Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2050 నాటికి హరిత గృహ వాయుద్గారాలను శూన్యస్థాయికి తగ్గించటం ఈ సదస్సు ప్రధాన లక్ష్యాలలో ఒకటి. సహజ సెలవులను, ఆవరణ వ్యవస్థలను కాపాడుకోవటం రెండో అంశం. అన్నింటికంటే ముఖ్యమైనది ఆర్థిక వనరులను చేకూర్చుకోవటం. వీటిని సాధించుకోవటానికి అవసరమైన నియమ నిబంధనలు, పారిస్ ఒప్పందాన్ని తు.చ. తప్పకుండా అమలు చేసే 'పారిస్ రూల్ బుక్'ను రూపొందించుకోవటం ఈ సదస్సు ఎజెండాగా ఉంది. భూ ఉపరితల వేడిని పారిశ్రామిక విప్లవ కాలపు ముందున్న ఉష్ణోగ్రతలతో పోలిస్తే 1.5డిగ్రీల సెల్సియస్‌కు మించకుండా చూడాలంటే కర్బన ఉద్గారాలను 2030లోగా సగానికి సగం తగ్గించి తీరాలి.
ప్రపంచ దృష్టి అంతా ఇప్పుడు సీఓపీ26 పైనే. సీఓపీ 26 ఏమిటి? ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగే 26వ అంతర్జాతీయ వాతావరణ సదస్సు. (సీఓపీ 26). వాతావరణ మార్పుపై జరిగే భాగస్వాముల సదస్సు ఇది. ఇందులో ప్రపంచాధినేతలతో పాటు, వాతావరణ నిపుణులు, పర్యావరణ కార్యకర్తలు, ప్రభుత్వాధికారులు, స్వతంత్ర పౌర సంస్థలు అందరూ కలిపి 20వేలకు పైగా హాజరు కానున్నారు. రెండు వారాలపాటు జరిగే ఈ సదస్సు అక్టోబర్ 31న స్కాంట్టాండ్ రాజు దాని గ్లాస్కోలో ఆరంభం కానున్నది. ఆధ్యదేశాధిపతి, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సదస్సు లక్ష్యాలను బొగ్గు, కార్లు, ధనం, చెట్లు అని సూటిగా చెప్పారు. ఈ సదస్సు అధ్యక్షులు ఆలోక్శర్మ పారిస్ ఒప్పందాన్ని అమలు చేయటానికి మన ముందున్న చివరి అవకాశమని ప్రపంచనాయకులను హెచ్చరించారు. దాని అమలుకై పటిష్ట కార్యా చరణకు కచ్చితమైన నిర్ణయాలు తీసుకునే సదస్సుగా, ఇది వాతావరణ మారన్పుకు భరత వాక్యం పలికే అసాధారణ సందర్భంగా పేర్కొన్నారు.
భూగోళం మనుగడకు, సకల జీవరాసుల ఉనికికి పెనుప్రమాదంగా వాతావరణ మార్పు ముంచుకొస్తున్నదని ఐక్యరాజ్యసమితి నిపుణుల బృందం దశాబ్దాల క్రితమే హెచ్చరించింది. అప్పట్నుంచీ ఇటువంటి సదస్సులెన్నో జరిగాయి. ఆ క్రమంలో రేపు జరగబోయేది 26వది. ఇన్నాళ్లుగా మీనమేషాలు లెక్కబెట్టిన వారికి ఇది ఇంకొక సమావేశమే! కాని వాతావరణ మార్పుపై చర్యలు చేపట్టటానికి ఇంకేమాత్రం తాత్సారం చేయలేమనీ, రేపో ఎల్లుండో నింపాదిగా మాట్లాడుకునే రోజులకు కాలం చెల్లిందనీ నిపుణుల హెచ్చరిక. ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుపై నియమించిన అంతర ప్రభుత్వ నిపుణుల కమిటీ (ఐపీసీసీ) గత ఆగస్టు 9న విడుదల చేసిన మదింపు నివేదిక (ఏఆర్-6) కోడ్ రెడ్ ప్రమాదహెచ్చరిక చేసిన నేపథ్యంలో సీఓపీ26కు మరింత ప్రాధాన్యం వచ్చింది. ఎప్పుడో ఈ శతాబ్దాంతానికి (2100) ప్రమాద స్థాయికి చేరుకుంటాయనకున్న వాతావరణ ఉష్ణోగ్రతలు ఈ దశబ్దంతానికే చేరుకుంటున్నాయని, అందుకే మానవాళికి చివరి ప్రమాద హెచ్చరిక 'కోడ్రెడ్'ను జారీ చేసినది. శతాబ్దాలుగా విడుదలై పోగుపడిన ఉద్గారాలు సీఓ2, ఇతర హరిత గృహవాయువుల సమిష్టి ప్రభావ ఫలితమే నేడుమనం చూస్తున్న భూతాపం, వాతావరణ మార్పు అని ఈ నివేదిక స్పష్టం చేసింది. అరకొర చర్యలతో దీన్ని తిప్పికొట్టడం సాధ్యం కాదనీ తక్షణం హరిత గృహ వాయు ఉద్గారాలను సగానికి సగం తగ్గించి 2050నాటికి ఉద్గారాలను శూన్యస్థాయికి తీసుకు పోవాలని సూచించింది.
2050 నాటికి హరిత గృహ వాయుద్గారాలను శూన్యస్థాయికి తగ్గించటం ఈ సదస్సు ప్రధాన లక్ష్యాలలో ఒకటి. సహజ సెలవులను, ఆవరణ వ్యవస్థలను కాపాడుకోవటం రెండో అంశం. అన్నింటికంటే ముఖ్యమైనది ఆర్థిక వనరులను చేకూర్చుకోవటం. వీటిని సాధించుకోవటానికి అవసరమైన నియమ నిబంధనలు, పారిస్ ఒప్పందాన్ని తు.చ. తప్పకుండా అమలు చేసే 'పారిస్ రూల్ బుక్'ను రూపొందించుకోవటం ఈ సదస్సు ఎజెండాగా ఉంది. భూ ఉపరితల వేడిని పారిశ్రామిక విప్లవ కాలపు ముందున్న ఉష్ణోగ్రతలతో పోలిస్తే 1.5డిగ్రీల సెల్సియస్‌కు మించకుండా చూడాలంటే కర్బన ఉద్గారాలను 2030లోగా సగానికి సగం తగ్గించి తీరాలి. ప్రపంచదేశాల సర్వాంగీకారం ఉన్న పారిస్ ఒప్పందం అమలు చేయటంలో ఎందుకు అడ్డంకులు ఎదురవుతున్నాయి? ఇన్నేండ్లుగా సదస్సులు, తీర్మానాలు చేస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఎందుకు ఉంది? వాతావరణ మార్పుకు కారణమైన కర్బన ఉద్గారాలను వాతావరణంలోకి విచ్చలవిడిగా వదిలిందెవరు? దీని కట్టడికి ప్రధాన బాధ్యత తీసుకోవలసింది ఎవరు? ఒక్క అమెరికా, ఐరోపా దేశాలే 970 బలియన్ టన్నుల సీఓ2ను విడుదల చేసాయి. నేటి పరిస్థితికి కారకులు సంపన్న దేశాలే. అందుకు బాధ్యతసైతం వారు తీసుకోవాలి గదా! తొలుత సంపన్న దేశాలు ఎక్కువ బాధ్యత తీసుకొనేలా వాతావరణ మార్పును కట్టడిచేసే సాంకేతికతను వర్థమాన దేశాలకు అందించే విధంగా అంగీకారానికి రావటం జరిగింది. వీటిని బుట్టదాఖలా జేసి, సమస్య పరిష్కారాన్ని తప్పుదారులు పట్టించి ఎట్టకేలకు పేద, వర్థమాన దేశాల డిమాండ్లను పెడచెవిని బెట్టి 2015లో పారిస్ సదస్సులో నీరుగార్చిన ఒక ఒప్పందాన్ని వెలుగులోకి తెచ్చారు. దాని ప్రధానలక్ష్యం ఉష్ణోగ్రత పెరుగుదలను 2 డిగ్రీలకు పరిమితం చేయటం, 1.5 డిగ్రీలకే తగ్గిస్తే మరింత మేలని. బొగ్గు వాడకానికి, శిలాజ ఇంధనాలకు గుడ్‌బై చెప్పకుండా కర్బన ఉద్గారాలను అరికట్టలేము. కాని అభివృద్ధి చెందుతున్న పేదదేశాలు దీన్ని భరించగలవా? దీనికి ప్రత్యామ్నాయం వారికి అందుబాటులో ఉందా? పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగానికి కావలసిన టెక్నాలజీ వారికి అందుబాటులో ఉందా? ఇది జరగాలంటే ఆర్థిక భారం తడిసి మోపెడవుతుంది. ఇందుకు కావలసిన ఆర్థిక వనరులెలా? దీనికి సంపన్న దేశాలు తమ బాధ్యతలా కాకుండా ఒక నిధిని ఏర్పాటు చేయాలని చెప్పింది పారిస్ ఒడంబడిక. సంవత్సరానికి 138 బిలియన్ డాలర్లు తక్కువలో తక్కువ 100 బిలియన్ డాలర్లు సమకూర్చారట. సీఓపీ26 ముందున్న సవాల్. దీన్ని ఆచరణలోకి తీసుకురావటం. ఏమేరకు ఈ సదస్సు ఆర్థిక వనరులను వర్థమాన దేశాలకు అందుబాటులోకి తెస్తుందో వేచి చూడాలి. కర్బన ఉద్గారాలను 2030 నాటికి సగానికి సగం తగ్గించడానికి అరకొర ప్రకటనల బదులు ఆచరణాత్మక ప్రణాళికలను సంపన్న దేశాలు అమలు చేసేలా వత్తిడి తేవటం. పేద దేశాల అభివృద్ధి హక్కుతో లింకుపెట్టి తప్పించుకో జూస్తున్న పారిశ్రామిక దేశాల ఎత్తుగడలను అధిగమించి స్వతంత్రంగా వ్యవహరించడంలో ఈ సదస్సు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. పేద దేశాల ప్రజల జీవనాధారాలను రక్షించేవిధంగా ఆవరణ వ్యవస్థలను, సహజ వనరులను, అడవులను పరిరక్షించే సమగ్ర చర్యలు చేపట్టడం ద్వారా వాతావరణ మార్పుకు చెక్ పెట్టవచ్చు. వాతావరణ సంక్షోభాన్ని సృష్టించిన అభివృద్ధి నమూనాలపై చర్చ జరుపవలసిన సందర్భమిది. న్యాయబద్ధమైన పరిష్కారాలను నీరుగార్చి మధ్యేమార్గంగా చేసుకున్న పారిస్ ఒప్పందాన్ని సైతం నిర్లక్ష్యం చేయటం శోచనీయం. ఈ ఒప్పందమే బూటకమని వైదొలగిన అమెరికా మళ్ళీ ఒప్పందంలోకి రావటం, ఈ సదస్సులో పాల్గొన బోవటం కొసమెరుపు. దేశాధినేతలతో పాటు యువ పర్యావరణ ఉద్యామకారిణి గ్రేటా ధున్బర్గ్, ప్రముఖ జర్నలిస్ట్, పర్యావరణ కార్యకర్త డేవిడ్ అటెన్ బరో వంటి ఎందరో ప్రజల తరఫున ఈ సదస్సులో గొంతెత్తనున్నారు. భూమి వాతావరణాన్ని కాపాడుకోవటానికి ఇప్పుడు తప్పితే మరొక అవకాశం రాదని గుర్తించి ప్రపంచదేశాలు సరైన దిశలో తక్షణ పర్యావరణ చర్యలు చేపట్టటం అవసరం. ఈ మహాయజ్ఞంలో ప్రభుత్వాలు, ఉన్నతాధికారులు, ప్రభుత్వేతర సంస్థలు, వ్యాపారులు, పౌరసంఘాలు, ఉద్యమకారులు ఇలా ప్రతిఒక్కరినీ కలుపుకుని ఒక తాటిపైకి తీసుకురావటంలో సీఓపీ-26 విజయం సాధించాలని ఆశిద్దాం.
- డాక్టర్ కట్టా సత్యప్రసాద్, 9490098918