Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖాళీ సమయపు సూపుల్ని శూన్యం ఆక్రమిస్తది. తరంగ వలయపు సమూహాల్లో తెలీకుండానే చిక్కుబడిపోతం. మనస్సుతో పాటు దేహాన్ని స్థానభ్రంశం చెందించాలని ప్రయత్నిస్తున్నప్పుడల్లా విఫలమవుతుంటాం. పర్వతాల్ని మోస్తున్నట్టు భారంగానైనా శ్వాసక్రియ జరుగుతూనే వుంటది. ఆవులింతలు తెచ్చిన కన్నీటిని పిండుతూ రెండు కండ్లు అలిసిపోతయి.
చెమట పట్టని శరీరమంటే ఎప్పటికి చిన్నచూపే! కదలని కుర్చీలు జాగారం చేస్తూ విలపిస్తుంటాయి. అగ్గువ గాలి దొరకని గది రోజంతా ఆయాసపడుతాంటది. గుడ్డీగలు భవిష్యత్తును గానం చేస్తూ గడియ రికాం లేకుండా శ్రమిస్తుంటాయి.
ఆకాశం తన నీడను కప్పుకున్నప్పుడల్లా గొంతు పట్టుకుని యాళ్లాడుతున్న భయం తెరలు తెరలుగా దగ్గుతనే వుంటది. ముందస్తుగా రాసిపెట్టిన నమ్మకాల చివరితేదీ పలకరించినప్పుడల్లా విక్రుత హావభావాలతో కడుపులో పిసుకుతుంటది. డిజిటల్ తెరలపై వరిగంటలు ఊగినప్పుడల్లా పచ్చదనం పరవశింపజేత్తది.
వెనువెంటనే లోయల్లోకి జారుతున్నట్టు శీతలత్వాన్ని అనుభవంలోకి తీసుకొత్తది.
గమ్యాన్ని వెతుకుతూ వేగంగా పరిగెత్తుతున్న రహదారికి సమాంతరంగా నడక కొనసాగుతది. అనామక ముఖాల అంతిమయాత్రలో పాల్గొని ఏకుడు ప్యాలాలు సల్లుతున్నట్టు భ్రమపడుతం. తాళంచెవి పోగొట్టుకుని లోపలి గదుల్లోకి ప్రవేశించకుండా నిత్యం గింజుకుంటుంటాం.
గద్దెనెక్కుతున్న 'తుపాకులు' రాసే రాజ్యాంగానికి ఎదురుకోల్లు తీసుకుంటం. ఏ ఉద్వేగమూ పలకని స్థితిలో గడ్డకట్టుకుని పడివుంటాం. ఏ గుణపాఠమూ నేర్పని నీతికథలు వింటూ కాలం చేస్తాం.
- బండారి రాజ్ కుమార్
9959914956