Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన కమర్షియల్ సినిమాలలో బలమైన స్త్రీ పాత్రలు తక్కువగానే కనిపిస్తాయి. అందుకే స్త్రీని అందమైన బొమ్మగా కాకుండా కొంచేం విభిన్నంగా, వ్యక్తిత్వం ఉన్న మనిషిగా చూపించే సినిమాలు ఎన్ని కథా పరమైన లోపాలతో కనిపించినా, వాటికి టెక్నికల్‌గా కానీ, వాస్తవిక దృక్కోణం పరిగణంలోని తీసుకున్నప్పుడుకాని గొప్ప సినిమాలనబడే వాటి మధ్య చేరే అర్హత లేకపోయినా, ప్రేక్షకులకు ఆ సినిమాలు గుర్తుండి పోతాయి. ఆ పాత్రలను వారు ఇష్టపడతారు. వాస్తవికతకు దూరంగా ఉన్నా సరే ఆ పాత్రలు చూపే వ్యక్తిత్వానికి ముగ్ధులవుతారు. అలాంటి పాత్రల కోవలోకి వస్తుంది హిందీలో 1988లో వచ్చిన ''ఖూన్ భరీ మాంగ్''. ఇందులోని ఆర్తి వర్మ పాత్ర హిందీ సినిమాలలో ఒక గొప్ప స్త్రీ పాత్ర అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇది పూర్తిగా కమర్షియల్ సినిమా. ముగిసిపోయిందనుకున్న రేఖ సినీ జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా. అంతే కాకుండా ఆమెకు రెండవ ఫిలిం ఫేర్ అవార్డు తీసుకొచ్చిన సినిమా. అపట్లో ఇది క్లాస్ ప్రేక్షకులను, మాస్ ప్రేక్షకులను కూడా సమాన స్థాయిలో అలరించింది. రేఖ నటన చాలా బావుంటుంది. ముఖ్యంగా అన్ని షేడ్స్ ఉన్న పాత్రలు స్త్రీలకు మన సినిమాలో దొరకడం అరుదు. రాకేష్ రోషన్ నిర్మించి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏడు ఫిలింఫేర్ నామినేషన్లు సంపాదించికుంది. రేఖ ఉత్తమ నటిగా, సోనూ వాలియా ఉత్తమ సహాయ నటిగా, సంజరు వర్మకు ఉత్తమ ఎడిటింగ్‌కి అవార్డులు లభించాయి.
ఖూన్ భరీ మాంగ్కు మాతక ''ది రిటర్న్ టూ ఈడన్'' అనే ఆస్ట్రేలియన్ మినీ సీరిస్. ఆరు గంటల పాటు మూడు భాగాలలో నడిచే ఈ సీరియల్, ప్రపంచంలో ఎన్నో దేశాలలో కోట్ల మంది ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా ఫ్రాన్స్ దేశంలో పదమూడు సార్లు ఇది టెలికాస్ట్ అయిందట. కథను పూర్తిగా ఆ సీరియల్ ప్రభావంతో మలచుకున్నారు రవికపూర్, మోహన్ కౌల్. ఆర్తి పాత్రకు రేఖను ముందే అనుకున్నారట. తరువాత ముఖ్య పాత్రకు కబీర్ బేడిని తీసుకున్నారు. ఇటలీ దేశంలో సందోకన్ అనే టీవీ సీరియల్ ద్వారా పేరు తెచ్చుకున్న కబీర్ బేడీకి ఆ దేశంలో పెద్ద ఫాలోయింగ్ ఉంది. భారత దేశంలో మాత్రం చిన్న పాత్రలకే పరిమితమయ్యారాయన. ఆయనకు మన దేశంలో దక్కిన ఒకే ఒక సూపర్ హిట్ సినిమా ''ఖూన్ భరీ మాంగ్''.
ఆర్తి ఒక పెద్ద వ్యాపారస్తుని ఏకైక కూతురు. అందమైనది కాదు. ముఖం మీద ఒక పెద్ద మచ్చ, కాస్త పళ్ళు ఎత్తు. బిడియంతో ఎక్కడా చొరవ చూపలేని సాధారణ యువతి ఆమె. కాని ఆమె భర్త విక్రం సక్సేనా ఆమెను ఇష్టపడి వివాహం చేసుకుంటాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత ఆక్సిడేంట్లో అతను మరణిస్తాడు. ఆర్తి జీవితం చీకటవుతుంది. పిల్లల కోసమే బ్రతికే ఆర్తికి తండ్రి పెద్ద అండగా నిలబడతాడు. అయితే ఆమె ఇంట్లోనే చిన్నప్పటి నుంచి ఉన్న తండి స్నేహితుడు, వారి వ్యాపారాలు చూసుకునే ఉద్యోగి కూడా అయిన హీరాలాల్ వ్యాపారంలో చాలా డబ్బు మింగేసాడని ఆర్తి తండ్రికి తెలుస్తుంది. కూతురికి ఈ సంగతి ఫోన్లో చెప్పి వ్యాపారాన్ని, కుటుంబాన్ని రక్షించుకుందాం అని అతను అనుకునేంతలో హీరాలాల్ ఆర్తి తండ్రిని చంపేస్తాడు. భర్త లేక, ఇప్పుడు తండ్రి మరణంతో ఆర్తి ఒంటరిదవుతుంది. కోట్ల ఆస్థికి వారసురాలు ఆమె. కాని వ్యాపారం పట్ల పెద్ద ఆసక్తి ఆమెకు ఉండదు. పిల్లల కోసం మాత్రమే బ్రతుకుతున్న ఆమె నుంచి ఆ ఆస్థి కాజేయాలని హీరాలాల్ తన దూరపు చుట్టమయిన సంజరుని పిలిపించుకుంటాడు. సంజరు గొప్ప అందగాడు, ఆడపిల్లల నమ్మకాన్ని చూరగొనడంలో ఆరి తేరిన వాడు. నందిని ఆర్తి స్నేహితురాలు. నందినిని ప్రేమిస్తాడు సంజరు. నందిని సంజరు కోసం ఏదైనా చేసే స్థితిలో అతని పిచ్చిలో ఉంటుంది.
సంజయ్ కి ఆర్తి ఆస్థి మీద కన్నుందని తెలిసి వారిద్దరూ కలుసుకునేలా చేస్తుంది. ఆర్తిని మొదటి చూపులోనే సంజయ్ అంచనా వేస్తాడు. ఆమెను లోబర్చుకోవడానికి ఆమె పిల్లలే మార్గం అని అర్ధం చేసుకుంటాడు. తండ్రి లేని ఆ పిల్లల పై ప్రేమ చూపించడం మొదలెడతాడు. సాంప్రదాయమైన స్త్రీగా ఇంటికే పరిమితం అయి తండ్రి స్థానంలో కూడా చేరి పిల్లల కోరికలు తీర్చలేక ఇబ్బంది పడుతున్న ఆర్తిలోని బలహీనతను కనుక్కుంటాడు సంజరు. ఆ పిల్లలకు మగ దిక్కుగా తండ్రి చేయవలసిన పనులు చేస్తూ, ఆనందాన్ని పంచుతూ పిల్లల ను పూర్తిగా తన వైపుకు తిప్పుకుంటాడు సంజరు. ఒక రోజు ఆర్తిని వివాహం చేసుకుంటాననే ప్రస్తావన తీసుకు వస్తాడు. హీరాలాల్ కూడా ఆర్తి పిల్లలకు తండ్రి అవసరమని ఆమెను ఈ పెళ్ళికి వప్పుకొమ్మని అంటాడు. నందిని కూడా అర్తి సుఖం కోరుతున్నట్టే నటిస్తూ సంజరుని వివాహం చేసుకొమ్మని ఆర్తిని ప్రోత్సహిస్తుంది. ఆ ఇంట్లో నమ్మకంగా ఉన్న ఆర్తిని పెంచిన నౌఖరు రాము కూడా ఆర్తిని వివాహం చేసుకొమ్మని అది ఆ పసి పిల్లల కోరిక కూడా అని చెప్తాడు. ఆర్తి పిల్లల కోసం సంజయ్ ని వివాహం చేసుకుంటుంది.
ఆర్తికి సిమ్లాలో ఒక పెద్ద ఎస్టేట్ ఉంటుంది. వివాహం తరువాత ఆ కుటుంబం ఆ ఎస్టేట్ కి వెళతారు. నందిని కూడా వాళ్ళతో వచ్చేలా చేస్తాడు సంజరు. సిమ్లాలో బోటు షికారుకు బయలు దేరతారు నందిని, సంజరు, ఆర్తి. ఆ నీళ్ళలో ఒక పెద్ద మొసలి ఉంటుంది. దాన్ని చూడగాని సంజరు ఆర్తిని నీళ్ళలోకి తోసేస్తాడు. నందిని ఆశ్యర్యం నుంచి తేరుకునే లోపలే ఆర్తిని మొసలి పట్టుకుంటుంది. రక్షించమని బ్రతిమిలాడిన ఆర్తిని మౌనంగా చూస్తూ ఉంటాడు సంజరు. చివరకు ఆర్తిని మొసలి నీళ్ళలోకి లాక్కుని వెళుతుంది.
ఆర్తి మరణించిందని అందరికీ తెలుస్తుంది. నందినిని అసలు విషయం ఎవరికీ చెప్పవద్దని చెబుతాడు సంజరు. ఆర్తి శవం దొరకదు. సంజరు ప్రవర్తన పిల్లల పట్ల మారుతుంది. ఈ విషయాన్ని గమనించిన అర్తి లాయర్ ఆస్తి విషయంలో ఒక షరతు పెడతాడు. ఆర్తి శవం దొరకనందున ఆమె మరణించినట్లు చెప్పలేం అని, అందువలన ఏడు సంవత్సరాల దాకా ఆ అస్థి భర్తయిన సంజరు పేరు మీద మార్చే అవకాశం లేదని చెప్తాడతను. దీనితో సంజరు ఆశల పై నీళ్ళు చల్లినట్లు అవుతుంది. అతనికి వేచి ఉండడం తప్ప మరో మార్గం ఉండదు. పిల్లల పై అతని క్రూరత్వం కనిపిస్తూ ఉంటుంది. అతనికి హీరాలల్ కు కూడ నందని సంపాదనే ఆధారం అవుతుండి. సంజరు ప్రేమ కోసం ఏమైనా చేయడానికి సిద్దంగా ఉన్న నందిని సంజరు కోసం మాడల్ గా పని చేస్తూ ఉంటుంది.
మొసలికి ఆహారం అయిందనుకున్న ఆర్తి శరీరం ఒడ్డుకు కొట్టుకువస్తుంది. ఆమె మొహం సగం పైగా మొసలికి ఆహారం అవుతుంది. ఆమెను రక్షించిన వ్యక్తి ఆమె గాయాలను కుట్టేస్తాడు. సగం పైగా ఆర్తి ముఖం కుట్లతో నిండిపోతుంది. కొన్ని రోజుల తరువాత స్పహలోకి వచ్చిన ఆర్తి తన మొహాన్ని చూసుకుని భయపడుతుంది. ఆమెకు ధైర్యం చెబుతాడు ఆమెను రక్షించిన వ్యక్తి. కోలుకున్న ఆమె తన పై జరిగిన హత్యా ప్రయత్నాన్ని, మోసాన్ని మర్చిపోలేక పోతుంది. నగరం వెళ్ళినప్పుడు తన ఇంటికి చాటుగా వెళుతుంది. అక్కడ నందిని, సంజరులను చూసినప్పుడు గాని ఆమెకు తనపై జరిగిన హత్యా ప్రయత్నం వెనుక ఉన్న కుట్ర అర్ధం కాదు. ఆమెను రక్షించిన బాబా, ఆమె నదిలో కొట్టుకు వచ్చిన సమయంలో ఆమె చివికి రవ్వల దుద్దులు ఉన్నాయని, అవి తాను తీసి దాచి ఉంచానని చెప్పి వాటిని ఆమెకు తిరిగి ఇస్తాడు. వాటిని అమ్మి వచ్చిన డబ్బుతో విదేశాలకు వెళ్ళి ప్లాస్టీక్ సర్జరీ చేయించుకుని, కొత్త ముఖంతో తిరిగి దేశానికి వస్తుంది ఆర్తి.
ఆర్తి రూపం ఇప్పుడు పూర్తిగా మారిపోతుంది. చాలా అందమైన మొహంతో తిరిగి వచ్చిన ఆమె మొదటి ధ్యేయం ప్రముఖ మోడల్‌గా పేరు తెచ్చుకున్న నందినిని దెబ్బ తీయడం. అందుకని నందిని పని చేసే యాడ్ ఏజెన్సీకే వెళుతుంది. అక్కడ ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ జే.డీ సహాయంతో ఆమె పెద్ద మోడల్‌గా ఎదుగుతుంది. నందినికి వచ్చే ఆవకాశాలన్నీ అంది పుచ్చుకుని ఆమెకు పని లేకుండా చేస్తుంది. ఇక అక్కడి నుంచి సంజరుతో పరిచయం, సంజరు ఆమె ప్రేమలో మునిగిపోవడం చివరకు సంజరు తనను ఎలా చంపాలనుకున్నాడో అదే పద్దతిలో అదే మొసలికి అతన్ని ఆహారం చేయడం తన పిల్లలను ఆమె రక్షించుకోవడం సినిమా కథ.
కథ పరంగా చూస్తే రేఖ ఈ సినిమా హీరో, హీరోయిన్ కూడా. ఆమెను ముందు బిడియస్తురాలయిన ఒక గహిణిగా చూస్తాం. అందం ఆకర్షణ లేని రూపంతో కేవలం ఇంటికే పరిమితమయిన ఒక సాధారణ స్త్రీగా ముఖంపై మచ్చతో పళ్ళు కాస్త ఎత్తుగా గట్టిగా మాట్లాడాలంటే కూడా బిడియపడే వ్యక్తిత్వంతో అందరినీ నమ్మే అమాయకురాలిగా అమె కనిపిస్తుంది. భర్త చేతిలో మోసానికి గురి అయి మొసలి తినేసిన మొఖంతో స్పహలోకి వచ్చిన ఆమె గొంతు సరిగ్గా పలకక భయంకరమైన రూపంతో కోపం, దుఖం, బాధ, ఆక్రోశం ఇన్ని భావాలు కనపరుస్తుంది. 'అతను నన్ను తోసేసాడు బాబా'' అంటూ తనకు జరిగిన మోసాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె విలవిలలాడే సీన్ ఈ సినిమాకే హై లైట్. తనను రక్షించిన బాబాను వదిలి నగరాని ఆర్తి వెళ్ళే సీన్లో రేఖ ప్రదర్శించిన హావ భావాలు చాలా గొప్పగా ఉంటాయి. తరువాత ప్లాస్టీక్ సర్జరీ చేయించుకుని తిరిగి దేశానికి వచ్చినప్పుడు, ఆమె మాడలింగ్ని వత్తిగా ఎంచుకుని పని చేస్తున్నప్పుడూ, మొదటి భాగంలోని పాత్రకు పూర్తిగా విభిన్న మైన వ్యక్తిత్వంతో ఉన్న రేఖను చూస్తాం. పాశ్చాత్య వేషధారణతో పూర్తి భిన్నమైన శరీర భాష ప్రదర్శిస్తారామె. ఒక పక్క స్త్రీగా పగ గురించి ఆలోచిస్తూ కోపాన్ని ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతూ, మరో పక్క ఒక తల్లిగా పిల్లల కోసం ఆమె పడే వేదన కదిలిస్తుంది. సంజరుని ప్రేమిస్తున్నట్టు ఒక పక్క నటిస్తూ, పిల్లల పై జరుగుతున్న అన్యాయం పట్ల కోపాన్ని ప్రదర్శిస్తూ, చివరకు నందిని, సంజరు, హీరాలాల్ మరణాన్ని చుస్తూ తనకు జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకుంటునప్పుడు ఆమె చాలా భిన్నమైన షేడ్స్ ప్రదర్శిస్తారు. ఇన్నిరూపాలను కూడా ఆహార్యం, భావ వ్యక్తీకరణతో పాటు గొంతుతో కూడా మార్చి భిన్నంగా నటించి రేఖ తన ప్రతిభను చాటుకున్నారు. ఇది పూర్తిగా పగ ప్రతీకారాలు మూల కథావస్తువుగా తీసిన సినిమా. కొన్ని సంఘటనలు వాస్తవానికి దూరంగా ఉంటాయి. కొన్ని అసాధ్యాలను సినిమా బాణిలో సాధ్యాలుగా చూపే ప్రయత్నం కనిపిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఒక మాస్ హీరో ఇమేజ్‌ని హీరోయిన్‌కి చేర్చి ఆర్తి పాత్ర ను సష్టించారు. అయితే ఆ పాత్రను రేఖ నటించిన తీరు మాత్రం మర్చిపోలేం. రేఖ నటించిన చిత్రాలలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఇది.
ప్రతి ఫ్రేమ్‌లో రేఖ తన గొంతుని వాడుకున్న విధానం గమనిస్తే వారి నటనా ప్రతిభ అర్ధం చేసుకోవచ్చు. సంభాషణల ద్వారా పాత్ర అనుభవించే భావాలను పలికించడం, గొంతు మాడ్యులేషణ్ ను మార్చుకుంటూ సీన్ ఆధారంగా పాత్రను నడిపించడం తెలిసిన నటీమణులు హిందీలో ఎనభయవ దశకుంలో దాదాపుగా లేరనే చెప్పాలి. అలాంటి సమయంలో రేఖ తన ప్రతిభతో జీవం పోసిన పాత్ర ''ఆర్తి''. ఒక సామాన్యమైన గహిణి, వివాహం కారణంగా తాను మోసపోయానని తెలుసుకుని, తన బిడ్డలకు తండ్రి రూపంలో తానే సష్టించిన సమస్యను తానే నిర్మూలించాలని పూనుకుని, తన కుటుంబానికి, తన పిల్లలకు అన్యాయం చెసిన వ్యక్తులపై పగ తీర్చుకోవడానికి ఆమె చేసే ప్రయత్నం వాస్తవికంగా లేకపోయినా రేఖ కథను తన నటనతో నడిపిస్తారు. ఆ పాత్రకు చాలా గాంభీర్యాన్నీ, విశ్వసనీయతను తీసుకుచ్చారు ఆమె. మంచి స్త్రీ పాత్రలను హిందీ సినిమాలలో గుర్తుకు తెచ్చుకునే క్రమంలో ''ఖూన్ భరీ మాంగ్'' లో ఆర్తిగా రేఖ తప్పకుండా గుర్తుకు వస్తారు. హిందీ సినిమాలను స్టడి చేసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ప్రస్తావిస్తారు. పూర్తి హీరో ఓరియంటెడ్ సినిమాలే రాజ్యం ఏలుతున్న రోజుల్లోకమర్షియల్ పంధాలో సినిమా తీస్తూ కూడా హీరోయిన్‌కి ప్రాధ్యాన్యత ఇస్తూ ఇలాంటి ఇంకొన్ని సినిమాలు రావడానికి కారణమయిన ''ఆర్తి'' పాత్ర భారతీయ సినిమా గొప్ప స్త్రీ పాత్రలలో తప్పకుండా చేర్చవలసిందే.
ఈ సినిమాలో సంజరుగా కబీర్ బేడి బావుంటారు. జే.డిగా శతుఘన్ సిన్హా, నందినిగా సోనూ వాలియా నటించారు. నందిని పాత్ర కూడా ఆలోచింపజేసే పాత్రే, ఒక పక్క పిల్లల మీద ప్రేమ, తనకు జరిగిన అన్యాయంపై పోరాడుతూ పగ తీర్చుకునే ఆర్తి ఉంటే, సంజరుపై పిచ్చి ప్రేమతో అతన్ని అన్ని వేళలా ప్రోత్సహిస్తూ, అతని అన్ని కోరికలను తీరుస్తూ, అతను ఆర్తిని డబ్బు కోసం వివాహం చేసుకుని ఆ ధనంతో సుఖపడతానంటే ఆ కోరిక తీర్చడం కోసం సంజరు ఆర్తిలను కలిపి. తరువాత ఆస్తి కోసం జరిగిన ఆర్తి హత్యను మౌనంగా చూసి అ అన్యాయాన్ని భరించి, సహించి, అటు తరువాత సంజరు కోసం పని చేసి డబ్బు సంపాదిస్తూ ప్రేమ పిచ్చిలో కొట్టుకుపోయే నందినిలో మరో స్త్రీ కోణం చూపిస్తారు దర్శకులు. చివరకు ముఖం మార్చుకుని వచ్చిన ఆర్తిని గుర్తుపట్టక ఆమె ప్రేమలో పడి తనను నిర్లక్ష్యం చేసే సంజరుని చూసే దాకా నందినికి ప్రేమ కోసం తానెన్ని తప్పులు చేసిందో అర్దం కాదు. చివర్లో ఆర్తిని రక్షిస్తూ ఆమె మరణిస్తుంది. స్త్రీ ప్రేమలోని మరో రకమైన అబ్సెషన్ని చూపించే పాత్ర నందిని. ప్రేమ కోసం అన్ని హద్దులను అతిక్రమించే రెండు పాత్రలు ఆర్తి, నందిని ''ఖూన్ భరీ మాంగ్'' లో రెండు భిన్నమైన స్త్రీ పాత్రలు.
- పి.జ్యోతి, 9885384740