Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంగీతంలో ఎలాంటి శిక్షణ పొందకున్న, ఎ వయసు వారినైనా ఏమార్చే కనికట్టు ఆ కంఠంలో దాగి ఉంది. వేదనని, ప్రేమని, భక్తి భావాన్ని పలికించడంలో... ఆమె గాత్రం మనసు లోతుల్లో స్థిర పడి, మదిని ఎక్కడికో తీసుకువెళ్తుంది. ఎంత మరచి పోవాలన్న మరపురాని మధురమన స్వరం అది. మధువైన, ఉల్లాసవంతమైన శ్రావ్యతకు పేరు గాంచిన అనురాధ.
ఆమె గొంతు కోయిల స్వరం.. ఆమె పాడితే అమతం..
''ధీరే ధీరే సే మేరి జిందగీ మే ఆనా'' అంటూ...
సంగీత ప్రియులను తన సుమదూర స్వరరాగాల పల్లకిలో ఊయాలలూగించి,
''బహుత్ ప్యార్ కార్తే హై తుమ్కో సనమ్''...
''నజర్ కే సామ్నే జిగర్ కే పాస్'' అంటూ...
రొమాంటిక్ శైలిలో పాడుతూ యువ శ్రోతలను హుషారెత్తించి, మైమరపింపచేసిన గాయని అనురాధ పౌడ్వాల్.
సంగీతంలో ఎలాంటి శిక్షణ పొందకున్న, ఎ వయసు వారినైనా ఏమార్చే కనికట్టు ఆ కంఠంలో దాగి ఉంది. వేదనని, ప్రేమని, భక్తి భావాన్ని పలికించడంలో... ఆమె గాత్రం మనసు లోతుల్లో స్థిర పడి, మదిని ఎక్కడికో తీసుకువెళ్తుంది. ఎంత మరచి పోవాలన్న మరపురాని మధురమన స్వరం అది. మధువైన, ఉల్లాసవంతమైన శ్రావ్యతకు పేరు గాంచిన అనురాధ, సినీ సంగీత ప్రపంచంలో ఏకఛత్రాధిపత్యంగా రాజ్యామెళుతున్న ''మంగేష్కర్ సిస్టర్స్'' గుత్తాధిపత్యాన్ని సవాలు చేసి, హిందీతో పాటు మరాఠీ, మార్వాడీ, తమిళం, ఒడియా, నేపాలీ, బెంగాలీ, కన్నడ, తెలుగు చిత్రాలలో పాటలు పాడటమే కాకుండా, అనేక భాషలలొ భక్తి గీతాల ఆల్బమ్‌లలో పాడుతూ సంగీత ఆస్వాదకులను భక్తి పారవశ్యంలో ఓలలాడిస్తున్నారు. అనురాధ పౌడ్వాల్ భారత ప్రభుత్వం అందించే ''పద్మశ్రీ'' పురస్కారాన్ని, జాతీయ స్థాయిలో ఉత్తమ నేపథ్య గాయనిగా ఎన్నికవ్వడంతో పాటు, నాలుగు సార్లు ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా 'ఫిల్మ్‌ఫేర్ అవార్డు'లు అందుకున్నారు.
అనురాధ పౌడ్వాల్ ('అల్కా నాదకర్ణి') 1954, అక్టోబర్ 27న మహారాష్ట్రలోని (ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం) కార్వార్‌లోని మరాఠీ మాట్లాడే కుటుంబంలో జన్మించారు. పాటలు పాడటాన్ని నిషిద్దంగా బావించే కుటుంబంలో జన్మించిన అనురాధ రేడియోలో లతా మంగేష్కర్ పాటలు విని సంగీతంలో ప్రేరణ పొందారు. ఆమె 4వ తరగతి చదువుతున్నపుడే లతా పాటలు ప్రత్యక్షంగా వినాలని కలలు కనేది. అదే సమయంలో అనురాధ 'న్యూమేనియా' వ్యాదితో తీవ్ర అనారోగ్యానికి గురై తన స్వరాన్ని కోల్పోయింది. 40 రోజులు ఆసుపత్రిలో ఉన్న సమయంలో అనురాధ అంకుల్ లతా పాడిన ''భగవద్గీత'' ఆడియో క్యాసెట్ ఇచ్చాడు. ఆ సమయంలో లతా పాడిన ''భగవద్గీత''ను వింటూ, ఆ స్వరాన్ని అనుకరించడం ప్రారంబించింది. తండ్రి వ్యతిరేకించిన, అనురాధకు సంగీతం పట్ల ఉన్న ఆసక్తిని గమనించిన తల్లి ఆమెను సంగీత పాటశాలలో చేర్పించి అక్కడ కొన్నాళ్ళు, మరికొన్ని చోట్ల శిక్షణ ఇప్పించిన పలితం లేకపోయింది. అయితే స్కూల్లో జరిగిన అనేక సాంస్కతిక కార్యక్రమంలో పాటల పోటీలలో పాల్గొని పలుమార్లు బహుమతులను గెల్చుకుంది. ఆమె మొదటిసారి గెల్చుకున్న అవార్డు లతా పాడిన మీరా భజనలలో ఒకటి. ప్రాథమిక విద్యను పూర్తి చేసిన అనంతరం అనురాధ బొంబాయిలో జేవియర్స్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. గ్రాడ్యుయేషన్ అనంతరం లతా మంగేష్కర్‌ను గురువుగా బావించి, ఆమెను స్పూర్తిగా తీసుకుని లతా నోట్ లను అనుసరించి గంటల తరబడి ప్రాక్టీస్ చేసింది.
అరుణ్ పౌడ్వాల్తో వివాహం
అనురాధ 17ఏండ్ల వయసులో ఉన్నపుడు సంగీత దర్శకుడు ఎస్డి బర్మన్కి సహాయకుడిగా పనిచేస్తున్న తనకంటే 10 ఏండ్లు పెద్దవాడైన అరుణ్ పౌడ్వాల్తో ప్రేమలో పడింది. అయితే సంగీత ప్రపంచంతో సంబందాలు కలిగి ఉన్న కారణంతో అరుణ్‌తో వివాహానికి అనురాధ తండ్రి మొదట్లో ఒప్పుకోలేదు. కానీ ఆయన చివరకు వారి ప్రేమను అంగీకరించ డంతో 1969వ సంవత్సరంలో వారి వివాహం జరిగింది. వివాహం అయిన తర్వాత అనురాధను పాడమని ప్రోత్సాహాన్ని అందివ్వడమే కాకుండా గురువు, విమర్శకుడయ్యాడు. అరుణ్ పౌడ్వాల్ 'గుజరాతీ యువ వాణి' రేడియో కార్యక్రమంలో అనురాధ చేత ఒక పాటని పాడించాడు. ఈ పాట ప్రజాదరణ పొందింది. దీంతో లక్ష్మీకాంత్ ప్యారేలాల్, హదరు నాథ్ మంగేష్కర్ తో పాటు చాలా మంది స్వరకర్తలు ఈ పాట ఎవరు పాడారని రేడియో స్టేషన్ కు ఫోన్ చేసి తెలుసుకున్నారు.
సినిమాలలో గాయనిగా
అనురాధ పౌడ్వాల్ 1973 లో అమితాబ్, జయ బచ్చన్ నటించిన 'అభిమన్' సినిమాతో తన కెరీర్ ప్రారంబించింది. ఇందులో ఆమె ఎస్. డి. బర్మన్ స్వరపరిచిన సంస్కత ''శ్లోకం'' పాడింది. అదే సంవత్సరం 'దత్తా దవ్జేకర్' సంగీతంలో ''యశోద'' చిత్రంతో మరాఠీ సినిమాలో అరంగేట్రం చేసింది. యశోద చిత్రం కోసం ఆమె పాడిన పాట ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత 1974 లో ఆమె పాడిన చలన చిత్రేతర మరాఠీ పాటలు ''భావ గీతెన్'' విశేష ప్రాచుర్యం పొంది అనురాధకు మంచి గుర్తింపుని తెచ్చాయి. 1976 లో, 'కాళీచరణ్' చిత్రంతో హిందీ చిత్రాలలో గాయనిగా అడుగు పెట్టింది. అయితే ఆమె మొట్టమొదటి సోలో చిత్రం, లక్ష్మీకాంత్-ప్యారేలాల్ సంగీతంలో రూపొందిన 'ఆప్ బీటీ'. అనంతరం రాజేష్ రోషన్, జైదేవ్, కల్యాణ్‌జీ-ఆనంద్జీ, ఉషా ఖన్నా సంగీత దర్శకత్వంలో వచ్చిన పలు చిత్రాలలో పాటలు పాడారు. 1978 లో 'బాదల్తే రిస్తే' సినిమాలో లెజెండరీ గాయకుడు కిషోర్ కుమార్ తో ''గుమ్సమ్ సి ఖోరు ఖోరు'' పాటని పాడారు.
లక్ష్మీకాంత్ -ప్యారేలాల్ స్వరకల్పనలో అనూరాధ పౌడ్వాల్ ''హీరో'', ''మేరీ జంగ్'', ''బత్వారా'', ''నగినా'', ''రామ్ లఖన్'', ''తేజాబ్'' చిత్రాలకు పాడిన పాటలు హిట్ అయ్యాయి. ఆ తరువాత అనూరాధ సినీ నిర్మాత, గుల్షన్ కుమార్‌తో కలిసి పనిచేసింది. 1987 లో టి-సిరీస్, సూపర్ క్యాసెట్ మ్యూజిక్ కంపెనీలో చేరిన తర్వాత, 1990 వ దశకంలో అనురాధ పౌడ్వాల్ సంగీతంలో కొత్త విజయాలు సాధించారు. 'సడక్', 'ఆషికి', 'లాల్ దుపట్ట మల్మల్ కా', 'బహార్ ఆనే తక్', 'అయి మిలన్ కీ రాత్', 'దిల్ హై కి మంత నహీ' 'సాజన్' వంటి సినిమాల పాటలు ఆమెను రాత్రికి రాత్రే పాపులారిటీకి ఎదిగేలా చేశాయి. అనురాధ భర్త అరుణ్ పౌడ్వాల్ కూడా ఆమెని ముందుకు సాగడానికి ప్రోత్సహించాడు. ఆమె గుల్షన్ కుమార్‌తో పాటు కుమార్ సాను, ఉదిత్ నారాయణ్, అభిజీత్, సోను నిగమ్‌తో సహా అనేక మంది కొత్త నేపథ్య గాయకులను పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. అనూరాధ భర్త అరుణ్ పౌడ్వాల్తో కలిసి కొత్త సంగీత దర్శకులు నదీమ్-శ్రావణ్, అను మాలిక్, నిఖిల్ వినరు, అమర్ ఉత్పల్ లు సంగీత ప్రపంచానికి పరిచయమయ్యారు. వీరందరూ గుల్షన్ కుమార్ మ్యూజిక్ కంపెనీ ''టీ-సిరీస్ ద్వారా బాలీవుడ్లో కొత్త శ్రావ్యత శకాన్ని ప్రారంభించారు.
ఆమె సినిమా పాటలు విశేష ప్రాచుర్యంలో ఉన్న సమయంలో ''టి-సిరీస్'' కోసం మాత్రమే ప్రత్యేకంగా పాడతానని అనూరాధ పౌడ్వాల్ ప్రకటించింది. భక్తి పాటలు ''కవర్-వెర్షన్'' ఆల్బమ్‌లపై దష్టి పెట్టింది. అనేక భజన, ప్రచార వీడియోలలో టి-సిరీస్ ఆమె ఆకర్షణీయమైన రూపాన్ని ఉపయోగించింది. సినిమా నటీనటుల కంటే మ్యూజిక్ కవర్లలో కనిపించిన మొదటి ప్లేబ్యాక్ సింగర్ ఆమె. అనురాధ కొంతకాలం టి-సిరీస్ కోసం పాడింది. తరువాత విశ్రాంతి తీసుకుంది. దాదాపు ఐదు సంవత్సరాల తరువాత, ఆమె తన ప్లేబ్యాక్ కెరీర్‌ను తిరిగి ప్రారంభించింది. ఆమె తన పాత సంగీత దర్శకుల కోసం కొన్ని హిట్ పాటలు పాడింది. కానీ అనూరాధ సినిమాలకు పాడడం గణనీయంగా తగ్గిపోయిన ప్పటికీ, ఆమె భక్తి పాటలు, గజల్స్ ఆల్బమ్‌లను రూపొందిం చడం ద్వారా ఆమె ప్రజాదరణను కొనసాగిస్తూనే ఉంది.
తెలుగులో
అనురాధ దక్షిణాదికి చెందిన గాయకులు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం కె. జె. యేసుదాస్, మనో లతో కలిసి అందమైన యుగళ గీతాలు పాడారు. అనురాధ పౌడ్వాల్ బప్పీ లాహిరి సంగీత దర్శకత్వంలో వచ్చిన 'ఇంద్ర భవనం' సినిమాలో మనో తో కలసి 5 పాటలు, 'రక్త తర్పణం' చిత్రంలో ''చిక్కలి చిక్కలి'' పాట, వందేమాతరం శ్రీనివాస్ స్వరపరచిన 'మనసున్న మారాజు' చిత్రంలో ఉదిత్ నారా యణ్ తో ''నేను గాలి గోపురం''పాట, 2005లో మణి శర్మస్వరకల్పంలో వచ్చిన 'సుభాష్ చంద్ర బోస్' చిత్రంలో ''వందేమాతరం'' పాటని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలసి ఆలపించారు. తెలుగులో సినిమా పాటలతో పాటు అనురాధ పాడిన భక్తి గీతాలు సైతం తెలుగు వారినోట విరాజిల్లుతున్నాయి. ఆమె తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వెంకటేశ్వర భక్తి గీతాలు ఆల్బమ్, ఉదిత్ నారాయణ్ తో కలిసి పాడిన సాయి మహిమ, ''సాయి ధుని'' అమతవాణీ ''సాయి దివ్య రూపం'' సి నారాయణరెడ్డి సాహిత్యం అందించిన ''సాయి దేవ సాయి దేవ'' భక్తి గీతాల ఆల్బమ్‌లను ఆదిత్య పౌడ్వాల్ స్వరాలు సమకూర్చగా అనురాధ పాడారు.
లతా మంగేష్కర్ గుత్తాధిపత్యాన్ని సవాలు చేసిన గాయని
అనురాధ పౌడ్వాల్ ప్రముఖ నేపథ్య గాయకులైన లతా మంగేష్కర్, ఆశా భోంస్లే లు హిందీ చిత్ర పరిశ్రమలో అనేక విజయాలు సాధించి ఏకఛాత్రాదిపత్యం కొనసాగిస్తున్న సమయంలో మంగేష్కర్ సిస్టర్స్ గుత్తాధిపత్యాన్ని సవాలు చేసిన మొదటి గాయని ఆమె. లతా మంగేష్కర్ తనకి స్పూర్తి ని ఇచ్చిన గురువుగా భావించే ఆమె సినిమాల్లో పాటలు పాడటానికి వచ్చిన విషయాన్ని చెప్పడానికి లతా వద్దకు వెళ్ళినపుడు ఆమె అవమానించడంతో కలత చెందిన అనురాధ వారి గుతాధి పత్యాన్ని సవాలు చేసి ఒకే రోజు నదీమ్-శ్రవణ్ తో కలిసి 23 పాటలను రికార్డ్ చేసింది. అయితే అనేకమంది సంగీత దర్శకులు ఆమె పాడే చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించడానికి నిరాకరించారు. ఎందుకంటే వారు లతా మంగేష్కర్, ఆశా భోంస్లే ల ఆగ్రహాన్ని ఎదుర్కొవలసి వస్తుందని భయపడ్డారు. ఆ సమయంలోనే అనురాధ కొత్త సంగీత దర్శకుల స్వరకల్పనలో పాటలు పాడి విజయశిఖరాలను అదిరోహించింది.
'సూర్యోదయ' ద్వారా సేవా కార్యక్రమాలు
అనురాధ పౌడ్వాల్ జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో భర్త 'అరుణ్ పౌడ్వాల్' మరణం.., ఆ తర్వాత తనకి గాయనిగా గుర్తింపు వచ్చేందుకు దోహద పడిన 'గుల్షన్ కుమార్' హత్యకి గురవ్వడం, చేతికి ఎదిగిన కుమారుడు 'ఆదిత్య' మూత్రపిండాల వైఫల్యంతో మరణించడం, అనురాధని తీవ్ర వేదనకు గురిచేసింది. కాగా ఆమె తన భర్త 'అరుణ్ పౌడ్వాల్' జ్ఞాపకార్థం 'సూర్యోదయ పౌండేషన్' పేరుతో స్వచ్చంద సేవా సంస్థను స్థాపించింది. ఈ సంస్థ ద్వారా యుద్ధంలో మరణించిన సైనికుల కుటుంబాలకు సహాయం చేస్తూ, పేద కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నారు. అంతేకాకుండా, పోషకాహార లోపం సమస్య వున్నవారికి సహాయం అందించడం కోసం అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అనురాధ పౌడ్వాల్ తన సంస్థ సూర్యోదయ ఫౌండేషన్ ద్వారా కార్డియాక్ అంబులెన్స్‌ని సైతం విరాళంగా ఇచ్చారు. ఈ సేవా కార్యక్రమాల నిర్వహణకు అనురాధ తాను పాడిన పాటలకు వచ్చిన ఆదాయం నుండి నిధులను వెచ్చిస్తూ స్వచ్చంద సంస్థను నిర్వహిస్తున్నారు.
వివాదాలు
అనురాధ భర్త అరుణ్ పౌడ్వాల్ అకాల మరణం కారణంగా, ఆమె అనేక వివాదాలు, సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. ఆమె భర్త మరణం తర్వాత, ఆమెకు టీ-సిరీస్ కంపెనీ యజమాని గుల్షన్ కుమార్ మధ్య ఉన్న అనుబంధంపై రకరకాల పుకార్లు కూడా వచ్చాయి. ఆమె వాటిని ఖండించింది. ఆమె ''దిల్'' చిత్రంలో అల్కా యజ్ఞిక్ పాటలను డబ్ చేసినప్పుడు కూడా చాలా వివాదానికి గురైంది, మంగేష్కర్ సోదరీమణులు మామూలుగా చేసే అభ్యాసం. ఆమె తన స్వరం హీరోయిన్‌కు బాగా సరిపోతుందని పేర్కొంటూ లతా మంగేష్కర్ పాటను ''రాధ కా సంగం''లో డబ్ చేసారు.
అనురాధ కుమార్తెనని కేరళలో పిటిషన్
అనురాధ, అరుణ్ పౌడ్వాల్ల కుమార్తెనని వారు తన తల్లిదండ్రులు అని పేర్కొంటూ కేరళలో కర్మలా మోడెక్స్ అనే 45 ఏండ్ల మహిళ తిరువనంతపురంలోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 1974లో పౌడ్వాల్ గాయనిగా దష్టి పెట్టాలనుకున్నందున, తనకు కేవలం నాలుగు రోజుల వయస్సు ఉన్నప్పుడు తన పెంపుడు తల్లిదండ్రులకు అప్పగించారని ఆరోపించింది. మరణశయ్య మీద ఉన్నప్పుడు తన పెంపుడు తండ్రి ద్వారా తన తల్లిదండ్రుల గురించి వెల్లడించాడని ఆమె పేర్కొంది. గతంలో అనురాధ పౌడ్వాల్ని సంప్రదించడానికి ప్రయత్నించిన కానీ, అది విఫలమైందని కూడా ఆమె ఆరోపించింది. పౌడ్వాల్ నుంచి తనకి రూ .50 కోట్లు పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేసింది. అయితే అనురాధ పౌడ్వాల్‌కు 1974లో కుమార్తె కవిత జన్మించింది కాబట్టి ఆమె వాదనలు అబద్ధమనీ, అనురాధ పౌడ్వాల్ భర్త గురించి ఆమె ప్రస్తావించింది, కానీ అతను అప్పటికే చనిపోయాడని కూడా ఆమెకు తెలియదు. కాబట్టి ఆమె ''సైకో'' మహిళగా కనిపిస్తోందని, ఆమె చేసిన వాదనలను కోర్టు కొట్టివేసింది.
భక్తి భజనలు, గజల్స్ పాడటానికే పరిమితం
అనురాధ గాయనిగా తన ప్రయాణాన్ని ప్రారంబించినపుడు ఆమె లతా మంగేష్కర్ స్థానంలో నిలుస్తుందని సంగీత ప్రియులు ఊహించారు. ప్రముఖ సంగీత దర్శకులు 'ఓ.పి. నయ్యర్' కూడా లతా స్థానాన్ని అనురాధ బర్తీ చేస్తుందని అభిప్రాయపడ్డారు. అయితే అనురాధ ఇందుకు భిన్నంగా తానేనాడు కీర్తీ కోసం ఆకాంక్షించలేదని, తన అభిమానులు, సంగీత దర్శకులు ఇచ్చిన గౌరవం తనకు ఎంతో సంతప్తిని ఇచ్చిందని, ఇదే సమయంలో సినీ రంగం నుండి వైదొలగాలని నిర్ణయించుకుని వైదొలుగుతున్నానని ప్రకటించి భక్తి భజనలు, గజల్స్ పాడటానికే పరిమితమయ్యారు.
అవార్డులు
అనురాధ 1985లో 'ఉత్సవ్' చిత్రంలోని ''మేరే మన్ బాజో మదంగ్'' పాటకి ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా 'ఫిల్మ్‌ఫేర్ అవార్డు' ను అందుకున్నారు. ఆ తర్వాత 1990-1992 నుంచి వరుసగా మూడు సంవత్సరాలు ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా 'ఫిల్మ్‌ఫేర్ అవార్డు' ను అందుకున్నారు. 1989 లో మరాఠీ చిత్రం 'కళత్ నకలత్' లోని 'హి ఏక్ రేషామి' పాటకు అనురాధ పౌడ్వాల్ ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ పురస్కారాన్ని పొందారు. 2017లో నాల్గవ దేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన ''పద్మశ్రీ'' పురస్కారాన్ని భారత ప్రభుత్వం ప్రదానం చేసింది.
2004లో మద్యప్రదేశ్ ప్రభుత్వం 'మహాకాల్ అవార్డు' ను అందచేసింది.
2010లో మద్యప్రదేశ్ ప్రభుత్వం 'లతా మంగేష్కర్ అవార్డు' తో సత్కరించింది.
2011లో జీవిత సాఫల్య పురస్కారంగా 'మదర్ థెరిస్సా అవార్డు' అందుకున్నారు.
2013లో మహారాష్ట్ర ప్రభుత్వం 'మహమ్మద్ రఫీ అవార్డు' ను అందచేసింది.
2018లో మహారాష్ట్ర ప్రభుత్వం 'మహారాష్ట్ర గౌరవ పురస్కార్' తో సత్కరించింది.
ఓడిషా రాష్ట్ర చలనచిత్ర అవార్డులు
1987లో 'తుండా బైడా' చిత్రంలోని గీతానికి ఉత్తమ నేపథ్య గాయనిగా ఓడిషా రాష్ట్ర చలనచిత్ర అవార్డు అందుకున్నారు.
1997లో 'కంధేరు అఖి రీ లుహా' చిత్రంలోని గీతానికి ఉత్తమ నేపథ్య గాయనిగా ఒడిషా రాష్ట్ర చలనచిత్ర అవార్డు అందుకున్నారు.
2004లో గిల్డ్ ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ నేపథ్య గాయనిగా 'అప్సర అవార్డు' కు ఎంపికైంది. 2016లో అనురాధ పౌడ్వాల్ ను డివై పాటిల్ విశ్వవిద్యాలయం 'డిలిట్ డిగ్రీ'తో సత్కరించింది.
2018లో భక్తి సంగీతానికి ''సాంస్కతిక రాయబారి''గా యు.ఎన్.ఓ. నియ మించింది.
2020-21 సంవత్సరానికి గుజరాత్ రాష్ట్ర 'తానా-రిరి అవార్డు' కు అనురాధ పౌడ్వాల్ ఎంపిక అయ్యింది.
అనురాధ సినీ సంగీత దర్శకులు రాజేష్ రోషన్, జయదేవ్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్, కళ్యాణ్ జీ ఆనంద్ జీ, ఉషా ఖన్నా, ఎస్.డి.బర్మన్, శివ్-హరి, రవీంద్ర జైన్, ఆర్.డి.బర్మ, బప్పీల హరి, ఆనంద్-మిలింద్, నదీమ్-శ్రావణ్, జతిన్ లలిత్, దిలీప్ సేన్ - సమీర్ సేన్, ఎ.ఆర్.రహ్మాన్, అనూ మాలిక్, జగ్జీత్ సింగ్, అనుప్ జలోటా, ఉత్తం సింగ్, రామ్-లక్ష్మణ్, హంసలేఖ, అరుణ్ పౌడ్వాల్, విజు షా, ఆనంద్ రాజ్ ఆనంద్, విశాల్ భరద్వాజ్, హిమేష్ రేషమియా, ఎం.ఎం.కీరవాణి, ఆదేశ్ శ్రీవాత్సవ, సాజిద్ - వాజిద్, నుస్రత్ ఫతే అలీ ఖాన్, నిఖిల్ వినరు, సుఖ్వీందర్ సింగ్, అద్నాన్ సామి, సంజీవ్-దర్శన్, అజరు-అతుల్ మొదలైన వారితో కలసి పనిచేసింది. అలాగే సినీ గాయని,గాయకులు కుమార్ సాను, ఉదిత్ నారాయణ్, మహమ్మద్ అజీజ్, కిషోర్ కుమార్, మహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్, ఆశా భోస్లే, కవితా కష్ణమూర్తి, అల్కా యాజ్ఞిక్, సాధనా సర్గమ్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, హరిహరన్, కె.జె.యేసుదాస్, రాజేష్ కష్ణన్, మనో వంటి గాయకులతో కలిసి పాడింది.
ఉజ్జయిని లోని మహా కాళేశ్వర్ దేవాలయ సందర్శనకు తరచూ వెళ్ళి సందర్శించుకునే అనురాధ తనకు కవిత్వాన్ని, శంకరాచార్య రచనలను రికార్డింగ్ చేయాలని కోరిక ఉందని అన్నారు. ఆమె పాడిన గాయత్రి మంత్రం ఇప్పటికీ విశేష ప్రాచుర్యంలో వుంది.
అనురాధ హిందీతో పాటు మరాఠీ, మార్వాడీ, తమిళం, ఒడియా, నేపాలీ, బెంగాలీ, కన్నడ, రాజస్థానీ, సంస్కతం, గుజరాతీ, భోజ్‌పూరీ, మైథిలీ, ఆస్సామీస్, తెలుగు చిత్రాలలో పాటు అనేక భాషలలో గీతాలాపన చేసింది.
- పొన్నం రవిచంద్ర,
9440077499