Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గాయపడని మనసెప్పుడు అక్షరమై మాట్లాడదు. పాటై గొంతెత్తదు. కవిత్వమై కదిలించదు.గుండె గాయమైతేనే గుత్తులు గుత్తులుగా అక్షరాలు కవిత్వమై, పాటై, ప్రశ్నై సమాజం ముందు నిలబడుతది. వేదనలు, అవమానాలను, కష్టాలను ఇనాంగా పొందిన మనసే కవిత్వమై కలబడుతది. రెండు ముక్కలైన మనసే మూడు పూటలా కవిత్వాన్ని వండుకొని తింటది. కాలం పూయించిన అనుభవాలే అక్షరాల తొవ్వ జూయిస్తయి. నిత్యం కవిత్వమై పలవరిస్తది. అట్లాంటి నేపథ్యం నుంచి వచ్చిన కవి జోగి నరేష్ కుమార్. కాలానికి మనిషికి మధ్య జరుగుతున్న మానసిక సంఘర్షణను తన అక్షరాలలో బంధించాడు. అనుభవాలనే అనుభూతి చిత్రాలుగా కండ్లకు చూయించి పగిలిన గాజుకాగితాన్ని మన ముందుంచాడు. ఎక్కడో పెనుగులాట, ఏదో సంఘర్షణ, ఎదనిండా గాయాలు పుట్టుమచ్చలై మొలుస్తుంటే ఆగకుండా, ఆవిరవ్వకుండ ప్రవహిస్తున్న అక్షర ప్రవాహంలో మనసు మునకలేస్తూ తాత్విక ప్రపంచంలోకి తానుదిగి సమాజం లోతెంతో కవి హదయంతో చూస్తున్నడు. జీవితమంతా ఎక్కడ పొంతన కుదరక కాలంతో కనిపించని మనసుతో నిత్యం యుద్ధమే చేస్తున్నాడు. జోగి నరేష్ కుమార్ కవిత్వంలో నూతన పదబంధాలు, భిన్నమైన అభివ్యక్తి, వినుత్నమైన ఆలోచన శైలి, వాక్యాలను పూలతీగల్లా జారవిడుస్తునే హదయాలకు చుట్టుకుంటడు. గతంలోకి తొంగి చూస్తే కండ్ల తెరలపై అనుభవాలు పక్షులై వాలి ఎగిరిపోతయంటడు.
'ఇంకో హదయం కావాలి' కవితలో ఇలా అంటాడు.
''ఒంటరి తనపు మంటల్లో / తగలబడి పోతున్నప్పుడు / కొన్ని స్నేహపు చినుకుల్ని గుమ్మరించే మేఘంలాంటి తోడు కావాలి / పచ్చగా నీవుండాలంటే / ఇంకొక్కరు నిన్ను చుట్టుకోవాలి / పచ్చని చెట్టులా...'' అంటాడు
మనుషుల జీవితాలలో ఖాళీతనం నిండుకున్నది. ఒకరికొకరం అనే భావన అందరి లోపల తొలగిపోయింది. ఒకే ఇంట్లో ఉన్న ఎవరికి వారే అన్నట్లు ఉంది. బాధ కల్గిన సంతోషమొచ్చిన పంచుకునేందుకు ఒక హదయం కావాలంటడు కవి. కవిత్వమంటే సాంత్వన కల్గించే సాధనం. చైతన్యాన్ని రగిలించే ఆయుధం. స్ఫూర్తిని నింపే దివ్య ఔషధం. మనుషులు మానసిక రోగులుగా మారినప్పుడు వారికి చేయూతనిచ్చి చైతన్యాన్ని నింపి మాములు మనుషులను జేస్తది. జోగి నరేష్ కుమార్ కవిత్వం కూడా చైతన్యాన్ని స్ఫూర్తిని కలిగించేలా రాశాడు. ''ధడమవ్వాలి'' కవితలో ఇలా చెప్పుకొస్తడు.
''ద్వేషపు ముళ్ళు మనసును గుచ్చినప్పుడు / వేదనాగ్నిలో కాలే కట్టేలా కారాదు / భూమి పొరల్లో, వేర్లను పరచుకొని / నిలబడిన మహా వక్షంలా ఉండాలి''
''వారెంత పెద్దగా గొంతు సవరించుకొని / విమర్శన గీతాన్ని ఆలపించిన / కరిగే కొవ్వొత్తిలా కాదు / కరగని శిలలా నిలబడాలి...'' అంటాడు
నిరాశ, నిస్పహలను పారద్రోలడానికి రెండు వాక్యాలు చాలు కదా... ఇది కాదా కవిత్వం. ఇది కాదా భవిష్యత్ సాహిత్య ఆశాకిరణం ఆనవాలు. ఎంత అధ్భుతంగా చెప్పారు జోగి నరేష్ కుమార్. సూటి పోటి మాటలతో విమర్శనాస్త్రాలను సంధించి, కాలే కట్టెల కాదు / కరిగే కొవ్వొత్తిలాకాదు/ మహావక్షంలా / కరగని శిలలా నిటారుగా నిలబడాలంటాడు. నాలుగైదు కవితల్లో మనసు ముక్కలై మాట్లాడుతున్న ప్రేమాక్షరాలున్నయి. నరేష్ కుమార్‌ది చాలా సున్నితమైన హదయం. చాలా సూక్ష్మదష్టి గల కోణమే అనేక వస్తువులను కవిత్వం చేయగల్గింది. తాను ఎందుకో చాలా నిరాశగా, బాధగా అల్లిన పదాలే పగిలిన గాజుకాగితం నిండా తలో దిక్కు చేరి నేను చదువుతుంటే నన్ను చుట్టుముట్టినయి. మరి మీరు ఒక్కసారి పుస్తకం తీసుకుని చదివితే ఏమనిపిస్తదో తెల్వదు కానీ, ఇందులో తాత్వికత సామాజిక బాధ్యతతో రాసిన కవితలు ఎక్కువగా ఉన్నాయి. లోతైన బావుకత, అర్ధవంతమైన పదాల పొందిక నరేష్ కవిత్వంలో గాఢతను పెంచేలా చేశాయి. కవి అనేవాడు ప్రస్తుతం నడుస్తున్న కాలాన్ని రికార్డ్ చేసే చరిత్రకారుడు. జోగి నరేష్ కుమార్ కూడా అదేపని చేశాడు. కరోనా ప్రపంచమంతా ఎన్నో జీవితాలను బలిగొని విచ్చిన్నం చేసింది. ప్రాణాలకు విలువ లేకుండా జేసింది. ఆ సందర్భంలో రాసిన కవిత ఇది. దేవుడిప్పుడు గుడిలో లేడంటడు.
''దేవుడిప్పుడు గుడిలో లేడు / తన ప్రాణాన్ని లెక్క చేయక / ఒక ప్రాణాన్ని నిలబెట్టే డాక్టరై / ఆసుపత్రిలో ఉన్నాడు / అవును దేవుడు గుడిలో లేడు / ఆ వైరస్ ను అంతం చేసే మందునో / టీకానో కనిపెట్టాలనే శాస్త్రవేత్తలా ప్రయోగశాలలో ఉన్నాడు'' అంటాడు.
దేవుడు నిజంగా గుడిలో లేడు. మనుషులుగా సాయం చేసే మానవత్వంలో, విపత్కర పరిస్థితులను ఎదిరించిన డాక్టర్లు, పోలీసుల రూపంలో దేవుడు మన మధ్యనే ఉన్నాడు అంటాడు. తన దష్టిలో పడిన ప్రతి వస్తువును కవిత్వం చేశాడు జోగి నరేష్ కుమార్. సమాజంలో ఉన్న సమకాలీన సమస్యలపై అక్షరాస్రాల్ని సంధించాడు. మనసును తట్టిన అనేక గాయపు గుర్తులను మరచి పోవడానికి కవిత్వ లేపనం రుద్ది, పగిలిన గాజుకాగితం మీద తన మనసు ముఖచిత్రాన్ని చిత్రించుకున్నడు. తను భావాల గూడును అల్లితే అక్షరాలు మురిపెంతో తన మదిలోంచి దిగుతయి. తను కవిత్వమై కదిలితే మోడువాడిన చెట్టు చిగురాకుల తోరణం కట్టి ఎదురుచూస్తది. రాలిన ప్రేమ పువ్వు జ్ఞాపకమై తిరిగొస్తది. ఇలా పగిలిన ''గాజు కాగితం'' నిండా అనుభవాల ఆనవాలున్నాయి.
నిత్యం తనతో సంఘర్షించే దినచర్య ఫలితాలందించే పదాల పలకరింపులున్నయి. ఇది తొలి వచన కవితా సంపుటి ఐనా, కాలానికి నిలబడే కవిత్వాన్ని అందించిన నరేష్ కుమార్‌కు అభినందనలు తెలియజేస్తూ, ముందు ముందు మరింత అధ్యయనంతో సమాజ హితం కోసం సాహిత్యం రాయాలని ఆశిస్తున్నాను.
(గాజు కాగితం (కవిత్వం), రచయిత : జోగి నరేష్ కుమార్, పేజీలు : 140, వెల : రూ.100/-, ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలలో... ; జోగి నరేష్ కుమార్ ూ/ఉ బాలస్వామి, ఇంటి నం.2-36, తీలేరు గ్రామం, మరికల్ మండలం, నారాయణ పేట జిల్లా, సెల్ : 9705411605)
- బోల యాదయ్య, 9912206427