Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆరురుతువులలోని సహజస్థితిని మనమంతా అనుభవిస్తుంటాము అలా కాకుండా మననుండి దూరంగా జరిగినదేదో, మనదైనది మనకు కాకుండా పోయిందేదో ఒక అసహజమైన పరిస్థితి మనల్ని వేధిస్తుంటుంది. అదంతా ఒక దగ్గరగా చేరుస్తూ కవి కొండి మల్లారెడ్డి కవిత్వంగా పట్టుకొచ్చాడు.
కొండి మల్లారెడ్డి సిద్దిపేట జిల్లా గంగాపురం నివాసి. ఇప్పటి వరకు వీరు నాలుగు కవితాసంపుటలను వెలువ రించారు. 2013లో 'అలికిడి', 2018లో ఇప్పుడు వీస్తున్న గాలి', 2019లో ''శబ్దభేది'', 2020లో ''భిన్నరుతువు''. అంతే కాకుండా కథా సంకలనాలకు సంపాదకులుగా కూడా వ్యవహరించారు.
ఈ పుస్తకంలో కవి స్వచ్ఛమైన ఊరును కోరుకుంటాడు. వలసకూలీల జీవితాలను పలవరిస్తాడు. నిశ్శబ్దం ఒక ఆయుధమని చాటి చెబుతాడు. ప్రాణాన్ని పణంగా పెట్టి పనిచేసే పారిశుద్ధ్య కార్మికులను, పోలీసులను, వైద్యులను ,రైతులను దేవుళ్ళుగా కొలుస్తాడు. కరోనా కాలపు బాధలను కవితలుగా మలిచాడు. కొన్ని కవితల్లో జీవితాన్ని దర్శింపచేస్తాడు.
వెంటాడే వాక్యాల్లోకి..
1.వెన్నుపూసలు
మూలవాసాలై నిలబెడితేనే
పట్నంతోవలు
ప్లైవోవర్లై పైకిలేచింది
(గూళ్ళకు చేరాలి - పేజీ 13)
వలసకూలీల ప్రాధాన్యతను తెలిపేందుకు కవి ఈ వాక్యాలను వాడాడు.ఈ నాలుగు వాక్యాల్లో వారి జీవితాన్నంతా చూపించాడు. 'మూలవాసాలు' అనే పదప్రయోగం వారు దేశాభివద్ధిలో ఎంత కీలకమైన వ్యక్తులో తెలియచేస్తుంది.కవి అన్నట్టుగా దేశానికి మూలవాసాలు శ్రామికులే.
2.వెలకట్టలేని
విలువల ప్రతిరూపాలు
పరిమళిస్తున్న
మానవత్వ ప్రతీకలు..(దేవుళ్ళు-పేజీ 23)
సాధారణంగా రోజువారీ జీవితంలో పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు ఎదురవుతుంటారు. వారు ఎంతో సేవ చేస్తున్నారు. ఏ వత్తిలోనైనా కొంతమందిని మినహాయించుకో వచ్చు. అది వేరే విషయం. కానీ కరోనా సమయంలో వారి ప్రాధాన్యత కళ్ళకు కట్టినట్టుగా కనబడింది. అందుకే కవి వీళ్ళను మానవత్వానికి ప్రతీకలుగా చెప్పుకొస్తూ దేవుళ్ళని సంభోదించాడు. కవి రాసిన ఈ వాక్యాలు అంగీకరించదగినవి.
3. తను కూర్చున్న కొమ్మను
తనే నరుక్కుంటున్న మనిషికి
ప్రకతే
చొరవతో
ధైర్యవచనాలు నూరిపోస్తుంది
(కాసింత తెరిపి కోసం- పేజీ 91)
ఈ వాక్యాల్లో మనుషులే ప్రకతి విపత్తులకు కారణమన్న విషయాన్ని చెబుతాడు.ఎవరికి వాళ్ళుగా బాధ్యతగా నడుచుకుంటే ప్రకతి వినాశనము జరుగదని చెబుతూ ప్రకతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని కాస్త వనరులను రాబోయే తరాలవారికి మిగల్చాలన్న ఎరుకను కలిగిస్తాడు.
4.త్యాగాలను
చెరిపేసిన చెదపురుగు
తనకుతాను
సరికొత్తగా చరిత్ర రాసుకుంటుంది
(తంగేడు పూలు దుఃఖం - పేజీ 101)
తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడి రాజకీయ, సామాజిక,ఆర్థిక పరిస్థితు లను చెబుతూ రాసిన వాక్యాలివి. కవి తంగేడు పూలను తెలంగాణ ప్రజలకు ప్రతీకగా చెప్పాడు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడు ఎవ్వరికి మేలు చేయటంలేదన్న అసహనాన్ని ఈ వాక్యాల ద్వారా వ్యక్తం చేశాడు. ఇవి కనువిప్పును కలిగించే బలమైన వాక్యాలు.
ఈ పుస్తకంలో సరళమైన భాషను గమనించవచ్చు, చక్కటి కవితా నిర్మాణాన్ని, అభివ్యక్తిని గమనించవచ్చు. ఇది అందరికీ సులభంగా అర్థమయ్యే కవిత్వరుతువు.
- తండ హరీష్ గౌడ్,
8978439551