Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విద్యార్థి ఉద్యమ నాయకులు ఎట్లా ఉండాలి, వారు సమాజం కోసమై, ఉద్యమం కోసమై ఎట్లా తమ జీవితాలను త్యాగం చేస్తారు, వారి ఆలోచనా విధానాలు ఎట్లా ఉంటాయి అనేవి ఈ నవల ద్వారా వ్యక్తమయ్యాయి. ఈ నవలలో ఒకచోట ''ఆశయం, సంకల్పం, త్యాగం లేని ఉద్యమం జీవంలేని నెత్తురసోంటిది. ఉద్యమం నిజాయతీగా ఎగిసిపడే బలమైన గొంతుక... ఉద్యమం కోసం బతకడమంటే జీవితాన్ని జలపాతంలా ధారబోయడం... జీవిత సారాన్ని పిడికెడు పిడికెడు మట్టిలా సమాజానికి పంచడం''
సాహిత్యలోకానికి నర్రా ప్రవీణ్ రెడ్డి యువకవిగా, రచయితగా, పరిశోధకుడిగా ఇప్పటికే పరిచయం. ఆయన ఏది రాసినా ప్రామాణికతను వీడడని అతని రచనలు చదివితే తెలుస్తుంది. తను ఏడవ తరగతి చదువుతున్న నాడే కవితలు రాసి, ఎనిమిదవ తరగతిలో ఏకంగా 70 పేజీల అసంపూర్ణ సినిమా కథ రాసి పాఠశాల స్థాయిలోనే ఉపాధ్యాయుల మన్ననలు పొందిన సాహిత్య అభిలాషి. చిట్యాల మండలం వట్టిమర్తి తన సొంత ఊరు. ప్రస్తుతం నార్కట్ పల్లిలో ఉంటున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగులో పరిశోధన చేస్తున్నాడు. ఇటీవలే 'పొత్తి' అనే నవల రాసి సాహిత్యంలో చెరగని ఉద్యమసంతకం చేశాడు.
మానవుడి ఆలోచనలను, చర్యలను ప్రతిబింబిస్తూ తాత్వికతను సామాజిక అనుభవంగా చిత్రించడం నవల ప్రధాన లక్ష్యం అంటాడు డబ్ల్యూ హెచ్ లారెన్స్. ఆ మాటలు ఇటీవల వచ్చిన 'పొత్తి' నవలకు వర్తింపజేయవచ్చు. ఇది ఉద్యమనవలగా అనతి కాలంలోనే పేరుగాంచి తెలంగాణ నవలా సాహిత్యంలో గీటురాయి వంటి నవలగా నిలిచింది. ఈ నవలలో ఉద్యమంలో భాగమై తిరిగిన వీరుల త్యాగాలు, కవుల, కళాకారుల ఆట పాటలు, గ్రామీణ పల్లెల స్థితిగతులు చిత్రితమైనాయి. విద్యార్థి ఉద్యమ నాయకులు ఎట్లా ఉండాలి, వారు సమాజం కోసమై, ఉద్యమం కోసమై ఎట్లా తమ జీవితాలను త్యాగం చేస్తారు, వారి ఆలోచనా విధానాలు ఎట్లా ఉంటాయి అనేవి ఈ నవల ద్వారా వ్యక్తమయ్యాయి. ఈ నవలలో ఒకచోట ''ఆశయం, సంకల్పం, త్యాగం లేని ఉద్యమం జీవంలేని నెత్తురసోంటిది. ఉద్యమం నిజాయతీగా ఎగిసిపడే బలమైన గొంతుక... ఉద్యమం కోసం బతకడమంటే జీవితాన్ని జలపాతంలా ధారబోయడం... జీవిత సారాన్ని పిడికెడు పిడికెడు మట్టిలా సమాజానికి పంచడం'' అంటాడు కథానాయకుడు శంకర్.
ఈ మాటలు వివిధ విద్యార్థి ఉద్యమాలలో తిరిగే నాయకులకు శక్తినే కాదు , వాళ్లు పడ్డ కష్టాలు గుర్తుకు తెచ్చి కళ్ళలో నీళ్లనూ రప్పిస్తవి. గుండెను బరువెక్కిస్తవి. ఉవ్వెత్తున ఎగిసే ఉద్యమ జ్వాలలు పొత్తిలోని అక్షరాలు. అంతేకాదు పల్లెజీవన సౌందర్యాలు గ్రామీణుల మనస్తత్వాలను కళ్ళకు కట్టినట్లు చూపించే నవల ఇది. తెలంగాణ మలిదశ పోరాట తీరూతెన్నులు ఈ నవలలో వాస్తవికంగా రాయబడ్డవి. రైతులకు జరిగే అన్యాయాలు, పాలకుల చేతిలో రైతుల కుటుంబ వ్యవస్థ ఆగమయ్యే తీరును ఈ నవల ప్రతిబింబించింది.పాలి వాళ్ళ పంచాయితీల వలన కుటుంబం ఎట్లా నష్టాల పాలవుతుందో ఈ నవల తెలుపుతుంది. అనేకమైన పల్లెకు చెందిన సామెతలతో, జాతీయాలతో రాయబడిన ఈ నవలను చదువుతుంటే పాఠకుడికి ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది. నవలలో గంగ, శంకర్ అని పాత్రల పేర్లు పెట్టడంలో కూడా రచయిత ప్రతిభ తెలుస్తుంది. ఇరువురి వర్గాలు వేరైనప్పటికీ కలిసి ఉద్యమంలో నడవడం, ప్రేమించుకోవడం వంటివి నవల ఆసక్తిగా చదవడానికి ఊతం ఇస్తాయి.
ఇందులో సూరి అనే నక్సలైట్ పాత్ర మనల్ని ఆలోచనలలో నెట్టేసే విధంగా ఉంటుంది. ఈ పాత్ర నవలకు బలాన్ని చేకూర్చిన పాత్రల్లో ఒకటి. కథనంలో ''రాముల దలిసేటి యాళ్లతల్లీ/దేవుడు దలిసేటి యాళ్లతల్లి/ ఓయమ్మ సీతమ్మ/ మాయమ్మ సీతమ్మ '' అంటూ సాగే జానపదుల పాటతో పాటు తెలంగాణ ఉద్యమంలో భాగమైన కొన్ని పాటల ప్రస్తావన వల్ల ఈ నవల చదువుతుంటే ఒక సినిమా చూసినట్టు అనిపిస్తుంది. ఇది రానున్న కాలంలో సినిమాగా వచ్చినా ఆశ్చర్యం లేదని అభిప్రాయపడతాడు పాఠకుడు.స్థూలంగా ఇలా ఈ నవలను పరిశీలించవచ్చు.
ఇంకాస్తలోతుల్లోకివెళితే సాహిత్య ప్రపంచంలో యుక్తవయసులో నవలలు రాసినటువంటి వారు తక్కువ. మరీ ముఖ్యంగా నల్లగొండలో నవలలు తక్కువగానే వెలువడ్డాయి. ఈ తరంలో వచ్చిన ఈ నవల నల్లగొండకు నవలా ప్రతిష్టతను తెచ్చిపెట్టింది.
తెలంగాణ భాషా సాంస్కతిక మండలి పక్షాన ప్రచురింపబడిన పొత్తి నవలలో కథానాయికా నాయకులు గంగా శంకర్లు. వీరు ఉస్మానియా విశ్వవిద్యాలయ కేంద్రంగా ఉద్యమించిన ధీరత్వపు పతాకలు. ఈ ప్రధాన పాత్రల ఆధారంగా నవల ఆసాంతం ఆకట్టుకునే శైలిలో నడిచింది. గంగ తల్లిదండ్రులు వీరయ్య యాదమ్మలు. వీళ్లిద్దరూ వ్యవసాయ కూలీలు. శంకర్ ఈ నవలలో ముఖ్యపాత్ర యువకుడు. హీరో. ఇతడు మల్లారెడ్డి శారదమ్మల కొడుకు. తెలంగాణ పల్లె పొత్తిళ్ళలో పెరిగిన అచ్చమైన మట్టి బిడ్డలుగా ఈ నవలలో వారిని రచయిత తీర్చిన విధానం ఉన్నతంగా సాగింది. అంతేకాక వాస్తవ జీవితానికి అనుగుణంగా తెలంగాణ పల్లె జీవన విధానాన్ని రచయిత నర్రా తెలంగాణా భాషాశైలిలో కళ్ళకు కట్టి చూపించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పల్లెల్లో, ఉస్మానియా యూనివర్సిటీ లో ఉరకలెత్తిన తీరుతో పాటు అనేక పల్లియ జీవితపు దశ్యాలు ఈ నవల గుండా ప్రవహించాయి.
తెలంగాణ పల్లెలోని రైతాంగ సామాజిక సాంస్కతిక జీవన విశేషాలు దానితో పాటు విభిన్న కులాలకు, సామాజిక వర్గాలకు చెందిన యువతీయువకుల మనస్తత్వాలను వర్ణించిన ఈ నవలలో అవసరమైన చోట పాటలు, ఉద్రిక్తతను రేకెత్తించే గాఢమైన మాటలూ దాగున్నాయి. నవలలో వాడిన వచనం కూడా కవిత్వంలా పరుగులెడి మనల్ని అబ్బురపరుస్తుంది. ఇంకా ధ్వన్యాత్మకంగా ఉండే వాక్యాలు రచయిత సజనాత్మక, ఊహాత్మక శక్తికి నిదర్శనంగా నిలుస్తాయి.
ప్రవీణ్ ఈ నవలకు 'పొత్తి' అనే పేరు పెట్టడానికి కారణమేంటని భావిస్తే 'పొత్తి' అనే పదానికి మాండలిక భాషలో వ్యవసాయికంగా ధాన్యపు రాసి చుట్టూ గీసే రక్షణ రేఖ. ప్రత్యేక సందర్భాలలో ఊరి పొలిమేరపై నవధాన్యాలతో పోసే రేఖ. తెలంగాణా ఏర్పడినాక మన పల్లెలకు, మన నిధులకు, మన నియామకాలకు ఇతరత్రా వనరులకు రక్షణ చేసుకోవాలని చెప్పే ప్రతీకాత్మక పదమే పొత్తి. ఈ పదం అచ్చంగా తెలంగాణది. నడుస్తున్న ఈ పాలనకు,కాలానికి హెచ్చరికగా , సూచనగా ఏర్పడ్డ పదం ఇది. ఉద్యమకారులకు , తెలంగాణాసమాజానికి అప్రమత్తతచేకూర్చేపదం ఇది. మొత్తం మీద తెలంగాణ మాండలికంలో ' పొత్తి ' అనే పేరు పెట్టడంతోనే సాహిత్య , సామాజిక లోకాన ఈ నవల గెలిచింది. ఎప్పటికీ నిలిచే తత్వం నింపుకుంది.
కూరెళ్ళ విఠలాచార్య గారన్నట్లు పొత్తి నవల నల్లగొండ నవలా సాహిత్యంలో గీటురాయిగా నిలుస్తుందనడంలో , సరికొత్త బ్రాండ్ అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.సందేహం లేదు. ప్రవీణ్ చేతిలో గిజిగాడి గూడులా అల్లబడిన ఈ నవల నల్లగొండ నవలా సాహిత్యంలో నూతన ఒరవడి, శకం పొత్తి ద్వారా నిర్మితమవ్వబోతుంది. నల్లగొండ ఉద్యమ నవలా ఖడ్గం పొత్తి. సాహితీ పుటలలో ఉద్యమ అక్షరం పొత్తి. యువ రచయిత నర్రా భవిష్యత్ తెలంగాణ నవల సాహిత్యానికి పెద్దదిక్కుగా మారబోతున్నాడు అనడానికి ఈ నవల తార్కాణం.
అభ్యుదయ భావాల అవసరం, పోరాట తత్వం, త్యాగాల విలువ, ప్రజా ఉద్యమాల ప్రాధాన్యతలను ఈ నవల ఎత్తి చూపే ఈ నవలకు పెద్దలు అంపశయ్య నవీన్, ఏనుగు నరసింహా రెడ్డి, ఎస్. రఘులు రాసిన ముందుమాటలు నవలకు మరింత బలాన్ని చేకూర్చాయి. నవలను వారు సాధికారికంగా, పరిశోధ నాత్మకకంగా విశ్లేషించిన తీరు పొత్తి నవలా విశిష్టతను పట్టి చూపాయి.సాహిత్యంలో శ్రధ్ధగా శ్రమిస్తున్న ఈ తరపు రచయిత, పరిశోధకుడైన నర్రా తెలంగాణకు మరో వట్టికోటో, దాశరథి రంగాచార్యో కాక తప్పడు. ప్రామాణిక, ఆత్మ గల్ల వాక్యం రాయగల ఈ యువరచయిత మున్ముందు మరిన్ని నవలలు, కథలు రాసి తెలంగాణ సాహిత్యాన్ని సుసంపన్నం చేయాలని కోరుకుందాం.
-డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు