Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక కలం అయోమయంగా ఉన్న జీవితాలను అద్దంలో స్పష్టంగా చూపెట్టింది. ఒక కలం సమస్య లతో అతలాకుతలం అవుతున్న యువకులకు చైతన్యపు దారిని వేసింది. ఒక కలం మానవ ఎదుగుదల పరిణామ క్రమంలో తారసిల్లే తుంటరి చేష్టలకు కళ్లెం వేసింది. ఒక కలం ఒక తరము తెలుగు సాహిత్యాన్ని ప్రపంచానికి ఎరుక చేసింది. ఒక కలం మహనీయుల చరిత్రను మట్టిలో కలవకుండా అక్షరాల్లో పదిలంగా దాచింది. ఒక కలం అక్షరాలకు సిరాను అద్ది అద్ది అలసి అలసి రాయలేని, రాయడానికి వీలులేని నీటి సిరాలో దూకింది. ఒక సిరా మరణంలోకి దూకి తనదైన ప్రపంచంలో బతకడానికి బయలుదేరింది. తన కలానికి ఆ సిరాను ధరింపచేసిన వైవిధ్యమైన వ్యక్తే డోకిపర్తీ రామలింగం
జీవన రేఖలు
కథకుడిగా, కవిగా, నాటక రచయితగా, అనువాదకుడిగా, వ్యాసకర్తగా, జీవిత చరిత్రకారుడిగా భిన్న ప్రక్రియలలో రచనలు చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. బహుభాషా కోవిదుడు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్య్ర సమర యోధుడు. ఖమ్మం జిల్లా మధిర తాలూకా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు గ్రామంలో జూన్ 8, 1924లో జన్మిం చాడు. పూర్తి పేరు డోకిపర్తి రామలింగం. ప్రముఖ రచయిత దాశరథి కష్ణమాచార్యులకు రామలింగం బాల్య మిత్రుడు.
ఉద్యమ జీవితం
1946-48 మధ్యకాలంలో నిజాం అరాచక పాలనకు ప్రతికూలంగా హైదరాబాద్ స్వాతంత్య్ర సమరంలో స్టేట్ కాంగ్రెస్ తరఫున పాల్గొన్నాడు. అనంతరం తాళ్లూరి రామానుజస్వామి అనే కాంగ్రెస్‌వాది నడిపిన సారథి అనే పత్రికలో 1947లో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. ఈ సారథి పత్రికకు సహసంపాదకుడిగా ఉన్నప్పుడే ఈ పత్రికను నిజాం ప్రభుత్వం నిషేధించింది. దీంతో దాదాపు సంవత్సరంన్నర పాటు అజ్ఞాతవాసంలో ఉండి ఈ పత్రిక నిర్వహణను చేపట్టాడు. అనంతరం సురవరం ప్రారంభించిన గోలకొండ పత్రికలో పనిచేశాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యంలో పట్టా పుచ్చుకొని తెలుగు సాహిత్యంపై మమకారంతో అధ్యయనం చేసి స్వయంగా సాహిత్య రచనలు చేశాడు.
సాహిత్యం, పదవులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి అయిన దామోదరం సంజీవయ్య, ఆంధ్ర పితామహుడు మాడపాటి హనుమంతరావు, హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకష్ణారావు, శొంఠి రామమూర్తిల జీవిత చరిత్రలు రాశాడు. రవీంద్రనాథ్ ఠాగూర్, బంకింగ్ చంద్ర చటర్జీల రచనలను తెలుగు వారికి పరిచయం చేశాడు. 'విజేత' పేర వీర శివాజీకి చెందిన ఇతివత్తంతో చారిత్రక నాటకాన్ని రచించాడు. రామలింగం మొదటిసారిగా తెలుగు సాహిత్యాన్ని ఆంగ్ల ప్రపంచానికి విమర్శనా దక్కోణంలో నుండి పరిచయం చేసిన వాళ్లలో మొదటి వ్యక్తి. ఇతను 1946లో కథాంజలి పత్రికలో 'తనవంతు' అనే తొలి కథ రాశాడు. వీరు బాల సాహిత్యంలో అల్పంగా కషి చేశారు. తెలుగు సాహిత్యాన్ని గురించి ఇండియన్ లిటరేచర్ సంచికల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా తెలియపర్చాడు.
కేంద్ర సాహిత్య అకాడమీ సలహా మండలి సభ్యుడిగా ఐదేళ్లు కొనసాగారు. 1951లో తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా, 1952-56ల మధ్యకాలంలో హైదరాబాదు రాష్ట్ర ప్రభుత్వ సమాచార పౌర సంబంధాల శాఖలో పనిచేశాడు. తర్వాత కేంద్ర ప్రభుత్వశాఖలోకి మారి ఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలిలో కొంతకాలం, అటు పిమ్మట మద్రాసులో డిప్యుటీ సెన్సార్ ఆఫీసర్ గా కొంతకాలం ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి ఆ తర్వాత పదవీ విరమణ చేశాడు. రామలింగం కథలు, స్కెచ్‌లు, రేడియోనాటికలు, సాహిత్య విమర్శక వ్యాసాలు రాశాడు. నేతాజీ, తెలంగాణ సాహిత్యం తెలుగు-సాహితీ మూర్తులు, భారతీయ పునరుజ్జీవనము, కాగితపు పడవలు(కథలు), అడ్డుగోడలు వంటి రచనలను సష్టించాడు. కాగితపు పడవలు అనే కథా సంపుటాన్ని దేశీ ప్రచురణాలయం అనే సంస్థ 1964లో ప్రచురించింది. అలాగే కేంద్ర సాహిత్య అకాడమీ వారు ప్రచురించిన 'ఒక తరం తెలుగు కథ' అనే సంకలనానికి సంపాదకత్వ బాధ్యతలు చేపట్టాడు. ఈయన రాసిన 'సిపాయి రాముడు' కథలో స్వాతంత్య్రోద్యమ ఫలాలను గురించిన వత్తాంతం ఉంది.
ఈ విధంగా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని కళ్లారా చూసిన సంఘటనలకు చలించి, జీవితంలో ఎదురైన అనుభవాలను కథా వస్తువులుగా మలుచుకొని పలు పదవులను అలంకరించిన రామలింగం అరవై తొమ్మిది ఏండ్ల వయసులో ఉన్నప్పుడు వచ్చిన విపరీత కడుపు నొప్పిని భరించలేక 1993 జనవరి 3న హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
- ఘనపురం సుదర్శన్