Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ పుస్తకం ... ఓ కెలిడో స్కోప్... తెరిచి చూస్తే ఓ వింత లోకం... చిలుకలు, చీమల మధ్య స్నేహం. తేనెటీగలు, కందిరీగలు, తూనీగలు... ఎగిరే రంగు రంగు ఊహలు ... గంతులేసే సరదా సంగతులు... ఓ అద్భుత ప్రపంచం పిల్లల కండ్ల ముందు ఆవిష్కృతం అవుతుంది. చిలుక, చీమల మధ్య కుదిరిన స్నేహం, ఒకరికి ఒకరు సహకరించుకునే విధానం గురించి తెలిపే చెలిమి విలువ కథ. తూనిగలకు తేనెటీగ, కందిరీగ చేసిన సాయమే సహాయం కథ. పిల్లల తీరని కోరిక తీర్చిన చిలుకల సంగతులు అసలు పిల్లలు తీరని కోరికలేమిటి? చిలుకలు తీర్చినదేమిటి? పాలు నీరులా కలిసి ఉండే స్నేహితుల మధ్యకు ఆ అసూయపరుడు చేరితే కలిగే నష్టం గురించి తెలిపే కథ పాలు నీరు చెలిమి. అందం, గౌరవం అనేవి కిరీటాలతోరావు వాటి స్వభావాలతో వస్తాయని తెలిపే కథ వంకాయలు, టెంకాయలు. అపాయ సమయంలో ఉపాయం తెలియాలి.
ఉపాయంతోనే ఏదైనా సాధించగల మని తెలిపే కథ ''ఉపాయం''. కుందేలకు మొసలి ద్వారా వచ్చిన ప్రమాదమేంటి! దానిని కుందేలు ఉపాయంతో ఎలా బయటపడగల్గింది అనే విషయాన్ని తెలుపుతుంది. ''నెమలిని రక్షించిన కోయిల'' అవును ఉపకారం కథలో కోయిల నెమలిని ఎలా రక్షించింది. చేపలను తాబేలు బాతుల నుంచి ఎలా రక్షిస్తాయి. చేపలకు బాతుల వలన కలిగిన అపాయం ఏమిటి? తాబేలు తెలివి తేటలతో చేపలను ఎలా కాపాడింది అనేది కథ. సృష్టిలో పగలు రేయి చాలా ముఖ్యం. అవి లేకుంటే విశ్వం ఎలా స్థంభించి పోతుందో ఆకలి, దాహం నశించిపోయి విపరీతమైన కోరికలు కోరితే జరిగే అనర్థాలను గురించి తెలిపే కథ
''పగలు రేయీ లేకుంటే''. వీటితోపాటు ''చిలిపి చిలుక'' చెప్పిన సంగతులు ''కుందేలు కోరిక'', ''ఎలుక సహాయం'' అందుకున్న ఏనుగు కథ, ''ఎవరి విలు వారిదే'' వంటి కథలు చదివితేనే సమాజంలో మనం ఉత్తమ పౌరులుగా బతకగలం.
నిజంగా ఈ కథల సంపుటి ''బాలలకో బహుమతీ'' అందులోనూ సరళంగా చదువుకునే కథలు...
ద్విత్వ సంయుక్తాక్షరాలు లేని కథలు ఇవి. ఉపాధ్యాయురాలిగా రచయిత్రిగా, కవయిత్రిగా నిత్యం విద్యార్థుల మధ్య ఉండే వురిమళ్ల సునంద పిల్లల మనసెరిగి రాసిన కథలు ఇవి.
ప్రతులకు:
భోగోజు ఉపేందర్ రావు
సాహితీ లోగిలి,
ఇ.నెం. 11-10-694/5, బురహాన్పురం, ఖమ్మం-507001. సెల్: 9441815722
వెల: 150/-, పేజీలు: 32
- అనంతోజు మోహన్ కష్ణ