Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజా ప్రతినిధులు సమావేశాలకు హాజరవడానికి వచ్చారు. అక్కడ ఉండాల్సిన భవనం లేదు. ప్రభుత్వం అమ్మేసిందని తెల్సి ఎటుపోవాలో పాలుపోలేదు వాళ్ళకి. చెట్టుకింద అరుగుమీద బాసింపట్టువేసుక్కుచున్న సభాపతి ఆ బిల్డింగ్ అమ్మేరు ఇటురండి నా ముందు జంబుఖానా మీద నాలాగే కూచోండి. సభాకార్యకలాపాలు యాధావిధిగా సాగించుకుందాం.
రైలు స్టేషన్ దాటింది. నెమ్మదిగా దూరాన రైలు పట్టాలకు అడ్డంగా ఓ లారీ కనపడ్డంతో కెవ్వుమన్నాడు డ్రైవర్. కీచుమంటూ ఆగింది రైలు. ఎవడ్రా రైలు కడ్డంగా లారీ పెట్టింది. గుద్ది వుంటే దాని గూబ ఓనర్ గూబ గుంయ్యిమనేది అంటూ క్రిందికి దిగాడు రైలు ఓనరు.
లారీ అడ్డంగా పెట్టిన వెధవపుండాకోరు రాస్కెల్ ముందుకు వచ్చాడు. పైకి పోవడానికి రైలే కావాలా అనరిచాడు రైలోనర్. పైకి పోవడానికి కాదు బ్రదర్. డబ్బు వసూలుకి లారీ అడ్డం పెట్టా. టోల్గేట్ అనుకో అన్నాడ పట్టామీద అడ్డంగా లారీ నిలబెట్టినోడు.
రైలుకు టోల్గేట్ ఏం మాట్లాడుతున్నావు అన్నాడు రైలు ఓనర్ ఎర్ర బడిన ముఖంతో అవును ఈ రైలు నీకెక్కడిది? కొన్నానోరు. ప్రభుత్వం వారు అమ్మారు. ఇప్పుడిది ప్రయివేటు రైలు అనగా నా రైలు నాకే స్వంతం.
బాగా చెప్పావు. నేనూ అదే చెప్పాలనుకుంటు న్నాను. ఇక్కడి నుంచి పది స్టేషన్లు అక్కడిదాకా వెళ్ళే పట్టాలూ గవర్నమెంట ఆక్షన్లో నేను కొనుకున్నాను.
అవునా అని బుర్ర గోక్కున్నాడు. రైలు కొనుకున్నవాడు. కొంటే కొన్నావు. పట్టాలు ఇంటికి తీసుకుపోకపోయావా అన్నాడు ఎకసెక్కంగా రైలోడు
ఎందుకూ పాత ఇనపసామాన్ల వాడికి అమ్ముకుని నెత్తిన గుడ్డేసుకోవాలా? అని అరిచాడు పట్టాలోడు. నువ్వు రైలుని మీ ఇంటి దగ్గర కట్టేసుకోక నా పట్టాల మీదికి ఎందుకు వచ్చావు అన్నాడు చిటపటమంటూ.
విషయం అర్థం చేసుకున్నాడు రైలోడు. పట్టాలు కొన్నోడికి కొంత సొమ్ము కట్టటానికి సమ్మతించాడు. రైలు కొన్నందుకు నేను పట్టాలు కొనేసినందుకు నువ్వూ బాగుపడాలి మరి అన్నాడు నవ్వుతూ.
ఇంటి ఎదురుగా పెద్ద ఖాళీ స్థలంలో విమానం ముందు నిలబడ్డాడు దాని వోనరు. జనం గుంపులుగా ఉన్నారు. విమానం కొన్నవాడు చెప్తున్నాడు. ప్రభుత్వం వారు అమ్ముతున్నారు కదా అని చవకగ్గా వస్తే కొనేశాను. దీన్ని గాలిలో నడిపి నష్టపోవడందేనికని ఇక్కడే పాతించాను. విమానమే ఎక్కని మనుషులు వంద కొట్టి విమానం ఎక్కి చూసి రావచ్చును. భలేగా వుంటుందని జనం క్యూ కడ్తున్నారు. ఎవరాన్నా అడిగితే బర్థుడే ఫంక్షన్లకీ, పెళ్ళిళ్ళికీ కూడా అద్దెకియ్యవచ్చు. అది గిట్టిరాకపోతే మరో మనిషికి మారు బేరానికి అమ్మేయవచ్చు. అమ్మిన ధరలోంచి కొన్న ధర తీస్తేస్తే లాభమే కదా వచ్చేది. అన్నాడు విమానం కొన్నవాడు.
భూములు, అడవులూ, కొండలూ, నదులూ, స్టీలుప్లాంట్లూ, స్తంభాలూ, వైర్లూ, టవర్లూ, అఫీసులూ, రోడ్లూ, అన్నీ అమ్మకానికి పెడ్తున్నారంట డిసౌంట్లు కూడా ఇస్తున్నారంట ఒక రైలు కొంటే ఒక గూడ్సుబండి ఉచితమంట. ఒక రోడ్డు కొంటే ఓ సర్వీసు రోడ్డు ఫ్రీ అంట ఎలాగో తంటాలు పడి ఏదో ఒకటి కొనేస్తే తర్వాత లాభాలే లాభాలు లాభాలోరు లాభాలు అని ప్రజలు ఉరుకులూ పరుగులూ పెడ్తున్నారు.
ప్రజా ప్రతినిధులు సమావేశాలకు హాజరవడానికి వచ్చారు. అక్కడ ఉండాల్సిన భవనం లేదు. ప్రభుత్వం అమ్మేసిందని తెల్సి ఎటుపోవాలో పాలుపోలేదు వాళ్ళకి. చెట్టుకింద అరుగుమీద బాసింపట్టువేసుక్కుచున్న సభాపతి ఆ బిల్డింగ్ అమ్మేరు ఇటురండి నా ముందు జంబుఖానా మీద నాలాగే కూచోండి. సభాకార్యకలాపాలు యాధావిధిగా సాగించుకుందాం అన్నాడు.
శీతాకాలం సమావేశాలు కనుక చలికోట్లు వేసుకొచ్చాం. వానాకాలం సమావేశాలు అనరిచాడు సభ్యుడు అగ్గిపుల్లలా మండిపడి. అప్పుడు గొడుగులు తెచ్చుకుందురు గాని అన్నాడు సభాపతి.
కొందరు కింద కూర్చున్నారు. కానీ చాలా మంది వృద్ధులే కదా మోకాళ్ళ నొప్పులని కూచోలేకపోయారు. ఇదీ మంచిదే సభలో కూర్చండ కుర్చీలు లేవని కింద కూచోలేమని ముసలివాళ్ళు ఎన్నికల్లో పోటీ పడరు అని కిసుక్కున నవ్వింది ఓ మహిళా ప్రతినిధి. ప్రభుత్వం సభాభవనాన్నమ్మేసింది కాని లోపలి కుర్చీలను అక్కడేక్కడో వేలం వేస్తున్నది. అన్న సమాచారం తెల్సి చాలా మంది కుర్చీలు కొనుక్కోవడానికి పరుగెత్తారు. సభ్యుల సంఖ్యల తక్కువగా ఉందని సభాపతి సభను, వానాకాలం సమావేశాలకు వాయిదా వేశాడు.
వారువారుగా అమ్ముకుంటారు. వీరు వారైతే అమ్ముకుంటారు. వారైనా వీరైనా అమ్ముకుంటారు.
- చింతపట్ల సుదర్శన్, 92998092912