Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెల్సుకొనవే డాంకీ ఇలా నడుచుకొనవె డాంకీ అని రాగం తీసిన కుక్క ముఖ్యమైన పార్టీల వాళ్ళంటే ఓటర్ల దగ్గర ఓట్లు కొనడానికి కావల్సినంత నల్లడబ్బూ ఎలెక్షన్ ఫండూ ఉన్న వాళ్ళన్న మాట. ఇది వరకు పార్టీ ఆఫీసులుండేవి. ఇప్పుడు వాటిని దూకాణాలనే అనాలి. ఓట్ల బేరసారాల కొనుగొళ్ళకు, డబ్బు పంపకాలకు అవి కేంద్రాలయినవి కదా మరి.
కూలిన ఇంటి అరుగెక్కిన కుక్క హుశారుగా తనతోక కొసని అందుకోవడానికి గిరగిరా తిరగసాగింది.
అప్పటికే అరుగుమీద ఓ మూల పడుకున్న గాడిద ఆవలిస్తూ కుక్క డాన్సు చూసి పేపర్ వెయిట్లాంటి కళ్ళు వెడల్పుచేసి ఏంటా జోరు! ఏముహుషారు! అని అడిగింది ''డాగీని''
జోరుగా హుషారుగా తోక కొరకనా గిర్రుగిర్రు తిరగనా అంది కుక్క తోక కోసం రౌండుగా రౌండ్లు కొడుతూ.
మనుషులకు వీపు అందదు కుక్కలకి తోక అందదు ఊరికే తిరక్కు తిన్నదరిగిపోద్ది అంది గాడిద ఎకసెక్కంగా.
అందేదాక తిరుగుతాను తిన్నది అరిగితే అరిగింది కావాల్సినంత తిండి దొరికే రోజుల్లో కాకపోతే ఎప్పుడు కొట్టగలమిట్లా తోక కొసకోసం చక్కర్లు అంది డాగీ.
ఇదెక్కిడి చోద్యం. ఊర్లో పెళ్ళయితే కుక్కలకు హడావిడి అంటే విన్నాను ఇప్పుడు ఊళ్ళో ఎవరిపెళ్ళేమిటి అంది 'యాసీ' పలుగురాళ్ళల్లాంటి పళ్ళు బయట పెడుతూ.
పెళ్ళి కాదు అంతకు మించి అందుకే తగ్గేదేలే అని మెడతిప్పింది కుక్క.
పెళ్ళికి మించా అందేమిటో చెప్తే సంతోషిస్తాం కదా అంది గాడిద పొట్టితోక కేసి చూసుకుంటూ.
రోజూ న్యూస్ పేపర్లు నవుల్తావు ఈ సంగత్తెలీదా. ఎన్నికలోరు... ఎన్నికలు... ఎన్నికలొచ్చాయోరు అంది కుక్క ఉత్సాహంగా.
అప్పుడేనా! అయిదేండ్లకోసారి కదా ఇప్పుడు ఏటికొక్కసారి ఎన్నికలొస్తు న్నాయా ఏంటి! అంది గాడిద బుర్ర గోడకేసి గోక్కుంటూ.
అసలు ఎన్నికలకంటే ఉప ఎన్నికలు మరింత మజాగా రంజుగా సాగుతాయి. ఇప్పుడవే వొచ్చి పడ్డాయి. అన్ని పార్టీల వాళ్ళ దృష్టి ఈ ఎన్నిక మీదే. చావో రేవో తేల్చుకోవడానికి కొన్ని ముఖ్యమైన పార్టీల వాళ్ళు దుకాణాలు తెరిచేశారు అంది కుక్క. తిరిగితిరిగీ అలసిపోయి తిరగలేను తిమ్మప్ప అంటూ కూలబడుతూ.
ముఖ్యమైన పార్టీలవాళ్ళంటే? అని 'డవుటు' వెలిబుచ్చింది గాడిద.
తెల్సుకొనవే డాంకీ ఇలా నడుచుకొనవె డాంకీ అని రాగం తీసిన కుక్క ముఖ్యమైన పార్టీల వాళ్ళంటే ఓటర్ల దగ్గర ఓట్లు కొనడానికి కావల్సినంత నల్లడబ్బూ ఎలెక్షన్ ఫండూ ఉన్న వాళ్ళన్న మాట. ఇది వరకు పార్టీ ఆఫీసులుండేవి. ఇప్పుడు వాటిని దూకాణాలనే అనాలి. ఓట్ల బేరసారాల కొనుగొళ్ళకు, డబ్బు పంపకాలకు అవి కేంద్రాలయినవి కదా మరి.
సరే నువ్వన్నది సరే సరే మరి నీ జోరుకీ హుషారుకీ ఎన్నికలకీ అదే ఉప ఎన్నికలకీ ఏమిటి లంకె అంది గాడిద చెవులు దులుపుకుంటూ
ఎందుకంటే ఈ దుకాణాల్లో కార్యకర్తలకు జెండాలు మోసే వాళ్ళకు, ఓట్లడుక్కోవడానికి గొంతు చించుకోనే బంట్లకు బిర్యానీలు పంచబడతాయి కదా. ఊరికే వచ్చే మటన్ బిర్యానీలో చికెన్ ఫ్రైడ్ రైస్‌లో ఎముకలు ఎవరు ఏరుతూ కూచుంటారు గనక వాళ్ళు విసిరేసిన బోన్సుని పీకల్దాకా మెక్కుతున్నాం. ఊళ్ళో ఉన్న కుక్కలం. అయాం ఎ 'లకీ డాగ్! ఎన్నికలయ్యేదాకా పొట్టనిండా తిండి... అదరగడానికే ఈ 'టెయిల్డాన్సు' అంది కుక్క.
ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఊళ్ళో ఉప ఎన్నికలైతే కుక్కల హడావిడి అన్నమాట. కుక్కలకే కాదు. గాడిదలకూ బెనిఫిట్టే. బిర్యాని పొట్లాల కాగితాలతో నా బానా పొట్ట కూడా నింపుకోవచ్చు రేపట్నించి నేనూ వస్తాను. ఏ పార్టీ ఆఫీసు దగ్గర గిట్టుబాటవుతుందో చెప్పాలి మరి అంది గాడిద నాలుక తడి చేసుకుంటూ.
అప్పుడొచ్చాడు మనిషి అరుగుమీదకి ఓ చేతిలో సీసా వుంది. ఓ చేతిలో బిర్యాని పొట్లం ఉంది. రావోయి ఓటరు మహాశయా. రా 'ఉషారుగా ఊగుతున్నావు' అంది గాడిద మనిషివైపు తలెత్తి చూస్తూ అతని చేతిలో ఉన్న బిర్యానీ పొట్లాన్నీ ఆప్యాయయంగా చూడసాగింది. కుక్క తోక ఊపుతూ ఊరికి ఉప ఎన్నిక వచ్చింది. కదా! గెలుపు మాదంటే మాదంటూ బలిసిన పార్టీల వాళ్ళు వచ్చారు కదా! అన్నాడు మనిషి క్వార్టర్ సీసా మూత విప్పుతూ
అదేమిటి సోడా, వాటర్ కలపవా? డైరెక్టుగా కొట్టేస్తావా అంది కుక్క.
మనం కొంటే ఐసు, సోడా కలుపుతాం కానీ ఊరికే ఉచితంగా ఉత్తినే వచ్చే మందు కదా 'ఆన్దరాక్స్' అంతే అంటూ మందు గొంతులోకి పంపి అన్నాడు మనిషి ఇంటిముందు 'ఇచ్చట ఓట్లు అమ్మ బడును' అని బోర్డు పెట్టాను. నన్ను చూసి ఊళ్ళో చాలా మంది ఇండ్లముందు బోర్డులు పెట్టారు. అప్పట్నించీ ఓటర్లందరకీ ఇదిగో రాజభోగమే ఫైనల్‌గా ఏ పార్టీమందు కిక్కిస్తుందో ఏ పార్టీ జేబు నింపేస్తుందో దానికే ఓట్లు అంటూ
మందు తాగి చికెన్ బిర్యానీ లాగించి వెళ్ళి పోయాడు మనిషి. ఎముకలు నమిలింది కుక్క. బిర్యానీ పొట్లం కట్టిన పేపర్ని ఎంజారు చేసింది గాడిద.
ఉప ఎన్నికలు వస్తుండాలి. జనం ఓట్లు అమ్ముతుండాలి. మనం తోక చుట్టూ తిరగాలి అంటూ తోక కొసను అందుకోవడనాకి గిర్రు గిర్రు తిరిగింది కుక్క
- చింతపట్ల సుదర్శన్, 9299809212