Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఊహాతిత జీవనదశ్యాల సమ్మేళన మిది. జీవితం లేని చోట ఊహ పుడుతుందా? ఊహకు కూడా స్థానమి చ్చేది జీవితమే. జీవితమనేది కాఫీ లాంటిది. సిప్ చేస్తున్నా కొద్ది రుచి పెరుగుతుంది.అందుకే కవయిత్రి కాస్త ప్రేమను,కాస్త విరహాన్ని కవిత్వంలో కలుపుకొని జ్ఞాపకాలను తాగు తున్నట్టుంది.
ఈ పుస్తకం
సముద్రం, నది, తీరం, ఇసుక, నక్షత్రాలు, రేయి, వాన, ప్రేమ, నిరీక్షణ, విరహం, ప్రేయసి, ప్రియుడుగా కనిపించే వాక్యాల కలబోతల ఫాంటసీ.
కవయిత్రి పరోక్షంగా ఉంటూనే ప్రతి వాక్యంలో తనగొంతుకను వినిపించింది. జీవితంలోని ఖాళీనంతా ఈ కవితలతో పూడ్చుకుంది.
నేను, నీవు అని సాగే ఈ కవితలలో తనను తాను కోల్పోయినటువంటి విషయాలను చెబుతూనే, నిరీక్షణ అనే పదానికి అనంతానంత భావనలను జోడిస్తుంది. నిరీక్షణ అనేది కొంతమందికి పరీక్షే కావచ్చు కానీ కొన్ని సందర్భాల్లో అదే జీవితం.
కవయిత్రి నాన్న మీద రాసిన కవిత చాలా భిన్నమైంది. ఈ కవితలో
నాన్న నాన్నలా లేని యదార్థ జీవితాన్ని కళ్ళముందు పరిచింది. ఈ కవితలో ఫాంటసీ ఏ మాత్రం లేదు. 'డిప్రెషన్ చెట్టు', కవి-కవిత్వం, ఆకాశం-నేను లాంటి కవితలు కవయిత్రి గీతావెల్లంకి సామర్థ్యానికి మచ్చుతునకలు, మెచ్చుతునకలు.
ప్రేమ అనేది మూలవస్తువుగా సాగే ఈ కవితల నిండా జీవితం బోలెడంత ఉంది. నేను, నీవులలో ఉండేది ప్రేయసి ,ప్రియుడే కాకపోవచ్చు.
జీవితం, మనలో ఒకరు కూడా కావచ్చు. ఊహ అనేది మనిషిని ప్రయాణింప చేసే సాధనం. కవయిత్రి ఊహ చాలా బలమైనది. కనబడ్డ ప్రతి వస్తువులో ప్రేమనుచూడగలిగినప్పుడు
ఎన్ని యుగాలైనా కొన్నింటి కోసం వేచి చూడక తప్పదు. ఆస్వాదించే మనసు కలిగినవాడు ఉండాలి కానీ ఈ కవిత్వం
ఎన్నో అనుభూతులను కలిగిస్తుందనటంలో సందేహం లేదు. ఇది వీరి మొదటి కవితా సంపుటి.
వెంటాడే వాక్యాల్లోకి..
1. కనురెప్పలాంటి నువ్వే కరువైపోయాకా
కళ్ళల్లో నీ రూపం ఎంతకాలం దాచుకుంటాను?
అందుకే
స్క్రీన్ సేవర్‌గా నిన్నే పెట్టుకొని
చూసుకుంటున్నానిప్పుడు! (స్క్రీన్ సేవర్ పేజీ:29)
కవయిత్రి ఈ వాక్యాల్లో అమితంగా ప్రేమించే వ్యక్తి గురించి చెబుతుంది. వాళ్ళు లేనపుడు మనం వాళ్ళు ఉపయోగించిన వస్తువుల్లోనో, వాళ్ళతో కలిసితిరిగిన ప్రదేశాల్లోనో వాళ్ళను, వారి జ్ఞాపకాలను చూసుకుంటుంటాము. ఇందులో ఆ వ్యక్తి లేనితనం లోంచి ఓ సెల్‌ఫోన్ తన గుర్తుగా మిగిలిందని చెబుతూ రాసిన వాక్యాలివి. అందుకే కావచ్చు మనకు ఇష్టమైన వ్యక్తుల పుట్టినరోజును,
పెళ్ళిరోజులను వాట్సాప్ స్టేటస్‌ల్లో పెట్టుకుంటాము.
2. ఇది ఓ ఎడారి జీవితం
దొరికినప్పుడే నీళ్ళు తాగాలి ఒంటెలాగా!
ఎంతో వీలైతే అంతగా
మనసులో సంతోషపు తడిని
నింపి సాగిపోతుండాలి(డిప్రెషన్ చెట్టు, పేజీ:52)
ఇందులో తత్వంతో కూడిన ప్రేమ ఉంది. డిప్రెషన్‌లోంచి రిఫ్రెష్ చేసే వాక్యాల తడిదనం ఉంది.జీవితాన్ని రెండే రెండు వాక్యాల్లో వివరించిన నేర్పరితన ముంది. జీవితంలోఎంత అప్రమత్తంగా ఉండాలని చెబుతూనే ప్రేమనెలా పొందాలో చెప్పే ఈ వాక్యాలు గుర్తుంచుకోదగ్గవి.జీవితం ఎడారి ఒకటే అని చెప్పే పోలిక చాలా కుదిరింది కూడా!
3) ఆకాశం కింద కూర్చుని
రోజూ నేను నక్షత్రాల్ని లెక్కేసేటపుడు
ఎక్కడో తప్పిపోతుంటది
అదినువ్వొస్తేనే సరౌతుందేమో! (ఆకాశమంత ప్రేమ పేజీ 76)
ఇంతలా ఓ మనిషిని ప్రేమించొచ్చు అని చెప్పే మెరుపు లాంటి వాక్యాలివి. మూడు వాక్యాలు సాధారణంగా సాగుతూ నాల్గో వాక్యంలోని పదాల కూర్పు చాలా బలంగా సమన్వయం చేస్తుంది. లెక్కపెట్టుకునే నక్షత్రాల్లో తనులేని ఖాళీతనాన్ని పూరించుకుంటున్న కవయిత్రిది అమాయకపు నిష్కల్మష, నిష్కపట, అమలిన ప్రేమకాక మరేమిటి.
4. ఇద్దరం ప్రేమ తీరాలయినపుడు
మన మధ్య ఎప్పటికీ
పారుతూనే ఉంటుంది
ప్రేమనది!(ఎంతో ప్రేమబీపేజీ 124)
ఒక చేతితో కొడితే చప్పట్లు రావు అనే నానుడిని గుర్తుచేస్తున్న వాక్యాలివి. నిజంగా కవయిత్రి చెప్పినట్టు ఒకరినొకరు అర్థం చేసుకోవటంలోనే జీవితం పరమార్థం దాగుంటుంది. అహం ప్రేమను కాల్చి భస్మం చేస్తుంది. ప్రేమనదిలా పారాలంటే రెండు తీరాలు ప్రేమను నింపుకోవాల్సిందే.
ఇలా ప్రతి కవితలో ప్రేమను ప్రస్తావిస్తూ సరియైన ప్రతీకలను జోడిస్తూ కవయిత్రి కవితలను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది.ఒక వ్యక్తిని ఎంతలా ఆరాధించొచ్చే తెలియజేసే సందేశాత్మక ప్రేమకవిత్వమిది. ప్రేమను,ప్రేమ స్వభావాన్ని పలుచన చేస్తున్న కొంతమందికి మేల్కొలుపును కలిగించే ప్రేమైకసాధనమిది.
- తండ హరీష్ గౌడ్, 8978439551