Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జ్యోతీర్మయి మళ్ళ జాగ్రత్తగా తన ఏడోయేటి నుంచీ తవ్వుకుని తీసిన జ్ఞాపకాలనన్నీ పేర్చి, కూర్చి మనల్ని బాల్వపు స్మతుల్లోకి తోసేసే గ్రంథమిది. 'తవ్వకాలు' అని పేరు పెట్టిన పుటల్లోకి చూపును మళ్ళించగానే చివరి వాక్యం చదివే వరకూ తలను తిప్పుకోలేము. వందపేజీలు తిరగేయటమూ అంటే మానవ జీవనానుబంధాలను నెమరువేయడంగా జరిగిపోతూ వుంటుంది. 'తవ్వకాలు చదివిన ప్రతి ఒక్కరూ తమ బాల్యాన్ని చూసుకుంటారు. తమలో తామే మురుసుకుంటారు.
నేటి బాల్యంలో ఏవేవి లేకుండా పోతున్నాయో, దేనికి దూరమయి పోతున్నారో అవన్నీ ఇందులో వున్నాయి. అది విశాఖనో విజయినగరమో, వరంగల్లో, హైదాబాదో ప్రదేశమే దయితే ఏముంది. మనుషుల జీవనగమనాలన్నీ ఒకటే. అనుబంధాల తడి జ్ఞాపకాలు ఎవరికైనా మధురమే. ఇప్పటి తరానికి జ్ఞాపకాలు లేవు. ఇవి కేవలం స్మతులు కాదు. మానవ సంబంధాల పరిణామ చరితలోని కొన్ని మచ్చుతునకలు. ''అప్పుడే ఉడికిన బువ్వను/మెత్తగా వేళ్ళతో పిసికినప్పుడల్లా / అమ్మ చెయ్యి కాలే వుంటది / బువ్వదీ చారుదీ కాదేమోరుచి/ అమ్మ చేతిదే అయుంటుంది''. ఈ ఆరంభ కవిత సార్వజనీనమైనది, అందరి అనుభూతికీ అందేదేకదా! మడత కుర్చీ కవితలో 'నాకంటి ఖజానాపెట్టెలో దాగుండి, రెప్పల తలుపులు మూసినప్పుడల్లా లోపల కిటికీ లేవో తెరుచుకుని ముత్యాల్లా జారిపడి మది ఒడిని నించే అపురూప దశ్యాలు' మడత కుర్చీలో నాన్న బొజ్జపై కబుర్లాడిన జ్ఞాపకం ఎంత మధురం! 'పాఠాలు బాగుంటాయి గాని ఇంటరువెల్లు బెల్లు ఇంకా బాగుంటుంది. వేడి వేడి ఉప్పాడేశా... తిరగలిలో ముఖ్యంగా ఆడ పిల్లలు వంట చేసి వడ్డిస్తున్నట్టు, బొమ్మరిల్లు కట్టి పెళ్ళి చేస్తున్నట్లు ఆడే ఆటలు ఇప్పుడేమయ్యాయో! అన్నీ సెల్లుల్లో, కార్టూన్ బొమ్మల్లో మునిగిపోతున్నారు. బాల్యంలో అన్నా చెల్లల మధ్య ఉండే అనుబంధాలు, నులకమంచం జ్ఞాపకాలు, టూరింగ్ టాకీసులో ఏడూ కొండల స్వామి ఎక్కడున్నావయ్య!' అనే పాట, బాల్యదశ లోని అన్ని ఘట్టాలను అక్షరీకరించిన జ్యోతిర్మయి గారు చిత్రకారిణి కూడా. అందుకనే ప్రతి కవితకి తానే బొమ్మగీసారు. గజల్ గాయనిగా ప్రసిద్ధురాలయిన వీరీ 'తవ్వకాలు' అందరి బాల్యపు జ్ఞాపకాలు. గొప్ప అనుభూతినిచ్చేపుస్తకం. వీరికి అభినందనలు.తవ్వకాలు
ఓ గజల్ గాయని బాల్యం
రచన : జ్యోతిర్మయి మళ్ళ
పేజీలు : 107,
వెల : రూ. 100/-
ప్రతులకు : ప్రభాకర్ రావు మళ్ళ
5-155/- నాగమళ్ళీ నగర్
సుజాతానగర్, వైజాగ్-530051
9959912541
- కె. ఆనందాచారి