Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సోమరాజు రామానుజరావు
స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న సోమరాజు
రామానుజరావు బ్రిటిషు ప్రభుత్వంలో
జరుగుతున్న అరాచకాల పట్ల ప్రజలను
ఉత్తేజపరిచి వాళ్ళను స్వాతంత్య్రోద్యమంలో
భాగస్వాముల్ని చేయడానికి రచనను
సాధనంగా ఎంచుకున్నాడు.
తెరచబడ్డ చరిత్ర పుటలలో కనబడని జ్ఞానయోధుడు. జరపబడ్డ స్వాతంత్య్రోద్యమంలో కాలు కదపిన భారతీయుడు. అంధకారంలో కాలం గడుపుతున్న సమాజాన్ని చైతన్యపు వెలుగుల తీరానికి చేర్చిన వైతాళికుడు. ప్రశ్నించిన పర ప్రాంతీయులకు(బర్మా) సహనంతో జవాబు చెప్పిన రామానుజుడు. జానపద కళలతో, రమ్యమైన నాటకాలతో రక్తికట్టించేలా రచించి ప్రదర్శింపచేసిన నాటక కర్త, నవలాకారుడు, కథయిత, నాటక ప్రయోక్త అయిన స్వాతంత్య్ర సమరయోధుడే సోమరాజు రామానుజరావు.
జీవన రేఖలు
సోమరాజు రామానుజరావు జూన్ 18, 1896 సంవత్సరంలో ఖమ్మం జిల్లా దుమ్ముగూడెంలో జన్మించారు. తల్లిదండ్రులు అచ్చమాంబ, కోదండ రామయ్య. రామానుజరావు విద్యాభ్యాసం అంతా భద్రాచలం, దుమ్ముగూడెంలోనే కొనసాగింది. వీరు భూస్వామ్య కుటుంబానికి చెందినవారు.
ఉద్యమం
మహాత్మాగాంధీ, బాల గంగాధరతిలక్, గోపాలకష్ణ గోఖలేల ప్రభావంతో స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న సోమరాజు రామానుజరావు బ్రిటిషు ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాల పట్ల ప్రజలను ఉత్తేజపరిచి వాళ్ళను స్వాతంత్య్రోద్యమంలో భాగస్వాముల్ని చేయడానికి రచనను సాధనంగా ఎంచుకున్నారు. హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రజలను సాంస్కతికంగా మేల్కొల్పడానికి ప్రారంభించిన గ్రంథాల యోద్యమంలో పాల్గొని, దాని ద్వారా స్ఫూర్తిని పొంది గ్రంథమాలల స్థాపనలో చొరవ తీసుకున్నారు. ప్రజలలో స్వాతంత్య్ర భావాలను ప్రేరేపించి వారిని జాతీయోద్యమంలో పాల్గొనేలా చేస్తూ స్వరాజ్య రథం నాటకాన్ని రాశారు. ఈ నాటకాన్ని బ్రిటిషు ప్రభుత్వం 1922 సంవత్సరంలో జూన్ 26వ తేదీన నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేధం కొరకు ప్రభుత్వం ప్రత్యేకంగా జి.వో నంబర్ 466ను జారీ చేసింది. ఈ నాటక కర్త అయిన సోమరాజు రామానుజరావు అరెస్టుకు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయం తెలిసిన రామానుజరావు ఆ సమయంలో బ్రిటిషు ప్రభుత్వానికి చిక్కకుండా అజ్ఞాతవాసంలో ఉన్నారు. దీంతో తనకు ప్రభుత్వం నుంచి భద్రత లేదని భావించి తన కుటుంబాన్ని అత్తారింటికి పంపించి రంగూన్ కు వెళ్ళారు.
రామానుజరావు స్వదేశీ ఉద్యమ సమయంలో జాతీయ మహాసభల్లో పాల్గొని జాతీయోద్యమ ఐక్యత గురించి, దేశభక్తి ఉద్దీపన గురించి నాయకులు ఇచ్చిన ఉపన్యాసాలు విని వాటిని ఆకళింపు చేసుకొని తన నాటకాలలో వాటిని నిక్షిప్తం చేశాడు. బ్రిటిషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసహాయోద్యమం సాగుతున్న సమయంలో రామానుజరావు తన స్వగ్రామంలో శ్రీ వెంకటేశ్వర గ్రంథమండలిని స్థాపించి దాని తరపున పలు పుస్తకాలు ప్రచురించారు.
సాహిత్య సేవ
రామానుజరావు తన రచనా ప్రస్థానాన్ని తన పద్దెనిమిదవ ఏట ప్రారంభించారు. బ్రిటిషు కాలంలో భారతీయులకు అంతంత మాత్రంగానే ఉన్న సామాజిక స్పహను విస్తతం చేయడానికి తన సజనాత్మకతకు పదునుపెట్టి నలభై పైగా నాటకాలు, ఇరవైకి పైగా నవలలను రాశారు. వీటి ద్వారా నాటి కాలంలో ఉన్న అస్వతంత్ర, బానిస జీవనాన్ని రుపుమాపుతూ, అసమానతల నిర్మూలన కోసం పాటుపడుతూ, దేశభక్తిని పెంపొందిచుటకు ప్రజలలో జాతీయ భావాలను రేకెత్తిస్తూ రాసిన అంశాలు ఉన్నాయి.
ఇతను పలు చారిత్రక, పౌరాణిక, సాంఘిక నాటకాలు రాశారు. 1914 సంవత్సరంలో సోమరాజు రాసిన తొలి నవల 'మంజుమతి', రెండో నవల 'జగన్మోహిని' (1915), తర్వాత 'విషవాహిని' (1916), 'హైమావతి' (1916), 'రక్తజ్వాల' వంటి నవలలు రాశారు. వీటిని ఆంధ్ర ప్రచారిణీ గ్రంథమాల వారు ప్రచురించారు. 'దోమాడ యుద్ధం' (1921), 'వనదుర్గం', 'జపమాలిక', 'శిశుహత్య', 'తపోవనం', 'కరుణ' వంటి నవలలు రాశారు. 1918 సం.లో తిలక్ రాసిన 'రాయబారం' అనే నాటికకు మరో నాలుగు అంకాలు చేర్చి 'స్వరాజ్య రథం' అనే నాటకం రాశారు. ఇది తెలుగులో తొలి సాతంత్య్రోద్యమ నాటిక. వీటితో పాటు 'ప్రచండ బొబ్బిలి', 'సీతా వనవాసం', 'ద్రౌపది', 'బిల్వమంగళం' వంటి నాటకాలు రాశారు. తెలుగు సాహిత్యంలో పౌరాణిక నాటకాలలో ఒకే పేరుతో పలువురు కర్తలు నాటకాలు రాశారు. వారిలో వేదం వెంకటరాయ శాస్త్రి, కాళ్ళకూరి నారాయణలు రాసిన ప్రతాపరుద్రీయం, చింతామణి నాటకాలను సోమరాజు రామానుజరావు తనదైన శైలిలో రచించారు. ఇతను 1914లో సజన వినోదిని అనే సమాజాన్ని స్థాపించి దాని తరపున నాటకాలు ప్రదర్శించేవారు. పైగా తన రచనల ద్వారానే కాకుండా జానపద కళలైన తోలుబొమ్మలాటలతో కూడా ఊరూరు సంచరించి వాటిని ప్రదర్శించి ప్రజలను ఉద్యమం వైపు అడుగు వేయించేందుకు ప్రయత్నం చేశారు. ఈ విధంగా తాను ప్రదర్శించిన తోలుబొమ్మలను ఒక చోట భద్రపరచగా అవి ప్రమాదవశాత్తు కాలిపోయాయి.
మరణం
ఈ విధంగా పలు కోణాలలో కథలు, నాటకాలు, నవలలు రాసి ప్రజలను ఆలోచించేటట్టు చేసి వారిలో చైతన్యం తీసుకొచ్చిన స్వాతంత్య్ర సమరయోధుడు సోమరాజు రామానుజరావు 1934 సంవత్సరంలో నవంబర్ 14న మరణించారు.
- ఘనపురం సుదర్శన్