Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొందరు పుడతారు గిడతారు, కానీ పక్కింటి వారికి కూడా వారి ఉనికి తెలీదు. కానీ మరికొందరు మాత్రం బురదలో పుట్టినా ఎదిగి అందాలు విరజిమ్మే తామరలా తమ వర్ణ, సుపరిమళాల్ని వెదజల్లుతూ లోకాన్ని తనవైపు తిప్పుకొని, తామేంటో ప్రపంచానికి చాటిచెపుతారు. వారి ప్రభను ఎప్పటికీ సుస్థిరం చేసుకుని ఎందరికో ఆదర్శమై నిలుస్తారు. ఆ కోవకు చెందినవారే సినీ పబ్లిసిటీ ఆర్టిస్ట్, ప్రముఖ వాల్ పోస్టర్ డిజైనర్ '' ఈశ్వర్''.
ఈశ్వర్ కుటుంబం కళలకు సుపరిచితమే! వంశపారంపర్యంగా అబ్బిన కళ ''తనను చిత్రకళా యవనికపై ప్రముఖంగా నిలుపుతుందని'' ఈశ్వర్ చిన్నతనంలో ఏమాత్రం ఊహించి ఉండకపోవచ్చు. కానీ కాలం ఎవరికి ఎప్పుడు ఏ అమూల్య కానుకనిస్తుందో చెప్పనేలేము.
ఆంద్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో పుట్టిన ఈశ్వర్ అసలు పేరు'' కొసనా ఈశ్వర రావు''. బొమ్మల్ని ప్రేమిస్తూ, కాకినాడలో తన పాలిటెక్నిక్ చదువు ఆర్ధిక కారణాల వల్ల సాగక అర్థాతరంగా ఆగినప్పుడు ఈశ్వర్ పబ్లిసిటీ ఆర్టిస్ట్‌గా ఎదగాలనేకాంక్షతో చెన్నై చేరుకుని ''అక్కడి సీనియర్ ఆర్టిస్ట్ కేతా గారివద్ద'' శిష్యరికం చేసి పోస్టర్ డిజైన్ చేయడంలో మెళకువల్ని వంటపట్టించుకున్నారు. ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు ఐన బాపు దర్శకత్వం వహించిన ''సాక్షి'' (1967) సినిమాకు పబ్లిసిటీ డిజైనర్‌గా పోస్టర్స్, లోగోలు రూపొందించి, తొలి ప్రయత్నం లోనే మంచి గుర్తింపు పొందిన ఈశ్వర్ ఇక వెనక్కు తిరిగి చూసుకునే పనే లేకుండాపోయింది. ఆఫ్ సెట్ ముద్రణ లేని ఆ కాలంలోనే ఈశ్వర్ చేసిన లైన్ , బ్రష్, పాలెట్ నైఫ్ టెక్నిక్స్‌తో వాల్ పోస్టర్ వర్క్ సరికొత్త అందాల్ని సంతరించుకుంది. మరిన్ని ప్రయోగాలతో తెలుగు, హిందీ, కన్నడ,తమిళ , మలయాళ భాషలతో పాటుగా, పలు భాషా చిత్రాలకు పబ్లిసిటీ డిజైనర్‌గా '' ఏవియం, విజయా, జెమిని, అన్నపూర్ణ, సురేష్, వైజయంతి ప్రొడక్షన్స్'' లాంటి అగ్ర శ్రేణి సినీ నిర్మాణ సంస్థలకు పబ్లిసిటీ చేసి, నడిరోడ్డు మీద తన రంగుల వాల్ పోస్టర్స్ ముందు ఎందరినో తలెత్తి చూసేలా చేసి వారందరినీ సినిమా క్యూలోనిలబెట్టి, తాను పనిచేసిన వందలాది సినిమాలను శతదినోత్సవం దాకా నడిపిన చిత్రకళా మాంత్రికుడాయన.
ఈశ్వర్ కళాయాణం దాదాపు నాలుగు దశాబ్దాలుగా కొనసాగి 2,600 పైచిలుకు చిత్రాలకు లోగోలు, వాల్ పోస్టర్స్ అందించింది. తనెంతో పనిచేస్తూనే మరింత కొత్తదనాన్ని చూపడం కోసం పుస్తకాల్ని, ఇతర భాషల పోస్టర్స్‌ని పరిశీలిస్తూ ముందుకుసాగేవారు. వాటర్ కలర్స్‌తో ఈశ్వర్ చేసిన వాల్ పోస్టర్ డిజైన్స్ ఆయిల్ కలర్స్‌ని తలదన్నేలా ఉన్నాయని ''చిత్ర నిర్మాతల్లో ఒకరైన నాగిరెడ్డి'' ప్రశంశించేవారు. ఎందరో
నటులు ఈశ్వర్చేత తమ పోట్రైట్స్ వేయించుకోవడం కోసం క్యూ కట్టేవారంటేనే ఈశ్వర్ పనితనం ఏంటో మనం ఇట్టే ఊహించవచ్చు. ప్రముఖ '' తమిళ రాజకీయ నాయకులు అన్నాదురై'' చిత్రాన్ని గీయమని నాటి ముఖ్యమంత్రి కరుణానిధి ''మన ఈశ్వర్ ఇంటికివెళ్లి అడగడమూ'' ఈశ్వర్ పనితనానికి ఓ మచ్చుతునకే అని చెప్పొచ్చు !. తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా ఈశ్వర్చే ''శ్రీవారి చిత్రాలు'' వేయించి క్యాలండర్లుగా ప్రచురించడం కోసం ఆపనిని తనకు అప్పగించగా, తాను కొన్ని రోజుల పాటూ గర్భగుడిలో స్వామివారి ఎదురుగా కూర్చుని స్కెచ్‌లు గీయడం ''తన జీవితంలో గొప్పవిషయం అని ఎన్నో సార్లు చెప్పుకున్నారు ఈశ్వర్''.
ఈశ్వర్ చిత్రకారుడు మాత్రమే కాదు, మంచి రచయిత కూడా, తన కళా ప్రయా ణంలో తాను ఎదుర్కొన్న ఒడిదొడుకుల్ని వివరిస్తూ ఈశ్వర్ రాసిన ''సినిమా పోస్టర్'' కు 2011 లో నంది అవార్డు, సినీ రంగా నికి ఆయన చేసిన సేవల్ని కొనియాడుతూ 2015 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య పురస్కారంతో ఈశ్వర్ని సత్కరించింది. పబ్లిసిటీ రంగంనుంచి ఈ అవార్డు అందుకున్న తొలి సాంకేతిక నిపుణులు ఈశ్వర్ మాత్రమే కావడం గొప్ప విశేషం. అంతేకాదు, ''సౌత్ ఇండియన్ పబ్లిసిటీ'' సంఘానికి ఈశ్వర్ పదేళ్లు అధ్యక్ష భాధ్యతల్నీ చేపట్టారు. ఈశ్వర్ పనిచేసిన చివరిచిత్రం ''దేవుళ్ళు''.
''కళ సాధనతో వస్తుంది కొందరికి, పుట్టుకతోనే వశమవుతుంది మరికొందరికి కాని పుట్టుకతో వచ్చి సాధనతో మెరుగైనదే గొప్పకళ అంటారు'' సంజీవ్ దేవ్. అలా వారసత్వం గా వచ్చిన కళను ఈశ్వర్ నిరంతర పరిశీలన పరిశ్రమతో ద్విగుణీకతం చేసుకుని సినిమా పోస్టర్ ఈశ్వర్‌గా చిత్ర సీమపై చెరగని ముద్ర వేసుకున్నారు.
తన కుంచెతో ఎందరో తారల, ప్రముఖుల రూపాల్ని తన రేఖల్తో రంగుల్తో బంధించిన ఈశ్వర్ (84)ని సెప్టెంబర్ 21న మంగళవారం తెల్లవారుజామున '' కాలం'' బందీగా తీసుకెళ్లి కళాభిమానుల్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది.
పుట్టిన ప్రతి ప్రాణీ ఏదోరోజు కనుమూయాల్సిందే, కానీ తన జీవితంలో తానెంచుకున్న రంగంలో అత్యంత ప్రతిభ కనపరిచి, ఆ పనిపై చెరగని సంతకం చేసిన వారు మాత్రమే చరిత్రలో చిరంజీవిగా నిలుస్తారు. అప్పుడు కదా ఆ జీవితానికి ధన్యత ! కళా యాత్రికులు ఈశ్వర్ అంతటి ధన్యులే!! '' ఈశ్వర్ చిత్రాలు సజీవం, ఆచిత్రాలు కళాభిమానుల మనసుల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాయి. ''వారి సుదీర్గ కళాసేవకు'' కళాభి మానుల, కళాకారుల అశ్రు నివాళి'' ఈశ్వర్ మీరు తిరిగి తెలుగు సీమలోనే పుట్టి మీ కుంచెను కొనసాగిస్తారని నమ్ముతూ మీకుంచెకు మా కన్నీటి నమస్సు.
- శ్రీనివాస్ బీర, ఆర్టిస్ట్ , 8247027265