Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముల్లా కథలు పేరుతో వీరు రాసిన ఇరవై మూడు కథల్లో దేనికదే సాటి. ఈ కథలు రాసినప్పుడు పొట్లపల్లి వయస్సు ఇరవై అయిదేండ్లలోపు వయసు మాత్రమే. ఒక రకంగా ఈ కథలన్నీ ఆనాటి బాల బాలికలకు చక్కని భాషను, చమత్కారాన్ని తెలుసుకు నేందుకు ఉపయోగపడ్దాయని చెప్పవచ్చు. పొట్లపల్లి హాస్యాన్ని ఎంత చక్కగా పండించగలరో ఆయన కథలు చూస్తే తెలుస్తుంది.
తెలంగాణ తాత్వ్తిక, సాంస్కృతిక, రాజకీయ ప్రపంచాలకు వెలుగులు పంచిన కవి పొట్లపల్లి రామారావు. తెలంగాణాలో బాల సాహిత్యం రాలేదని రాసేవాళ్ళకు పొట్లపల్లి బాలల కథలోక చరుపు చరుస్తాయి. 20 నవంబర్, 1997న వరంగల్ జిల్లా తాటికాయల గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో పుట్టారు. పొట్లపలి రామారావు పిల్లల కోసం చేసిన రచనలు రెండు. మొదటిది 'ముల్లా కథలు', ఇవి 1945లో 'ఆనందవాణి'లో వచ్చాయి. ఇవి హాస్య వ్యంగ్య కథలు. సునిశితమైన హాస్యం, చక్కని వ్యంగ్యాన్ని వీటిలో చూడవచ్చు. పొట్లపల్లి రామారావు సాహిత్యంపై పరిశోధన చేసిన బాల సాహితీవేత్త డా|| భూపాల్ ఈ కథలకు 1978లో ప్రచురిం చిన మహీధర రాంమోహన్‌రావు 'నసీరుద్దీన్ కథలు' పోలివున్నాయని చెబుతారు. పొట్లపల్లి వారి 'ముల్లా కథలు' చిన్న కథలు. తాను చెప్పాలనుకున్న విషయాన్ని చాలా సూటిగా అతి తక్కువ పదాలతో చెప్పే రసవిధ్య తెలిసిన రచయిత పొట్లపల్లి. పిల్లలకోసం రాయడం కత్తిమీద సాము వంటిది. దానిని అతి సులభంగా చేసి చూపించిన వారాయన. ముల్లా కథలు పేరుతో వీరు రాసిన ఇరవై మూడు కథల్లో దేనికదే సాటి. ఈ కథలు రాసినప్పుడు పొట్లపల్లి వయస్సు ఇరవై అయిదేండ్లలోపు వయసు మాత్రమే. ఒక రకంగా ఈ కథలన్నీ ఆనాటి బాల బాలికలకు చక్కని భాషను, చమత్కారాన్ని తెలుసుకు నేందుకు ఉపయోగపడ్దాయని చెప్పవచ్చు.
పొట్లపల్లి హాస్యాన్ని ఎంత చక్కగా పండించగలరో ఆయన కథలు చూస్తే తెలుస్తుంది. 'ముల్లా వివేకము' ఇంందులోని నవ్వు తెప్పించే కథలో ఒకటి. తెల్లారగానే నమాజుకు వేళ అయిందని మసీదు నుంచి 'అజా' వినిపించడం గురించి మనకు తెలుసు. కథలోని ముల్లా ఒకనాడు ప్రొద్దున్నే అజా పిలుపు ఇచ్చి, వెంటనే కేకలు వేస్తూ పరుగులు తీస్తుంటాడు, అలా పరుగులు తీస్తున్న ముల్లాను చూసి అలా ఎందుకు పరుగెడుతున్నావని అడిగితే, దానికి సమాధానంగా ''నా పిలుపు ఎంతదూరం పోయిందో చూద్దామని'' చెబుతాడు. అదివిని జనం గొల్లున నవ్వుతారు. ఇది పొట్లపల్లిగారి ముల్లా పరిచయం.
ఇటువంటిదే మరో కథ 'ముల్లా రసికత్వము'. ఇందులో ముల్లాలోని హాస్య చతురతనే కాదు, ముల్లా యొక్క గొప్పదనాన్ని కూడా చూడవచ్చు. ముల్లా కన్నా ఖాజీ అధికుడు. అందులోనూ ఆయన ప్రభుత్వ అధికారి. ఒకనాడు ఆ ఖాజీ ఏదో ఒక రచన చేసి ముల్లాకు వినిపిస్తాడు. అది నచ్చని ముల్లా దానిని ప్రశంసించడు. అందుకు ముల్లాకు ఖాజీ విధించిన శిక్ష జైలు శిక్ష. తరువాత కొన్నిరోజులకు ముల్లాకు తిక్క కుదిరిందిని భావించిన ఖాజీ ముల్లాను మళ్ళీ పిలిచి తన రచనను వినిపిస్తాడు. అది విన్న ముల్లా ఏమీ మాట్లాడకుండానే లేచి వెళ్తాడు. ఎక్కడకని అడిగితే 'జైలుకు' అంటూ సమాధానమిస్తాడు. ఉర్దూ నుంచి గ్రహించినప్పటికీ ఎక్కడా ఆవాసనలు, ఆనవాళ్ళు కనిపించవు. దేనికది స్వీయ కథలాగే ఉంటుంది. అది పొట్లపల్లి వారిశైలి, పద్దతి. చెంపదెబ్బ, ముల్లా రసికత్వము, పిసినిగొట్టు, పారిన పాచిక వంటి వాటి పేర్లు చూస్తే తెలుగుదనం తెలుస్తుంది. న్యాం, ఉత్తరం, బిచ్చగాడు, ముల్లా ధనుర్విద్య, మృత్యువు భయం వంటి మరికొన్ని కథలు చదివుతుంటేనే కడుపుబ్బ నవ్వు తెప్పిస్తాయి. ఉత్తరం కథ మనకు తెలిసినట్టే అనిపించినా పొట్లపల్లివారి శైలిలో చదివితే ఎంత విలక్షణమైన వారి శైలి నవ్వకనే నవ్వించే పద్ధతి తెలుస్తుంది.
పొట్లపల్లి వారి మరో బాల సాహిత్య రచన 'ఆచార్యులవారి కథలు'. వీటిని పొట్లపల్లి ప్రచురణలు తరుపున వచన సాహిత్య సంకలనంలో ప్రచురించారు. ఇవి జూన్, 1945 నుంచి 'ఆనందవాణి' పత్రికలో అచ్చయ్యాయి. ''దొరికినవి మూడు నాలుగు కథలే ఐనా అవి భారతీయ సంస్కృతికి మచ్చుతునకల్లా ఉన్నాయి'' అని అంటారు భూపాల్. 'తళిహత్తం' ఇందులోని పెద్ద కథ. దొంగల గుంపుకు, ఆచార్యులవారి శిష్యులకు మధ్య జరిగే సంభాషణలు ఇందులో చూడవచ్చు. శిష్యగణంతో తరలివెళుతున్న ఒక గురువును దోచుకావాలని చూసిన దొంగల గుంపు నుంచి తన మాటల చమత్కారంతో తప్పించుకున్న గురువు కథ ఇది. గురువుగారి ఒక శిష్యుని ద్వారా రచయిత జరిపిన సభాషణలను చేస్తే సమయస్ఫూర్తి, చమత్కారాల వంటివాటిని పొట్లపల్లి ఎంత బాగా చెబుతారో తెలుస్తుంది. ఇంత చక్కని బాల సాహిత్యాన్ని సృజించిన పొట్లపల్లి వారి మొత్తం కథలు లభించివుంటే తెలుగు బాల సాహిత్య చరిత్రలో మరో గొప్ప అధ్యాయం ఆవిష్కృతమై ఉండేది. అదీ స్వాతంత్య్రానికి పూర్వమే రాయడం మరో విశేషం. కేవలం ఈ బాల సాహిత్యమే కాదు పొట్లపల్లి వారి ప్రతిగేయాన్ని చూస్తే అవి పిల్లలకు ఎంత బాగా అర్థమవుతాయో తెలుస్తుంది. 'చీమల బారు' గేయంలో- ''పిల్లవాడా పిల్లవాడా ఎందుకు ఏడ్చావ్''/''చీమ కుట్టింది''/ ''చీమా చీమా ఎందుకు కుట్టావ్''/''నా బంగారు పుట్టలో వ్రేలు పెడితే కుట్టనా?''... ఇది రాజు, అతని ఏడుగురు కొడుకుల కథను పోలిఉన్న గేయం. ''కాలిబాట'' కూడా ఇలా సులభంగా అర్థమయ్యే గేయమే. స్వాతంత్య్రానికి పూర్వమే ఎంతటి నిర్దుష్టమైన వచన రచన, చక్కటి బాల సాహిత్యం వచ్చిందో చెప్పేందుకు నిదర్శనాలు పొట్లపల్లి రామారావు పిల్లల కోసం రాసిన కథలు.
- డా|| పత్తిపాక మోహన్ 9966229548