏదో మాయదారి జబ్బు వచ్చి అంటుకుందట గదా. దాని భయానికి జనం దినపత్రికలు చదవడం మానేశారు కదా. ఉత్తి కాగితాల పేగు నాది నిండకపోవడంతో అల్లాడిపోతున్నా. నాలాంటి జంతువుల యోగక్షేమాలు కూడా చూసుకోవయ్యా రారాజా. ఈ భూమి మొత్తం మనుషులదే కాదు మేమూ ఉన్నాం అని గుర్తుంచుకోరా అంది గాడిద.
అవునవును. మమ్మల్నీ పట్టించుకోండి అంటూ మరో జీవి రాజావారి ముందుకు వచ్చి నిలబడ్డది.
నువ్వెవ్వరివి అని అడక్కండి రాజా వారూ. జాతి కుక్కల్నీ వేట కుక్కల్నీ చూసి ఉంటారు కానీ ఇది ఊరకుక్క. విశ్వాసానికేం తక్కువ లేదు. యిస్తే ప్రాణం యిస్తుంది. తిక్కలేస్తే ఎవరి కాలి పిక్కనైనా పళ్ళతో పట్టి పీకుతుంది అన్నది గాడిద.
నువ్వెందుకు వచ్చావు అన్నాడు రాజు కుక్క వైపు ఈసడింపు చూపు సారించి.
అయ్యా తమరు శిశుబంధు పథకం, వృధ్యాప్య పథకం, కల్యాణ పథకం, కారుణ్య పథకం, వాళ్ళకో పథకం, వీళ్ళకో పథకం వంటివి ప్రవేశపెట్టి మనుషుల్ని ఉద్దరిస్తూ దేవుడ్నని పించుకుంటూ పాలాభిషేకాలు చేయించుకుంటున్నారు కదా మరి గాడిద బంధు పథకం కుక్క బంధు పథకం ఏకంగా జంతు బంధు పథకం ప్రవేశపెట్టవచ్చు కదా అన్నది గాడిద.
ముయ్యండి నోర్లు. ఓట్లున్న వారికి, ఓట్లు వేసే వారికి పథకాలు. మీకు పథకాలుపెడితే నాకేం ఒరుగుతుంది. తక్షణం ఒక్కడ్నుంచి పోతారా సైన్యాన్ని పిలిపించనా అన్నాడు రాజు.
వెనక కాళ్ళతో లాగి పెట్టాలన్న గాడిద కోరికా రాజావారి కాలి పిక్కను 'బ్రేక్‌ఫాస్ట్' చెయ్యాలనుకున్న కుక్క కోరికా ఆవిరై పోయేయి. దూరం నించి వస్తున్న సైనికుల్ని చూసి. ఏదో ఓ రోజు మనుషులే మా కోరికలు తీరుస్తారు అంటూ పారిపోయేయి కుక్కా గాడిదా!!
- చింతపట్ల సుదర్శన్, 9299809212