Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వట్టికోటకు నిజామాబాద్లో జరిగిన ఆరవ ఆంధ్రమహాసభతో తొలిసారిగా పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఆయన రాజకీయ జీవితం మొదలయ్యింది. స్వాతంత్య్రోద్యమం జరుగుతున్న సమయంలో మొదట గాంధేయవాదిగా ఉంటూ, క్రమంగా కమ్యూనిస్టు భావాలకు ఆకర్షితుడై అతివాదుల పక్షాన నిలిచారు. 1951లో 'గుమాస్తా' పేరుతో పత్రిక నడిపారు. తెలంగాణ పోరాటంలో హత్య చేయబడ్డ దొడ్డి కొమురయ్య హత్యా విషయమై వేసిన విచారణ కమిటీలో ఆళ్వారు స్వామి సభ్యులు.
చిన్న వయసులో పెద్ద సమస్యలు ఎదుర్కొన్నారు. పోషకులు దూరమవడంతో కష్టాలు భరించి స్వంతంగా పోషించుకునే స్థాయికి ఎదిగారు. సాహితీ పిపాసతో, బతుకుదెరువుకు ఆకలితో బ్రిటిషు ప్రాంతానికెళ్ళి పనిచేస్తూ పూట గడుపుకుంటూ స్వాభిషిలాషతో విద్యా గంధాన్ని ఒంట పట్టించుకున్నారు. హైదరాబాద్ స్వాతంత్య్రం కొరకు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు గోడలకు పరిచయమయ్యారు. తన జీవితాన్ని తాను అక్షర రూపంగా మార్చుకున్నారు. స్వశక్తితో ఎదిగి ఎందరికో ఆదర్శప్రాయుడయ్యారు.
జీవన రేఖలు
రచయిత, పాత్రికేయుడు, ప్రచురణ కర్త, స్వాతంత్య్ర సంగ్రామ వీరుడు వట్టికోట. తొలితరం తెలంగాణ కథకుల్లో ముఖ్యులైన ఆళ్వారుస్వామి 1915 నవంబర్ 1న నల్లగొండ జిల్లా నకిరేకల్ సమీపంలోని చెర్వు మాదారం గ్రామంలో సింహాద్రమ్మ, రామచంద్రాచార్యులకు జన్మించారు. ఆయన చిన్న వయసులో నే తండ్రి అకాల మరణం చెందారు.
విద్యాభ్యాసం
ఆళ్వారుస్వామి, తండ్రి కన్నుమూయగానే కంచినేపల్లి సీతారామా రావు అనే ఉపాధ్యాయుడికి వంట చేసి పెడుతూ నకిరేకల్లులో ఆ తర్వాత సూర్యాపేటలో కొంతకాలం ఉండి, అనంతరం విజయవాడకు వెళ్లి హౌటల్లో పని చేస్తూ స్వంతంగా చదువు నేర్చుకున్నారు.
సాహిత్యం వైపు దారి
వట్టికోటకు సూర్యాపేటలో ఉన్న ఆంధ్ర విజ్ఞాన ప్రకాశినీ గ్రంథాలయంతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కందిబండ అనే గ్రామంలో ఉండే నారపరాజు రాఘవరావు సోదరులతో ఏర్పడిన పరిచయం ఆళ్వారుస్వామిని సాహిత్య అధ్యయనం వైపు మళ్ళించింది. ఇలా ఇక్కడి నుంచి హైదరాబాదు చేరుకున్న వట్టికోట నారాయణ త్రయంలో ఒకరైన కోదాటి నారాయణరావు సహాయంతో గోలకొండ పత్రికలో ప్రూఫ్ రీడరుగా చేరాడు. ఇక్కడే ఇతనికి నాటి ప్రముఖులతో పరిచయమయ్యింది. అనంతరం వట్టికోట కందిబండ నారపరాజు సోదరుల వలన బెజవాడకు వెళ్లి కొన్ని రోజులు ఒక పూటకూళ్ళ ఇంటిలో పనిచేస్తూ స్వంతంగా రాయడం, చదవడం నేర్చుకున్నారు. ఈవిధంగా కొంతమందికి సపర్యలు చేస్తూ, వారితో ఉన్న చిన్న పరిచయంతో విద్యపై ఉన్న అమితాసక్తితో విద్యను నేర్చుకున్నారు.
1938లో కాశీనాథుని నాగేశ్వరరావు స్మతిలో వట్టికోట 'దేశోద్దారక గ్రంథమాల'ను స్థాపించారు. ఈ గ్రంథమాల తరపున 1938-41, 1953-61 మధ్య కాలంలో 30 పుస్తకాలను ప్రచురించారు. ప్రజలలో విద్య పట్ల ఆసక్తి కలిగించుటకు మారుమూల గ్రామాలకు తిరిగి చందాదారులను చేర్చి పుస్తకాలను అందించారు. నిబద్ధత గలిగిన పరిశోధకులకు పాత పత్రికలు, సంచికలు అందచేయుటకు 'దేశోద్దారక సూచీ గ్రంథాలయం' స్థాపించారు.
స్వాతంత్య్రోద్యమం
1942లో హైదరాబాద్లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్టై ఏడాది పాటు ముషీరాబాద్ జైలు జీవితాన్ని అనుభవించి 1943లో విడుదలయిన తర్వాత ఫిబ్రవరిలో తెనాలిలో తాపీ ధర్మారావు అధ్యక్షతన జరిగిన అరసం ప్రథమ సభలలో పాల్గొన్నారు. మరల నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొని 1947లో అరెస్టయి సికింద్రాబాద్, నిజామాబాద్, వరంగల్, గుల్బర్గా, సంగారెడ్డి జైళ్లలో ఐదు సంవత్సరాలు జీవితాన్ని గడిపారు. 1951లో విడుదలయి కాళోజీ 'నా గొడవ'ను ప్రచురించి శ్రీ శ్రీ చేత ఆవిష్కరిం పచేసారు.
వట్టికోటకు నిజామాబాద్లో జరిగిన ఆరవ ఆంధ్రమహాసభతో తొలిసారిగా పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఆయన రాజకీయ జీవితం మొదలయ్యింది. స్వాతంత్య్రోద్యమం జరుగుతున్న సమయంలో మొదట గాంధేయవాదిగా ఉంటూ, క్రమంగా కమ్యూనిస్టు భావాలకు ఆకర్షితుడై అతివాదుల పక్షాన నిలిచారు. 1951లో 'గుమాస్తా' పేరుతో పత్రిక నడిపారు. తెలంగాణ పోరాటంలో హత్య చేయబడ్డ దొడ్డి కొమురయ్య హత్యా విషయమై వేసిన విచారణ కమిటీలో ఆళ్వారు స్వామి సభ్యులు.
సాహిత్యం
కథకుడిగా, నవలాకారుడిగా ప్రసిద్ధి చెందిన ఇతను 1946లో 'పరిసరాలు' పేరుతో 34 మంది కథకుల కథలను ప్రచురించారు. అలాగే తెలంగాణ రాజకీయ చరిత్రను, సంస్కతిని తెలుపుతూ రాసిన 32 మంది వ్యాసాలను 'తెలంగాణం' పేరుతో ప్రచురించారు. మచీలిపట్నం నుంచి వెలువడే 'తెలుగు విద్యార్థి' పత్రికలో 'రామప్ప రభస' పేరుతో కథనాలు రాశాడు. 'తెలుగు తల్లి' మాస పత్రిక నిర్వహణ సంఘంలో సభ్యుడిగా ఉన్నారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో నిజాం రాష్ట్రంలో జరిగిన దోపిడీ చర్యలను కథల్లో, నవలల్లో చిత్రించారు. ధర్మరాజు అనే కలం పేరుతో 'ఆక్షేపణ లేదు' (జాతీయోద్యమ కథ) వంటి కథలు వివిధ పత్రికల్లో రాశారు. ప్రజల మనిషి (1952), గంగు (అసంపూర్తి నవల) అనే పేర్లతో నవలలు, జైలు లోపల అనే పేరుతో ఆరు కథలను రాశారు. మేధావి, కొత్తబాట, కనువిప్పు వంటి పలు నాటికలనూ రాశారు.
ఈ విధంగా తెలంగాణ స్వాతంత్య్రోద్యమంలో, తెలుగు సాహిత్యంలో, పుస్తక ప్రచురణలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకున్న వట్టికోట 1961, ఫిబ్రవరి 5న తేదీన కన్నుమూశారు.
- ఘనపురం సుదర్శన్,
9000478542