Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''అయ్యా! దసరా మామూలు'' చెత్త బండి దగ్గర మెలికలు తిరుగుతూ, కళ్ళలోకి సూటిగా చూళ్ళేక, నసుక్కుంటూ, తలవేలాడేసి, నేల చూపులు చూస్తూ అడుగుతున్నాడు ఏసోబు.
''ఇద్దాంలే పోరా!''
''అయ్యా! చాలా రోజుల్నించి ఇలాగే చెబుతున్నారు'' నసిగాడు ఏసోబు.
''వుండొద్దారా నువ్వు అడిగినప్పుడు?''
''అయ్యా! ఒక్కపాలేగా మేం అడిగేది?'' ఏసోబు భార్య వెనకనుంచి.
''సరి సర్లేవే... అయినా ఎందుకివ్వాలి మీకు?, మునిసిపాలిటీ బోల్డు ఇస్తుందటగా మీకు?''
''అవునయ్యా, చాలానే ఇత్తుంది.... అవన్నీ పేరుకుపోయి... ఇగో ఈ చెత్త కుప్పకంటే పెరిగిపోతోంది'' కొంచెం గట్టిగానే అంది మార్తమ్మ.
''రేపు చూద్దాం పోండి'' గేటు వేసుకొని లోపలికి పోతుంటే ఏసోబు దిగులుగా ''రోజూ అదే చెబుతుండు, ఇగ అడగమాకే!'' అంటున్నాడు భార్యతో.
6556
''ఏంటీ నస? రోజూ... ఇంటిముందు? దసరాకి వారం ముందు నుంచీ, దసరా ఐపొయ్యాకా!''
ధుమ ధుమ లాడుతూ గేటు తోసుకునివస్తున్న భర్తని నిలేసింది భార్య.
''ఎవరిమీద పొద్దున్నే?''
''చెత్త మనుషుల మీద!'' కొంచెం వ్యంగ్యంగా అన్నాడు కుక్కుటేశం.
మొన్న ''వెయ్యి నూటపదార్లు'' అందుకుపోయిన ఆ చెత్త మనుషుల గురించా?
''కాదు!'' చిరాగ్గా అన్నాడు కుక్కుటేశం.
''వారం రోజుల ముందు ఒక బందం వొచ్చి, తమరి ధాతత్వాన్ని పొగిడి ''మూడువేల నూటపదార్లు'' రాయించుకు పోయిన వారి గురించా?''
''అబ్బా! వాళ్ళు కాదే, పొద్దున్నే పీక్కు తినే చెత్త మనుషులు గురించి!''
6556
''నీ కొడుకు ఒక చిరుగుల జీనుకి వేలాడే టాగ్ మీద వేల రూపాయల బిల్లు గురించి అడగని నువ్వు, నీ కూతురు మీటరు కూడా ఉండని డ్రస్సు మీద రేటు చూసి బిత్తర పోని నువ్వు, నీ భార్య చీర టాగ్ మీద రేటు చూసి కూడా ఏనాడూ స్పహ తప్పని నీకు, మైదాపిండి మీద ఇంత బంకా, ఒక టమాటా ముక్కా, ఒక కాప్సికమ్ తొక్కా అతికిచ్చిన 'చెత్త'కి పీజా అని నీ కొడుకు మూడొందలు పోసి లొట్టలు వేసుకొని చప్పరిస్తుంటే ఏనాడూ అడగని నువ్వు, రోజూ నువ్వూ, నీ కొడుకులూ, కూతుళ్లూ పోగేసే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, పీజా చెత్త పేకెట్లనీ, ఇంకా ఇంట్లో రొష్టుని ఉత్తి చేతుల్తో ఎత్తిపోసి తీసుకెళ్లి పోయే వాళ్ళు చెత్త మనుషులు అయిపోయారు నీకు! ఒక వంద రూపాయలిస్తే కళ్లకద్దుకొని వెళ్లి పోయేవాళ్ళు చెత్త మనుషులు అయ్యారా నీకు!
సిగ్గు లేదాండీ మీకు!'' జానకమ్మ ఒక్కసారిగా విరుచుకు పడింది మొగుడిమీద!
అవాక్కయ్యాడు కుక్కుటేశం ఒక్కసారిగా! నోరు పెగల్లేదు!
చెవుల్లో దూదివుండలు కూరుకున్న కొడుకూ, మొబైల్లో చూస్తూ పిచ్చిపిచ్చిగా నవ్వుకునే కూతురూ, ఇంట్లో యే మాటలూ ఏనాడూ వినిపించుకోని ఈ డెఫ్ అండ్ డమ్ బిడ్డలు కూడా నోరెళ్ల బెట్టి చూస్తుంటే జానకమ్మకి ఆశ్చర్యం వేసింది.
కుక్కుటేశం గిల్టీగా ఫీలయ్యాడు.
కొడుకు వైపు గద్దించి చూశాడు, కూతురు బిక్కు బిక్కుమంటూ చూస్తోంది! కంటితోనే ఎగరేస్తూ అడిగాడు విషయం యేమిటన్నట్టు?''
''మమ్మీ....మమ్మీ...'' అంటూ నసుగుతూ'', మమ్మీ ఈ మధ్య ''ఇంటి పనీ... బైటిపనీ'' అంటూ ఏవేవో పుస్తకాలు చదువుతోంది డాడి'' నసిగింది కూతురు.
6556
''అమ్మా, చెత్త వెయ్యండి అమ్మా! చెత్త వెయ్యండి తల్లీ!
యే కవి హదయం పొంగిందో, యే రక్త కన్నీరు కార్చే స్టేజీ ఆర్టిస్టుగా విలపించిన కళాకారుడి చేతిలో రికార్డు అయిందో, చెప్పొద్దూ చెత్త బండి బజార్లో వినిపించినప్పుడల్లా, ఎలా అయినా సరే లేచొచ్చి చెత్త వెయ్యాలని పిస్తుంది. ఎంత హదయ విదారకంగా, హదయం ద్రవించేలా, హదయం కరిగిపోయేలా, ఎన్నిసార్లు విన్నా దుఃఖం తన్నుకొచ్చేలా... అసలు చెత్తని ఇంత దయనీయంగా, ఇలా గుండెలు తరుక్కుపోయేలా అడుక్కుంటే తప్ప గత్యంతరం లేదన్నట్టుగా రాసిన ఆ ఖండ కావ్యానికి మనసులోనే జోహార్లు.
ఏసోబుకు జానకమ్మ గారు గేటు దగ్గర కనబడగానే దసరా మామూలు ఆశ చిగురించింది.
కళ్ళు తళుక్కున మెరిశాయి.
మార్తమ్మ ''బాగున్నవా అమ్మా'' అంది.
జానకమ్మ చేతిలో ఒక పొట్లం ఉంది. వెనక కుక్కుటేశం చేతిలో కూడా ఒక పేకెట్టు వుంది. కొడుకు చేతిలో కూడా ఏదో పొట్లం ఉంది. కూతురు చేతిలో కూడా!
జానకమ్మ మార్త చేతులో పొట్లం పెట్టి ఇదిగో నీకు 'చీర' అంది చిరునవ్వుతో.
కుక్కుటేశం ''ఇదిగో ఏసోబూ, ఇవి నాకు ఎవరో పెళ్లికి పెట్టిన బట్టలు. డ్రస్సు కుట్టించుకో!'' అన్నాడు చిరునవ్వుతో.
''ఇవిగో అంకుల్! నా పీజా పాకెట్లూ, అమెజాన్ పెట్టెలూ పారేసినందుకు నీకు అమ్మ చేసిన స్వీట్లు''
నవ్వుతూ చేతిలో ఒక పొట్లం పెట్టాడు కొడుకు సరదాగా నవ్వుతూ.
''ఆంటీ, మీ అమ్మాయికి నా డ్రస్ సరిగ్గా సరిపోతుంది. ఇదిగో!'' కూతురు ఇంకో పేకెట్టు!
ఏసోబూ, మార్తా ఉబ్బి తబ్బిబైపోతున్నారు. నమ్మశక్యంకానట్టు. వారి కళ్ళల్లో నీళ్ళు తళుక్కు మన్నారు!
6556
జానకమ్మ అంది ఇంట్లోకి రాగానే!
''చూశారా! మన ఆస్తులు ఎప్పట్లానే ఉన్నారు, ఏమీ తరగలేదు ఇప్పటికీ'' అంది.
''అవును జానకీ! యెన్నో మనకు అవసరంలేని వస్తువుల్ని కూడా ఇతరలకు ఇవ్వలేని 'చెత్త' మనుషులం మనమే, ''వాళ్ళుకాదు'' కుక్కుటేశం తలొంచుకున్నాడు.
చిన్ని నీటిపొర జానకి కళ్ళలో తళుక్కుమంది.
- వి.విజయకుమార్, 8555802596