Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దిక్కూ మొక్కూ లేనివాడు, స్లమ్ ఏరియాలో అడుక్కుంటూ బ్రతికే బాధసర్పద్రష్టుడు. ఆకలితో అలమటించే వీధి బాలుడుగా పెరిగినవాడు, ఆదరించే వారు లేక ఒంటరిగా సమాజంపై తీవ్ర కోపంతో కసితో పిచ్చిగా తిరిగే యువకున్ని ఆ లేఖలలోని తల్లి బాధ కదిలిస్తుంది. 'చంపింది నేనేనమ్మ...' అని ఆ తల్లికి చెబుతాడు.
మనం నివసిస్తున్నది నేర సమాజమే. ఎందుకంటే జైళ్ళు వున్నాయి, పోలీసులున్నారు, న్యాయస్థానాలున్నాయి, శిక్షలూవున్నాయి. కావున ఇది నేరమయసమాజమే. నేరమనేది ఓ భౌతిక చర్య. దాని ప్రకారమే శిక్షలు వేస్తుంటారు. కానీ నేరప్రవృత్తి లేదా నేరమయఆలోచన మాత్రం మానసికమైనది. ఇది ఎలా పరిణమిస్తుంది? నేరపూరితమైన ఆలోచన మనసులోకి రావటానికి వున్న భౌతిక స్థితులేమిటి? ఎవరైనా నేరాలు ఇలా ఇలా చేయాలని తర్ఫీదు ఇస్తారా? పోనీ బోధిస్తారా? అసలా ఆలోచన ఎందుకు వస్తుంది? ఇవి ఎప్పటి నుండో వేసుకుంటున్న ప్రశ్నలే. సమాధానాలూ చెప్పుకున్నాము. మనిషి ఆలోచనలకు, ఆచరణకు సమాజమే కారణం. అంటే ఒక దొంగను చూసి మనం దొంగతనం నేర్చుకోము. మన చుట్టూ వున్న ఆవరణంలోని పరిస్థితులే మనల్ని పురికొల్పుతాయి. చాలా పూర్వమే రష్యన్ రచయిత ''కైమ్ & పనిష్మెంట్'' అనే తన నవలలో నేరాలు శిక్షల గురించి సమగ్రంగా, కళాత్మకంగానే చర్చించారు.
ఇప్పుడు అంకురం ఫేమ్ సి. ఉమామహేశ్వరరావు కథ, మాటలు దర్శకత్వం వహించిన 'ఇట్లు అమ్మ' సినిమాలో ఒక సంఘటనను ఆధారం చేసుకుని సమాజపు అంతస్సారాన్ని ఎరుకపరిచే ప్రయత్నం విజయవంతంగానే చేశారు. సామాజిక అంశాలను చిత్రించే దర్శకుడుగా వున్న పేరును నిలబెట్టుకున్నారు. సినిమా ఆరంభం నుంచీ ప్రేక్షకులను ఉత్సకతతో తను అనుకున్న కథలోకి తీసుకుపోయారు. భర్త చనిపోగా ఉన్న ఒక్కగానొక్క కొడుకును చాలా అపురూపంగా చూసుకుంటున్న సంప్రదాయ బ్రహ్మణకుటుంబంలోని స్త్రీ (రేవతి) ప్రధాన పాత్రగా కథంతా నడుస్తుంది. తండ్రి పోవడంతో అక్కడే కొడుకుకు ఉద్యోగం వస్తుంది. చాలా జాగ్రత్తగా, ఎవరి జోలికి వెల్ళకుండా, ఎవరితో తిరగకుండా, తమ విషయాలు బతుకూ తప్ప ఇంకేది పట్టించుకోని, ఎవరికీ హాని తలపెట్టని బుద్ధిమంతులుగా జీవనం సాగిస్తుంటారు. అమాయకంగానూ ఉంటారు. ఒక రోజు అకస్మాత్తుగా కొడుకు హత్యకు గురవుతాడు. ఎవరూ శత్రువులూ, ద్వేషాలూలేని తన కుమారుణ్ణి ఎవరు చంపారో, ఎందుకు చంపారో ఆ అమ్మకు అంతు పట్టలేదు. ఎవరో పొడిచి చంపారు అనేంత వరకు పోలీసులు తెలుసుకోగలుగుతారు. ఆచూకీ కనుగొనలేక పరిషాన్ అవుతారు పోలీసులు. పోలీస్స్టేషన్ చుట్టూ తిరిగీ తిరిగీ వేదన పడుతూ ఆఖరికి 'నా కొడుకును ఎందుకు చంపారో తెలిస్తే చాలనుకుంటుంది అమ్మ. అదీ తెలియదు. చివరగా ఒక జర్నలిస్టు సలహా ఇస్తాడు. పత్రికలో మీ వేదననను, నిందితుడు ఎందుకు ఆ నేరం చేశాడో తెలుపమని లేఖలుగా రాయమని చెప్తాడు. సత్యాన్ని ఎలా తెలుసుకోవటం అనే సమస్యతో సతమతమవుతూ గాందీజీ 'సత్యాన్వేషణ' ఇతర పుస్తకాలు చదువుతూ కాలం గడిపే అమ్మకు ఈ ఆలోచన వచ్చి పత్రికకు తన కొడుకు ఉదంతాన్ని అమ్మకోణం నుంచి ఆర్థ్రంగా రాస్తుంది. సినిమాలో పత్రికకు అనే నేపంతో లక్షలాది ప్రేక్షకులకు చంపబడ్డ ఒక మనిషి తల్లి పడే వేదన దుఃఖాన్ని చాలా అద్భతంగా చెబుతారు. దర్శకులు. ఆసక్తి గల ఆ లేఖలను పాఠకులు విరివిగా చదువుతుంటారు.
హత్య చేసిన అనాథ యువకుడు వింటుంటాడు. దిక్కూ మొక్కూ లేనివాడు, స్లమ్ ఏరియాలో అడుక్కుంటూ బ్రతికే బాధసర్పద్రష్టుడు. ఆకలితో అలమటించే వీధి బాలుడుగా పెరిగినవాడు, ఆదరించే వారు లేక ఒంటరిగా సమాజంపై తీవ్ర కోపంతో కసితో పిచ్చిగా తిరిగే యువకున్ని ఆ లేఖలలోని తల్లి బాధ కదిలిస్తుంది. 'చంపింది నేనేనని' ఆ అమ్మకు పోయి చెబుతాడు.
అక్కడే దర్శకుని ప్రతిభ మనకు కనపడుతుంది. ఎందుకు చంపావని అమ్మ అడిగితే, ఒట్టిగనే, ఒట్టిగనే చంపాను, ఆకలి అవుతుంటే డబ్బులివ్వలేదని చంపేసా, ప్రేమ, కరుణ, తోడు నేనున్నాననే వారు లేరు. ఆదుకునేవాళ్లే లేరు. కొడుకు రాక పోతే ఎదురు చూసే నీలాంటి అమ్మలుంటారని తెలువదు' అని దుఃఖిస్తూ పడిపోవడం, దుఃఖిస్తూ అమ్మా కూలబడటం ఓ గొప్పసన్నివేశం. అతన్ని చేరదీసి వైద్యం చేయించి, అన్నం పెట్టి పంపిస్తుంది. ఎవరికీ ఏ అపకారం అన్యాయం చేయకుండా మంచి మనుషులుగానే మేం ఉన్నామంటే సరిపోదు. అనే సత్యాన్ని తెలుసుకుంటుంది. గోర్కి రాసిన 'అమ్మ' నవల చదువుతుంది. సమాజంలో అనేక రుగ్మతలు, ఆకలి, దారిద్య్రం, అన్యాయం, దురాగతాలు, మనకు మనమే మంచిగా వుండలేమనే సారాంశాన్ని చాలా హృద్యంగా చెప్పగలిగారు దర్శకులు. అమ్మగా నటించిన రేవతి చాలా సజీవంగా ఆ పాత్రలో ఒదిగిపోయారు. కథంతా కూడా ఆమే కేంద్రంగానే నడుస్తుంది. ఆ తర్వాత పోలీసు పాత్ర, పోలీసులు, ప్రభుత్వాల వైఫల్యాలను ఉద్వేగ రహితంగానే చాలా స్పష్టంగా చూపించారు. సినిమా మొదటి సీను మర్డర్తోనే ప్రారంభం కావడం, తర్వాత దుఃఖం, వేదన వెతుకులాట భారంగానే కొనసాగుతుంది. అయితే మధ్యలో గోరటి వెంకన్న బృందగానం 'అద్దాల అంగడి మాయ' పాట అర్థవంతంగా, ఉత్సాహంగానూ సాగి రిలాక్స్నిచ్చింది.
మార్క్సిమ్ గోర్కీ 'అమ్మ' నవలలోని అమ్మలాగా ఈ అమ్మ పరిణామ చెందటం ఇప్పుడందరు అమ్మలకూ అవసరం. ఒక ఘటన నుంచి పెద్ద తాత్విక, రాజకీయ, ఆర్థిక సామాజిక అంశాన్ని సూక్ష్మంలో విశదపరచే సినిమాగా నిలుస్తుంది. అయితే అంతా సీరియస్గా కాకుండా కొంత ఎంటర్టైన్మెంట్ను కూడా జోడిస్తే బాగుండేదనిపించింది. మొత్తంగా రెండే పాటలు, అదీ ఒకటి చాలా చిన్నది. మ్యూజిక్ బాగుంది. ఇలాంటి సినిమా తీయటానికి ముందుకు వచ్చిన బొమ్మకు మురళి అభినందనీయులు, ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు తప్పక చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమా సోని ఓటీటీలో అందుబాటులో ఉంది.
- కె. ఆనందాచారి